North Telangana
-
ఉత్తర తెలంగాణపై కమలం ఫుల్ ఫోకస్!
సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంప్రదాయబద్ధంగా పట్టున్న ఈ ప్రాంతంనుంచి ఈసారి కూడా మంచి ఫలితాల సాధనకు పార్టీ ఉత్తర తెలంగాణను నమ్ముకుంది. సంస్థాగతంగానూ, రాజకీయంగానూ ఇతర ప్రాంతాల కంటే ఇక్కడే పార్టీ పటిష్టంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలో అధిక సీట్లు గెలుస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లు బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వముంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూలత పెరుగుతున్నదని అంచనా వేస్తున్నారు. ముమ్మరంగా ప్రచారం చేసేలా... ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అధిక సీట్లు గెలుచుకునే దిశలో వివిధ రూపాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామన్న హామీని వివిధ వర్గాల ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు ఉపకులాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు తెలపడంతో పాటు సమస్యల పరిష్కారంపై కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఈ వర్గాల్లో బీజేపీపై సానుకూల స్పందన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో బీజేపీకి ఎమ్మార్పిఎస్ నాయకత్వం మద్దతు తెలపడంతో పాటు బీసీ సీఎం నినాదాన్ని కూడా బలపరుస్తూ ప్రచారం చేయడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా 36 సీట్లను బీసీలకు బీజేపీ కేటాయించడం ద్వారా బీసీలకు పెరిగిన ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. -
దంచికొడుతున్న వానలు.. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం, రెడ్ అలర్ట్!
సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. (కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!) ఉప్పొంగిన వాగులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. (ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి) -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల నేపథ్యంతో.. ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో నేడు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మంగళవారం సుమారు 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ తేదీల్లో మస్త్ వానలు!
సాక్షి, హైదరాబాద్: గత రెండు రోజల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో, వర్షాలు తగ్గుముఖం పట్టేలోపే.. హైదరాబాద్ వాతవరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావం కారణంగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, ద్రోణి ప్రభావంతో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ కురవనున్నట్టు తెలిపారు. మరోవైపు, ద్రోణి కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగి.. సాయంత్రం సమయంలో వడగండ్ల కురిసే అవకాశం ఉందని స్పష్టంచేశారు. అలాగే, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశముందన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత నష్టం కలిగే అవకాశం లేకపోలేదు. -
మూడు జోన్లు.. మూడు ‘వానలు’
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలోని మూడు వాతావరణ జోన్లలో ప్రస్తుత వర్షాకాల సీజన్లో మూడు రకాలుగా వర్షాలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు)లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండగా మధ్య తెలంగాణలో (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు) ఓ మోస్తరుగా, దక్షిణ తెలంగాణ (ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు)లో సాధారణ వర్షాలే కురుస్తున్నాయి. అప్పుడే లక్ష్యానికి చేరువై... నైరుతి రుతుపవనాలతో రాష్ట్రంలో నాలుగు మాసాల్లో కురవాల్సిన వర్షం 72.04 సెంటీమీటర్లుకాగా జూన్ 1 నుంచి జూలై 18 వరకు 56.41 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. అంటే 120 రోజుల్లో కురవాల్సిన వర్షం కేవలం 48 రోజుల్లోనే 78 శాతం మేరకు కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతమే నమోదైనా (14.26 సెంటీమీటర్లు), జూలై 18 వరకు 11.7 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఏకంగా 42.03 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 85.5 సెంటీమీటర్ల వర్షం (253 శాతం) కురవగా జగిత్యాల (230 శాతం), కరీంనగర్ (211 శాతం), నిర్మల్ (205 శాతం), భూపాలపల్లి (190 శాతం) అధిక వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకు అన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 125 శాతం నుంచి 253 శాతం వరకు అధిక వర్షాలు కురిశాయి. కొన్ని గంటలపాటు క్లౌడ్‌బరస్ట్ వల్లే ఉత్తర తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్లో మధ్యస్థం.. సెంట్రల్ తెలంగాణ జోన్‌లోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు కురిశాయి. అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఇంకా కురువలేదు. ఒక్క ములుగు జిల్లాలో మాత్రం అతిభారీ వర్షాలతో 158 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దక్షిణాన వెనకబడ్డ గద్వాల.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం రంగారెడ్డి జిల్లాలో 91 శాతం అధికంగా నమోదైతే, అత్యల్పంగా జోగులాంబ గద్వాలో 35 శాతం మేర అధిక వర్షపాతం నమోదైంది. ఉత్తర, మధ్య తెలంగాణలతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో వర్షాల తీవ్రత తక్కువగానే ఉన్నా అన్ని జిల్లాలు ఇప్పటికే సాధారణ సగటు వర్షపాతాన్ని మించిపోవడం విశేషం. వర్షాల రికార్డులు ఇవీ... ►ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లా నవీపేట సాధారణం కంటే 365 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షం కురిసిన ప్రాంతంగా రికార్డు సృష్టించగా కుమురం భీం జిల్లా లింగాపూర్ 344 శాతంతో రెండో స్థానంలో 308 శాతం అధిక వర్షంతో జైనూర్ మూడవ ప్లేస్‌లో నిలిచింది. ►గత 50 ఏళ్లలో అత్యధిక వర్షపాతం రికార్డు ములుగు జిల్లా వాజేడులో నమోదైంది. 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం జిల్లా దహేగాన్లో 2013 జూలై 23న 50.36 సెంటీమీటర్లు, 2005 సెప్టెంబర్ 20న భద్రాద్రి జిల్లా ములకపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షం పడింది. ►24 గంటల్లో 0.25 సెంటీమీటర్ల మేర వర్షం కురిస్తే దాన్ని ఒక్క రెయినీ డేగా గుర్తిస్తారు.గత 30 ఏళ్ల సగటు వర్షపాతం లెక్కలను పరిశీలిస్తే సంవత్సరంలో అత్యధికంగా భద్రాద్రి జిల్లా 80 రెయినీ డేస్‌తో మొదటి స్థానంలో ఉంది. 74 రోజులతో ములుగు రెండవ స్థానంలో 72 రోజులతో కుమురం భీం మూడవ ప్లేస్‌లో ఉంది. ►జోగులాంబ గద్వాలలో ఏడాదిలో కేవలం 47 రోజులు, వనపర్తిలో 49, హైదరాబాద్‌లో 51 రోజులు మాత్రమే రెయినీ డేస్ ఉన్నాయి. అల్పపీడనాలే ఎక్కువ... తెలంగాణలో సాధారణ సగటు వర్షపాతం కంటే అల్పపీడనాల వల్లే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అల్పపీడనాలు ఒడిశా వైపు మళ్లే సమయంలో ఉత్తర తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. దీంతో అతిభారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా తీర ప్రాంతంతో పోలిస్తే గోదావరి పరీవాహకంలో అత్యధిక అటవీ ప్రాంతం ఉండటం కూడా అక్కడ అత్యధిక వర్షాలకు ఓ కారణం. – వై.కరుణాకర్‌రెడ్డి, వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ ఇదీ వర్షం లెక్క.. (ప్రతి గంటకు) తేలికపాటి వర్షం: 1 సెంటీమీటర్ మోసర్తు వర్షం: 1–2 సెంటీమీటర్లు భారీ వర్షం: 2–3 సెంటీమీటర్లు అతి భారీ వర్షం: 3–5 సెంటీమీటర్లు అత్యంత భారీ వర్షం: 5–10 సెంటీమీటర్లు క్లౌడ్ బరస్ట్: 10 సెంటీమీటర్లపైన -
ఉత్తర తెలంగాణకు రెడ్ అలెర్ట్
-
మృత్యుపాశాలు; ఆరేళ్లలో 3 వేల మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో 2014-2020 మధ్య కాలంలో విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడి 3,008 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 1,197 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందడం గమనార్హం. తెలంగాణ ఉత్తర విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడించింది. (వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ) విద్యుత్ ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయం పరిహారం చెల్లించాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్ఈఆర్సీ) స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, అధికారుల నిర్లక్క్ష్యంతో తరుచుగా ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తీగలను సరిగా అతికించకపోవడం, లైవ్ వైర్లు, స్తంభాల నుంచి లీకేజీ, విద్యుత్ సరఫరాలోని లోపాల కారణంగా విద్యుత్దాఘాతాలు సంభవిస్తున్నాయి. కరెంట్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేసే ముందు అవసరమైతే అంతర్గత విచారణ చేపట్టవచ్చని డిస్కంలకు టీఎస్ఈఆర్సీ సూచించింది. 2013 వరకు 2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 2015లో నాలుగు లక్షలకు ప్రభుత్వం పెంచింది. పలు సవరణల తర్వాత 2018లో పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మృతుల్లో చాలా మంది సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడంతో పరిహారాన్ని పొందడంలో వారి కుటుంబ సభ్యులు అవాంతరాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. పరిహారం కోసం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నాయని సామాజిక కార్యకర్త సుధీర్ జలగం తెలిపారు. ఆర్టీఐ కింద విద్యుత్ ప్రమాద వివరాలను ఆయన సేకరించారు. ‘బాధితుల కుటుంబాలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర రుజువులను అందించాల్సిన అవసరం ఉంది, కాని అధికారులు వాటిని జారీ చేయడానికి నెలల సమయం తీసుకుంటూ, ప్రక్రియను ఆలస్యం చేస్తున్నార’ని ఆయన ఆరోపించారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయని, తరచుగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. (మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు) టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 2014-2020 మధ్య కాలంలో వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 178 విద్యుత్ ప్రమాద సంబంధిత మరణాలు సంభవించాయి. తర్వాత స్థానాల్లో కామారెడ్డి(175), నిర్మల్(164), మహబూబాబాద్(163), జగిత్యాల్(160), నిజామాబాద్(158), పెద్దపల్లి(139), కరీంనగర్(130), మంచిర్యాల(129), ఆదిలాబాద్(128), ఖమ్మం(128), భూపాలపల్లి(122), భదాద్రి-కొత్తగూడెం(119), జనగాం(113), వరంగల్ అర్బన్(60), ఆసిఫాబాద్(53) ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అమలు చేసి ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి. సాగర్ అన్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు తప్ప ముందుస్తు రక్షణ చర్యలు శూన్యమని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో గత కొనేళ్లుగా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2014-15లో 210 మరణాలు నమోదు కాగా, 2017-18లో 537 మంది మృతి చెందారు. 2019-20 నాటికి ఈ సంఖ్య 681కి పెరగడం ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోంది. -
విస్తారంగా వానలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలే వర్షాలు.. వానలు విస్తారంగా కురుస్తున్నాయి. రాష్ట్రం తడిసి ముదై్దయింది. జిల్లాలు జలమయ మయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 31.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. 33 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. వాస్తవానికి ఈ నెల 10న సాధారణ వర్షపాతం 10.9 మిల్లీమీటర్లు ఉండాలి. కానీ, మూడు రెట్లు అధిక వర్షపాతం నమోదైంది. మరో రెండ్రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆర్మూర్‌లో అతిభారీ వర్షం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో అతిభారీ వర్షం కురిసింది. ఏకంగా 17.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నవీపేటలో 16.6, రంజల్లో 13.8, కామారెడ్డి జిల్లా గాంధారిలో 13.4, కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో 13, హుజూరాబాద్‌లో 12, వరంగల్ జిల్లా ధర్మసాగర్లో 12, తిమ్మాపూర్‌లో 11.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 17 మండలాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు∙వాతావరణ శాఖ ప్రకటిం చింది. 8 జిల్లాల్లో సగటున 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నిజామాబాద్‌లో అత్యధికంగా 8.2 సెంటీమీటర్లు నమోదుకాగా, వరంగల్ అర్బన్ 7.6, వరంగల్ రూరల్ జిల్లాల్లో 7.5, కరీంనగర్లో 7, సిరిసిల్లలో 6.7, కామారెడ్డిలో 6.3, మహబూబాబాద్‌లో 6, భూపాలపల్లిలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదైంది. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర సగటు వర్షపాతం 44.7 సెంటీమీటర్లు కాగా, ఇప్పటివరకు 52.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం ఎక్కువ. బంగాళాఖాతంలో 13న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఈ నెల 9న ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు కురుస్తుండగా ఈ నెల 13న వాయవ్య దిశలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చని పేర్కొంది. రాబోయే రెండ్రోజులు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
ఉత్తరాన ఉలికిపాటు..!
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ... మావోయిస్టు ఉద్యమానికి పుట్టినిల్లుగా చెప్పుకునే ఈ ప్రాంతంలో తిరిగి మావోల సంచారం కలకలం రేపుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభణ, మరోవైపు పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మద్దతు వంటి అంశాలను తమ కేడర్ రిక్రూట్మెంట్కు అనుకూలంగా మలుచుకునే య త్నాలు చేస్తున్నారు. తాజాగా పోలీసుల కూంబింగ్ లో ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పలువురు కీలక మావోయిస్టులు త్రుటిలో తప్పించుకోవడం, రెండు చోట్ల ఎదురుకాల్పులు చోటుచేసుకోవ డమే ఇందుకు నిదర్శనం. లాక్డౌన్ సమయం నుంచే ఉమ్మడి కరీంనగర్‌లోని జగిత్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో మావోయిస్టుల సంచారం మొదలైంది. ఇదే సమయంలో రిక్రూట్మెంట్ కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఛత్తీస్గడ్, ఒడిశాల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నేతలంతా ఉత్తర తెలంగాణవారే అయినా.. వారి సొంత ప్రాంతాల్లో పార్టీ పటిష్టంగా లేదన్న వి మర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఈ విమర్శలను పోగొట్టుకునేందుకే ఈ సంక్షోభ సమయంలో ఉత్తర తెలంగాణపై దృష్టి సారించారని సమాచారం. ఇపుడే ఎందుకు? ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభణకు వేలాది మందికి ఉపాధి కరువైంది. ముఖ్యంగా అసంఘటి త రంగంలో ఉండే కార్మికులు, విద్యావంతులు సైతం ఉపాధి కోల్పోతున్నారు. దేశంలో ప్రస్తు తం నెలకొన్న ఆర్థిక మందగ మనం కారణంగా క్రమంగా నిరుద్యోగం, పేదరికం పెరుగుతున్నాయి. అంటే తిరిగి 1990ల నాటి పరిస్థితులు కనిపిస్తున్నా యి. అందుకే, కేడర్ రిక్రూట్మెంట్ ఇదే సరైన సమయమని భావించిన మావో అగ్రనేతలు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్‌లపై దృష్టి కేంద్రీకరించారు. ప్రజాసమస్యలపై పోరాటం పేరిట గిరిజన, అటవీ ప్రాంతాల ఆదివాసీల్లోని అనాథలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతను తమతో చేర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కోసం పలు ప్రాంతాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో ఇటీవల సిరిసిల్లలో పోలీ సులు కొందరు మావోయిస్టులను, కొన్ని తుపాకులను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో ప్రధాన కారణం పోడు వ్యవసాయం... ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోడు వ్యవసాయం పోకడలు అధికం. దాంతో ఇక్కడ ఫా రెస్టు ఆఫీసర్లకు పోడు వ్యవసా యం చేసుకునేవారికి ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా తిప్పుకోవాలని మావో నేతలు నిర్ణ యించినట్లు కనిపిస్తోంది. పోడు రైతుల్లో యువకులను తమవైపు తీసుకెళ్లేందుకు పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఆ 15 మంది ఎక్కడ? ఆసిఫాబాద్‌లో తిర్యాణి మండలంలో మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని వీరి స్థావరం నుంచి ఆసిఫాబాద్ పోలీసులు ఓ డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆసిఫాబాద్‌కు చెందిన 15 మంది యువకుల పేర్లు ఉన్నాయి. వీరిలో చాలామంది స్థానికంగా లేరని, మిస్సయ్యారని సమాచారం. వీరు ఎక్కడికెళ్లారని పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరి పేర్లు డైరీ లో ఎందుకున్నాయి? వీరిని ఇప్ప టికే రిక్రూట్ చేసుకున్నారా? శిక్షణ కోసం ఛత్తీస్గడ్ పంపారా? లేక మరేదైనా కారణం కోసం డైరీలో రాసుకున్నారా? అన్న అంశాలను ధ్రువీకరించుకునే పనిలో పడ్డారు. 24 గంటల్లో రెండు చోట్ల ఎదురుకాల్పులు.. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య రెండు చోట్ల ఎదురుకాల్పులు జరగడం తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈవారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిధిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలరేపు అడెళ్లు అలియాస్ భాస్కర్ నేతృత్వంలోని దళం సంచరిస్తోందన్న సమాచారంతో స్పెషల్ పోలీసులు రంగంలోకి దిగారు. అతనితోపాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, ఛత్తీస్‌గడ్‌కు చెందిన వర్గీస్ కోయ మగ్లు, కంతి లింగవ్వ అలియాస్ అనిత, పాండు అలియాస్ మంగులు, మీనా, రాములతో కూడిన దళం పోలీసులకు ఎదురుపడగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. ఇందులో భాస్కర్, ప్రభాత్ తలలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. కాగా మిగిలిన దళ సభ్యులపై రూ.4 నుంచి 5 లక్షల రివార్డు ఉంది. వీరి ఫొటోలను ఇప్పటికే విడుదల చేసిన పోలీసులు..తిర్యాణి అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మరోవైపు కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలోని మల్లెపల్లితోగు సమీపంలో కూంబింగ్ చేస్తోన్న పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. సామగ్రి వదిలేసిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ట్రిపుల్ ఐటీ పై పట్టింపేది?
