నేటితో ఉల్లి ‘మద్దతు’దరఖాస్తు గడువు ముగింపు
Published Tue, Dec 20 2016 11:47 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- పిబ్రవరి వరకు అవకాశం ఉన్నా అర్ధాంతరంగా ముగించే యత్నం
- ఇప్పటి వరకు మద్దతు పొందినవారు 50శాతం లోపే
- డెడ్‌లైన్ విధింపుతో రైతుల గగ్గోలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వచ్చే ఏడాది పిబ్రవరి వరకు ఉల్లిని రూ.600 కంటే తక్కువ ధరకు అమ్ముకునే రైతులందరికీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వర్తిస్తుంది. గరిష్టంగా రూ.300 వరకు మద్దతు లభిస్తుంది. పిబ్రవరి చివరి వరకు అవకాశం ఉందికదా అనుకున్న రైతులు మద్దతును కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికే మద్దతు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ డెడ్‌లైన్ విధించారు. దీని ప్రకారం వేలాది మంది రైతులు సంకటంలో పడ్డారు. దేవుడు వరమిచ్చినా... పూజరి వరమివ్వడు అనే చందంగా ప్రభుత్వం ఉల్లి రైతులు నష్టపోకుండా మద్దతు ప్రకటిస్తే జిల్లా స్థాయిలో మాత్రం మద్దతుకు గండికొట్టే ప్రమాదం ఏర్పడింది. సెప్టంబరు నుంచి వచ్చే ఏడాది పిబ్రవరి చివరి వరకు మార్కెట్‌లో రూ.600 లోపు ధరకు ఉల్లి అమ్ముకునే రైతులకు మద్దతు వర్తిస్తుంది. రూ.50 నుంచి రూ.300లోపు ధరకు అమ్ముకుంటే రూ.300,... రూ.400కు అమ్మకుంటే రూ.200, రూ.500 అమ్ముకున్న వారికి 100 ప్రకారం మద్దతు లభిస్తుంది. అయితే జిల్లా కలెక్టర్ ఉల్లికి మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల21తోనే ముగింపు పలుకుతుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు అరకొరే..
ఇప్పటి వరకు మద్దతు పొందిన రైతులు అంతంతమాత్రంగానే ఉన్నారు. దాదాపు 6500 మంది రైతులు ఉల్లి మద్దతు ధర పొందేందుకు తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం 3వేల మందికి మాత్రమే మద్దతుకు అర్హత లభించింది. దరఖాస్తులో తప్పులున్నాయనే ఉద్దేశ్యంతో సుమారు 2వేల మందిని తిప్పుకుంటున్నారు. మరో 1500 మంది మార్కెట్ కమిటీ నుంచి దరఖాస్తులు తీసుకెళ్లినా తిరిగి తెచ్చివ్వలేదు. ఈ లెక్కన 3500 మంది ఇంకా మద్దతు పొందాల్సి ఉంది. ఇది కేవలం దరఖాస్తులు తీసుకెళ్లిన వారికి సంబంధించి మాత్రమే. కలెక్టర్ నిర్ణయం మేరకు మద్దతుకు దరఖాస్తులు ఇవ్వడానికి బుధవారమే చివరి రోజని మార్కెట్ కమిటీ సమాచారం ఇవ్వడంతో రైతులు మంగళవారం భారీగా మార్కెట్‌కు తరలివచ్చారు. ఇదెక్కడి అన్యాయం అంటూ మార్కెట్ కమిటీ సెక్రటరీని నిలదీశారు. ఇచ్చిన దరఖాస్తుల్లో తప్పులున్నాయని తిరస్కరించారు... ఇపుడేమో చివరి రోజు బుధవారమేనని అంటున్నారు. రైతులు బాగుపడటం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని మార్కెట్ కమిటీ సెక్రటరీ శమంతకమణి తెలిపారు.
Advertisement
Advertisement