ఓరుగల్లులో ‘దేశం’ డీలా
వరంగల్: ఉత్తర తెలంగాణలో కీలక జిల్లా వరంగల్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. దశాబ్దం క్రితం వరకు వరంగల్ జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు మసకబారింది. తెలంగాణ ఉద్యమంతో వెనుకబడ్డామని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత పుంజుకుంటామని ఆశించిన పార్టీ పెద్దల అభిప్రాయం తప్పని స్పష్టమవుతోంది. బలమైన పునాదులు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పుకునే ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయింది. నియోజకవర్గ ఇంచార్జి పదవులు ఖాళీగానే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకుల కొరత ఉంది.
ఆ ప్రాభవం నేడేది..?
1999 ఎన్నికల్లో టీడీపీ జిల్లాలోని వరంగల్, హన్మకొండ లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. అప్పుడు జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. వీటిలో ఆరు స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 2004 ఎన్నికల్లో రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఫర్వాలేదనిపించేలా ఫలితాలు వచ్చినా తర్వాత పరిణామాలతో క్రమంగా పార్టీ పలచబడుతోంది. 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న టీడీపీ.. నర్సంపేట, పాలకుర్తి, ములుగు, డోర్నకల్ స్థానాలను గెలుచుకుంది. ప్రజావ్యతిరేకతతో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీని తెలంగాణపై అస్పష్ట వైఖరి జిల్లాలో బాగా దెబ్బతీసింది. తెలంగాణ ఉద్యమం తీవ్రతతో రాజకీయాలు మారిపోయాయి.
తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం, విశ్వసనీయత లేని విధానాలతో జిల్లాలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి గతంలోనే వెళ్లిపోయారు. ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కీలక నేతలతో కలిసి ద్వితీయశ్రేణి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లో భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి టీడీపీని వీడిన సందర్భంలో పార్టీకి భారీగా నష్టం జరిగింది. రెండేళ్ల క్రితమే పార్టీ దాదాపు సగానికిపైగా ఖాళీ అయింది. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ వెళ్లి పోవడంతో ఎన్నికల తరుణంలో జిల్లాలో పార్టీ డీలా పడిపోయింది.
స్థానిక ఎన్నికలే కాదు.. సాధారణ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆ పార్టీకి జిల్లాలో నాయకులే లేకుండా పోయారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో ఏళ్లుగా టీడీపీకి ఇంచార్జీలే లేరు. రిజర్వుడు నియోజకవర్గాలకు సైతం ఇతర వర్గాల వారికి బాధ్యతలు అప్పగించడంతో పార్టీ అధినేత చెబుతున్న బడుగుల అనుకూల నినాదం నవ్వులపాలవుతోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది.
* స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్‌చార్జి లేరు. ఈ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి బలమైన సెగ్మెంట్‌గా ఉండేది. కడియం శ్రీహరి పార్టీ మారడంతో అక్కడ టీడీపీ పరిస్థితి మారిపోయింది. ఎస్సీ నియోజకవర్గానికి అదే సామాజికవర్గం నేతలను ఇంచార్జీగా నియమించ లేదు. కట్ట మనోజ్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలిచ్చారు. దీనిపై టీడీపీలోనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇక్కడ నాయకులే లేరు.
* మరో ఎస్సీ నియోజకవర్గం వర్ధన్నపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ మహాకూటమి తరఫున టీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేశారు. తర్వాత ఎస్సీ వర్గానికి చెందిన ఏ నేతకూ ఇక్కడ ఇంచార్జి బాధ్యతలు అప్పగించ లేదు. బీసీ వర్గానికి చెందిన ఈగ మల్లేశంకు బాధ్యతలు అప్పగించారు. 2009 వరకు ఇది టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గంగా ఉండేది. రిజర్వు నియోజకవర్గంలో ఈ వర్గానికి చెందిన వారిని ఇంచార్జీగా నియమించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ టీడీపీకి నాయకులే లేరు.
* ఎస్టీ రిజర్వుడ్ సెగ్మెంట్ మహబూబాబాద్‌లోనూ తెలుగుదేశం పార్టీకి నాయకులు లేరు. ఇక్కడ గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసింది. ఈ నియోజకవర్గ ఇంచార్జి లేకుండానే పార్టీ నడుస్తోంది. ఇటీవలి వరకు సమన్వయ బాధ్యతలు చూసిన నెహ్రూనాయక్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇక్కడ ఎవరూ దొరకడం లేదు.
* ఎస్టీ నియోజకవర్గం డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ షాక్ నుంచి పార్టీ తేరుకునే పరిస్థితి లేదు. నియోజకవర్గ స్థాయి నేత ఎవరూ లేకపోవడంతో పోటీకి అభ్యర్థలు దొరకడం లేదు.
* వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నేతలు ముందుకు రావడం లేదు. పాలకుర్తి, నర్సంపేట, ములుగు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.