Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్‌! | Lok Sabha Election 2024: Polling for 6 Lok Sabha poling on 25 may 2024 | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్‌!

Published Sat, May 25 2024 4:23 AM | Last Updated on Sat, May 25 2024 4:23 AM

Lok Sabha Election 2024: Polling for 6 Lok Sabha poling on 25 may 2024

బీజేపీ గట్టి పోటీ 

6 స్థానాలకు నేడు పోలింగ్‌

ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్‌సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్‌సభ సీట్లకు శనివారం పోలింగ్‌ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్‌ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్‌... 

సంభాల్‌పూర్‌... 
తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్‌ గంగదేవ్‌ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్‌ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్‌ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.

కటక్‌... బీజేడీ కంచుకోట
స్వాతంత్య్ర యోధుడు సుభాష్‌ చంద్ర బోస్‌ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్‌ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్‌ మిశ్రా, కాంగ్రెస్‌ నుంచి సురేశ్‌ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్‌ పట్నాయక్‌ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్‌కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.

పూరి.. నువ్వా నేనా! 
సుందరమైన బీచ్‌లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్‌ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్‌ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరూప్‌ పట్నాయక్‌ను బరిలోకి దించింది. కాంగ్రెస్‌ నుంచి జయనారాయణ్‌ పటా్నయక్‌ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.

భువనేశ్వర్‌... నవీన్‌కు సవాల్‌ 
ఈ టెంపుల్‌ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరూప్‌ పటా్నయక్‌ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్‌ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్‌ నుంచి యాసిర్‌ నవాజ్‌ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!

కియోంజర్‌.. పోటాపోటీ 
ఈ ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్‌ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్‌ నుంచి బినోద్‌ బిహారీ నాయక్‌ రేసులో ఉన్నారు. కియోంజర్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement