adialabad district
-
తాడుకు వేలాడుతున్న చేపలు.. ఎందుకో చెప్పండి!
సోన్: ఇక్కడ దండేనికి వేళాడుతున్న చేపలను చూశారా? ఇవన్నీ ఎండు చేపలు. పచ్చి చేపలను ఎండబెట్టడానికి చేసుకున్న ఏర్పాటు ఇది. ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో నివసించేవారంతా గంగపుత్రులే. నాలుగు వందల జనాభా ఉండగా అంతా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిలో చేపల వేట సాగించి జీవనోపాధి పొందుతారు. అమ్ముడు పోగా మిగిలిన చేపలను నాలుగు రోజుల పాటు ఎండబెడతారు. ఎండుచేపలను కూడా అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఏ ఇంటి ముందు చూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తాయి. (క్లిక్ చేయండి: నెలకు లక్ష జీతం.. సాఫ్ట్వేర్ వదిలి ‘సాగు’లోకి..) -
అరక దున్నిన అత్త.. విత్తనాలు వేసిన కోడళ్లు!
వ్యవసాయంలో మహిళల శ్రమే అధికమైనా... రైతు అనగానే నెత్తిన తలపాగ, చేతిలో అరకతో ఓ పురుష రూపం గుర్తుకొస్తుంది. దాన్ని బ్రేక్ చేశారు నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీశైలమ్మ. చింతపల్లి మండలం కుర్రంపల్లిలో గురువారం ఆమె అరక దున్నుతుండగా, తన ఇద్దరు కోడళ్లు విత్తనాలు వేస్తూ కనిపించారు. శ్రీశైలమ్మ భర్త రామచంద్రం సామాజిక కార్యకర్త. వారికి ఆరుగురు కుమారులు. ఇద్దరు ఆర్మీలో ఉన్నారు. నలుగురు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. అయినా శ్రీశైలమ్మ భర్తతోపాటు వ్యవసాయ పనులు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, చింతపల్లి (దేవరకొండ) ‘ఆశ’క్తిగా ఖోఖో ఆదిలాబాద్ డైట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న గురువారం ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన క్రీడా వస్తువులు, మైదానాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. అనంతరం విధి నిర్వహణలో భాగంగా అక్కడే ఉన్న ఆశ వర్కర్లు ఖోఖో ఆడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శైలజ వారితో కలిసి ఉత్సాహంగా ఖోఖో ఆడుతూ కనిపించారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ పిల్లల్ని పలకరించి.. కలిసి భోజనం.. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి హైస్కూల్లో కలెక్టర్ కె.శశాంక విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం తీగలవేణికి హాజరైన కలెక్టర్ ‘మన ఊరు – మన బడి’లో ఎంపికైన జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పిల్లలు ప్లేట్లు పట్టుకొని బారులు తీరారు. కలెక్టర్ శశాంక వారితో మాట్లాడిన అనంతరం వంటకాలను పరిశీలించారు. ‘రోజూ రుచికరంగా వండి పెడుతున్నారా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా’.. అని కలెక్టర్ కోరగా.. సార్... రండి అంటూ పిల్లలు ఆనందంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వారితో కూర్చుని భోజనం చేశారు. ‘వంటలు బాగానే ఉన్నాయి. ఇలాగే చేయండి’.. అని అన్నారు. (క్లిక్: గోళీ అంత గుడ్డు.. వావ్.. మూన్!) -
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు..
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో శనివారం భూమి స్వల్పంగా కంపించింది. మంచిర్యాల జిల్లాలో కాలేజ్ రోడ్, సున్నంబట్టివాడ, శ్రీశ్రీనగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతారాంపూర్, షిర్కేలో రెండు సెకండ్లపాటు భూమి కంపించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ, జ్యోతినగర్, మల్కాపూర్, నర్రాశాలపల్లె ప్రాంతాలలో 2 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: (ఇది విన్నారా?.. ఇక్కడ కిరాయికి ఇల్లుందా!) -
భరించరాని నొప్పి.. చెప్పుకోలేని బాధ
సాక్షి, బెల్లంపల్లి: పన్నెండేళ్లపాటు ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారి జీవనప్రయాణం పదినెలల్లోనే అర్ధాంతరంగా ముగిసింది. బెల్లంపల్లిలోని సుభాష్‌నగర్‌కు చెందిన మోసం మల్లేష్‌కుమార్ (36), బాబుక్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మల్లేష్ ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో రిపోర్టర్. పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక.. చనిపోదామనే నిర్ణయించుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్ తన సన్నిహితులైన కొందరికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్ వచ్చి అందులో దూకారు. కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రాజు, తహసీల్దార్ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు. మల్లేశ్ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. చదవండి: (పెళ్లంటూ ఎర... గిఫ్టంటూ టోకరా! ) కలచివేసిన సూసైడ్ నోట్ “నా కుటుంబ సభ్యులను, నా ప్రాణమిత్రులను, అందరిని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. రోజురోజుకూ నా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. రోజు నరకం చూస్తున్న. భరించరాని నొప్పి. చెప్పుకోలేని బాధ. ఈ లోకాన్ని వదిలి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. కడుపునొప్పితో రోజూ నరకం చూస్తోంది. ఇలా బతకడం కంటే చావడం మేలని ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. నా నిర్లక్ష్యం, జర్నలిజం వృత్తియే నా అనారోగ్యానికి కారణం అనుకుంటున్న. సమయానికి తినక ఎన్నోసార్లు టెన్షన్‌కి గురయ్యాను. నా ప్రాణమిత్రులు, విలేకరులు నాకుటుంబానికి బాసటగా నిలవాలని వేడుకుంటున్న. అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. “అమ్మను, అన్నయ్యను, అక్కలను మంచిగా సూసుకో, నీదే బాధ్యత, నీకు కొడుకుగానో, బిడ్డగానో పుడుత’ అని తన తోబుట్టువు శ్రీనివాస్‌ను ప్రాధేయపడిన తీరు కలిచివేసింది. అలాగే వారు తీసుకున్న అప్పులు.. తమ వద్ద అప్పు తీసుకున్నవారి వివరాలను కూడా అందులో రాసి పెట్టారు. -
ప్రేమ, ఉద్యోగాల పేరుతో.. రూ.లక్షల్లో వసూలు
సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్‌లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశంకర్(28)లతో కలిసి కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది. ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పచ్చని అడవికి నెత్తుటి మరకలు
సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పదేళ్ల క్రితం వరకూ ఇక్కడి అడవుల్లో తుపాకుల మోతలు వినిపించేవి. అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. యాక్షన్ టీం మెంబర్ల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలపై పోలీసు తుటాలు పేలాయి. ఈ ఆధిపత్య పోరులో ఒక్కోసారి దళ సభ్యులది.. ఎక్కవసార్లు పోలీసు బలగాలది పైచేయిగా మారింది. దళ సభ్యుల క్యాంపులపై బలగాలు విరుచుకుపడిన ఘటనలు ఉండగా.. పక్కా సమాచారంతో మాటువేసి దాడులు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు రోజులకొద్దీ కాల్పులు సాగాయి. దశాబ్దం తర్వాత మళ్లీ కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఉమ్మడి జిల్లాలో గతంలో పేలిన తూటాల చప్పుళ్లను గుర్తుచేసింది. చదవండి: (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) సంచలనం రేపిన ఆజాద్ ఎన్కౌంటర్ 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ కాగజ్‌నగర్ మండలం జోగాపూర్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర కూడా చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ ఆజాద్ భార్య పద్మ కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్కౌంటర్లో పాల్గొన్న 20 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. చదవండి:(19 ఏళ్లకే దళంలోకి.. మూడు నెలలకే ఎన్కౌంటర్) మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన సంఘటనలు 2001లో జన్నారం, దండేపల్లి అడవుల్లో జిల్లా కమిటీ సెక్రటరీ సూర్యం ఎన్కౌంటర్ అయ్యాడు. కీలక సభ్యుడి మరణంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లింది. 2003 డీసీఎస్ (జిల్లా కమిటీ సెక్రటరీ)గా ఉన్న ఎల్లంకి అరుణ అలియాస్ లలితక్కను ప్రస్తుత కుమురంభీం జిల్లా.. అప్పటి బెజ్జూరు మండలం అగర్గూడలోని కొండ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా సభ్యులు చనిపోయారు. 2003లో ప్రస్తుత మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న సుదర్శన్‌రెడ్డి అలియాస్ రామక్రిష్ణ ఎన్‌కౌంటర్‌తో పార్టీకి పెద్ద నష్టం జరిగింది. 2006లో కాగజ్‌నగర్ మండలం మానిక్‌పటార్‌లో వరుసగా మూడు రోజులపాటు కాల్పులు జరగగా.. ఓ దళ కమాండర్ సహా ముగ్గరు మావోలు చనిపోయారు. అంతకుముందు 1989లో ప్రస్తుత నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసి పేట అడవుల్లో జిల్లా కమిటీ సభ్యుడు సుగుణాకర్, 1992లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం చింతలబోరి వద్ద ఎన్కౌంటర్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ఐదుగురు దళ సభ్యులు చనిపోయారు. 1993లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా అడవుల్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ముగ్గురు దళ సభ్యులు మరణించారు. ఇవేకాకుండా కెరమెరి, సిర్పూర్(టి), ఖానాపూర్, చెన్నూరు ప్రాంతాల్లోనూ ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టుల ప్రతీకార దాడులు 1985లో ప్రస్తుత కుమురం భీం జిల్లా పాత బెజ్జూరు మండలం లోడ్పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా దహెగాం మండలం బీబ్రా ఎస్సై లక్ష్మణరావును కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్వార్టర్లో ఉండగా ఉదయం ఏడు గంటలకు బయటకు పిలిచి కాల్చి చంపారు. 1989లో ప్రస్తుత పెంచికల్‌పేట మండలం చేడ్వాయి గుట్ట వద్ద ల్యాండ్‌మైన్ పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. 1991లో నెల వ్యవధిలోనే రెండుసార్లు కౌటాల పోలీసు స్టేషన్‌పై దాడులు జరిగాయి. 1997లో ప్రస్తుత కుమురంభీం జిల్లా సిర్పూర్ (యూ) పోలీస్‌స్టేషన్‌ను బాంబులతో పేల్చివేయగా 11 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సాధారణ వ్యక్తులున్నారు. 1998లో కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేయగా ముగ్గురు గన్మెన్లు మృత్యువాత పడ్డారు. 1999 బెజ్జూరు ఫారెస్టు రేంజర్ కొండల్‌రావును పిస్తోల్‌తో కాల్చి చంపారు. గోలేటీ సీఐఎస్ఎఫ్ క్యాంపుపై దాడితోపాటు అనేక ప్రతీకార దాడులు జరిగాయి. కోల్‌బెల్టు ప్రాంతంలో ‘సికాస’ ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలో అటవీ, గిరిజన ప్రాంతాల్లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు జరుగుతుండగా.. అదే సమయంలో తూర్పు ప్రాంతంగా ఉన్న ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో పీపుల్స్‌వార్ గ్రూప్ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మిలిటెంట్ దళాల నియంత్రణకు పోలీసు బలగాలు అనేక ఎన్కౌంటర్లు జరిపాయి. 1996లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్కౌంటర్ ‘సికాస’ చరిత్రలో ప్రముఖమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ స్లాబ్క్వార్టర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సమ్మిరెడ్డితోపాటు అప్పటి చెన్నూరు సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్ మరణించారు. ముఖ్యమైన ఎన్కౌంటర్లు చూస్తే 1991లో శ్రీరాంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు, 1993లో రామక్రిష్ణాపూర్‌లో ఇద్దరు, 1996లో బెల్లంపల్లి మండలం చిన్నబుదలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు, 1998లో మాదారంలో, 1999లో నస్పూర్‌లో సికాస సభ్యులు ఎన్కౌంటర్లో మరణించారు. 2002లో బెల్లంపల్లిలోని గాంధీనగర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సికాస సభ్యులు మరణించారు. అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు సారథ్యం ఉమ్మడి జిల్లాలో అనేక ఎన్కౌంటర్లలో దూకుడుగా ఉన్న అప్పటి ఎస్సైలే ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి యువ అధికారులే ప్రస్తుతం కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘మావోయిస్టు ఆపరేషన్’ కొనసాగుతోంది. భాస్కర్ వేటలో భారీ కూంబింగ్ వేమనపల్లి: రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. కల్లెంపల్లి ఫెర్రీ పాయింట్‌ను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ వేమనపల్లి మండలం కల్లెంపల్లి, ముక్కిడిగూడెం అడవులను పోలీసుబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ రవీందర్, జైపూర్ ఏసీపీ నరేందర్, రూరల్ సీఐ నాగరాజు సోమవారం కూంబింగ్ బలగాల వద్దకు వెళ్లి దిశానిర్దేశం చేశారు. కల్లెంపల్లి, ముక్కిడిగూడం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో జనం ముందుకు వస్తున్న మావోయిస్టులకు ఇప్పటికే ఎవరూ సహకరించడం లేదని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సహకరించొద్దని, కదలికలు ఉన్నట్లు గమనిస్తే 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు. రాకపోకల నిలిపివేత కదంబా ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత నదిపై రాకపోకలు నిలిపివేసినట్లు డీసీపీ, ఏసీపీ తెలిపారు. మండలంలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. మావోయిస్టులు నది మీద రాకపోకలు సాగించే వీలున్నందున కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు రాచర్ల, రేగుంట, వేమనపల్లి, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా పడవలను నిలిపివేశామన్నారు. నది అవతలి వైపు ఉన్న సిరోంచ, బామిని, రేగుంట, వెంకటాపూర్ పోలీస్స్టేషన్ల సహకారం తీసుకుని ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలోని తీరం వెంట ఉన్న పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశామని, 10 గ్రేహౌండ్స్ బృందాలకు చెందిన 400 మంది పోలీసులతో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. తప్పిపోయిన మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యమని, లేకుంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అర్ధరాత్రి బాదిరావు అంత్యక్రియలు నేరడిగొండ: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జుగ్నక్ బాదిరావు మృతిచెందిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. నేరడిగొండ పోలీసులు మృతుడి తల్లితోపాటు సర్పంచ్ సీతారాం, పలువురు గ్రామస్తులను ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అదే అర్ధరాత్రి మృతదేహాన్ని ఇచ్చోడ సీఐ కంప రవీందర్, నేరడిగొండ ఎస్సై భరత్‌సుమన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అద్దాల తిమ్మాపూర్‌కు తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు. రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు దీంతో బంధువులు, ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు సోమవారం మృతుడి ఇంటికి చేరుకున్నారు. ఆయన తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జుగ్నక్ బాదిరావు కొంతకాలం నేరడిగొండలో లారీ క్లీనర్‌గా పనిచేశాడు. నాలుగైదు నెలల క్రితం నిర్మల్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కంటతడి పెడుతూ తెలిపారు. నిర్మల్‌లోని లారీ యజమానిని అడగగా 20రోజులుగా పనికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడంతో ఆ కుటుంబం రోధనలు మిన్నంటాయి. -
టీఆర్ఎస్కు బుద్ధి చెబుతాం
సాక్షి, ఇచ్చోడ: సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుంటే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన జోడేఘాట్ నుంచి నిర్మల్‌కు వెళ్తుండగా ఇచ్చోడలో కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఇక ఇది నడవదని, టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గుమ్మడి భీంరెడ్డి, కొల్లురి చంద్రశేఖర్, కేంద్రే నారాయణ, కదం బాబారావు, మాధవ్ ఆమ్టె, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలొస్తేనే సీఎంకు సింగరేణి గుర్తొస్తది గోదావరిఖని(రామగుండం): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ప్రజలు, కార్మికులు గుర్తొస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. రజాకార్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు మంచిర్యాలకు వెళ్తూ మంగళవారం రాత్రి గోదావరిఖనికి చేరుకున్నారు. స్థానిక ఇల్లెందు గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. త్వరలో సింగరేణిలో గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయని, టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌కు కార్మికులు బుద్ధిచెప్పాలని కోరారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన కూతురు కవితను గనుల పైకి పంపి ప్రచారం చేయించి, కార్మికుల మారుపేర్లను రెగ్యులరైజ్డ్ చేస్తామని, రూ. 10లక్షల సొంతింటి కోసం వడ్డీలేని రుణం ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తామని, కొత్త బొగ్గుగనులు ప్రారంభించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఆనేక హామీలిచ్చి గెలిచారన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినా హామీలు మాత్రం నెరవేరలేదన్నారు. త్వరలో నిర్వహించే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చే తీర్పుతో సీఎం కేసీఆర్ మైండ్ బ్లాక్ కావాలన్నారు. ధనబలంతో గెలిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తాడని, కేసీఆర్ వచ్చే డబ్బులు తీసుకుని బీఎంఎస్‌ను గెలిపించాలని కోరారు. పీవీ ఇప్పుడు గుర్తొచ్చారా.. మాజీ ప్రధాని పీవీనర్సింహారావు తెలంగాణ గడ్డపై పుట్టిన గొప్ప నేత అని కొనియాడారు. రాష్ట్రం సాధించిన ఆరేళ్లలో ఎన్నడూ పీవీ గురించి మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు శతజయంతి సందర్భంగా ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఇది గమనించిన కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీకి క్రెడిట్ దక్కుతుందనే ఉద్దేశంతో శత జయంతి ఉత్సవాలు ఏడాదంతా నిర్వహించాలని నిర్ణయించి, అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్–17ను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎంఐఎంకు బయపడి ఒకవర్గానికి కొమ్ముకాచేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణ అమరులను కించపరుస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఆర్ఎఫ్సీఎల్లో అక్రమాలపై దృష్టి రామగుండంలో పునర్నిర్మిస్తున్న రామగుండం ఎరువుల కార్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలిచ్చేలా కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రికి విన్నవిస్తామని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ. 54కోట్లు చెల్లించాల్సి ఉందని, నిధులు మంజూరు చేయడంలో కేసీఆర్ జాప్యం చేస్తున్నారని విమర్శించారు. నవంబర్‌లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో నాయకులు దుగ్యాల ప్రదీప్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బొడిగె శోభ, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బల్మూరి అమరేందర్‌రావు, బల్మూరి వనిత, గీతామూర్తి, భానుప్రకాశ్, రాకేష్‌రెడ్డి, వడ్డెపెల్లి రాంచందర్, రావుల రాజేందర్, మామిడి రాజేష్, కోమల్ల మహేష్, క్యాతం వెంకటరమణ, ప్రవీణ్, జక్కుల నరహరి, పిడుగు క్రిష్ణ, సోమారపు లావణ్య పాల్గొన్నారు. -
తల్లి అంత్యక్రియలు.. అంతలోనే కొడుకు, కోడలు..
సాక్షి, ఆదిలాబాద్/వరంగల్: జిల్లాలోని యపల్గూడలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదంలో మృత్యువు వెంటాడింది. రమణమ్మ అనే వృద్ధురాలు శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె తనయుడు, రిటైర్డ్ సీఐ విజయ్‌కుమార్, కోడలు సునీత అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యపల్‌గూడకు బయల్దేరారు. ఈక్రమంలో వారు ప్రమాణిస్తున్న కారు వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం, పెంచికల్‌పేట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన విజయ్‌కుమార్, సునీత అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడి మృతితో రమణమ్మ అంత్యక్రియలు నిలిచిపోయాయి. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో.. ఆ గ్రామం విషాదంలో మునిగింది. -
పరుగో పరుగు..
సాక్షి, కరీంనగర్ స్పోర్ట్స్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీ ప్రారంభమైంది. తొలి రోజు పలు జిల్లాల అభ్యర్థులకు సోల్జర్ టెక్నికల్ విభాగంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మూడు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్‌ప్రాంగణంలో ఎత్తు కొలిచి పంపించారు. 2,608 మంది రన్‌కు అర్హత సాధించారు. అంబేద్కర్ స్టేడియంలో 250 చొప్పున బ్యాచ్‌లుగా విభజించి రన్ నిర్వహించారు. వీరిలో సుమారు 250 మంది అర్హత సాధించినట్లు సమాచారం. జిల్లాలో వర్షం పడటంతో అంబేద్కర్ స్టేడియం ట్రాక్ బురద మయంగా మారింది. బురుదలోనూ పరుగు పందెం నిర్వహించారు. -
కోయకుండానే.. కన్నీళ్లు
సాక్షి, ఆదిలాబాద్: కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిగడ్డలు.. కొద్ది రోజులుగా వాటి ధరలు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తు తం మార్కెట్లో కిలో ఉల్లిగడ్డల ధర రూ.50 నుంచి రూ.60 వర కు పలుకుతోంది. దీంతో సా మాన్య ప్రజలు నిత్య వినియోగంలో ఉల్లిగడ్డలను తగ్గించారు. గతంలో కిలో ధర రూ.15 నుంచి రూ.20 ఉన్న ఉల్లిగడ్డల డిమాండ్ పెరుగుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉల్లిగడ్డల సరఫరా తగ్గిపోయి ధరలు మండిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో వీటి ధర మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. సామాన్యులకు చుక్కలు ఉల్లికి ప్రధానమైన మార్కెట్లు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలు. ఆదిలాబాద్ జిల్లాకు ఆ ప్రాంతాల నుంచే ఉల్లిగడ్డలు దిగుమతి అవుతాయి. కర్నాటకతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పూణె, చంద్రపూర్, బెంగుళూరు, లాసల్గావ్ వంటి తదితర ప్రధాన ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వ్యాపారులు ఇక్కడ విక్రయాలు జరుపుతుంటారు. నెలరోజుల క్రితం ఉల్లి కిలో ధర రూ.20 ఉండగా ప్రస్తుతం రెండింతలు దాటిపోయింది. రైతుబజార్లో, కూరగాయల మార్కెట్లో తెల్ల ఉల్లిగడ్డలు రూ.60కిలో విక్రయిస్తుండగా, ఎరుపు రంగు ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు అమ్మకాలు జరుపుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో.. మహారాష్ట్రలో రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటలు బాగా దెబ్బతిన్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లికి పెట్టిందిపేరు. అక్కడినుంచి దేశంలోని నలుమూలలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉల్లిగడ్డలు సరఫరా అవుతాయి. మహారాష్ట్రలోని వర్షాలను సాకుగా చూపి కొంతమంది వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రెండు నుంచి మూడింతలు ధరను అధికంగా పలుకుతూ వినియోగదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఉల్లి ధర పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలేవీ.. ప్రతియేడాది ఉల్లి ధర అమాంతం పెరుగుతూనే ఉంటుంది. ఆ సమయంలో మార్కెట్ అధికారులు, జిల్లా పౌరసరఫరాల అధికారులు రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తుంటారు. గతంలో రేషన్ షాపుల ద్వారా కూడా తక్కువ ధరకు ఒక్కొక్కరికి 2కిలోల చొప్పున అందించారు. అయితే ఈసారి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖాధికారులు స్పందించి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి సామాన్య, పేద ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిగడ్డలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రోత్సాహం కరువు ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువశాతం మంది రైతులు పత్తి, సోయా, ఆతర్వాత కందిపంటనే సాగు చేస్తున్నారు. ఉద్యానవన శాఖాధికారులు ఉల్లి సాగు గురించి రైతులకు అవగాహన కల్పించకపోవడం, రాయితీపై విత్తనాలు అందించకపోవడంతోనే రైతులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. గతంలో జిల్లాలో ఉల్లి సాగు చేసేవారని, ప్రస్తుతం కనీసం వంద ఎకరాల్లో కూడా చేపట్టడం లేదని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. రైతులు వాణిజ్య పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే వినియోగదారులకు మేలు జరగడంతో పాటు రైతులు ఆర్థికంగా లబ్ధిపొందుతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
అందరికీ అవకాశం
సాక్షి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ప్రస్థానం ఈ ప్రాదేశిక ఎన్నికల అనంతరం ముగిసిపోనుంది. 1959లో ఏర్పాటైన జెడ్పీ అరవై సంవత్సరాలు కలిసి నడిచింది. జిల్లాల విభజనతో ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు జిల్లాలుగా ఏర్పడటం, ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు జిల్లాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇక ఉమ్మడి జెడ్పీ చరిత్రగా మిగిలిపోనుంది. ఉమ్మడి జెడ్పీలో ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ జిల్లాల నుంచి జెడ్పీ చైర్మన్ల ప్రాతినిధ్యం ఉంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల నుంచి కూడా పలువురు ప్రాతినిధ్యం వహించారు. నిర్మల్ నుంచే అత్యధికం.. ఉమ్మడి గా 1959 నుంచి 2019 వరకు 19 మంది ప్రాతినిధ్యం వహించారు. మధ్యకాలంలో కాల పరిమితి ముగిసినప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కూడా కొనసాగింది. స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు వ్యవహరించారు. ఈ 19 మందిలో ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచే 11 మంది ఉండటం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో నిర్మల్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానంగా రాజకీయ చైతన్యం ఈ ప్రాంతంలో అధికం. ఆ తర్వాత మంచిర్యాల నుంచి ఐదుగురు, ఆదిలాబాద్ నుంచి ఇద్దరు, కుమురంభీం జిల్లా నుంచి ఒక్కరు మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాకో జెడ్పీ చైర్మన్ స్థానం ఏర్పడింది. దీంతో స్థానిక నేతలకు అవకాశం లభించనుంది. కొంతమందికి ఉన్నతి.. ఉమ్మడి జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించిన వారిలో కొంతమంది రాజకీయంగా ఉన్నతి సాధించారు. మరికొంత మంది ఆ పదవి తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. ఇంకొంతమంది ఇప్పటికీ ఉన్నత పదవి కోసం పోరాడుతున్నారు. మొదటి చైర్మన్ రంగారావు పల్సికర్ రాజకీయం అక్కడితోనే నిలిచిపోయింది. 1960 నుంచి 1961 వరకు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించిన పి.నర్సారెడ్డి ముఖ్యమంత్రులు బ్రహ్మానందంరెడ్డి, వెంగల్రావుల హయాంలో రెండుసార్లు మంత్రులుగా పనిచేశారు. రెవెన్యూ మంత్రిగా ఆయన పేరు గడించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రాష్ట్రస్థాయిలో పదవి అలంకరించారు. ఆయనకు సోదరుడైనటువంటి పి.గంగారెడ్డి 1964 నుంచి 1967 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. టి.మధుసూదన్‌రెడ్డి 1983 నుంచి 1985 వరకు జెడ్పీచైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపీగా పనిచేశారు. మహ్మద్ సుల్తాన్‌అహ్మద్ 1985 నుంచి 1986 వరకు జెడ్పీచైర్మన్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. 1987 నుంచి 1991 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తున్నారు. 2006 నుంచి 2009 వరకు అధ్యక్షుడిగా ఉన్న రాథోడ్ రమేశ్ ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పనిచేశారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. కొంతమంది కనుమరుగు.. జెడ్పీచైర్మన్లుగా పనిచేసిన వారిలో కొంతమంది రాజకీయంగా కనుమరుగయ్యారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. కడెంకు చెందిన జి.నారాయణరెడ్డి ఏడాదిపాటు 1967 నుంచి 1968 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయనకు రాజకీయంగా ఎలాంటి పదవులు లభించలేదు. 1991 నుంచి 1992 వరకు చైర్మన్‌గా ఉన్న చుంచు ఊశన్నది కూడా అదే పరిస్థితి. 1995 నుంచి 1996 వరకు చైర్ పర్సన్‌గా వ్యవహరించిన సుమతిరెడ్డి ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగయ్యారు. టి.పురుషోత్తంగౌడ్ది ఇదే పరిస్థితి. చిట్యాల సుహాసిని ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. లోలం శ్యామ్‌సుందర్ నిర్మల్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో చేరారు. జుట్టు అశోక్ చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నత పదవి చేపట్టలేదు. సిడాం గణపతి ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా చైర్మన్ పదవి తర్వాత ఎలాంటి ఉన్నతి లభించలేదు. పూర్తి కాలం కొంతమందే.. జెడ్పీచైర్మన్లుగా పూర్తికాలం కొంత మందే పదవిలో ఉన్నారు. జి.నర్సింహారెడ్డి 1970 నుంచి 1976 వరకు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 1987 నుంచి 1991 వరకు, లోలం శ్యామ్‌సుందర్ 2001 నుంచి 2006 వరకు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న వి.శోభారాణి 2014 నుంచి పదవిలో ఉన్నారు. ఈ జూన్‌తో పదవి కాలం ముగియనుంది. జెడ్పీచైర్మన్ రిజర్వేషన్ మొదట్లో ఉండేది కాదు. ఆ తర్వాత బీసీ, ఎస్సీలకు వచ్చింది. 2014లో బీసీ (మహిళ)కు రిజర్వ్ చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో 52 స్థానాలకు గాను 38 ఏకపక్షంగా గెలిచింది. ఆ తర్వాత పలువురు ఇతర పార్టీల జెడ్పీటీసీలు టీఆర్ఎస్లో కలవడంతో సంపూర్ణమైంది. ఇక అప్పట్లో చైర్పర్సన్ స్థానం కోసం టీఆర్ఎస్లో నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి, మంచిర్యాల జెడ్పీటీసీ ఆశాలత, నార్నూర్ జెడ్పీటీసీ రూపావతి పుష్కర్ల మధ్య పోటీ నెలకొనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్మల్ జెడ్పీటీసీ వి.శోభారాణి పేరును జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఖరారు చేశారు. జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్లు.. నిర్మల్ : రంగారావు పల్సికర్, రాంచంద్రారావు అన్నాజీ, లోలం శ్యామ్‌సుందర్, జుట్టు అశోక్ (ముథోల్ నియోజకవర్గం), పి.నర్సారెడ్డి, పి.గంగారెడ్డి, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎన్.సుమతిరెడ్డి, వి.శోభారాణి (నిర్మల్ నియోజకవర్గం), జి.నారాయణరెడ్డి, రాథోడ్ రమేశ్(ఖానాపూర్ నియోజకవర్గం). మంచిర్యాల: జి.నర్సింహారెడ్డి, బి.సీతాపతి, చుంచు ఊశన్న(మంచిర్యాల నియోజకవర్గం), మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (చెన్నూర్ నియోజకవర్గం), టి.పురుషోత్తంగౌడ్ (బెల్లంపల్లి నియోజకవర్గం). కుమురంభీం : సిడాం గణపతి (సిర్పూర్ నియోజకవర్గం). ఆదిలాబాద్ : టి.మధుసూదన్‌రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి (ఆదిలాబాద్ నియోజకవర్గం) పెరిగిన జెడ్పీటీసీ స్థానాలు ఉమ్మడి జిల్లాలో 52 మండలాలు ఉండగా 52 మంది జెడ్పీటీసీలు ఎన్నికయ్యేవారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడడంతో జెడ్పీటీసీ స్థానాల సంఖ్య 66కు పెరిగింది. దీంతో ఉమ్మడి జిల్లాతో పోలిస్తే.. 14 జెడ్పీటీసీ స్థానాలు పెరిగాయి. 636 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కొత్త జిల్లాల్లో ఈ సంఖ్య తగ్గి 568కి చేరింది. ప్రధానంగా పలు ఎంపీటీసీ స్థానాలు ఉన్నటువంటి గ్రామాలు సమీపంలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, తక్కువ ఓటర్లు ఉన్న వాటిని సమీపంలోని మరో ఎంపీటీసీ స్థానంలో కలపడం వంటివి జరగడంతో ఈ సంఖ్య తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఆదిలాబాద్ 17 158 మంచిర్యాల 16 130 కుమురంభీం 15 124 నిర్మల్ 18 156 మొత్తం 66 568 -
తహశీల్దార్ పై సర్పంచ్ దాడి
భీమిని: ఆదిలాబాద్ జిల్లాలో భీమిని తహశీల్దార్ దేవానంద్ పై నాయకపుపేట సర్పంచ్ దాడి చేశారు. ఈ ఘటనలో తహశీల్దార్ గాయపడ్డారు. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆహారభద్రత కార్డుల వివరాలు ఇవ్వనందుకు తహశీల్దార్ పై సర్పంచ్ చేసినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.