కోయకుండానే.. కన్నీళ్లు | Onion Price Increased In Adilabad District | Sakshi
Sakshi News home page

కోయకుండానే.. కన్నీళ్లు

Published Tue, Sep 24 2019 10:44 AM | Last Updated on Tue, Sep 24 2019 10:45 AM

Onion Price Increased In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిగడ్డలు.. కొద్ది రోజులుగా వాటి ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తు తం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.60 వర కు పలుకుతోంది. దీంతో సా మాన్య ప్రజలు నిత్య వినియోగంలో ఉల్లిగడ్డలను తగ్గించారు. గతంలో కిలో ధర రూ.15 నుంచి రూ.20 ఉన్న ఉల్లిగడ్డల డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయి ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.

సామాన్యులకు చుక్కలు 
ఉల్లికి ప్రధానమైన మార్కెట్లు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు. ఆదిలాబాద్‌ జిల్లాకు ఆ ప్రాంతాల నుంచే ఉల్లిగడ్డలు దిగుమతి అవుతాయి. కర్నాటకతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పూణె, చంద్రపూర్, బెంగుళూరు, లాసల్‌గావ్‌ వంటి తదితర ప్రధాన ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వ్యాపారులు ఇక్కడ విక్రయాలు జరుపుతుంటారు. నెలరోజుల క్రితం ఉల్లి కిలో ధర రూ.20 ఉండగా ప్రస్తుతం రెండింతలు దాటిపోయింది. రైతుబజార్‌లో, కూరగాయల మార్కెట్‌లో తెల్ల ఉల్లిగడ్డలు రూ.60కిలో విక్రయిస్తుండగా, ఎరుపు రంగు ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మకాలు జరుపుతున్నారు.

ఎడతెరిపిలేని వర్షాలతో.. 
మహారాష్ట్రలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌ ఉల్లికి పెట్టిందిపేరు. అక్కడినుంచి దేశంలోని నలుమూలలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉల్లిగడ్డలు సరఫరా అవుతాయి. మహారాష్ట్రలోని వర్షాలను సాకుగా చూపి కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రెండు నుంచి మూడింతలు ధరను అధికంగా పలుకుతూ వినియోగదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉల్లి ధర పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ కేంద్రాలేవీ.. 
ప్రతియేడాది ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెట్‌ అధికారులు, జిల్లా పౌరసరఫరాల అధికారులు రైతుబజార్‌లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో రేషన్‌ షాపుల ద్వారా కూడా తక్కువ ధరకు ఒక్కొక్కరికి 2కిలోల చొప్పున అందించారు. అయితే ఈసారి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్‌ శాఖాధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.

ప్రోత్సాహం కరువు 
ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువశాతం మంది రైతులు పత్తి, సోయా, ఆతర్వాత కందిపంటనే సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు ఉల్లి సాగు గురించి రైతులకు అవగాహన కల్పించకపోవడం, రాయితీపై విత్తనాలు అందించకపోవడంతోనే రైతులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. గతంలో జిల్లాలో ఉల్లి సాగు చేసేవారని, ప్రస్తుతం కనీసం వంద ఎకరాల్లో కూడా చేపట్టడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే వినియోగదారులకు మేలు జరగడంతో పాటు రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement