కటక్: కరోనా మహమ్మారి మనుషులనే కాదు మూగ ప్రాణులను కూడా భయపెడుతోంది. ఇప్పటికే పెద్ద పులులు, పిల్లులు కరోనా వైరస్ బారిన పడినట్టు కథనాలు వెలుగు చూశాయి. తాజాగా ఒడిశాలో అలుగు(పాంగోలిన్) కూడా కరోనా పరీక్షలు ఎదుర్కొక తప్పలేదు. కటక్ జిల్లా సబ్‌డివిజన్ పరిధిలోని అథాగఢ్ ఫారెస్ట్ రేంజ్‌లో ఉన్న ఓ క్వారంటైన్ కేంద్రంలో కనిపించిన అలుగును అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీనికి కోవిడ్-19 నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్‌ఓ) సస్మిత లెంకా తెలిపారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం ఒడిశాలో ఇప్పటివరకు 1,438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బారిన పడిన వారిలో 649 మంది కోలుకోగా, ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఒక్కరోజే ఒడిశాలో 103 కోరనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
రథయాత్రపై సందిగ్ధం
మరోవైపు పూరీ జగన్నాథుని రథయాత్రపై సందిగ్ధం కొనసాగుతోంది. పూరీ జిల్లాలో గత 48 గంటల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో కొంత ఊరట కలిగించే అంశం. ఇప్పటివరకు జిల్లాలో 78 మంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే కోలుకోగా, మిగతా వారు చికిత్స పొందుతున్నారు. రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పాటు కోలుకున్న వారి సంఖ్య పెరిగితే తప్ప జగన్నాథుని రథయాత్ర నిర్వహణకు అనుమతి లభించే అవకాశం లేదని భావిస్తున్నారు. (అయ్యో పాపం; క్వారంటైన్‌లో విషాదం)
Comments
Please login to add a commentAdd a comment