సాక్షి, నిర్మల్: ఉత్తర తెలంగాణ పేదింటి విద్యార్థుల కలల చదువు.. కల్పతరువు.. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ. చదువులమ్మ కొలువుదీరిన చోట 272ఎకరాల విశాల ప్రశాంత వాతావరణంలో ఈ విద్యాక్షేత్రం కొలువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా 2008లో ప్రారంభమైంది. మొత్తం ఏడువేల మంది విద్యార్థుల కలల ప్రపంచమిది. ఎన్నో ఆశలు, ఆశయాలతో వచ్చిన పేదింటి విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తోంది. అలాంటి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ట్రిపుల్ ఐటీ) పై రాష్ట్ర సర్కారు చిన్నచూపు చూస్తోంది. ఏళ్లుగా ఈ ప్రత్యేక యూనివర్సిటీని ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ పాలనతోనే నెట్టుకొస్తోంది. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నవారూ అరకొర పర్యవేక్షణే చేపడుతుండటంతో ఇక్కడి క్యాంపస్‌లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా పలుమార్లు ఆరోపణలు ఎదుర్కొన్న ట్రిపుల్‌ఐటీలో తాజాగా కీచక చేష్టలూ వెలుగులోకి రావడం విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. ఏళ్లుగా ఇన్చార్జి పాలన.. పేద పిల్లలను ఉన్నత స్థానాలకు చేర్చాలన్న వైఎస్ఆర్ ఆశయంతో ఏర్పడిందే ట్రిపుల్ఐటీ. తెలంగాణలో ఏకైక ట్రిపుల్ఐటీ బాసర ఆర్జీయూకేటీ. ఉన్న ఒక్క చదువుల క్షేత్రంపై ఏళ్లుగా వివక్ష కొనసాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. గడిచిన ఐదున్నరేళ్లుగా ట్రిపుల్‌ఐటీని ఇన్చార్జి వీసీలతోనే నెట్టుకొస్తుండటం గమనార్హం. శాశ్వత వీసీని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేక విశ్వవిద్యాలయంగా స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీకి రెగ్యులర్ వీసీ ఉండాలన్న డిమాండ్ ఏళ్లుగా వస్తున్నా..కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇక్కడి క్యాంపస్‌పై శీతకన్ను కొనసాగుతోంది. ఇప్పటికీ ఇక్కడ రెగ్యూలర్ వీసీ నియామకంపై చర్చించకపోవడం గమనార్హం. గతంలో ఉస్మానియా వీసీగా పనిచేసిన సత్యనారాయణను ఇన్‌చార్జీగా నియమించారు. మూడేళ్లపాటు ఆయన పనిచేశారు. అనంతరం గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ కలెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా ఉన్న అశోక్‌కు ఇన్చార్జి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. పర్యవేక్షణ కరువై.. ఏడువేల మంది విద్యార్థులు ఉంటున్న బాసర ట్రిపుల్ఐటీకి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ రెగ్యూలర్ వీసీని నియమించడం లేదు. ఏళ్లుగా ఇన్చార్జి పాలనే కొనసాగుతుండటంతో ఇక్కడి వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత ఇన్చార్జి వీసీ అశోక్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శిగా బిజీగా ఉంటున్నారు. ఇటీవల తరచూ వివాదాల్లో ఇంటర్‌బోర్డు కూరుకుపోతుండటంతో ఆయన మరింతగా సంబంధిత శాఖపైనే పూర్తి దృష్టిపెడుతున్నట్లు సమాచారం. దీని ప్రభావం ఆయన ఇన్చార్జిగా ఉన్న బాసర క్యాంపస్‌పై పడుతోంది. ఎప్పుడన్నా.. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా ఇన్చార్జి వీసీ క్యాంపస్‌కు రావడం లేదు. ఇక్కడి ఏఓ, రిజిస్ట్రార్ల పరిధిలోనే వర్సిటీ పాలన కొనసాగుతోంది. వైస్ చాన్స్‌లర్ పర్యవేక్షణ లేకపోవడంతో స్థానిక అధికారులు, అధ్యాపకుల్లో కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా కీచక చేష్టలు.. ఉన్నత ఆశయాలతో క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విషనాగుల్లాంటి అధ్యాపకులూ ఇక్కడ ఉన్నారు. పదోతరగతి వరకు బాగా చదువుకుని, ట్రిపుల్‌ఐటీలో ప్రవేశమే లక్ష్యంగా అత్యుత్తమ మార్కులు సాధించి వచ్చిన పేదింటి బిడ్డల జీవితాలతో ఆడుకునేవారు దాపురించారు. తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఘటన క్యాంపస్‌లో కొంతమంది అధ్యాపకుల వికృత చేష్టలకు అద్దం పట్టింది. కెమిస్ట్రీ విభాగాధిపతిగా ఉన్నతస్థానంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవి వరాల చేసిన పని అధ్యాపకవృత్తినే తలదించుకునేలా చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సెల్ఫోన్లో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు ఆయనను విధుల నుంచి తొలగించడంతో పాటు కేసులనూ నమోదు చేశారు. ఇక ఇలాంటి కీచక చేష్టలతో పైశాచిక ఆనందం పొందుతున్న వారు మరికొందరు ఉన్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దొరికితేనే దొంగ.. అన్న రీతిలో వీరు చేస్తున్న కథలు బయటపడక పోవడంతో గుట్టుగా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలోనూ ఓ అధ్యాపకుడు చేసిన నిర్వాకానికి ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. మొత్తం ఇప్ప టి వరకు ఏడుగురు విద్యార్థులు వివిధ కారణాల తో ఇక్కడి క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అవినీతి, అక్రమాలకూ ఆస్కారం.. ట్రిపుల్ఐటీకి వివిధ సంస్థలు, ప్రభుత్వాల నుంచి వచ్చే ఉత్తమ పురస్కారాలను అందుకుంటున్న ఇన్చార్జి వీసీ ఇక్కడి అక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. విద్యార్థుల కోసం వచ్చే లాప్‌టాప్‌లు, యూనిఫాంలలో అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ మెస్‌లలో లోపాలపైనా విద్యార్థులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు. తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారని, అన్ని విభాగాలనూ వారికే దక్కేలా చూస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక అకాడమిక్ పరంగా కూడా ఇన్చార్జి వీసీ ఉండటంతో విభాగాధిపతులపై పర్యవేక్షణ కరువైంది. ఈక్రమంలో రవి వరాల వంటి వారు ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో భద్రతపైనా భరోసా లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదేవిషయంపై సోమవారం క్యాంపస్‌ను తనిఖీ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మండిపడ్డారు. ఇప్పటికైనా.. 2008లో ప్రారంభమైన బాసర ట్రిపుల్ఐటీ లో ఎంతో మంది పేద విద్యార్థులు కొలువు లు సాధించారు. గ్రామీణ విద్యార్థులకు అ త్యుత్తమ సాంకేతిక విద్యను అందించే దిశగా పదో తరగతి ఉత్తీర్ణత కాగానే ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జీపీఏ కేటగిరీ వారీగా వారికి సీట్లను కేటాయిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, మండలాలు, జిల్లాలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తారు. ఏటా కౌన్సెలింగ్‌లో హాజరైన విద్యార్థులు ప్రవేశాలు పొంది కళాశాలలో ఆరేళ్ల సమీకృత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు 2014 నుంచి చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ కొలువులు సాధించారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పేదింటి విద్యార్థుల కలగా భావించే ట్రిపుల్ఐటీపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టా ల్సిన అవసరం ఉంది. ఇక్కడి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు కీచక అధ్యాపకుల చేష్టలు ఇక ముందు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇందు కోసం అత్యుత్తమ రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులూ కోరుతున్నారు. -
‘ఆయువుపట్టు’ పట్టేద్దాం!
