
సాక్షి, ములుగు జిల్లా: మావోయిస్ట్ పార్టీ, శాంత పేరున కర్రెగుట రక్షణ కోసం బాంబులు పెట్టామంటూ ప్రకటన చేయడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించారు. నక్సల్స్.. అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదన్నారు. ఆదివాసీలు ఎవరికి భయపడొద్దని.. పోలీసులు ఎల్లవేళలా రక్షణగా ఉంటారని ఎస్పీ తెలిపారు. నక్సల్స్ అడవులలో ఉండి సాధించేదేమీ లేదని.. లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలంటూ ఎస్పీ పిలుపునిచ్చారు.
వెంకటాపురం (నూగూరు) కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్టు మావోయిస్టు పార్టీ వాజేడు-వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట విడుదలయిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కొందరు వ్యక్తులు పోలీసుల మాటలు నమ్మి, డబ్బుకు ఆశపడి ఇన్‌ఫార్మర్లుగా మారి షికారు పేరుతో గుట్టవైపు వస్తున్నారంటూ మంగళవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. తమ రక్షణ కోసం అమర్చిన బాంబుల వల్ల ఇతరులు గాయపడుతున్నారని, పోలీసుల మాటలు నమ్మి ఎవరూ ఇటువైపు రావొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.