మల్లాపురం గ్రామసమీపంలో కలాల్లో ఉంచిన ఉల్లిని చూపుతున్న రైతు
అనంతపురం అగ్రికల్చర్: ‘ఉల్లి’ మేలు తల్లి కూడా చేయదంటారు. అదే ఉల్లి ఇపుడు రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. ఎన్నో ఆశలతో సాగు చేసి పండించిన పంటకు గిట్టుబాటు లేకపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6,200 హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో దాదాపు 9 వేల మంది రైతులు ఉల్లి సాగు చేశారు. రాయదుర్గం, గుమ్మఘట్ట, డి.హిరేహాళ్, గుంతకల్లు, గుత్తి, యాడికి, బ్రహ్మసముద్రం కళ్యాణదుర్గం, పెనుకొండ, రొద్దం, పామిడి, అనంతపురం, గార్లదిన్నె, బొమ్మనహాళ్, కణేకల్లు, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో ఉల్లి సాగు ఎక్కువగా ఉంది. వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడులు బాగానే వచ్చాయి. అయితే ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కిలో రూ.2 కూడా పలకని దుస్థితి
ప్రస్తుతం కిలో ఉల్లి రూ.2 కూడా పలకకపోవడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో కొనేవారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఎంత లేదన్నా క్వింటా రూ.5 వేలు పలికితే పెట్టుబడులైనా వస్తాయని భావించిన రైతులకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పడిపోవడంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. హెక్టారుకురూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేశారు. దిగుబడులు బాగానే వచ్చినా రేట్లు పతనం కావడంతో అయినకాటికి అమ్మేసుకుంటున్నారు. లేదా కలాల్లోనే ఉంచేస్తున్నారు.
పెట్టుబడులు రూ.70 కోట్లు
రైతులు ఉల్లి సాగుకు రూ.70 నుంచి రూ.72 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ధరలు గిట్టుబాటు కాకపోవడంతో రూ.40 కోట్లకు మించి దక్కించుకోలేని పరిస్థితి. లాభాలు పక్కనపెడితే పెట్టుబడుల్లోనే రూ.30 కోట్లు నష్టాలు మూటగట్టుకున్నారు. రూ.100 నుంచి రూ.120 కోట్లు ఉల్లి వ్యాపారం జరుగుతుందని అధికారులు అంచనా వేయగా... ధరల పతనంలో అంచనాలు తారుమారై రైతులు ఇబ్బందుల్లో పడ్డారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
జిలాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం బాగా పెరగడం, పంట దిగుబడులు కూడా బాగా రావడంతో ధరలు పడిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల పరిధిలో ఉల్లి పంట భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అలాగే మహారాష్ట్రలో అంచనాలకు మించి పంట వేయడం, దిగుబడులు వచ్చాయని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లు తాడేపల్లిగూడెం, కర్నూలుకు పెద్ద ఎత్తున ఉల్లి రావడంతో ధరలు పలకడం లేదంటున్నారు. అలాగే చిత్రదుర్గ, బళ్లారి, నాగపూర్, కలకత్తా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో ఉల్లికి గిట్టుబాటు కష్టంగా ఉందని అంచనా వేస్తున్నారు. పండించిన పంట నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహం లేకపోవడంతో తక్కువైనా ఎక్కువైనా పండిన వెంటనే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment