వరంగల్ జిల్లాలో పులి సంచారంపై అధికారుల సూచన
పెద్దపులి పాదముద్రలు గుర్తించిన అటవీ అధికారులు
నర్సంపేట ఏజెన్సీ పల్లెల్లో ప్రజల ఆందోళన
నర్సంపేట: వరంగల్ జిల్లాలో పులి సంచారం వార్త ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి వరంగల్‌లోకి ప్రవేశించిన పెద్దపులి నల్లబెల్లి, ఖానాపురం, నర్సంపేట ఏజెన్సీ పల్లెల్లో తిరుగుతున్నట్లు ఆనవాళ్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం నల్లబెల్లి మండలం రుద్రగూడెం సమీప అడవిలో పులి తిరిగింది. స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పులి పాద ముద్రలు పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గ్రామాల్లో చాటింపు చేశారు. తర్వాత ఖానాపురం మండలంలో కూడా పులి సంచరించినట్లు సమాచారం రాగా అధికారులు స్థానికులకు జాగ్రత్తలు చెప్పారు. ఆదివారం నర్సంపేట మండల పరిధిలోకి పెద్దపులి వచ్చినట్లు తెలియడంతో ఇక్కడి పల్లెల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా పశువులు, గొర్రెలు, మేకలను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లే కాపరులు కొద్ది రోజులు మైదాన ప్రాంతాల్లోనే మేపుకోవాలని నర్సంపేట ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా వెళ్లి పనులు త్వరగా ముగించుకొని సాయంత్రం కాక ముందే ఇళ్లకు చేరుకోవాలని చెప్పారు.
డ్రోన్ కెమెరాలతో..
మూడు రోజులుగా నల్లబెల్లి మండలంలో సంచరిస్తున్న పెద్ద పులి రుద్రగూడెం, కొండాయిపల్లి శివారులోని పలుగు ఏనే (కొండ ప్రాంతం) నుంచి అటవీ బాట పట్టింది. పులి పాదముద్రల ఆధారంగా అది మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామస్తుల అభ్యర్థన మేరకు నర్సంపేట ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్ పర్యవేక్షణలో అటవీ సిబ్బంది.. డ్రోన్ కెమెరా సహాయంతో పలుగు ఏనే ప్రాంతాన్ని చిత్రీకరించి పరిశీలించారు. ఇక్కడే పులి సేద తీరినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. కాగా, పెద్దపులి అటవీ ప్రాంతానికి తరలివెళ్లినట్లు స్పష్టం కావడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment