ఉత్తర తెలంగాణలో ‘రియల్’ ఢమాల్
నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరు తగ్గింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగైదేళ్లు అడ్డుఅదుపులేకుండా సాగిన ‘రియల్’ దందా ఇప్పుడు కుదేలయ్యింది. వ్యవసాయ క్షేత్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా... లేఔట్లు లేకుండా ప్లాట్లు చేసి పంచాయతీ, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో పన్నులు ఎగవేసినా.. ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా సాగిన ఈ దందాలో ఇప్పుడు పూర్తిగా స్తబ్ధత నెలకొంది.
తగ్గిన ఆదాయం...
రియల్ వ్యాపారం పడిపోవడంతో ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 2014-15లో భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీల ద్వారా రూ.740.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.138 కోట్ల వరకు ఆదాయం చేకూరాల్సి ఉంది. అయితే, ఈ ఆదాయం ఇప్పటి వరకు కేవలం వరకు రూ.70 కోట్లకు మించలేదు.
ఏప్రిల్‌లో ఐదు జిల్లాల్లో రూ.51.84 కోట్ల లక్ష్యానికి రూ.27.17 కోట్లే రాగా... 48.59 శాతం ఆదాయం తగ్గింది. మేలో రూ.55.54 కోట్లకు రూ.29.07 కోట్ల ఆదాయం రావడం గణనీయమైన మార్పులని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా ఈ రెండు నెలలలో ఖమ్మం జిల్లాలో 60.68 శాతం ఆదాయం పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో 58.45 శాతం ఆదాయం తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో 24.45, కరీంనగర్‌లో 25.92, వరంగల్‌లో 17.93 శాతం ఆదాయం తగ్గినట్లు సమాచారం.