అడవి అలుగు పెంకు కోటిన్నర అన్న ప్రచారం అబద్ధం
దాని పెంకులను ఏ మందుల్లోనూ వాడరు
స్మగ్లర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దు
అటవీ శాఖ అధికారుల సూచన
భూపతిపూర్ అడవుల్లో స్మగ్లర్ నుంచి అలుగు స్వాధీనం
ఏటూరునాగారం: అంతరించిపోయే జంతువుల జాబితాలో ఉన్న అడవి అలుగు (ఇండియన్ పాంగోలిన్)కు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్ల ధర ఉందన్న ప్రచారం అంతా అబద్ధమని ములుగు జిల్లా అటవీశాఖ అధికారులు కొట్టిపారేశారు. కొందరు జంతు స్మగ్లర్లు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. అరుదైన ఈ జంతువును వేటాడినా, స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
వేటగాళ్లకు ఆశచూపి..
భూపాలపల్లికి చెందిన చిదం రవి అనే వ్యక్తి ఇటీవల అడవి అలుగుకు అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.5 కోట్ల ధర పలుకుతుందని, చైనాలో మందుల తయారీలో దీని పెంకులు వాడుతారని ప్రచారం చేశాడు. అడవి అలుగును వేటాడి తీసుకొస్తే భారీగా డబ్బు ఇస్తానని భూపతిపూర్‌కు చెందిన కోరం నాగయ్య, కోరం పెంటయ్య, కోరం కృష్ణమూర్తి అనే వేటగాళ్లకు ఆశ చూపాడు. దీంతో భూపతిపూర్ అడవుల్లో ఆ జంతువును పట్టుకొన్న వారు.. రవికి అందజేశారు. ఈ నెల 20వ తేదీన దానిని భూపాలపల్లికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఏటూరునాగారం నార్త్ అటవీశాఖ అధికారులు పట్టుకొన్నారు. అడవి ఎలుగుతో చిదం రవి పట్టుబడ్డాడు.
జీవితకాలం 20 ఏళ్లు
అంతరించిపోతున్న అరుదైన జీవి ఇండియన్ పాంగోలిన్. దీని జీవితకాలం 20 ఏళ్లు. సింహం కూడా తినలేనంత గట్టిగా అలుగు పెంకులు ఉంటాయి. అత్యధిక వర్షపాతం, పురుగులు, చీమల పుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇవి జీవిస్తుంటాయి. ఎడారి అడవుల్లోనూ ఉంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ జంతువు పెంకులను చైనాలో మందుల తయారీలో వాడుతారని స్మగ్లర్లు ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యవర్తులకు భారీ ధరకు విక్రయిస్తున్నారు.
అలుగు పెంకులు ఏ మందుల్లోనూ వాడరు
అడవి అలుగు పెంకులను ఎలాంటి మందుల తయారీకి వాడరు. అదంతా అపోహ మాత్రమే. స్మగ్లర్లు సొమ్ము చేసుకునేందుకే అమాయకులకు ఇలా మాయమాటలు చెబుతున్నారు.
– అబ్దుల్ రెహమాన్, సౌత్ రేంజ్ అధికారి, ఏటూరునాగారం.
చదవండి: కోతులతో భయం.. కొండముచ్చులతో ఉపాయం
Comments
Please login to add a commentAdd a comment