మాల్దీవులను తలపిస్తున్న లక్నవరం ద్వీపాలు
ది కోవ్ రిసార్ట్ పేరుతో అందుబాటులోకి మూడో దీవి
పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న వసతులు
ఒక రోజుకు రూ.5 వేల నుంచి రూ.15 వేల అద్దె
గోవిందరావుపేట: చుట్టూ నీళ్లు.. మధ్యలో ఉన్న దీవిలో అందమైన కుటీరాలు.. వాటిల్లో లోకాన్ని మరిచి సేదదీరేందుకు అద్భుతమైన వసతులు.. ఈ సీన్ ఊహించుకోగానే ఏ మాల్దీవులో ఠక్కున గుర్తుకొస్తున్నాయి కదా? కానీ.. ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు అంతదూరం వెళ్లాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే అంతటి అందాల ప్రదేశం ఉంది.
అదే లక్నవరం చెరువు. లక్నవరం చెరువులో ఇప్పటికే ఉన్న అందమైన దీవులకు అదనంగా టీఎస్‌టీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ‘ది కోవ్’రిసార్ట్స్ పేరుతో మూడో ద్వీపాన్ని తీర్చిదిద్దాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ఈ జలాశయంలోని కొత్త ఐలాండ్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. రూ.7 కోట్ల వ్యయంతో మూడెకరాల విస్తీర్ణంలో 21 కాటేజీలతో తీర్చిదిద్దిన ఈ దీవి 2024 నవంబర్‌లోనే అందుబాటులోకి వచి్చంది.
వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్
ది కోవ్ రిసార్ట్‌లో పర్యాటకులు ఆటలతో ఉల్లాసంగా గడపడానికి జల క్రీడలు, సాహస కార్యకలాపాలు, కృత్రిమ బీచ్, బాక్స్ క్రికెట్, షటిల్ కోర్టులు, ఈత కొలనులు, క్యాంపింగ్ జోన్‌లు ఏర్పాటు చేశారు. మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని కలిగించేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దీంతో టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ద్వీపం మాల్దీవులు, మున్నార్, గోవా, అండమాన్ దీవులను తలపిస్తోందని పర్యాటకులు చెబుతున్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఒక్కో కాటేజీలో నలుగురు బస చేయవచ్చు. వ్యక్తిగత కాటేజీలకు ఈత కొలనులు నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈత కొలనులు, ఆట వస్తువులు ఉన్నాయి. పెద్దల కోసం రెండు స్పాలు, రెస్టారెంట్ ఉన్నాయి. ఈ కాటేజీల్లో ఒకరోజు (24 గంటలు) బస చేయడానికి అద్దె రూ.5,000 నుంచి రూ.15, 000 వరకు వసూలు చేస్తున్నారు.
పొంచి ఉన్న నీటి సమస్య
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న లక్నవరం సరస్సుకు త్వరలోనే నీటి సమస్య ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువు కింద 4,150 ఎకరాల ఆయకట్టు భూములకు యాసంగి పంట కోసం నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీటి మట్టం తగ్గిపోయి సరస్సు అడుగంటే ప్రమాదం ఉంది.అదే జరిగితే వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ మూలనపడ నున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment