![Onion Center Opened In Srikakulam District - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/29/onion5.jpg.webp?itok=iz8Jizx-)
రైతుబజారులో ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్న వినియోగదారులు
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆకాశాన్నంటిన ఉల్లి ధరను అధికారులు నేల మీదకు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్‌లో కిలో సుమారు రూ.70 పలుకుతున్న ఉల్లిపాయలను శనివారం రైతు బజారులో రూ.25లకే సరఫరా చేశారు. వర్షాల కారణంగా ఉత్తరా ది రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గి దిగుమతులు కొరవడడంతోపాటు.. అదను చూసుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసిన వ్యాపారుల బెడద నుంచి వినియోగదారులకు ఊరట కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నాసిక్, మధ్యప్రదేశ్ నుంచి సరుకు తీసుకొచ్చి సబ్సిడీ ధరకు అందిస్తోంది. శని వారం రైతు బజారులో ఐదు టన్నుల ఉల్లిని అందుబాటులో ఉంచారు. వినియోగదారులు బారులుదీరి వీటిని కొనుగోలు చేశారు. ఆదివారం వినియోగదారుల రద్దీ దృష్ట్యా మరింత పెంచే ఆలోచనలో ఉన్నారు. ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతు బజారుల్లో కూడా ఆదివారం నుంచి కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందించనున్నారు.
ఒక్కసారిగా పెరిగిన ధరలు
నెలన్నర క్రితం వరకు రైతు బజారులో రూ.20గా ఉన్న ఉల్లి ధర ఈమధ్య కాలంలో రూ.35 నుంచి రూ.50వరకు చేరింది. బహిరంగ మార్కెట్‌లో విపరీతంగా పెరిగింది. పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో అయితే ఏకంగా నాణ్యత పేరుతో రూ.70కి పెంచేశారు. హోటళ్లల్లో ఉల్లిదోశ ధరను రూ.5 పెంచేశారు. ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఉల్లి కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దిగుబడి తగ్గడం తోపాటు కృత్రిమ కొరత సృష్టించడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యామ్నాయ చర్య లకు ఉపక్రమించింది. శనివారం రైతు బజారులో ఉల్లిపాయలకు మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్ మహిళలకు, రెండు కౌంటర్లు పురుషులకు ఏర్పాటు చేసి ఆధార్ కార్డు ఆధారంగా కిలో రూ.25 వంతున ఒక కిలో అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి కౌంటర్లను సైతం పెంచి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నాణ్యత బాగుంది
రైతు బజారులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాణ్యమైన ఉల్లిపాయలు తక్కువ ధరకు అందించడం చాలా బాగుంది. డబ్బులిచ్చి కొందామన్నా మంచి ఉల్లి దొరికేది కాదు. అందరికీ ఓ పద్ధతి ప్రకారం అందిస్తున్నారు.
–బి.పద్మావతి, డే అండ్ నైట్ కూడలి, శ్రీకాకుళం
ఉల్లితోపాటు కూరగాయలు కొంటున్నాం
రైతుబజారులో తక్కువ ధరకు ఉల్లిపాయలు అందిస్తున్నారు. దీంతోపాటు కూరగాయలు తక్కువ ధరకే దొరకడంతో సంచి నింపుకుని వెళ్లున్నాం. ధరలు అదుపులోకి వచ్చేంతవరకు ఉల్లి కౌంటర్లు ఉంచితే బాగుంటుంది.
–ఎస్.నర్సింగమూర్తి, ఫ్రెండ్స్‌కాలనీ, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment