పడిలేస్తున్న టమాట
జిల్లాలో టమాట ధరలు నిలకడగా ఉండడం లేదు. ఒకసారి పూర్తిగా పడిపోతే మరోసారి భారీగా పెరుగుతోంది. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌కు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. రైతు తను పండించిన టమాటాను మార్కెట్‌లో కిలో రూ.14కు (ప్రస్తుత ధర ప్రకారం) అమ్మి, రిటైల్ మార్కెట్‌లో రూ.24కు కొనాల్సి వస్తోంది. టమాట విస్తీర్ణం భారీగా పెరగడంతో ధరలు తగ్గాయన్న వాదన ఉంది. - పలమనేరు
- మార్కెట్‌లో నిలకడ లేని ధరలు
- హోల్‌సేల్‌కు, రిటైల్‌కు మధ్య వ్యత్యాసం
- మూడేళ్లుగా భారీగా పెరిగిన సప్లయ్
రైతుకు మిగిలేది సున్నే..
గంగవరం మండలం కూర్నిపల్లెకు చెందిన వెంకటేష్ తన ఎకరా పొలంలో టమాట సాగు చేశాడు. దానికి సంబంధించి ఖర్చు లు ఇలా ఉన్నాయి.
- భూమి దున్నకం, నర్సరీ నుంచి మొక్కల కొనుగోలు(ఎకరాకు 8వేల మొలకలు. మొలక రూ.50 పైసలు)కు రూ.5వేలు.
- టమాటకు స్టిక్‌లు ఎకరాకు 1200. ఒకటి రూ.20 చొప్పున రూ.24వేలు
- సేంద్రియ ఎరువు పదిలోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు రూ.27వేలు
- క్రీమి సంహారక మందులు రూ.10 వేలు
- కూలీల ఖర్చు రూ.15 వేలు. ఆ లెక్కన ఎకరాలో పంటసాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.81 వేలు.
- ఎకరాకు మంచి దిగుబడి వస్తే వెయ్యి బాక్సులు (బాక్సు 14 కేజీ లు). ఈ ఏడాది సగటు ధర రూ.200. ఆ లెక్కన రూ.2 లక్షలు.
- 20 కిలోమీటర్ల నుంచి టమాట బాక్సును మార్కెట్‌కు తరలిం చేందుకు రూ.5 నుంచి 10
- టమాట మండీలు రైతు నుంచి 10 శాతం కమీషన్ (రూ.20) వసూలు చేస్తున్నాయి. కోతకు రైతు వ్యక్తిగత ఖర్చు రూ.50.
- ఓ బాక్సు కాయలు కోసేందుకు కూలీ ఖర్చు రూ.15. ఆ లెక్కన ఓ బాక్సు టమాట రవాణా, తదితరాల ఖర్చు ప్రస్తుత ధర ప్రకారం రూ.100.
- వెయ్యి బాక్సులకు రూ.100 చొప్పున రూ.లక్ష ఖర్చు
- పంట సాగుకు పెట్టిన ఖర్చు రూ.81వేలు, మార్కెటింగ్ తదితర ఖర్చులు రూ.లక్ష మొత్తం 1.81 లక్షలు. రైతు రాబడి రూ.2లక్షలు. రైతుకు మిగిలేది కేవలం 19వేలు మాత్రమే. దీనికోసం రైతు కుటుంబ సభ్యులంతా కష్టపడాల్సి ఉంటుంది.
భారీగా పెరిగిన సప్లయ్..
ఐదేళ్ల క్రితం జిల్లాలో ఆరువేల హెక్టార్లలో టమాట సాగయ్యేది. మూడేళ్లుగా పెరిగిన నర్సరీలు, పంట విస్తీర్ణంతో ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఏడాదికి ఇక్కడ 4.80 లక్షల మెట్రిక్ టన్నుల టమాట ఉత్పత్తి అవుతోంది. సప్లయ్‌కు సరిపడా డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుముఖం పడుతోంది. పైగా కర్ణాటక, అనంతపురం జిల్లాల నుంచి సరుకు భారీగా ఇక్కడికొస్తోంది. దీని ప్రభావం ధర మీద పడుతోంది. ఆంధ్రలోని పలు జిల్లాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడులోని చెన్నై, రాణిపేట్, ఆర్కాడ్, నైవేలి, విరుదాచలం, కారైకూడి నుంచి వ్యాపారులొస్తున్నారు. ఆ ప్రాంతాల్లో లోకల్ టమాట ఉన్నపుడు వీరు ఇక్కడికి రాక ధరలు అమాంతం తగ్గుతున్నాయి.
ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు..
- డిమాండ్‌ను బట్టి టమాట సాగుచేసేలా చర్యలు
- కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
- దళారులతో పనిలేకుండా డెరైక్ట్ మార్కెటింగ్
- రైతు బజార్ల పెంపు
- మండల స్థాయిలో రైతుల కమిటీలు, నర్సరీల నియంత్రణ
- టమాట పల్ప్, పికెల్, పౌడర్ యూనిట్ల ఏర్పాటు