
పలమనేరులో 15 కిలోల బాక్సు రూ.50 మాత్రమే
టమాటాను కొంటున్నామంటూ ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం
కేవలం ఒక్క రోజు కొని.. ఆ తర్వాత పట్టించుకోని అధికారులు
దిక్కుతోచని స్థితిలో టమాటా రైతులు
పలమనేరు: చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. పలమనేరులోని టమాటా మార్కెట్‌లో గురువారం 15కిలోల బాక్సు ధర కేవలం రూ.50 పలికింది. దీంతో ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులు పెట్టి టమాటా సాగుచేసిన రైతులు తమకు భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలమనేరు హార్టికల్చర్ డివిజన్‌లో 4వేల హెక్టార్లలో టమాటా సాగు చేశారు. వెయ్యి హెక్టార్లలో పంట కోత దశకు వచ్చింది.
ప్రస్తుతం స్థానిక రైతులు రోజూ పలమనేరు మార్కెట్‌కు 40టన్నుల వరకు టమాటాలు తీసుకొస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రోజూ మరో 40టన్నుల వరకు టమాటా వస్తోంది. అయితే, కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి.
బయటి రాష్ట్రాల్లో టమాటా సీజన్ మొదలు
మన రాష్ట్రంలో టమాటా అత్యధికంగా పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏటా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో టమాటా సీజన్ మొదలైంది. అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు రావడం లేదు.
మరోవైపు వేసవి మొదలుకావడంతో తోటల్లో టమాటా మాగడం మొదలైంది. వెంటనే అమ్ముకోవాలని రైతులు మాగినవాటిని కోసి మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడం, డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో ధర తగ్గిపోయిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఒక్కరోజుతో చేతులెత్తేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. రైతులకు నష్టం రాకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటాను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కానీ, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇటీవల ఒక్కరోజు మాత్రం తూతూ మంత్రంగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్లకు పంపించారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు.
ఈ ధరలతో అప్పులపాలే..
ఎకరా పొలంలో టమాటా సాగుకు రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టాలి. బాగా పండితే ఎకరాకు 800 బాక్సులు దిగుబడి రావొచ్చు. ఇప్పుడున్న ధర రూ.50 ప్రకారం అయితే రైతుకు దక్కేది రూ.40వేలు మాత్రమే. రైతులు అప్పులపాలవడం ఖాయం. ప్రభుత్వమే టమాటాను మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలి. – గోవిందు, బేరుపల్లి, పలమనేరు మండలం
ప్రభుత్వం పట్టించుకోలేదు..
రూ.లక్షలు ఖర్చుపెట్టి టమాటా సాగుచేసిన రైతులకు 15కిలోల బాక్సు ధర రూ.400 ఉంటే లాభమే. ఇప్పుడు బాక్సు ధర రూ.50 ఉంది. ఈ లెక్కన చూస్తే పూర్తిగా నష్టం తప్పదు. ఇటీవల మార్కెటింగ్‌శాఖ అధికారులు ఒక రోజు టమాటాను కొని రైతుబజార్లకు పంపారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. నిత్యం అధికారులు సరుకు కొంటే బయటి వ్యాపారులు సైతం ఎక్కువ ధరకు కొనే అవకాశం ఉంటుంది. రైతులకు లాభం వస్తుంది.– టీఎస్ బుజ్జి, టమాటా వ్యాపారి, పలమనేరు
Comments
Please login to add a commentAdd a comment