సాక్షి, హైదరాబాద్: ఉత్తర తెలంగాణపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సంప్రదాయబద్ధంగా పట్టున్న ఈ ప్రాంతంనుంచి ఈసారి కూడా మంచి ఫలితాల సాధనకు పార్టీ ఉత్తర తెలంగాణను నమ్ముకుంది. సంస్థాగతంగానూ, రాజకీయంగానూ ఇతర ప్రాంతాల కంటే ఇక్కడే పార్టీ పటిష్టంగా ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణలోని వివిధ జిల్లాల పరిధిలో అధిక సీట్లు గెలుస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తం చేస్తున్నారు.
2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కీలకమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సీట్లు బీజేపీ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణలో అధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వముంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల్లో క్రమంగా సానుకూలత పెరుగుతున్నదని అంచనా వేస్తున్నారు.
ముమ్మరంగా ప్రచారం చేసేలా...
ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అధిక సీట్లు గెలుచుకునే దిశలో వివిధ రూపాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించారు. అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామన్న హామీని వివిధ వర్గాల ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేలా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
దీంతో పాటు ఉపకులాల వారీగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు తెలపడంతో పాటు సమస్యల పరిష్కారంపై కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఈ వర్గాల్లో బీజేపీపై సానుకూల స్పందన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ పరిణామాల దృష్ట్యా బీసీ, ఎస్సీ, ఇతర వర్గాల నుంచి బీజేపీకి మద్దతు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన వైఖరి తీసుకోవడంతో బీజేపీకి ఎమ్మార్పిఎస్ నాయకత్వం మద్దతు తెలపడంతో పాటు బీసీ సీఎం నినాదాన్ని కూడా బలపరుస్తూ ప్రచారం చేయడం కూడా తమకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కంటే అధికంగా 36 సీట్లను బీసీలకు బీజేపీ కేటాయించడం ద్వారా బీసీలకు పెరిగిన ప్రాధాన్యతను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment