‘రత్న భాండార్​’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి? | History And Mystery Of Lord Jagannath Puri Temple Ratna Bhandar In Telugu | Sakshi
Sakshi News home page

‘రత్న భాండార్​’లో ఏముంది? తాళాలు ఏమయ్యాయి?

Published Wed, May 22 2024 9:58 AM | Last Updated on Wed, May 22 2024 1:22 PM

History And Mystery Of Lord Jagannath Puri Temple Ratna Bhandar

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ గురించి ప్రస్తావించారు. ఈ రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదని, అవి ఏమైపోయాయనేది ఒడిశా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయాన్ని దాచి ఉంచుతున్నారని మోదీ ఆరోపించారు. మోదీ విమర్శల నేపధ్యంలో ‘రత్న భాండార్’ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ ‘రత్న భాండార్’లో ఏముంది?  

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి,వజ్ర వైఢూర్యాలు క్షేమంగా ఉన్నాయా? ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటినా ఇంత వరకు దాన్ని ఎందుకు చేధించలేదు?ఈ విషయంపై ప్రభుత్వం ఎందుకు అనుమానస్పద మౌనాన్ని కొనసాగిస్తోంది? శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి  బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది వేయి పడగల ఆదిశేషునివేనా? అసలు జగన్నాధుని కొలువులో  ఏం జరుగుతోంది? దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అక్కడున్న రహస్యం ఏంటి?

అందరినీ కాపాడ్డానికి ఆ దేవుడు ఉన్నాడు. మరి దేవుడి సంపద కాపాడటానికి ఎవరున్నారు? కచ్చితంగా మనిషిని నమ్మడానికి వీల్లేదు. తన సంపదను దేవుడే కాపాడుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఒడిషా లోని అత్యంత ప్రాచీనమైన పూరీ జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. తాళాలు ఎలా పోయాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. ఆలయ కమిటీ ఏమీ తెలీదంటోంది. తాళాలు పోయిన యాభై ఏళ్ల తర్వాత కూడా ఎవ్వరిలోనూ కంగారు లేదు. వాటిని వెతికి పట్టుకోవాలన్న ఆతృత లేదు. పాలకుల వైఖరిని చూసి భక్తులు మండిపడుతున్నారు. దేవ దేవుడి ఆభరణాలు ఉన్నాయా? దిగమింగేశారా? చెప్పండంటూ  నినదిస్తున్నారు.

దేశంలోని నాలుగు ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి. ఈ నాలిగింటినీ కలిపి చార్ ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటితో పాటు మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. 12వ శతాబ్ధంలో రాజా అనంత వర్మ చోడగంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్ దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం.

దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే  జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు.ఇక్కడ నిత్యం దేవ దేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు.ఇక ఏటా జూన్, జులై నెలల్లో జరిగే జగన్నాథ రథ యాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్ధం. అంటే ముల్లోకాలనూ చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్ధం చేసుకోవాలి.

ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. సమాధానం లేని ప్రశ్నలా అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుండి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు  దేవ దేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు.

ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు. ఎప్పుడో 1926లో  బ్రిటిష్ పాలకులు ఈ రత్నభాండాగారాన్ని తెరిపించినపుడు అందులో 597కి పైగా రక రకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైఢూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాశులు రాశులుగా పోసి ఉన్నట్లు గురించారు. రత్నభాండాగారంలోని రహస్యగదిగా పిలుస్తోన్న మూడో గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని  ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని వందేళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు.

అంతా బానే ఉంది కానీ కొన్నేళ్లుగా ఈ  రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్నభాండాగారంలోని మూడో గదికి  మూడు తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున మూడు తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళంచెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళంచెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక మూడో తాళం ఆలయ ప్రధాన అర్చకుడు భండాగార ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది.

ఈ మూడు తాళాలు ఉంటేనే ఆ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్నభాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు, పబ్బాలు వచ్చినపుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. రెండో గదిలోనూ విలువైన వస్తువులున్నాయి. అయితే మూడో గదిని మాత్రం దశాబ్ధాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్దం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజాసంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత తేలిందేంటంటే ఈ మూడు తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని.

దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా రత్నభాండాగారానికి చెందిన మూడో గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని అది ఎక్కడికిపోయిందో తెలవడం లేదని ప్రకటించారు. దాంతో  ప్రభుత్వంపైనా ఆలయ పాలనా యంత్రాంగం పైనా విమర్శలు వెల్లువెత్తాయి.1964లో చివరి సారి మూడో గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత తాళం కనిపించకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడటంతో కొన్నాళ్ల కింద పాలక పక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవ దేవుడి ఆభరణాలు కానీ సంపద కానీ  ఎక్కడికీ పోలేదని.. పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని అన్నీ భద్రంగానే ఉన్నాయని  వివరణ ఇచ్చారు.

అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే  ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తర్వాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న రెండు తాళాలతో మూడో గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు.

అయితే రెండు తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్ధాలు రావడంతో  భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారని చెబుతారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడ పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు.ప్రధాన అర్చకులయితే.. ఓ అడుగు ముందుకేసి దేవాలయ రత్నభాండాగారాన్ని తెరిస్తే దేశానికే అరిష్టం అని హెచ్చరిస్తున్నారు.
దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు.

జగన్నాధుని భక్తితో కొలిచే వారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. మూడో గది తాళాలు ఎలా పోయాయో ఎవరు కొట్టేశారో ఎందుకు తేల్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాళిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాళిగలను తెరిచారు. అయితే  అందులో ఆరు నేలమాళిగలు ఉండగా అధికారులు కేవలం అయిదు నేలమాళిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ ఆరో నేలమాళిగే అన్నింటిలోకీ కీలకమైందని అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే మిగతా అయిదు నేలమాళిగలతో పోలిస్తే ఆరో నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు.

ఆరో నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే  ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఆరో నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు కచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం ఆరో నేలమాళిగను ఈ రోజుకీ తెరవలేదు. ఆరో నేలమాళిగ ను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికే అరిష్టమని  దేవుడి ఉగ్రరూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాదులు.

ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో అయిదు మాళిగల తలుపులు తెరిస్తే ఏమీ కానిది ఆరో  మాళిగ తెరిస్తేనే  ఏదో అయిపోతుందని అనడంలో అర్ధం ఏముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో ఆరో నేలమాళిగ తెరవకూడదని నిర్ణయించేసుకున్నారు.

పూరీలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన మూడో గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉఏనేన్నాయా? లేక వేయి పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా? అన్నది అర్ధం కావడం లేదు. పాముల బుస బుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అన్నారన్న ప్రచారంలో ఎంత వరకు నిజముంది? వెంటనే ఆ గది తెరిస్తే  ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం దీనికి కొనసాగింపా? అన్నది తెలియాల్సి ఉంది.

అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులు అయితే మూడో గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను రాబందులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే మూడో గది తాళాల గురించి కానీ రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ ప్రభుత్వం మాట్లాడ్డం లేదని వారంటున్నారు.మూడో గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజా నిజాలు బయటకు వస్తాయని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు.

అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరో నేలమాళిగ తరహాలోనే పూరీ జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ మూడోగది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేథావులు అంటున్నారు. పాలకులు మాత్రం ఏమీ అనడం లేదు. ఆలయ సిబ్బంది కూడా బెల్లంకొట్టిన రాయిలా మాట్లాడ్డం లేదు. భక్తులు మాత్రం దేవుడికి అపచారం జరిగిందని బాధపడుతున్నారు. అది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఏ క్షణంలో ఏం ముంచుకు వస్తుందోనని వారు భయపడుతున్నారు. ఇక నిజా నిజాలు వెలికి తీసి దోషులకు శిక్షపడేలా చేయాల్సింది ఆ జగన్నాథుడే. ఆయనే కద జగన్నాటక సూత్రధారి. తన ఆస్తులను ఎవరు కొట్టేశారో పట్టుకుని బోనులో పెట్టాల్సింది దేవుడే ఇక.

భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మిక వాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజానిజలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement