అభిప్రాయం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అభివృద్ధికి పుష్కల వనరులు ఉన్నా... పేదరికమూ, దారిద్య్రమూ తాండవిస్తూనే ఉన్నాయి. రైతన్నల ఆత్మ హత్యలు, నేతన్నల ఆకలిచావులు కొనసాగుతూనే ఉన్నాయి. యువత ఎడారి బాట పడుతుంటే... బీడీ కార్మికుల బతుకులు మసిబారుతున్నాయి. సామాజిక అణిచివేతలు సరేసరి! ఇలా ఎన్నో సమస్యలు. గతం గతః. నేడు కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశతో ఈ ప్రాంతవాసులు ఉన్నారు.
రాష్ట్రంలోనే ఓ మూలకు విసిరేయబడ్డ ట్లున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్నింటా వివక్షకు గురవుతోంది. ఆదర్శ జిల్లాగా చెప్పు కుంటున్న ఆదిలాబాద్ కేవలం అక్షర క్రమంలోనే ముందుండి, అభివృద్ధిలో మాత్రం ఏళ్లుగా వెనుక బాటుకు గురవుతోంది. ఉన్నంతలో కొంత మేరకు పైపై అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలది మరో ప్రత్యేక స్థితి. కార్పొరేటీకరణ దుష్ఫలితంగా విద్య, వైద్యం పేదలకు ఎండ మావిగానే మిగులుతున్నాయి. ప్రపంచీకరణ పుణ్యమా అని అసంఘటిత, బీడీ కార్మికుల బతుకులు మరింత దుర్భర మవుతున్నాయి. మూడు జిల్లాల్లో కలిపి సుమారు 7–8 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఆకాశాన్నంటు తున్న ధరలు, అందని కనీస వేతనాలు, వెరసి వీరి బతుకులు మరింత దుర్భర స్థితిలోకి నెట్ట బడుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) మొత్తం జనా భాలో 18 శాతం మంది గిరిపుత్రులున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర చరిత్రలోనూ వీరివి చీకటి బతుకులే. జ్వరమొచ్చినా. జలుబు చేసినా వందల్లో జనం రాలిపోవాల్సిందే. ఈ మూడు జిల్లాల్లోనూ పుష్కల వనరులున్నా వాటి సద్వినియోగం లేక లక్షల మంది యువత ఉపాధి కోసం ఎడారి బాట పడుతున్నారు. ప్రణాళికా బద్ధంగా వినియోగించుకుంటే పక్క రాష్ట్రాలకు అప్పిచ్చేంత నీటి వనరులున్నాయి. అయినా ఖరీఫ్ ప్రారంభంలో రైతులు కారుమబ్బుల నుండి జాలువారే చినుకు కోసం ఆకాశానికేసి ఎదురు చూడాల్సిందే. గోదావరి వంటి జీవ నదులు, సిరులు పండించే సారవంతమైన నల్లరేగడి నేలలు, విస్తారమైన అటవీ సంపద. సిరులు కురిపించే సింగరేణి బొగ్గు గనులు, (Sigareni Coal Mines) విస్తారమైన ఖనిజ సంపద ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇలా ఎన్ని ఉన్నా వనరులను ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేక పోతోంది.
నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ... అభివృద్ధికి నోచుకోని ఉత్తర తెలంగాణ జిల్లాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఇక్కడి దుర్భిక్ష పరిస్థి తుల్ని పారదోలేందుకు ‘జలయజ్ఞం’ ద్వారా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి బాటలు వేసిన మహానేత ఆయన. అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఏ ఒక్క కొత్త పరిశ్రమ స్థాపించకపోగా ఉన్న పరిశ్రమలనేకం ఉత్తర తెలంగాణలో మూసి వేతకు గురయ్యాయి.
ఆదిలాబాద్‌లో సీసీఐ మూసివేతతో 2,500 మంది, స్పిన్నింగు మిల్లు ప్రైవేటీకరణతో 750 మంది, నిర్మల్ ప్రాంతంలో నటరాజ్ స్పిన్నింగ్ మిల్లుల మూతతో 2,000 మంది, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ (Bodhan Sugar Factory) మూసివేతతో 2,500 మంది, కరీంనగర్‌లో ఎరువుల కర్మాగారం మూతతో 2,500 మంది ఉపాధికి దూరమయ్యారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఈ పరి స్థితుల్లో యువతకు గల్ఫ్ బాట తప్పడం లేదు. ఫలితంగా వేలాది కుటుంబాల్లో గల్ఫ్ గాయం మిగులుతోంది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్సార్ ‘సమ వికేంద్రీకరణ’ సిద్ధాంతం బదులు ‘అపసవ్య కేంద్రీకరణ’పై దృష్టి పెట్టడంతో ప్రాంతాల మధ్య అసమాన తలు మళ్లీ మొదలవుతున్నాయి.
చదవండి: చెప్పిన గొప్పలు ఏమయ్యాయి?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో సింగరేణి బొగ్గుగనులతో పాటు విస్తారంగా మాంగనీసు, ఇనుప ధాతువూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పసు పుతో పాటు ప్రత్యేక పంటగా ఎర్రజొన్న సాగ వుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు స్థాపించాలి. ఆదిలాబాద్‌లో అటవీ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. కరీంనగర్, నిజామాబాద్‌లలో గ్రానైట్ గనులున్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల సరిహద్దులో భీమదేవరపల్లి మండలంలో ఇనుపరాతి గుట్టలున్నాయి. కావున ఇక్కడ ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి పూను కోవాలి. మంథని కేంద్రంగా మైనింగ్ యూని వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. స్థానికులకే ఇక్కడ పనులు కల్పించాలి. ఈ ప్రాంతం నుండి ఎన్నుకోబడిన ప్రతి నేతా న్యాయంగా మనకు రావాల్సిన నిధుల కోసం చట్టసభల్లో గొంతు విప్పాలి.
- డాక్టర్ బి. కేశవులు
నార్త్ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం ఫౌండర్ – చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment