pangolin
-
శ్రీశైలం అడవుల్లో అలుగుల అడుగులు
అలుగు.. ఒళ్లంతా పొలుసులు, మందపాటి తోక గల క్షీరద జాతి జంతువు. పగలంతా చెట్ల తొర్రలు, నేల బొరియల్లో దాక్కుని.. రాత్రి వేళ బయట సంచరించే నిశాచర జీవులివి. ఒంటరిగా జీవించడానికే ఇష్టపడే అలుగులు చీమలు, చెద పురుగులనే ఆహారంగా తీసుకుంటాయి. పొడవాటి సన్నని నాలుకతో వాటిని జుర్రుకుని తింటాయి. శత్రువు కనిపిస్తే బంతి మాదిరిగా చుట్టుకుపోయి.. ముప్పు నుంచి తప్పించుకునే నైపుణ్యం గల అలుగులు శ్రీశైలం అడవుల్లో సంచరిస్తున్నట్టు అటవీ శాఖ కెమెరా ట్రాప్‌ల ద్వారా గుర్తించింది. సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలో అరుదైన భారతీయ అలుగుల (ఇండియన్ పాంగోలిన్) ఉనికిని గుర్తించారు. గతంలో ఈ ప్రాంతంలో విస్తృతంగా కనిపించే పాంగోలిన్లు అంతరించే దశకు చేరుకున్నాయి. నల్లమలతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లోనూ వాటి జాడే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నల్లమల అడవుల్లో మళ్లీ వాటి కదలికలను గుర్తించడంతో వన్యప్రాణి ప్రేమికుల్లో ఆశలు చిగురించాయి. శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని ఆత్మకూరు, మార్కాపురం పరిసరాల్లో పులుల జాడ కోసం పెట్టిన కెమెరా ట్రాపుల్లో పాంగోలిన్లు కూడా కనిపించాయి. కాకపోతే మిగిలిన జంతువులతో పోలిస్తే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టు నల్లమలలో జీవించే చెంచులు, లంబాడీలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాంగోలిన్ల ఉనికి, వాటి ఆవాసాలు, రక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, రాష్ట్ర అటవీ శాఖ సంయుక్తంగా పరిశోధన ప్రారంభించాయి. వాటి ఆవాసాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రాంతాల్లో ఉండేందుకు అవి ఇష్టపడుతున్నాయి, వాటి జనాభా వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. పాంగోలిన్ల బొరియలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూస్తూ వాటి గురించి తెలుసుకుంటున్నారు. అవి ఆహారం తినడానికి తవ్వే బొరియలు, నివాసం కోసం తవ్వే బొరియలు వేర్వేరుగా ఉన్నాయి. ఆ బొరియల ఆధారంగా వాటి సంఖ్య, ఇతర వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీలైతే అక్కడ కెమెరా ట్రాప్‌లు పెట్టాలని భావిస్తున్నారు. అరుదైన పాంగోలిన్ జాతికి చెందినవి అలుగులను వివిధ ప్రాంతాల్లో వాలుగు, చిప్పల పంది తదితర పేర్లతోనూ పిలుస్తారు. ప్రపంచంలో 8 జాతుల పాంగోలిన్లు ఉన్నాయి. అందులో 4 ఆసియా ఖండంలో, మరో 4 ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. ఆసియాలో ఉన్న 4 జాతుల్లో రెండు జాతులు మన దేశంలో కనిపిస్తాయి. ఆ రెండింటిలో అత్యంత అరుదైన ఇండియన్ పాంగోలిన్ (మానిస్ క్రాసికాడాటా) జాతి మన రాష్ట్రంలో కనిపిస్తుంది. నల్లమలలో గుర్తించింది ఈ జాతినే. ఇది చీమలు, చెద పురుగులను తింటుంది. అన్ని పాంగోలిన్ల మాదిరిగానే ఇండియన్ పాంగోలిన్ మందమైన పొలుసులతో కప్పబడి ఉంటుంది. తమను వేటాడే జంతువుల నుండి రక్షించుకోవడానికి ఈ పొలుసులు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. ప్రాణాపాయం, బెదిరింపులకు గురైతే ఇండియన్ పాంగోలిన్ బంతిలా ముడుచుకుపోతుంది. మన దేశంలోని హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, నేపాల్‌లో చైనీస్ పాంగోలిన్లు కనిపిస్తాయి. పాంగోలిన్ జాతులున్నా అంతరించిపోయే జీవులు జాబితాలో ఉన్నాయి. అవి నివసించే ఆవాసాలు ధ్వంసమవడం, వాటి పొలుసులు, మాంసాన్ని సంప్రదాయ వైద్యంలో వినియోగించడం కోసం అక్రమంగా వేటాడుతుండటంతో పాంగోలిన్ల ఉనికి ప్రమాదంలో పడింది. వాటిపై ఉండే పొలుసులను చైనీస్ మెడిసిన్‌లో విరివిగా వాడతారు. అందుకే వాటిని ఇష్టానుసారం వేటాడటంతో అవి అంతరించిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఎక్కువగా అక్రమ రవాణా అవుతున్న క్షీరదాల్లో మొదటి స్థానం వీటిదే. దక్షిణాదిలో తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో వీటి అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. నల్లమలలో రక్షణకు అవకాశం ఎక్కువ ఇండియన్ పాంగోలిన్ అరుదైన జంతువు. దేశంలో చాలా ప్రాంతాల్లో ఇవి ఉన్నా అంతరించే దశలో ఉన్నాయి. శ్రీశైలం రిజర్వు పెద్దది కావడం, ఇక్కడి రక్షణ వ్యవస్థ బాగుండటం, పులుల సంఖ్య పెరుగుతుండటంతో పాంగోలిన్లకు ఎక్కువ రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే అటవీ శాఖతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. వాటి ఉనికి, హాట్ స్పాట్స్, అక్రమ రవాణా ఏమైనా జరుగుతుందా వంటి వివరాలను తెలుసుకుంటున్నాం. – కంటి మహంతి మూర్తి, తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ అధ్యక్షుడు -
లక్షల్లో డబ్బు పెట్టి అలుగులను కొంటున్న చైనా.. ఎందుకో తెలుసా?
బుట్టాయగూడెం: అడవికి రాజు సింహం... అది ఎంతటి జీవినైనా వేటాడి నమిలేస్తుందని నమ్ముతాం... కానీ, సింహం కూడా తినలేనంత గట్టిగా ఉండే అరుదైన వన్యప్రాణులు ఉన్నాయి. అటువంటి వాటిలో అడవి అలుగు ఒకటి. అలుగు వీపుపై ఉండే పెంకులు కత్తిలాగా పదును కలిగి ఉంటాయి. ఇవి సింహం కూడా నమలలేనంత గట్టిగా ఉంటాయి. అటువంటి అరుదైన అడవి అలుగులు ఏలూరు జిల్లా పరిధిలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో గల పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. వీటిని పాంగోలిన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలిన్, ఏషియా పాంగోలిన్, సుండా పాంగోలిన్, పాతమాన్ పాంగోలిన్ అని నాలుగు రకాల అలుగులు ఉంటాయి. వీటి మూతి ముంగిసను పోలి ఉంటుంది. నాలుగు కాళ్లతో ఉండే ఈ అలుగు సుమారు 20 ఏళ్లు జీవిస్తుంది. చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. ఎక్కువ శాతం దట్టమైన అడవి, అధికంగా వర్షాలు కురిసే ప్రాంతాలతోపాటు ఎడారి ప్రాంతాల్లో ఇవి జీవనం సాగిస్తుంటాయి. తొలిసారిగా 1821లో ఈ జంతువుల సంచారాన్ని గుర్తించినట్లు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. అరుదైన ఈ వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 20 వరకు సంచరిస్తున్నాయని వెల్లడించారు. అలికిడి అయితే బంతిలా ముడుచుకుపోతాయి.. అలుగులు పగలు కంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలికిడి అయితే అవి బెదిరి కదలకుండా గట్టిగా బంతిలా ముడుచుకుని ఉండిపోతాయి. వీటికి ఎదురు దాడి చేసే గుణం కూడా ఉంటుంది. ఇవి రెండేళ్లకు ఒకసారి పిల్లలకు జన్మనిస్తాయి. కోతి మాదిరిగానే తన పిల్లలను వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ పోషిస్తాయి. అలుగు పెంకులను చైనాలో మందుల తయారీకి ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. వీటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఒక్కో అలుగు రూ.20లక్షల వరకు ధర పలుకుతోందని చెప్పారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన శిక్షలు తప్పవు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరైనా వేటాడితే కఠిన శిక్షలు తప్పవు. పాపికొండల అభయారణ్య ప్రాంతంలో సంచరిస్తున్న అలుగుల వేట కోసం బయట ప్రాంతాల నుంచి స్మగ్లర్లు వస్తున్నట్లు గుర్తించి నిఘా పెట్టాం. ఇటీవల ఇద్దరు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేశాం. అలుగులను వేటాడితే ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. – జి.వేణుగోపాల్, వైల్డ్‌లైఫ్ డిప్యూటీ రేంజ్ అధికారి, పోలవరం, ఏలూరు జిల్లా -
పంగోలిన్ చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్ : పంగోలిన్ చర్మానికి (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో డిమాండ్ ఉండటంతో వాటిని అక్రమంగా సేకరించి అమ్మకానికి పెట్టిన అంతర్రాష్ట్ర ముఠా కుట్రను తెలంగాణ అటవీ శాఖ ఛేదించింది. సుమారు వారం రోజులపాటు అండర్ కవర్ ఆపరేషన్ చేసిన అటవీ శాఖ అధికారులు, తామే కొనుగోలుదారుల అవతారమెత్తి మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సహా కొత్తగూడెం, భద్రాచలం, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి, ఈ ముఠా అలుగు చర్మాలను సేకరిస్తోంది. ముందుగా సమాచారం అందుకున్న కొత్తగూడెం అటవీ అధికారులు బాదావత్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారంతో మూడు రోజులపాటు వివిధ ప్రాంతాల్లో నిఘాపెట్టి సునీల్, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని అటవీ, వన్యప్రాణుల సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. ఈ ముఠాలో ఇంకా ముగ్గురు ఉన్నారని, వారు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర ముఠాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, బెంగాల్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పంగోలిన్ స్కేల్స్ (అలుగు పొలుసుల) వల్ల వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయనే ప్రచారం ఉంది. దీంతో వాటి పొలుసులకు బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పొలుసులకు లక్షల్లో ధర పలుకుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ముఠా నుంచి సుమారు నాలుగు కేజీల పొలుసులను అటవీ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇందుకోసం మూడు నుంచి ఐదు జంతువులను దమ్మపేట అటవీ ప్రాంతంలో (కొత్తగూడెం) చంపిఉంటారని అధికారులు భావిస్తున్నారు. కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు నిందితులను ప్రవేశపెట్టి, రిమాండ్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోందని కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి రంజీత్ నాయక్ తెలిపారు. కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ దామోదర్‌రెడ్డి, హైదరాబాద్ విజిలెన్స్ డీఎఫ్ఓ రాజారమణారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అధికారులు, సిబ్బందిని పీసీసీఎఫ్ ఆర్.శోభ ప్రత్యేకంగా ప్రశంసించారు. -
ఆకతాయిల పైశాచికత్వం
కోలారు: పెంగోలియన్ని ఆకతాయిలు చంపి ఇనుపరాడ్‌కు చెక్కి పైశాచికంగా ప్రవర్తించారు. గురువారం రాత్రి పెంగోలియన్ దారి తప్పి నగరంలోని షెఫీన్ షా నగర్‌కు వచ్చింది. అక్కడ ఉన్న కొంతమంది ఆకతాయిలు పెంగోఇయన్పై క్రూరంగా దాడి చేసి చంపారు. దానిని ఇనుప రాడ్‌కు చెక్కి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతటితే ఊరుకోకుండా వీడియో చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పెంగోలియన్ను చంపిన ఆకతాయిల గురించి అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. -
చిన్ని ప్రాణికి కరోనా పరీక్షలు!
కటక్: కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ ప్రాణులను కూడా భయపెడుతోంది. ఇప్పటికే పెద్ద పులులు, పిల్లులు కరోనా వైరస్ బారిన పడినట్టు కథనాలు వెలుగు చూశాయి. తాజాగా ఒడిశాలో అలుగు(పాంగోలిన్) కూడా కరోనా పరీక్షలు ఎదుర్కొక తప్పలేదు. కటక్ జిల్లా సబ్‌డివిజన్ పరిధిలోని అథాగఢ్ ఫారెస్ట్ రేంజ్లో ఉన్న ఓ క్వారంటైన్ కేంద్రంలో కనిపించిన అలుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనికి కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్ఓ) సస్మిత లెంకా తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం ఒడిశాలో ఇప్పటివరకు 1,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడిన వారిలో 649 మంది కోలుకోగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే ఒడిశాలో 103 కోరనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. రథయాత్రపై సందిగ్ధం మరోవైపు పూరీ జగన్నాథుని రథయాత్రపై సందిగ్ధం కొనసాగుతోంది. పూరీ జిల్లాలో గత 48 గంటల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో కొంత ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకు జిల్లాలో 78 మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే కోలుకోగా, మిగతా వారు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు కోలుకున్న వారి సంఖ్య పెరిగితే తప్ప జగన్నాథుని రథయాత్ర నిర్వహణకు అనుమతి లభించే అవకాశం లేదని భావిస్తున్నారు. (అయ్యో పాపం; క్వారంటైన్లో విషాదం) -
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
-
కేబీఆర్ పార్కులో ‘అలుగు’
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కులో అరుదైన జంతువులు అటు సందర్శకులు.. ఇటు వాకర్లకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని జంతువులు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంటాయనడం అతిశయోక్తికాదు. ఆ కోవలోకే వస్తుంది అలుగు. చూస్తూనే చిన్న డైనోసార్ గుర్తుకొచ్చేలా ఉన్న తొండజాతికి చెందిన జంతువు అలుగు. దీని ముక్కు సూటిగా పొడవుగా ఉండి చీడ పురుగులు, చీమలను మాత్రమే తింటుంది. పొలుసుల్లా.. రాయిని పోలినట్లు మందంగా దీని చర్మం ఉంటుంది. ఈ జంతువు ఎవరికీ హాని తలపెట్టదని.. చాలా అరుదుగా కనిపిస్తుంటుందని పార్కు వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా వాక్ వేలో మెల్లగా వెళ్తున్న ఈ జంతువును వాకర్లు తమ కెమెరాల్లో బంధించారు. -
అబ్బురపరుస్తున్న అరుదైన జంతువులు.!
అద్భుతమైన వృక్ష సంపద.. అరుదైన జంతువులకు మన అడవులు కేంద్రాలుగా మారుతున్నాయి. జిల్లాలోని నల్లమల, శేషాచలం, లంకమల, పెనుశిల అభయారణ్యాల్లో సుమారు 1000కి పైగా వివిధ రకాల జంతు జాతులు నివసిస్తున్నాయి. అధికారులు కూడా వన్య ప్రాణుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. దేశంలో గుర్తింపు పొందిన పాంగోలిన్ (ఆలువ), హానిబడ్గర్ లాంటి అరుదైన జంతువులు కూడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో అమర్చిన కెమెరాలకు ఇటీవల దొరికాయి. సాక్షి కడప : ప్రపంచంలోనే అరుదైన అటవీ ప్రాంతం కడప సొంతం. ఎక్కడా లభించని ఎర్రచందనం కూ డా మన అడవుల్లోనే దొరుకుతుంది. ఇంతటి ప్రత్యేకత గల జిల్లా అడవు ల్లో పెద్ద పులులతోపాటు చిరుతలు, ఇతర అరుదైన జంతువులు కూడా కనిపిస్తున్నాయి. వీటితోపాటు పాంగోలిన్, హానీబడ్గర్ లాంటి జంతువులు కెమెరాకు చిక్కాయి. జిల్లాలో ఫారెస్టుకు సంబంధించి మూడు డివిజన్లు ఉండగా.. సుమారు 50కి పైగా కెమెరాలను అమర్చారు. అడవిలోని చెట్లకు, ఇతర నీటి కొలనులు ఉన్న ప్రాంతాల్లో వీటినిబిగించారు. అడవి జంతువులు అటువైపుగా వచ్చినపుడు కెమెరాల్లో దొరుకుతున్నాయి. అడవిలో పిల్లలతో ఎలుగుబంటి 1000 రకాలకు పైగా జంతువులు జిల్లాలో సుమారు 4.31 లక్షల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఇందులో అనేక రకాలైనటువంటి జంతువులు నివసిస్తున్నాయి. పులి, చిరుతలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, దుప్పిలు, కుందేళ్లు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, కోతులు, జింకలు, కొండగొర్రెలు, రొచ్చు కుక్కలు, నక్కలు, తోడేలు, అడవి దున్నలు, కుందేళ్లు, నెమళ్లు, కంతులు లాంటి జంతువులు నిత్యం అభయారణ్యంలో సంచరిస్తున్నాయి. సుమారు 1000రకాలకు పైగా జంతువులు నివసిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా జంతువుల గణనలో భాగంగా జిల్లాలో 2018 జనవరి 22వ తేదీనుంచి 28వ తేదీవరకు చేపట్టారు. అధికారులు అడవినంతా కలియతిరిగి లెక్కలు కట్టగా వేలాది రకాల జంతవులు ఉన్నట్లు గుర్తించారు. అరుదైన జంతువులకు మన అడవులు వేదిక అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీటి కొలను వద్ద రొచ్చు కుక్కలు వన్య ప్రాణులను వేటాడొద్దు – డీఎఫ్ఓ జాతీయ సంపదగా భావించే అడవులు, అక్కడ నివసించే జంతువులను కాపాడుకోవాలని..అలా కాకుండా వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని కడప డీఎఫ్ఓ శివప్రసాద్ హెచ్చరించారు. అడవి జంతువులు, జింకలు, ఇతర వన్యప్రాణులు రైతుల పొలాల్లోకి వచ్చి నష్టపరుస్తున్నాయని...కరెంటు, ఇతర ఆయుధాల ద్వారా చంపడం నేరమన్నారు. ఎక్కడైనా రైతులకు జంతువుల ద్వారా నష్టం జరిగినట్లు తమ సిబ్బంది దృష్టికి తీసుకు వస్తే పొలాన్ని పరిశీలించి వ్యవసాయాధికారుల ద్వారా పంట నష్టానికి సంబంధించిన పరిహారం వచ్చేలా కృషి చేస్తామని వివరించారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని....వన్య ప్రాణులను స్వేచ్ఛగా అడవిలో సంచరించేలా సహకరించాలే తప్ప ప్రాణహాని కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. -
నిమిషానికి ఒకసారి ఆహారం తింటుంది!
పంగోలిన్ని తెలుగులో అలుగు, అలువ అని పిలుస్తారు. ఒంటి మీద పొలుసులతో చూడటానికి చిత్రంగా ఉంటాయి. వీటిలో మొత్తం 8 జాతులున్నాయి. నాలుగు జాతులు ఆసియాలో, నాలుగు జాతులు ఆఫ్రికాలో ఉన్నాయి. సవన్నా గడ్డి భూములు, గడ్డి మైదానాలు, ఇసుక, రాతి నేలలలో ఇవి నివసిస్తాయి. ఎక్కువగా వేటాడటం వలన వీటి మనుగడ ప్రమాద స్థాయిలో ఉంది. చైనా, ఆఫ్రికా దేశాల వారు వీటి శరీర భాగాలను రకరకాల మందులు తయారుచేయడానికి వినియోగిస్తారు. వీటి ప్రత్యేకమైన చర్మాన్ని రకరకాల ఫ్యాషన్ పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు. వీటి పొడవు దాదాపు 3.2 అడుగులు, బరువు 40 పౌండ్లు. భారతదేశంలో ఉన్న అలుగులలో ఆడ, మగ అలుగులను తేలికగా గుర్తించవచ్చు. ఆడ అలుగు కంటే మగ అలుగు అధిక బరువు కలిగి ఉంటుంది. గట్టిగా ఉండే కెరటిన్‌తో వీటి వెంట్రుకలు, ఆ పైభాగం నిర్మితమై ఉంటుంది. నుదురు, పొట్ట, కాలి లోపలి భాగాలు మినహా, వీటి శరీరమంతా పొలుసులు పొలుసులతో కప్పబడి ఉంటుంది. వీటి ప్రతి పాదానికీ ఐదు గోళ్లుంటాయి. పదునుగా ఉన్న వీటి పంజాతో ఇవి బాగా తవ్వగలుగుతాయి. వెనుక కాళ్ల కంటే ముందు కాళ్లు పొడవుగా ఉంటాయి. గుండ్రంగా తిరిగే శక్తి ఉన్న తోక సహాయంతో ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు దూకుతాయి. 6 అంగుళాల అతి పొడవైన జిగురు వంటి నాలుకతో క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఆ సమయంలో చిన్న చిన్న చీమలు ముక్కు, చెవులలోకి చొరబడకుండా, ముక్కు రంద్రాలు, చెవులను మూసుకుంటాయి. తల్లి తోకే పిల్లలకు ప్రయాణ సాధనం! ఇవి ఒక్క రాత్రి పూటే సుమారు 70 మిలియన్ల క్రిములను తినగలవు. రాత్రి సమయంలో సుమారు 90 సార్లు తింటాయి. కొన్నిసార్లు ప్రతి నిమిషానికి ఒకసారి తింటాయి. కేవలం 19 రకాల క్రిములను మాత్రమే తింటాయి. వీటికి దంతాలు లేని కారణంగా ఆహారాన్ని మింగేస్తాయి. వీటికి కళ్లు బాగా కనిపించవు. కాని వాసన మాత్రం పసిగట్టగలవు. 135 రోజుల గర్భం తరవాత బిడ్డకు జన్మనిస్తాయి. ఇవి చిన్నవిగా ఉన్నప్పుడు తల్లి వీటిని గుహలలో ఉంచుతుంది. ప్రమాదం జరగబోతున్నట్లు పసిగట్టగానే పిల్లను మరో గుహకు మార్చుతుంది. పిల్లలు తల్లి తోక మీద కూర్చుని ప్రయాణిస్తాయి.