ఉత్తర తెలంగాణ టీఆర్ఎస్కు ఆయువుపట్టు గత ఎన్నికల్లో అత్యధిక సీట్లను ఈ ప్రాంతం నుంచే గెలిచింది అందుకే టీఆర్ఎస్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో ఆ ప్రాంతంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మొత్తం 45 స్థానాలున్నాయి. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు టీఆర్ఎస్కు ఉత్తర తెలంగాణ జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఈ జిల్లాల్లో 7 సీట్లే గెలిచింది. ఉత్తర తెలంగాణ లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో పూర్వవైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో కనీసం సగం సీట్లు గెలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. భారీసభలతో జనాల్లోకి... ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించేందుకు టీపీసీసీ ముఖ్యులంతా అక్కడే భారీస్థాయిలో ప్రచారపర్వం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కొన్ని నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో నార్త్ తెలంగాణ జిల్లాల్లపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే 30 బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రచార షెడ్యూల్‌పై కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభల్లో పాల్గొని అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిసింది. దక్షిణ తెలంగాణలోనూ పోటాపోటీయే... ఉత్తర తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణ తెలంగాణ నుంచే అధిక స్థానాలు గెలుపొంది ప్రతిపక్షం హోదాను దక్కించుకోగలిగింది. ముందునుంచి కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రాంతాలు ఆయువుపట్టుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, ఈసారి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు ఢీ అండే ఢీ అనే స్థాయిలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సగం అభ్యర్థులు మాజీమంత్రులే. నియోజకవర్గాల్లోనే ఉంటున్నందున కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన సీట్ల కంటే రెండింతలు సాధిస్తామని కాంగ్రెస్ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ► కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఉత్తర తెలంగాణ జిల్లా అయిన ఖమ్మంలోని మధిర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు, మధిర, ఖమ్మం, ఇల్లెందు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపుపొందింది. అయితే, పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 10 సీట్లలో ఈసారి కాంగ్రెస్ తన సిట్టింగ్ సీట్లతో పాటు కూటమి తరఫున సా«ధ్యమైనన్ని ఎక్కువస్థానాలు గెలిచేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ► ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల తప్పా మరే స్థానాన్నీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. జిల్లాలోని 13 స్థానాల్లో ఈసారి కనీసం సగం స్థానాలనైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ముథోల్ స్థానం మిన హాయించి ఏ స్థానంలోనూ గెలవలేకపోయింది. ముథోల్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. అయితే, ఈ సారి జిల్లాల్లోని 10 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక డోర్నకల్ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నర్సంపేట్ నుంచి ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి గెలిచారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరడం మళ్లీ పరకాల నుంచి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ తన స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. –సాక్షి, హైదరాబాద్ -
రేపు ఉత్తర తెలంగాణలో పవర్ కట్
ఆదిలాబాద్: ఉత్తర తెలంగాణలో రేపు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ లైన్లు కలపడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో పలు చోట్ల కరెంట్ కోతలు విధించనున్నారు. అదిలాబాద్ జిల్లాతో పాటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనురు, సిర్పుర్ మండలాలకు సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కరెంట్ కోతలు విధించనున్నారు. -
ఉత్తర తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు
విశాఖపట్నం : ఉత్తర తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలుతున్నాయని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుందని పేర్కొంది. అలాగే అల్పపీడన ప్రాంతంలోఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం, బుధవారం ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. కోస్తాతీరం వెంబడి 45 -50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. -
‘ఉత్తరాన్ని’ ముంచెత్తుతున్న వాన
-
‘ఉత్తరాన్ని’ ముంచెత్తుతున్న వాన
తడిసి ముద్దవుతున్న ఉత్తర తెలంగాణ - ఆదిలాబాద్‌లో స్తంభించిన జనజీవనం - బెజ్జూరులో 25 సెంటీమీటర్ల వర్షపాతం - జలదిగ్బంధంలో వందలాది గ్రామాలు - కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంల్లోనూ... - నిలిచిన 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాక్షి, మంచిర్యాల/కరీంనగర్ అగ్రికల్చర్/ఇందూరు/భద్రాచలం/హైదరాబాద్: మూడు రోజులుగా ముంచెత్తుతున్న వర్షాలతో ఉత్తర తెలంగాణ తడిసి ముద్దవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆదివారం జిల్లాలో సగటు వ ర్షపాతం 6.94 సెంటీమీటర్లుగా నమోదైంది. బెజ్జూరు మండలంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రాణహిత ఉప్పొంగడంతో వేమనపల్లి మండలం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. బెజ్జూరు మండలంలో తీగలబర్రె వాగు ఉప్పొంగడంతో కాగజ్‌నగర్-బెజ్జూర్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 64 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. 16 గ్రామాల ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. భారీ వరదనీటితో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. ప్రాణహిత, పెన్‌గంగ, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతుండడంతో నది పరీవాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సారంగాపూర్‌లోని స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. నేరడిగొండ మండలం వాంకిడి వద్ద తాత్కలిక వంతెన వర్షానికి కొట్టుకుపోయింది. భీమిని మండలంలో బిట్టూర్‌పల్లి వాగు ఉప్పొంగడంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. నిర్మల్ , భైంసా, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల తో సహా పలుచోట్ల ఇళ్లు కూలాయి. ఆది లాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, నిజామాబాద్‌ల్లోనూ... కరీంనగర్ జిల్లాలోనూ రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నారుు. దాంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నారుు. సుమారు 17 లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించారుు. రామగుండంలోని సింగరేణి నాలుగు ఓపెన్‌కాస్ట్ గనుల్లో 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎల్లంపెల్లి ప్రాజెక్టుకు ఎగువ నుంచి 800 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 150 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం రాత్రి వరకు జిల్లావ్యాప్తంగా 690 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి వద్ద గోదారి పరవళ్లు ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం రాత్రి 23.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఎగువ వర్షాలకు తోడు బాసగూడ, కాళేశ్వరం, ఇంద్రావతిల నుంచి కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. చర్ల తాలిపేరు ప్రాజెక్టు నాలుగు గేట్లు 2 అడుగుల మేర ఎత్తి, 6 వేల క్యూసెక్కుల నీటి ని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద గోదావరి నీరు రహదారిని ముంచెత్తటంతో అటువైపు ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఆదివారం 8.10 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇది ఇంకా పెరగవచ్చని అంచనా. -
అసలుకే ఎసరు రావచ్చు
అనూహ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మంత్రివర్గంలో కీలక స్థానం దక్కించుకున్న ఓ అమాత్యుల వారికి షాకింగ్ న్యూస్ ఒకటి చెవినపడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఈ మంత్రివర్యులు తన జిల్లాలో తనకు ఇక తిరుగులేదని భావించారు. పార్టీలో ఎవరైనా చేరడానికి వస్తే తనకు ఇష్టం లేకుండా చేర్చుకోరాదని షరతు పెట్టేదాకా ఆయన ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి తరువాత తానే అన్నట్లు వ్యవహారం నడుపుతున్న సదరు సీనియర్ మంత్రికి చెక్ పెట్టే వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. సదరు నేతకు పోటీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీఆర్ఎస్లో ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ లోగానే ఆయన ఆధిపత్యానికి చెక్ పెట్టాలని పార్టీ అధినాయకత్వమే ఓ నిర్ణయానికి వచ్చిందట. అదే జిల్లాలో తన సామాజిక వర్గానికి చెందిన ఓ నేత కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అంశం అది. పార్టీ ముఖ్యులు నేరుగా ఆ విషయం అమాత్యుల వారికి చెప్పేసరికి అవాక్కయ్యారట. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎదురు లేదని అనుకుంటే అంతే సంగతులు మరి...టీఆర్ఎస్సా...మజాకా! -
ఎస్సారెస్పీ ఎండిపోతోంది..
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ఎండిపోతోంది. ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా తగ్గిపోతోంది. గత ఖరీఫ్‌లో ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన రీతిలో వరద నీరు రాకపోవడంతో జలాశయంలోకి సగం వరకు కూడా నీరు చేరలేదు. అందుకే ఈసారి కాలువల ద్వారా పంటలకు సాగు నీరు కూడా విడుదల చేయలేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కనిష్ట నీటిమట్టం (డెడ్ స్టోరేజీ) 5 టీఎంసీలు పోను మిగిలేది 8.5 టీఎంసీలు మాత్రమే. లీకేజీలు, ఆవిరికి పోను మిగిలేదెంతో తెలియక అధికారులే తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులలో తాగునీటికి కూడా తిప్పలు తప్పేలా లేవు. మరోవైపు ఎండలు తీవ్రతరమవుతుండడంతో ఆయకట్టు రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలలలో భానుడు భగభగ మండే సంకేతాలు ఉన్నాయి. అంటే నీరు ఇంకా భారీగా ఆవిరయ్యే ప్రమాదం ఉంది. ఎగువ ప్రాంతంలోని మహారాష్ర్టలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు సైతం ఎస్సారెస్పీకి గండంగా మారింది. సు ప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతేడాది నీ రు విడుదల చేసినా.. ఆశించిన మేరకు నీరు వచ్చి చేరలేదు. కోర్టు తీర్పు ప్రకా రం ఈ ఏడాది మే మొదటివారంలో బా బ్లీ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉండగా, ‘మహా’ అధికారులు నీటిని విడుదల చేయలేదు. కాగా, ఎస్సారెస్పీ ఏటా 0.8 టీఎంసీల పూడిక చేరుతుందని రికార్డులు తె లుపుతున్నాయి. 1994లో చేపట్టిన సర్వే ప్రకా రం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 1,091 అడుగులు, 90 టీఎంసీలు ఉందని నమోదు చేశారు. 2014లో జరిగిన సర్వే అనంతరం అది 79 టీఎంసీలకు పడిపోయిందని తేల్చారు. అంటే 11 టీఎంసీల మేరకు తగ్గిందన్నమాట. ఇపుడు జలాశయం దాదాపు కనిష్ట నీటి మట్టానికి చేరుతోంది. ఇదంతా పూడిక వల్లేనని, జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. -
ఎంజీఎం ఆస్పత్రి సమస్యలతో..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్లకు అధికారులే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి రోజుకు వేలాది మంది రోగులు వచ్చే పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాలది కీలక పాత్ర. ప్రధాన గేట్లు, వార్డుల వద్ద రోగులతోపాటు వారి వెంట వచ్చే బంధువులను నియంత్రించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిపై ఉంది. అదేవిధంగా.. ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టడంలో శానిటేషన్ విభాగానిదీ పెద్ద పాత్రే. అలాంటి ప్రధానమైన రెండు విభాగాలు సమస్యలకు నిలయంగా మారారు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తగా.. ఏజెన్సీ కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. పలువురు అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల జబ్బు ఏజెన్సీలకు వరాలు కురిపిస్తున్నారుు. రోగులకు అత్యవసర సమయూల్లో వైద్య పరికరాలు అమర్చే ‘ఇంప్లాంట్స్’ టెండర్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. టెండర్ల ప్రక్రియ వివాదంగా మారడంపై ఆస్పత్రి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. అవినీతి అధికారులు కొందరు ధనదాహంతో తప్పులు చేసి.. కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలా వారికి పరోక్షంగా మేలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ఉద్యోగులు ఏకంగా బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో సాగుతున్న పలు పనులు నాసిరకంగా మారాయి. కాంట్రాక్టర్‌కు ఆరేళ్లుగా సెక్యూరిటీ.. ఎంజీఎంలోని సెక్యూరిటీ విభాగం జైహింద్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆస్పత్రిలో సుమారు పదేళ్లుగా సదరు కాంట్రాక్టర్ తిష్టవేశాడు. ఆరేళ్లుగా టెండర్ లేకుండానే కోర్టు వివాదాలతో నెట్టుకుంటూ వస్తున్నాడు. టెండర్ల విషయంలో అధికారుల చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ.. కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకోవడం సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఆస్పత్రిలోని అధికారులను శాసిస్తూ యథేచ్ఛగా టెండర్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. ఎంజీఎం సెక్యూరిటీ విభాగ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ అధికారులకు అప్పగించాలి. కానీ.. ఏడాదిగా సెక్యూరిటీ సూపర్వైజర్ను నియమించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. వేతనాలివ్వకుండా.. ఎంజీఎంలో మూడు విడతల్లో సుమారు 105 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించాలి. వీరందరికి ఈఎస్ఐ, ఈపీఎఫ్‌తో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.7 వేల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కాంట్రాక్టర్ మాత్రం ఒక్కొక్కరికి రూ.4 వేలకు మించకుండా వేతనాలిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బడ్జెట్ రావడం లేదంటూ ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సుమారుగా 8 నెలల వేతనం చెల్లించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది.. అటెండెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రోగుల వెంట వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. ఎంజీఎం రికార్డుల్లో 105 మంది సెక్యూరిటీ సిబ్బందిని చూపిస్తున్నా... వాస్తవంగా 60 మంది సిబ్బందితో పనిచేయిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారికి సంబంధించిన వేతనాన్ని దర్జాగా దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లేబర్ అధికారులకు ఫిర్యాదు అందినా.. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు వారు జంకుతున్నట్లు తెలిసింది. శానిటేషన్‌లో తప్పని తిప్పలు బోధన ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచడం పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సెక్యూరిటీ, శానిటేషన్‌ను ఒకే కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగిస్తారని సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. శానిటేషన్ టెండర్ కొలిక్కిరాకపోవడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో విభాగం కొనసాగుతోంది. అరుుతే.. మెడికల్ విభాగంలో శానిటేషన్ కార్మికుల వేతనాలకు సంబంధించి చిక్కులు వచ్చారుు. పెరిగిన జీతాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు రాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. దీంతో పరిపాలనాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల ఆందోళనతో చివరకు వారు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, పెంచిన వేతనాలు ఇస్తామనే హామీ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ‘ఇంప్లాంట్స్’ కొలిక్కి వచ్చేనా? ఎంజీఎం ఆస్పత్రిలో ఇంప్లాంట్స్ టెండర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదంగా మారాయి. 4 నెలల క్రితం ఎంజీఎం అధికారులు ఇంప్లాంట్స్‌కు టెండర్లు పిలిచారు. ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. ఇందులో కొన్నేళ్లుగా ఆస్పత్రిలో కొనసాగుతున్న కాంట్రాక్టర్‌తోపాటు కొత్తగా మరో కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేశారు. పాత కాంట్రాక్టర్ కంటే టెండర్లలో పాల్గొన్న కొత్త కాంట్రాక్టర్ తక్కువ రేటుకు కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ టెండర్లు దాఖలైనప్పుడే వీటిని తెరుస్తామని అధికారులు వాయిదా వేశారు. చివరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో వీటిని తెరిచారు. ఎక్కువ రేట్ కోడింగ్ చేసిన కాంట్రాక్టర్‌కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ ఉందని పేర్కొంటూ.. కొన్నేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టేలా పలువురు అధికారులు పావులు కదిపారు. చివరకు ఆ కాంట్రాక్టర్‌కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ లేదని తేలింది. ఈ టెండర్ల ప్రక్రియ వివాదంగా మారి కలకలం రేగడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ మొత్తానికే వాటిని రద్దు చేశారు. త్వరలోనే పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ.. 50 రోజులుగా పాత కాంట్రాక్టరుతోనే ఇంప్లాంట్స్ పరికరాలను ఆస్పత్రికి సరఫరా చేయించుకుంటున్నారు. -
‘జీవీసీ’ తరలిపోనుందా..!
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను అర్ధ శతాబ్ద కాలంగా కంటికి రెప్పల కాపాడిన గోదావరి వ్యాలీ సర్కిల్ కార్యాలయం (జీవీసీ-1) తరలిస్తున్నట్లు ప్రాజెక్ట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీపావళి తర్వాత ముహూర్తం కుది రినట్లు సమాచారం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పరి ధిలో ప్రస్తుతం పనులు అంతగా లేవన్న సాకుతో సర్కిల్ కార్యాలయాన్ని ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కోసం మెదక్ లేదా రంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉన్న సంగారెడ్డికి తరలించాలనే ఆలోచన అధికారులు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నెల 17న జరిగే చీఫ్ ఇంజినీర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. జీవీసీ-1 సర్కిల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. డివిజన్-1 కాకతీయ కాలువ పనులను 0 కిలో మీటర్ నుంచి జగిత్యాల్ వరకు చూస్తుంది. డివిజన్ -2 డ్యాం, క్యాంప్, ప్రాజెక్ట్ వరద గేట్ల పనులను, డివిజన్-3 జగిత్యాల్ నుంచి కరీంనగర్ వరకు కాకతీయ కాలువ పనులను, డివిజన్-4 కడెం ప్రాజెక్ట్, ముంపు బాధితుల నిధులను గురించి పరిశీలిస్తుంది. మెట్పల్లిలో డివిజన్-1, జగిత్యాల్లో డివిజన్-3 కార్యాలయాలు ఉన్నాయి. మిగత రెండు డివిజన్లు ఎస్సారెస్పీలో ఉన్నాయి. ప్రాజెక్ట్ నుంచి డివి జన్-5 ఇది వరకే ప్రాణహిత చేవేళ్ల కోసం బోధన్ తరలించారు. ప్రాజెక్ట్ పరిధిలో డివిజన్-2 ఉంచి దానికి డివిజన్-4లోని కొన్ని సబ్ డివిజన్లను అటాచ్ చేసి జీవీసీ -1ను తరలించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌పై ఐదు దశాబ్దాలుగా ప్రభుత్వం పాలకులు, అధికారుల వహించిన నిర్లక్ష్యం మూల్యమే ప్రస్తుతం పరిస్థితికి కారణమని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టంలోనే పెద్ద ప్రాజెక్ట్‌గా పేరు ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు సర్కిల్ కార్యాలయం లేకుండ ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు అంటున్నారు. జీవీసీ-1 ప్రాజెక్ట్ నుంచి తరిలిపోతే ప్రాజెక్ట్ కళ తప్పడం ఖాయమని, సంగారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాల్లో ప్రాణాహిత చేవేళ్ల ప్రాజెక్ట్ కోసం సర్కిల్ ఏర్పాటు ఆవశ్యకత ఉండటం వలన ప్రాజెక్ట్ నుంచి సర్కిల్ తరలించే ప్రమాదం ఏర్పాడుతుందని ప్రాజెక్ట్ కార్యలయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. -
'30వ రాష్ట్రంగా దక్షిణ తెలంగాణ'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యమిచ్చారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దక్షిణ తెలంగాణ మంత్రులను తన కేబినెట్లోకి తీసుకోకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తెలంగాణలో ఓ ప్రాంతానికి అధిక ప్రాధాన్యమిచ్చి మరో ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శించడం సబబు కాదని కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దక్షిణ తెలంగాణ 30వ రాష్ట్రంగా ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
ఉత్తర తెలంగాణలో ‘రియల్’ ఢమాల్
నిజామాబాద్: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరు తగ్గింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సుమారు నాలుగైదేళ్లు అడ్డుఅదుపులేకుండా సాగిన ‘రియల్’ దందా ఇప్పుడు కుదేలయ్యింది. వ్యవసాయ క్షేత్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా... లేఔట్లు లేకుండా ప్లాట్లు చేసి పంచాయతీ, మున్సిపాలిటీలకు రూ.లక్షల్లో పన్నులు ఎగవేసినా.. ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా సాగిన ఈ దందాలో ఇప్పుడు పూర్తిగా స్తబ్ధత నెలకొంది. తగ్గిన ఆదాయం... రియల్ వ్యాపారం పడిపోవడంతో ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 2014-15లో భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీల ద్వారా రూ.740.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.138 కోట్ల వరకు ఆదాయం చేకూరాల్సి ఉంది. అయితే, ఈ ఆదాయం ఇప్పటి వరకు కేవలం వరకు రూ.70 కోట్లకు మించలేదు. ఏప్రిల్‌లో ఐదు జిల్లాల్లో రూ.51.84 కోట్ల లక్ష్యానికి రూ.27.17 కోట్లే రాగా... 48.59 శాతం ఆదాయం తగ్గింది. మేలో రూ.55.54 కోట్లకు రూ.29.07 కోట్ల ఆదాయం రావడం గణనీయమైన మార్పులని అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా ఈ రెండు నెలలలో ఖమ్మం జిల్లాలో 60.68 శాతం ఆదాయం పడిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో 58.45 శాతం ఆదాయం తగ్గింది. నిజామాబాద్ జిల్లాలో 24.45, కరీంనగర్లో 25.92, వరంగల్‌లో 17.93 శాతం ఆదాయం తగ్గినట్లు సమాచారం. -
ఓరుగల్లులో ‘దేశం’ డీలా
వరంగల్: ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా వరంగల్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దం క్రితం వరకు వరంగల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు మసకబారింది. తెలంగాణ ఉద్యమంతో వెనుకబడ్డామని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుంజుకుంటామని ఆశించిన పార్టీ పెద్దల అభిప్రాయం తప్పని స్పష్టమవుతోంది. బలమైన పునాదులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకునే ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయింది. నియోజకవర్గ ఇంచార్జి పదవులు ఖాళీగానే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకుల కొరత ఉంది. ఆ ప్రాభవం నేడేది..? 1999 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని వరంగల్, హన్మకొండ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పుడు జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వీటిలో ఆరు స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికల్లో రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఫర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ పలచబడుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న టీడీపీ.. నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. ప్రజావ్యతిరేకతతో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని తెలంగాణపై అస్పష్ట వైఖరి జిల్లాలో బాగా దెబ్బతీసింది. తెలంగాణ ఉద్యమం తీవ్రతతో రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం, విశ్వసనీయత లేని విధానాలతో జిల్లాలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి గతంలోనే వెళ్లిపోయారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కీలక నేతలతో కలిసి ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లో భారీ సంఖ్యలో టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీని వీడిన సందర్భంలో పార్టీకి భారీగా నష్టం జరిగింది. రెండేళ్ల క్రితమే పార్టీ దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ వెళ్లి పోవడంతో ఎన్నికల తరుణంలో జిల్లాలో పార్టీ డీలా పడిపోయింది. స్థానిక ఎన్నికలే కాదు.. సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆ పార్టీకి జిల్లాలో నాయకులే లేకుండా పోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఏళ్లుగా టీడీపీకి ఇంచార్జీలే లేరు. రిజర్వుడు నియోజకవర్గాలకు సైతం ఇతర వర్గాల వారికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ అధినేత చెబుతున్న బడుగుల అనుకూల నినాదం నవ్వులపాలవుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. * స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్చార్జి లేరు. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి బలమైన సెగ్మెంట్‌గా ఉండేది. కడియం శ్రీహరి పార్టీ మారడంతో అక్కడ టీడీపీ పరిస్థితి మారిపోయింది. ఎస్సీ నియోజకవర్గానికి అదే సామాజికవర్గం నేతలను ఇంచార్జీగా నియమించ లేదు. కట్ట మనోజ్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలిచ్చారు. దీనిపై టీడీపీలోనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇక్కడ నాయకులే లేరు. * మరో ఎస్సీ నియోజకవర్గం వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరఫున టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన ఏ నేతకూ ఇక్కడ ఇంచార్జి బాధ్యతలు అప్పగించ లేదు. బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశంకు బాధ్యతలు అప్పగించారు. 2009 వరకు ఇది టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గంగా ఉండేది. రిజర్వు నియోజకవర్గంలో ఈ వర్గానికి చెందిన వారిని ఇంచార్జీగా నియమించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ టీడీపీకి నాయకులే లేరు. * ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్ మహబూబాబాద్‌లోనూ తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరు. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ నియోజకవర్గ ఇంచార్జి లేకుండానే పార్టీ నడుస్తోంది. ఇటీవలి వరకు సమన్వయ బాధ్యతలు చూసిన నెహ్రూనాయక్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ ఎవరూ దొరకడం లేదు. * ఎస్టీ నియోజకవర్గం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. ఈ షాక్ నుంచి పార్టీ తేరుకునే పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయి నేత ఎవరూ లేకపోవడంతో పోటీకి అభ్యర్థలు దొరకడం లేదు. * వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడం లేదు. పాలకుర్తి, నర్సంపేట, ములుగు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
శ్రీరాంసాగర్ వద్ద ఆహ్లాదం కరువు
బాల్కొండ,న్యూస్‌లైన్ : ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా చేపట్టిన పార్కు ఏర్పాటు పనులు నాలుగేళ్లకు పూర్తయ్యాయి. అయితే పార్కును ప్రారంభించి నెలన్నర కావస్తున్నా పర్యాటకులను లోకిని అనుమతించడం లేదు. దీంతో పార్కు పర్యాటకులకు ఆహ్లాదం పంచడం లేదు. కనీసం పార్కు గేటును కూడా తీయడం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ భాగాన రూ. 6 కోట్ల నిధులతో ఇరిగేషన్ అధికారులు పార్కును ఏర్పాటు చేశారు. పార్కు పనులు పూర్తి కావడంతో గతేడాది డిసెంబర్ 29న రాష్ర్ట భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పార్కును ప్రారంభించారు. అయితే ఆరోజు నుంచి పార్కును మాత్రం తెరవడం లేదు. పార్కును కాంట్రాక్టర్ల మేలు కోసం నిర్మించారా లేక పర్యాటకానికా అంటూ పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. నిరాశ చెందుతున్న పర్యాటకులు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదలు వస్తాయి. అప్పుడు ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదులుతారు. ఆ సమయంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రాజెక్ట్ సందర్శనకు పర్యాటకులు వస్తున్నారు. వసతులు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్కు తెరవక పోవడంతో నిరాశతో వారంతా వెనుదిరి వె ళుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం... పార్కులోకి ఇంత వరకు ఒక్క పర్యాటకుడిని కూడా అధికారులు అనుమతి లభించలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రాజెక్ట్ పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పార్కు, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2009లో పనులకు టెండర్లు పిలిచి అగ్రిమెంట్ పూర్తిచేసి పనులు ప్రారంభించారు. ఏడాదిలో పూర్తి కావాల్సిన పనులు నాలుగేళ్లకు పూర్తిచేశారు. ఆ తర్వాత పార్కు పర్యవే క్షణను సిబ్బందిని నియమించడం మరిచారు. ఉన్న ప్రాజెక్ట్ సంరక్షణకే సిబ్బంది దిక్కు లేదు. పార్కు పచ్చదనంతో కళకళలాడాలంటే ప్రతిరో జు కనీసం 20 మంది కూలీలు పనిచేయాలి. కాని ఒక్కరూ కూడా దిక్కులేరు. ఏదైనా ఏజెన్సీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు పట్టించుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.