తిమ్మాపురంలో గిరిజన రైతులకు కనిపించిన పులి
పాదముద్రలు గుర్తించిన అధికారులు
కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లు ఆనవాళ్లు
మంగపేట: ములుగు జిల్లా వెంకటాపురం (కె), మంగపేట మండలాల పరిధి చుంచుపల్లి అటవీప్రాంతానికి వచ్చిన పెద్దపులి ఎటువైపు వెళ్లిందోనని అటవీ శాఖ అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సుమారు 15 మంది అధికారులు బుధవారం గోదావరి తీర ప్రాంతం వెంట పులి ఆనవాళ్లను పరిశీలించారు.
నిమ్మగూడెం పంచాయతీ పరిధి తిమ్మాపురం ముసలమ్మవాగు సమీపంలోని చౌడొర్రె ప్రాంతంలోని వరి పొలం వద్దకు వెళ్లిన రామచంద్రునిపేట గ్రామానికి చెందిన పగిళ్ల రంగయ్య, వెంకటేశ్వర్లుకు కొంతదూరంలో పెద్దపులి కనిపించింది.
దీంతో భయపడిన రైతులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా, సుమారు 30 మంది కలిసి పులి కనిపించిన ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడినుంచి పెద్దపులి సమీపంలోని ముసలమ్మగుట్ట అటవీ ప్రాంతంలోని మల్లూరు వాగు మధ్యతరహా ప్రాజెక్టువైపు ఉన్న రాళ్లవాగువైపు వెళ్లినట్లు అడుగులు కనిపించడంతో విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు.
మంగపేట అటవీశాఖ ఇన్‌చార్జ్ రేంజ్ అధికారి అశోక్ మరో 20 మంది సెక్షన్, బీట్ ఆఫీసర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పులి పాద ముద్రలను గుర్తించిన అధికారులు అక్కడినుంచి సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముసలమ్మగుట్ట, కొప్పుగుట్ట అటవీప్రాంతంనుంచి అవతలి వైపు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని కొత్తగూడెం, గోళ్లగూడెం మీదుగా కిన్నెరసాని అభయారణ్యంలోకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు.
రెండు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నా ఎలాంటిì ప్రాణనష్టం జరగకపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment