పంట చేలల్లో పెద్దపులి సంచారం
నల్లబెల్లి/మన్ననూర్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్, మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి గ్రామాల శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాలను వదిలి గ్రామాల సమీపంలోని పంటచేలల్లో పెద్దపులి సంచరించడంతో.. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు.
కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఆడపులి, పిల్ల పులి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని కోనాపురం వైపు వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. కొండాపూర్ అటవీ ప్రాంతం నుంచి మగ పెద్దపులి మూడుచెక్కలపల్లి, ఒల్లేనర్సయ్యపల్లి గ్రామాల మీదుగా రుద్రగూడెం, కొండాయిపల్లి గ్రామాల మధ్యలోని పలుగుఏనె (గుబురు చెట్లతో కూడుకున్న అటవీ ప్రాంతం) వరకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
కానీ, ఒల్లేనర్సయ్యపల్లి, రుద్రగూడెం గ్రామాల్లో శనివారం తిరుగు ప్రయాణంలో పెద్దపులి సంచరించినట్లు పలువురు చెబుతున్నారు. కాగా పోలీసులు, అటవీ శాఖ, స్ట్రైక్‌ఫోర్స్ అధికారులు పంట చేలలో పులి కదలికలను పరిశీలించి పాదముద్రలను సేకరించారు. మొక్కజొన్న చేనులో సేదదీరిన ప్రాంతాన్ని గుర్తించారు. అవన్నీ పెద్దపులి పాదముద్రలేనని, తిరిగి వెళ్లలేదని నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సఫారీలో పెద్దపులి సందడి
అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం సఫారీ వాహన సందర్శకులకు శనివారం ఉదయం పెద్ద పులి కనిపించింది. ఫర్హాబాద్ సఫారీ పాయింట్ నుంచి వ్యూ పాయింట్‌కు సందర్శకులు వాహనంలో వెళ్తుండగా.. మార్గమధ్యలో పెద్దపులి అటవీశాఖ ఇంటర్నల్ రోడ్డు దాటుతూ కనిపించింది. అకస్మాత్తుగా చెట్ల మధ్యనుంచి వాహనం సమీపంలోకి పెద్దపులి రావడంతో సందర్శకులు కొంత భయపడినా.. దగ్గరి నుంచి చూశామని సంతోషపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment