పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు... | NCC Cadet JUO Shardhanjali Sahoo conquers Mount Kang Yatse-II | Sakshi
Sakshi News home page

పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...

Published Thu, Jul 18 2024 1:23 AM | Last Updated on Thu, Jul 18 2024 1:23 AM

NCC Cadet JUO Shardhanjali Sahoo conquers Mount Kang Yatse-II

ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్‌ ఫైనలియర్‌. చదివేది సాఫ్ట్‌వేర్‌ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని  దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే  ఎన్‌సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది.

 గత జూన్‌ నెల 21వ తేదీన కాంగ్‌ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం  చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో  తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. 

కాంగ్‌ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్‌ రీజియన్‌లో ఉంది. కాంగ్‌ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్‌ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్‌ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్‌ మేరీ శిఖర్‌’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్‌ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. 

పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌సీసీ, హైదరాబాద్‌ కమాండర్‌ కల్నల్‌ అనిల్‌ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్‌ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్‌ఎమ్‌ఐ (హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్‌ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్, సెర్చ్‌ అండ్‌  రెస్యూ్క మెథడ్స్‌ ట్రైనింగ్‌ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. 

అమ్మకు  దూరంగా యాభై రోజులు
ఢిల్లీలో మే 28న ఫ్లాగ్‌ ఆఫ్, జూన్‌ 29న ఫ్లాగ్‌ ఆన్‌ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. 

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్‌ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్‌ యూనిఫామ్‌ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది.  

ఆరోహణలో అవరోధాలు 
కాంగ్‌ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్‌ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్‌ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్‌ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు.

 డ్రై రేషన్‌... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్‌లు, న్యూట్రిషన్‌ బిస్కట్‌లు, ఓఆర్‌ఎస్‌ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. 

ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్‌ అవుట్‌ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్‌ ఎవరెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. 

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement