
మార్కెట్‌కు రైతులు తీసుకువచ్చిన టమాటా
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్‌లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్‌కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది.
నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు.
పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్‌కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్‌లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment