ఉత్తర తెలంగాణ టీఆర్‌ఎస్‌కు ఆయువుపట్టు
గత ఎన్నికల్లో అత్యధిక సీట్లను ఈ ప్రాంతం నుంచే గెలిచింది
అందుకే టీఆర్‌ఎస్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భారీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో ఆ ప్రాంతంలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో మొత్తం 45 స్థానాలున్నాయి. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు టీఆర్‌ఎస్‌కు ఉత్తర తెలంగాణ జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఈ జిల్లాల్లో 7 సీట్లే గెలిచింది. ఉత్తర తెలంగాణ లోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్‌ఎస్ గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు గెలిచింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ నార్త్ తెలంగాణ పేరుతో పూర్వవైభవాన్ని చాటుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిన స్థానాల్లో కనీసం సగం సీట్లు గెలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది.
భారీసభలతో జనాల్లోకి...
ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించేందుకు టీపీసీసీ ముఖ్యులంతా అక్కడే భారీస్థాయిలో ప్రచారపర్వం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈసభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం కొన్ని నియోజకవర్గాల బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిసింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో నార్త్ తెలంగాణ జిల్లాల్లపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహించే 30 బహిరంగ సభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ప్రచార షెడ్యూల్‌పై కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న బహిరంగసభల్లో పాల్గొని అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు తెలిసింది.
దక్షిణ తెలంగాణలోనూ పోటాపోటీయే...
ఉత్తర తెలంగాణపై దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణ తెలంగాణ నుంచే అధిక స్థానాలు గెలుపొంది ప్రతిపక్షం హోదాను దక్కించుకోగలిగింది. ముందునుంచి కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి ప్రాంతాలు ఆయువుపట్టుగా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే, ఈసారి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండు ఢీ అండే ఢీ అనే స్థాయిలోనే ప్రచారం నిర్వహిస్తున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సగం అభ్యర్థులు మాజీమంత్రులే. నియోజకవర్గాల్లోనే ఉంటున్నందున కాంగ్రెస్ పార్టీ గతంలో సాధించిన సీట్ల కంటే రెండింతలు సాధిస్తామని కాంగ్రెస్ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
► కాంగ్రెస్‌పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఉత్తర తెలంగాణ జిల్లా అయిన ఖమ్మంలోని మధిర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు, మధిర, ఖమ్మం, ఇల్లెందు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుపుపొందింది. అయితే, పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 10 సీట్లలో ఈసారి కాంగ్రెస్ తన సిట్టింగ్ సీట్లతో పాటు కూటమి తరఫున సా«ధ్యమైనన్ని ఎక్కువస్థానాలు గెలిచేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు.
► ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల తప్పా మరే స్థానాన్నీ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. జిల్లాలోని 13 స్థానాల్లో ఈసారి కనీసం సగం స్థానాలనైనా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.
► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంది. ముథోల్ స్థానం మిన హాయించి ఏ స్థానంలోనూ గెలవలేకపోయింది. ముథోల్ నుంచి గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అయితే, ఈ సారి జిల్లాల్లోని 10 స్థానాల్లో మెజారిటీ సీట్లు గెలిచేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
► ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక డోర్నకల్ సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నర్సంపేట్ నుంచి ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ నేత దొంతి మాధవరెడ్డి గెలిచారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరడం మళ్లీ పరకాల నుంచి పోటీలో ఉండటంతో కాంగ్రెస్ తన స్థానాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.
–సాక్షి, హైదరాబాద్
‘ఆయువుపట్టు’ పట్టేద్దాం!
Published Sat, Nov 24 2018 4:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment