ధర.. దైన్యం | Tomato Farmers Worried About Price Down | Sakshi
Sakshi News home page

ధర.. దైన్యం

Published Thu, Sep 27 2018 12:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM

Tomato Farmers Worried About Price Down - Sakshi

రోడ్డు పక్కన పడేసిన టమాట

అనంతపురం అగ్రికల్చర్‌: మార్కెట్‌లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్‌ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది.  

కూర‘గాయాలే’
ఇటీవలకాలంలో అంతో ఇంతో  నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్‌ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్‌లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు.

పెరిగిన సాగు... తగ్గిన ధర
జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్‌ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్‌లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు.

టమాట పరిస్థితి ఇలా...  
జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. 

పెట్టుబడి రూ.1.20 లక్షలు...రాబడి రూ.80 వేలు
మామూలు పద్ధతిలో అయితే ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్‌ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్‌లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనున్న చిత్తూరు, మదనపల్లి, అలాగే కర్ణాటకలోని కోలార్, చింతామణి, హైదరాబాద్‌ చుట్టుపక్కల, కొన్ని తెలంగాణా జిల్లాల్లో టమాట సాగు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. నవంబర్‌ వరకు ఇదే రకమైన మార్కెట్‌ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మిరపదీ అదే దారి
జిల్లా వ్యాప్తంగా బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, బొమ్మనహాళ్, కణేకల్లు, పరిగి, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, బత్తలపల్లి, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, తనకల్లు, మడకశిర ప్రాంతాల్లో మిరప సాగు ఎక్కువగా ఉంది. ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఎండుమిర్చి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 4,100 హెక్టార్లలో మిరప సాగు చేయగా అందులో ప్రస్తుతం 2,400 హెక్టార్లలో పంట ఉన్నట్లు చెబుతున్నారు. ఎకరా పచ్చి మిరప సాగుకు రూ.1.10 నుంచి 1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. పంట నాటిన 75 రోజుల తర్వాత నుంచి 7 నుంచి 8 నెలల వరకు పంట కోతలు ఉంటాయి. అంతా బాగుంటే ఎకరాకు 15 టన్నుల మిరప దిగుబడులు వస్తాయి. అన్ని రకాల ఖర్చులు పోనూ కిలో కనీసం రూ.15 పలికితే కాని మిరపకు గిట్టుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిరప రైతులు నిలువునా మోసపోతున్నారు. తెలంగాణ, మహరాష్ట్రలో విపరీతంగా మిరప సాగు, దిగుబడులు రావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు విశ్లేషిస్తున్నారు. 

దళారుల దందా
కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్‌ అయి ఒక రేటును ఫిక్స్‌ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్‌ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు.

కూలి డబ్బులుకూడా వచ్చేట్లు లేవు
నాకు ఐదెకరాల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో టమాట సాగు చేశాను. ప్రస్తుతం 15 కిలోల టమాట బాక్సును వ్యాపారులు రూ.45 అడుగుతున్నారు. ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కాదుగదా.. కూలీలు కూడా వచ్చేట్టు లేవు.– సుబ్రమణ్యం, బుక్కరాయసముద్రం

ధర అధ్వానం
నాకు పదెకారల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో డ్రిప్పు ద్వారా మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కిలో రూ.3, రూ.4కు అడుగుతున్నారు. పంట దిగుబడి ఉన్నా..ధర మాత్రం రావడం లేదు. కేజీ రూ.15 నుంచి రూ.20 పలికి ఉంటే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చేది.
– రవిచంద్రారెడ్డి, సంజీవపురం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement