mountaineering
-
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్‌లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్‌లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్‌కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్‌లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్‌లో పూర్తి చేసుకుని ఎక్స్‌పెడిషన్‌కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్‌కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్‌లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్‌క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్‌లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్‌లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పెడిషన్‌కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Rescue operation Specialist: ప్రమాదమా..? టాన్యా ఉందిగా..!
కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడు... సెలవుల్లో స్నేహితులతో కలసి ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు చాలామంది యువతీ యువకులు. అయితే అనుకోకుండా ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే వారిని ఎవరు కాపాడతారు? అందుకే అలాంటి వారికి అండగా ఉంటోంది టాన్యా. అవును, సరదాగా గడపాల్సిన వయసులో ఇతరుల ప్రాణాలను రక్షిస్తోంది టాన్యా కోలి. ఐదోఏటి నుంచే కొండలు ఎక్కడం నేర్చుకుని, టీనేజ్‌లోకి వచ్చినప్పటినుంచి ఏకంగా రెస్క్యూ టీమ్‌ను నిర్వహిస్తూ ఎంతోమందిని ఆపదల నుంచి బయటపడేసింది. పెద్ద పెద్ద్ద కొండలను అవలీలగా ఎక్కేస్తూ, మరొకరికి సాయంగా నిలబడుతూ.. నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది టాన్యా. నాసిక్‌కు చెందిన టాన్యా కోలి ఐదేళ్ల వయసు నుంచే పర్వతాలు ఎక్కడం నేర్చుకోవడం మొదలు పెట్టింది. టాన్యా తండ్రి దయానంద్ కోలి నాసిక్ క్లైంబర్స్ అండ్ రెస్క్యూయర్స్ అసోసియేషన్‌లో పనిచేస్తుండడంతో తరచూ ట్రెక్కింగ్, రెస్క్యూ అనే పదాలను తండ్రి నోట వెంట వినేది. టాన్యాకూ ట్రెక్కింగ్‌పైన ఆసక్తి ఏర్పడడంతో తండ్రి దగ్గర ట్రెక్కింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది. అలా ట్రెక్కర్‌గా మారిన టాన్యా, రెస్క్యూటీమ్ కలిసి ఎంతోమందిని ప్రమాదాల నుంచి బయటపడేస్తోంది. తండ్రి దగ్గర నేర్చుకున్న ట్రెక్కింగ్ మెళకువలతోపాటు, హిమాలయాల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంది. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడడంతోపాటు, పర్వతారోహకులకు ట్రెక్కింగ్‌లో శిక్షణ ఇస్తోంది టాన్యా. పర్వతాన్ని అధిరోహించేటప్పుడు జరిగే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పిస్తుంది. టాన్యా దగ్గర శిక్షణ తీసుకుంటున్నవారిలో మహారాష్ట్ర ΄ోలీసు అకాడమీ ట్రైనీలు కూడా ఉన్నారు. ప్రతిసారీ తను అందుబాటులో ఉండడం కష్టం కాబట్టి ఇతరులకు నేర్పించడం ద్వారా ప్రమాద సమయంలో వారిని వారే కాపాడుకోవడంతోపాటు, ఇతరులను కూడా కాపాడగలరు. అందుకే మరింతమందికి రెస్క్యూలో శిక్షణ ఇస్తున్నాను అని టాన్యా చెబుతోంది. ‘‘ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలి అని సమాచారం తెలిస్తే వెంటనే బయలుదేరతాం. అది అర్ధరాత్రి అయినా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో సిద్ధంగా ఉంటాం. ట్రెకింగ్ చేసేవారిని, ప్రమాదంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడం థ్రిల్లింగ్ ఇచ్చేదే అయినప్పటికీ చాలా సవాళ్లతో కూడుకున్నది. సమస్యలు ఉన్నప్పటికీ అవతలి వారిని ప్రమాదం నుంచి కాపాడగలిగామన్న సంతృప్తి ముందు ఆ సమస్యలు, సవాళ్లు చిన్నబోవలసిందే’’ అని చెబుతోంది తాన్యా. -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్‌కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్‌లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్‌లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్‌గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
ఫస్ట్ టైమ్ పర్వతాలు పరవశించి... ఆశీర్వదించాయి!
‘మనుషులు పర్వతాలతో కలిసి కరచాలనం చేసినప్పుడు గొప్ప అద్భుతాలు సంభవిస్తాయి’ అలాంటి అద్భుతాలను అయిదుసార్లు చవిచూసి మాటలకు అందని మహా అనుభూతిని సొంతం చేసుకుంది ప్రియాంక మోహితే. తాజాగా ప్రపంచంలోనే మూడో ఎల్తైన శిఖరం కాంచన్‌జంగా(8,586 మీటర్లు)ను అధిరోహించి జేజేలు అందుకుంటోంది మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే. ఈ విజయం ద్వారా ప్రపంచంలోని ఎనిమిదివేల మీటర్లకు పైగా ఎత్తు ఉన్న అయిదు పర్వతశిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. చిన్నప్పటి నుంచి పర్వతారోహణ గురించిన విషయాలు తెలుసుకోవడం, పర్వతారోహకులతో మాట్లాడడం అంటే ప్రియాంకకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను ప్రపంచం మెచ్చిన పర్వతారోహకురాలిగా మలిచింది. టీనేజ్‌లో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లోని బందర్‌పంచ్ పర్వతశ్రేణిని అధిరోహించింది ప్రియాంక. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో మౌంట్ ఎవరెస్ట్(8,849 మీ), 2016లో మౌంట్ మకలు(8,485 మీ), మౌంట్ కిలిమంజారో(5,895 మీ), 2018లో మౌంట్ లోట్సే (8,516 మీ), గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ (8,091 మీ) పర్వతాలను అధిరోహించింది. గత సంవత్సరం మౌంట్ అన్నపూర్ణ అధిరోహించడానికి బయలుదేరేముందు కోవిడ్ భయాలు సద్దుమణగలేదు. రకరకాల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోకతప్పలేదు. కొత్త విజయాన్ని నా ఖాతాలో వేసుకోబోతున్నాను...అంటూ ఒక వైపు అంతులేని ఆత్మవిశ్వాసం, మరోవైపు అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల గురించి విన్న భయంగొలిపే విషయాలు తన మనసులో కాసేపు సుడులు తిరిగాయి. అయితే చివరికి మాత్రం ప్రతికూల ఆలోచనలపై ఆత్మవిశ్వాసమే అద్భుత విజయాన్ని సాధించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ నుంచి క్రాస్ ఫిట్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టింది. సాహసయాత్రకు బయలుదేరేముందు– ‘ప్రతి విజయం తరువాత సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నారు. ఈసారి కూడా అలాగే జరగాలని ఆశిస్తున్నాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ప్రియాంక. మౌంట్ అన్నపూర్ణను విజయవంతంగా అధిరోహించిన తరువాత సోషల్‌మీడియాలో ఆమె ఫాలోవర్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. నాట్యం చేసిన పాదాలు పర్వతాలను ముద్డాడాయి (ప్రియాంకకు భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది)...అని కవిత్వం చెప్పినవారు కొందరైతే– ‘మీ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచిందో మాటల్లో చెప్పలేను’ అన్నవారు కొందరు. ప్రతి విజయ యాత్రకు ముందు– ‘నా కల నెరవేర్చుకోవడానికి బయలుదేరుతున్నాను’ అని పోస్ట్ పెడుతుంది ప్రియాంక. ఆ వాక్యానికి ఎన్నెన్ని ఆశీర్వాద బలాలు తోడవుతాయోగానీ ఆమె అద్భుత విజయాలను సాధిస్తుంటుంది. ముంబై యూనివర్శిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేసిన ప్రియాంకకు పర్వతారోహణ అంటే టీనేజ్‌లో ఎంత ఉత్సాహంగా ఉండేదో, ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహమే 30 సంవత్సరాల ప్రియాంక బలం, మహా బలం! -
వయసు 62.. పర్వతారోహణ.. ఉన్నతమైన కల
‘కల ఉంటే చాలు అదే వయసును తగ్గిస్తుంది. లక్ష్యం వైపు అడుగులు వేయిస్తుంది’ అనడానికి నాగరత్నమ్మ అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న నాగరత్నమ్మ వయసు 62. గృహిణిగా బాధ్యతలు తీరి, విశ్రాంతి తీసుకుంటున్న వయసు. కానీ, పశ్చిమ కనుమల్లో ఎత్తైన, అత్యంత కష్టతరమైన పర్వతాన్ని.. అదీ చీరకట్టుతో అధిరోహించి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారామె. సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమే అని చాటుతున్నారు. ఇంటి గడప దాటి ఎన్నడూ పర్యటనలు కూడా చేయలేదనే నాగరత్నమ్మను ‘ఈ వయసులో టీవీ చూస్తూ, మనవలు– మనవరాండ్రతో కాలక్షేపం చేయకుండా ఏంటీ సాహసం’ అని తెలిసినవాళ్లు, తెలియనివాళ్లూ అడుగుతుంటే హాయిగా నవ్వేస్తుంది. ఆ తర్వాత తాను ఎందుకు ఈ సాహసానికి పూనుకున్నదో వివరిస్తుంది. ఏళ్ల నాటి తపన పర్వతాలను అధిరోహించాలని తనకు ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే కలగన్నదట నాగరత్నమ్మ. కానీ, పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల నడుమ ఆ కల కళ్ల వెనకే దాగిపోయిందని చెబుతుంది. ‘‘కాలప్రవాహంలో నాలుగు దశాబ్దాలు దాటిపోయాయి. పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు. బాధ్యతలేవీ లేకపోవడంతో నా కల ముందుకు వచ్చింది. మా అబ్బాయితో చెప్పాను. ముందు సంశయించాడు. ‘ఈ వయసులో పర్వతారోహణ.. అంటే మోకాళ్ల నొప్పులు వస్తాయి, భరించలేవు’ అన్నాడు. ‘నా కల నాలో ఉత్సాహాన్ని, శక్తిని పెంచుతుంది. నేనిలా పర్వతారోహణ చేయడం నా వయసు వాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, కాదనకు’ అని చెప్పాను. అలా 40 ఏళ్ల తర్వాత నా కల నెరవేర్చుకోవడానికి మా అబ్బాయి, అతని మిత్రులతో కలిసి పశ్చిమ కనుమలకు చేరుకున్నాను. ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అంటారు నాగరత్నమ్మ. ఆమె చేసిన ట్రెక్కింగ్‌కి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది. సాహసం నాగరత్నమ్మ వయసును తగ్గించింది. ఇప్పుడీ పర్వతారోహణ ఆమెలో మరింత శక్తిని నింపింది. దీంతో ‘మరిన్ని పర్వతారోహణలు చేసి, నా కలను సుసంపన్నం చేసుకుంటాను’ అంటూ తన లక్ష్యాన్ని వివరించే నాగరత్నమ్మను తప్పక అభినందించాల్సిందే! ఒకవిధంగా చెప్పాలంటే ఇది నా జీవితంలో మొదటి పర్యటన కూడా. అగస్త్య ఆర్కూడమ్ పర్వతం ఎత్తు 6000 అడుగుల పైమాటే. అంత ఎత్తున్న పర్వతాన్ని చీరకట్టుతో అధిరోహించడం అసాధ్యం అన్నారు. సాధ్యమే అని మొదలుపెట్టాను. శిఖరాగ్రాన్ని చేరుకున్నాక కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. – నాగరత్నమ్మ -
'ఉద్యోగం తెచ్చుకోక ఆ కొండలెక్కడం ఏంటి'.. కట్‌చేస్తే
ఎవరూ చేయని పనులను ఎంచుకోవడం ఇష్టం. నలుగురూ వెళ్లేదారిలో కాకుండా తనకోసం తను కొత్త దారి వేసుకోవడం ఇష్టం. కన్న కల కోసం కఠోరశ్రమకైనా వెనకాడకుండా ముందుకు సాగడం ఇష్టం. మన త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ దేశాల పర్వతశిఖరాలపై ఎగురవేసి తీరాలన్నది మరీ మరీ ఇష్టం. తెలంగాణలోని భువనగిరి మండలం ఎర్రబెల్లి గ్రామంలో ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన పడమటి అన్విత ఇటీవల రష్యాలోని ఎల్బ్రస్ పర్వతంపై మన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో అన్విత పంచుకున్న విశేషాలు.. ఉస్మానియా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన అన్విత పర్వతారోహణలో బేసిక్ కోర్సులనూ పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఐదు పర్వతాలను అధిరోహించిన 23 ఏళ్ల అన్విత ప్రస్తుతం భువనగిరి రాక్ క్లైంబింగ్లో సహాయ శిక్షకురాలిగా ఉంది. తనకు తానుగా ఏర్పర్చుకున్న లక్ష్యంతో ఇతర దేశాల పర్వతాలపై భారతీయజెండాను ఎగురవేయడం కోసం కఠోర శ్రమను సైతం ఆనందంగా స్వీకరిస్తూ పర్వత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తోంది. పేరు: పడమటి అన్విత విద్యార్హత: ఎంబీఏ ఇప్పటి వరకు అధిరోహించిన పర్వతాలు: 2015లో రినాక్ పర్వతం( 4500 మీటర్లు) 2019లో బీసీ రాయ్ పర్వతం (6000 మీటర్లు) 2021 లో కిలిమంజారో (5849 మీటర్లు) 2021లో కడే పర్వతం (6000 మీటర్లు) 2021 లో ఎల్బ్రూస్ (5642 మీటర్లు) పర్వతారోహణ ఆలోచన ఎందుకు కలిగింది? అన్విత: ఇంటర్మీడియట్ చదువుతుండగా ఓ రోజు పత్రికలలో రాక్‌క్లైంబింగ్ ట్రెయినింగ్ గురించి చదివాను. నాకూ పర్వతారోహకురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలి.. అనే ఆలోచన కలిగింది. అందుకు నా శక్తి సరిపోతుందా అని పరీక్షించుకోవడానికి రాక్ కై్ౖలంబింగ్ కోసం భువనగిరి ఖిలా వద్దకు వెళ్లాను. అక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులను చూశాక నేను కూడా అందులో ఎలాగైనా చేరాలనుకున్నాను. మా అమ్మనాన్నలతో ‘కొండలు ఎక్కేందుకు శిక్షణ తీసుకుంటా’ అన్నాను. ముందు వద్దన్నారు. ‘చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకోక ఎందుకు ఆ కొండలెక్కడం, అదేమైనా చిన్నపనా’ అన్నారు. తర్వాత, నా పట్టుదల చూసి ‘సరే’ అన్నారు. 7 రోజుల్లోనే బేసిక్ కోర్సు పూర్తిచేశాను. ఆ తర్వాత డార్జిలింగ్‌లో 40 రోజుల శిక్షణ చదువుకు ఇబ్బంది కలుగకూడదని సెలవు రోజుల్లో తీసుకున్నాను. 2018 సెప్టెంబర్‌లో మరోసారి అడ్వాన్స్ కోర్సు నేర్చుకున్నాను. పర్వతారోహణ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యం ఏమిటి? అన్విత: పర్వాతారోహణలో ఎలాగైనా శిఖరం అంచుకు చేరాలన్న పట్టుదల ఉంటుంది. అది ఏ పనినైనా సాధించగలననే ధైర్యాన్ని ఇస్తుంది. దీంతోపాటు ఎవరు చేయని వాటిని నేను చేయాలనుకున్నాను. ప్రపంచంలో ఉన్న ఏడు ప్రధాన పర్వతాలతోపాటు, ఇంతవరకు ఎవరూ ఎంపిక చేసుకోని పర్వతాలను అధిరోహించాలన్నది నా లక్ష్యం. అందులో ప్రధానంగా ఉత్తర అమెరికాలో ఉన్న దెనాలి పర్వతాన్ని ఎక్కాలనేది నా కల. ఈ పర్వతాన్ని భారతీయులు ఎవరూ అధిరోహించలేదు. ఒక దేశంలో ఎల్తైన పర్వతం ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అలా అన్ని దేశాల్లోని ఎల్తైన పర్వతాలపై మన దేశ జాతీయ జెండాను ఎగురవేయాలి. దాని కోసమే కృషి చేస్తున్నాను. దేశదేశాల ఎల్తైన పర్వతాల జాబితాను రూపొందించుకున్నాను. అందులో భాగంగానే ఇటీవల రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పై 10 మీటర్ల జాతీయ జెండాను ఎగుర వేసిన తొలి భారతీయ యువతిగా పేరొందాను. మైనస్ 40 డిగ్రీల ప్రతికూల ఉష్ణోగ్రతలో కూడా పర్వతాలు అధిరోహించడం నాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. పర్వతారోహణ సమయంలో తగిలే గాయాలు కాలంతోపాటు తగ్గిపోతాయి. కానీ, ఆ ఆనందం జీవితాంతం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్ని పర్వతాలు అధిరోహించారు? అన్విత: ఐదు పర్వతాలు అధిరోహించాను. మొదట 17 ఏళ్ల (2015లో) వయసులో మన దేశంలోని సిక్కింలోని రెనాక్, 2019లో బీసీ రాయ్, ఈ యేడాది లద్డాక్లోని కడే, ఆఫ్రికాలోని కిలిమంజారో, రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాలను అధిరోహించాను. దేశ విదేశాల్లో పర్వతారోహణ అంటే ఆర్థిక వనరులు కూడా అవసరం కదా..? అన్విత: పర్వతారోహణ శిక్షణ కోసం ఆరేళ్లుగా మా అమ్మనాన్నలే లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రష్యాలోని ఎల్బ్రస్, కిలిమంజారో పర్వతాల అధిరోహణకు స్థానిక నేతలతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, జిల్లా కలెక్టర్ ప్రోత్సాహం మరువలేనిది. – యంబ నర్సింహులు, యాదాద్రి, సాక్షి కుటుంబ నేపథ్యం మాది సాధారణ రైతు కుటుంబం. భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన మా తల్లిదండ్రులు పడమటి చంద్రకళ, మధుసూదన్‌రెడ్డి. నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ భువనగిరిలో అంగన్వాడీ టీచర్. కఠినమైన పర్వతారోహణ గురించి ముందు భయపడినా, నా పట్టుదలను గుర్తించి అమ్మనాన్నలు ప్రోత్సహించారు. గ్రామం నుంచి భువనగిరికి వచ్చి చదువుకోవడానికి బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డాం. అందుకని నేను, అక్క మా చదువుల కోసం భువనగిరిలో ఉంటున్నాం. – అన్విత -
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
-
హిమాచల్‌లో ట్రెక్కింగ్ ప్రమాదం.. 11మంది మృతి
ఉత్తరకాశి: హిమాచల్ ప్రదేశ్‌లో పర్వతారోహణకు వెళ్లి కనిపించకుండా పోయిన బృందంలో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో ఆరుగురు గల్లంతయ్యారు. తప్పిపోయిన వారి అచూకీ కనిపెట్టేందుకు హెలికాప్టర్లతో గాలిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీకి చెందిన 8 మంది పర్వతారోహకులతోపాటు ముగ్గురు వంటవాళ్లు ట్రెక్కింగ్ కోసం ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చారు. 11న ఉత్తరకాశి జిల్లాలోని హర్సిల్‌లో పర్వతారోహణ ప్రారంభించారు. లామ్‌ఖాగా పాస్ నుంచి చిట్కూల్ చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ గల్లంతయ్యారు. వీరిలో ఐదుగురి మృతదేహాలను అధికారులు గురువారం గుర్తించారు. ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. శుక్రవారం మరో రెండు మృతదేహాలను కనిపెట్టారు. సెర్చ్ అండ్ రెస్క్యూ టీం గల్లంతైన మిగతావారి కోసం చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
గిరి పుత్రిక.. గ్రేట్ జర్నీ
కన్నిబాయి... అచ్చమైన ఆదివాసీ అమ్మాయి. ప్రకృతి ఒడిలో పుట్టింది. ప్రకృతితో కలిసిపోయి పెరిగింది. చెట్లెక్కడం, కొమ్మలను చేత్తో గట్టిగా పట్టుకుని ఊయలూగడం, ఒక్క పరుగులో కొండ శిఖరాన్ని చేరడమే ఆమెకు తెలిసిన ఆటలు. అవి ఒట్టి ఆటలు కాదు, సాహస క్రీడలు అని తెలిసి ఆశ్చర్యపోయింది. వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిసినప్పుడు కలిగిన అబ్బురం అంతా ఇంతా కాదు. పోటీలో పాల్గొనాలని సరదా పడింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది... వచ్చిన వాళ్లంతా అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన వాళ్లని. వాళ్ల భాష నాగరకం గా ఉంది. తానందుకున్న జ్ఞాపికలు... అవార్డులు... పతకాలతో కన్నిబాయి వాళ్లు ఉపయోగించే పదాలు కొత్తగా ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లనిపించింది. పోటీలు మొదలయ్యాయి. అత్యంత సులువుగా, అలవోకగా లక్ష్యాలను సాధించింది. ‘మీ కోచ్ ఎవరు? ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు’ అని అడిగినప్పుడు ఆమె ఒక్క మాటలో ‘‘ఈ పోటీలు ఉంటాయని పేపర్లో చూసి తెలుసుకున్నాను. శిక్షణ ఇస్తారని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు. మమ్మల్ని కడుపులో పెట్టుకుని బతికించుకునే అడవి తల్లే నాకు శిక్షణ ఇచ్చింది’’ అని సమాధానం చెప్పింది. ఇంతకీ కన్నిబాయి ఎవరు? ఆమె ఆడిన ఆటలేంటి? ఆ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆమె గెలుచుకున్న పతకాలెన్ని? ఆమె అధిరోహించిన విజయ శిఖరాలేవి? ∙∙ కన్నిబాయిది కుమ్రుం భీము ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలం, భీమన్ గొంది గ్రామం. కోలామ్ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి. తండ్రి పోడు వ్యవసాయం చేసేవాడు. తల్లి ఆదివాసీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో వంట చేసేది. తల్లితోపాటు స్కూలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో తొలి విద్యావంతురాలు పుట్టింది. అలా కన్నిబాయి పదవ తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో చదివింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. కన్నిబాయి అప్పుడు పేపర్లో తెలంగాణ అడ్వెంచర్ క్లబ్, నెహ్రూ యువజన కేంద్రం ఇచ్చిన ప్రకటనను చూసింది. పోటీలకు దరఖాస్తు చేసింది. ఆ పోటీలో మొత్తం పదహారు కేటగిరీలున్నాయి, అన్నీ సాహసక్రీడలే. ఎనిమిదింటిలో తొలిస్థానంలో నిలిచింది. ఆ ఆటలేవీ నేల మీద ఆడేవి కాదు. కొండ కోనల నుంచి లోయలోకి దిగాలి, లోయలో నుంచి కొండ మీదకు ఎక్కాలి. రాపెల్లింగ్ రెండు రకాలు, క్లైంబింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మరింగ్, బ్లైండ్ఫోల్, పారాషూటింగ్... అన్నింటిలోనూ పాల్గొన్నది. ఎనిమిదింటిలో తొలి స్థానంలో నిలిచిన జిల్లాస్థాయి పోటీలవి. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తొలిస్థానమే ఆమెది. ఇది ఐదేళ్లనాటి మాట. పతకాల పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్, రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ సంయుక్తంగా 2019లో నిర్వహించిన పోటీల్లో పద్దెనిమిది దేశాల నుంచి వందకు పైగా సుశిక్షితులైన క్రీడాకారులు పాల్గొన్నారు. అరకులోయ దగ్గరున్న 350 అడుగుల కటికి జలపాతం రాపెల్లింగ్ పోటీల్లో వరల్డ్ కప్‌లో కన్నిబాయికి కాంస్య పతకం వచ్చింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుని అదే ఉత్సాహంతో 2020లో జరిగిన సెకండ్ వరల్డ్ వాటర్ఫాట్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ పోటీల్లో ఒక బంగారు, వెండి, రెండు కాంస్యం... మొత్తం నాలుగు పతకాలను సాధించింది. ఆ పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈ యంగ్ అచీవర్... అదే ఏడాది ఆగస్టు లో వాటర్‌ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితమైంది. భగీరథ ప్రయత్నం ఇంటర్ తర్వాత చదువులో కొంత విరామం తీసుకున్న కన్నిబాయి ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదువుతోంది. ఆమె ఆటలపోటీలతోపాటు పర్వతారోహణలో కూడా ఓ మైలురాయిని చేరుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6,512 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ భగీరథ శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పద్దెనిమిది రోజులపాటు సాగిన ఆ సాహసయాత్ర అనుభవాలను ఆమె గుర్తు చేసుకుంటూ పోరాడే మొండితనమే తనను గెలిపించిందని చెప్పింది కన్నిబాయి. సాహస యాత్ర కూడా పోరాటం వంటిదే. ఈ పోరాటం లో లక్ష్యం తప్ప మరేమీ గుర్తుండ కూడదు, ఇతరత్రా ఏం గుర్తుకు వచ్చినా పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తాం. అందుకే మరేమీ గుర్తు తెచ్చుకోకూడదు అని సందేశాత్మక జీవిత సత్యాన్ని కూడా చెప్పిందీ పాతికేళ్ల అమ్మాయి. భవిష్యత్తులో ఎవరెస్టును అధిరోహించాలనేది తన కల అని చెప్పిన కన్నిబాయి ప్రస్తుతం పాంచులీ పర్వతారోహణకు సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన మొదలయ్యే ఆమె గ్రేట్ జర్నీకి ఆల్ ది బెస్ట్. పోరుబిడ్డ ఆదివాసీ బిడ్డను, ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని చెప్పే కన్నిబాయి పోరాట యోధ కూడా, నాయ క్పోడు తెగకు చెందిన అమ్మాయిలు ట్రాఫికింగ్‌కు గురయినప్పుడు కన్నెర్ర చేసింది. పోలీసులు ఆ అమ్మాయిలను వెతికి తీసుకువచ్చే డెబ్బయ్ మంది ఆదివాసీలతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసింది. ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించినప్పుడు ‘ఆమె మరణానికి అనారోగ్యమే కారణం’ అని కేసు ముగించడానికి సిద్ధమవుతున్న అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుని పార్థివ దేహాన్ని కదలనివ్వకుండా అడ్డుపడి, దర్యాప్తుకోసం పట్టుపట్టింది. కుమ్రుం భీము మొదలుపెట్టిన ఆదివాసీల భూమి హక్కు పోరాటాన్ని ఈ తరంలో కన్నిబాయి కొనసాగిస్తోంది. కొంతమందికి పట్టాలిప్పించింది. కరెంటు లేని ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సోలార్ లైట్లు శాంక్షన్ చేయించి స్వయంగా మోసుకెళ్లి లైట్లు వేయించిన ధీర కన్నిబాయి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నేపాల్లోనూ సీఐడీ రాధిక పర్వతారోహణ
సాక్షి, అమరావతి: పర్వతారోహణలో పట్టు సాధించిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ జీఆర్ రాధిక నేపాల్‌లోని హిమాలయ శిఖరాన్ని అధిరోహించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. నేపాల్‌లోని సుమిత్ శిఖరం కింద మంచు కరగడం, భారీగా రాతి పతనం, పట్టుకునేందుకు తాడు లేకపోవడం వంటి కారణాలతో ఈ సమయం (సీజన్)లో పర్వతారోహకులు ఆ శిఖరాన్ని చేరుకోలేరు. అయినా పట్టుదలతో రాధిక పర్వతారోహణ చేపట్టారు. లోతైన పగుళ్లు, భారీ ఈదురు గాలులకు ఎదురొడ్డి మొత్తం 6,189 మీటర్ల ఎత్తున్న శిఖరంలో 6,080 మీటర్లు చేరుకోగలిగారు. నేపాల్‌లో ఆమె చేసిన మొదటి హిమాలయ పర్వతారోహణ ఇది. కాగా, తొలి నుంచి పర్వతారోహణపై మక్కువ ఉన్న రాధిక ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుని సాధించారు. ఒకవైపు గృహిణిగా, మరోవైపు సీఐడీ అధికారిణిగా, ఇంకోవైపు పర్వతారోహకురాలిగా మూడు పాత్రలు పోషించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరెస్ట్, కిలిమంజారో, కోసియోస్కో, ఎల్బ్రస్, అకాంకాగువా, దేనాలి, విన్సన్ పర్వతాలను అధిరోహించి ఆమె రికార్డు నెలకొల్పారు. తాజాగా నేపాల్‌లో పర్వతారోహణ చేసిన ఆమె తనను ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ, సీఐడీ, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అనంతపురం అమ్మాయి లోకాన్ని చుట్టేస్తోంది
అనంతపురం నుంచి సమీరా ఖాన్ అనే అమ్మాయి హిమాలయాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే నేపాల్‌లోని అమా దబ్లమ్ పర్వతాన్ని అధిరోహించింది. ఎవరెస్ట్‌ను అందరిలా నేపాల్ వైపు నుంచి కాక టిబెట్ వైపు నుంచి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. సైకిల్ మీద దేశంలోని ఈ మూల నుంచి ఆ మూలకు తిరిగేసిన సమీరా ఖాన్‌కు తల్లిదండ్రులు లేరు. కుటుంబ మద్దతు లేకపోయినా అమ్మాయిలు తాము అనుకున్నది సాధించగలరు అని ఎవరెస్ట్ శిఖరం మీద నుంచి అరచి చెప్పాలని ఉందని సమీరా అంటోంది. సమీరా ఖాన్ మన తెలుగమ్మాయి అయినా తెలుగువారి కంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. పర్వతాలు ఎక్కాలనే సంకల్పంతో తరచూ ఆవైపే తిరుగుతుంటుంది సమీరా. నేపాల్, టిబెట్‌లకు పక్కింటికి వెళ్లినట్టు వెళుతుంటుంది. ‘పర్వతాన్ని అధిరోహించడం ఏదో సరదా కాదు నాకు. అదొక జీవన విధానం’ అంటుంది సమీరా. అనంతపురంకు చెందిన సమీరా ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక సంస్థలో పని చేస్తోంది. కాని టైలర్‌గా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం మరణించాక ఆమె ఈ ప్రపంచమే తన ఇల్లు అనుకుంది. ఆమెకు తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు తల్లి చనిపోయింది. ఐదుమంది సంతానం లో చివరిదైన సమీరా ఇంటి నుంచి ఏ మద్దతు కోరకుండా ఒక్కదానిగా ఏదైనా సాధించాలనుకుంది. ‘నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. దేశంలో దాదాపు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ మీద ఒక్కదాన్నే తిరిగాను’ అంటుంది సమీరా. కాని ఆమెకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ‘నేను పదో క్లాసు వరకు చదువుకున్నాను. ఆ తర్వాత కుటుంబ అవసరాల కోసం బెంగళూరులో ఒక బి.పి.ఓలో పని చేశాను. ఒక్కదాన్నే ప్రపంచం చూడటం మొదలుపెట్టాక ధైర్యం వచ్చింది. సైకిల్ వేసుకొని ఒక్కదాన్నే చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్లి రావడం మొదలుపెట్టాను’ అంది సమీరా ఖాన్. ‘2014లో కశ్మీర్‌కు వరదలు వచ్చినప్పుడు వాలెంటీర్‌గా పని చేయడానికి వెళ్లాను. ఆ సమయంలో రెండు రోజులు ట్రెక్కింగ్ చేశాను. ధైర్యం వచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఉండాలో అర్థమైంది. పర్వతారోహణ మీద ఆసక్తి ఏర్పడింది. నేపాల్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దాదాపు 500 కిలోమీటర్ల ట్రెక్కింగ్ పూర్తి చేశాను. నా శక్తి ఇంకా పెరిగినట్టనిపించింది. నేపాల్‌లో, హిమాలయాల్లో ఉన్న నాలుగు పెద్ద పర్వతాలు ఎక్కాను. ఇక ఎవరెస్ట్ మిగిలింది. దానిని అందరూ సులువని నేపాల్ వైపుగా ఎక్కుతారు. ఏదో ఎక్కామంటే ఎక్కాం అని చెప్పడానికి ఎక్కడం ఎందుకు? నేను టిబెట్ వైపు నుంచి చాలా నైపుణ్యంతో సవాలుతో ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకున్నాను’ అంది సమీరా ఖాన్. ట్రెక్కింగ్, పర్వతారోహణలో సమీరా ఖాన్ ఆమె ఇంతవరకూ పర్వతారోహణలో ట్రైనింగ్ తీసుకోలేదు. లండన్ వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. దానికి రెండు మూడు లక్షలు కావాలి. ఎవరెస్ట్ అధిరోహణకు కూడా కొన్ని లక్షల ఖర్చు ఉంది. ‘నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఇంకొంత స్పాన్సర్షిప్ కావాలి. ప్రభుత్వాన్ని సంప్రదిస్తే పర్వతారోహణ ఒక క్రీడ కాదు అని చెప్పి పంపించేశారు. ఏం చేయాలి’ అంది ఈ సాహసి. ‘నాకు స్త్రీలు ఏదైనా సాధించగలరు అని చెప్పాలని ఉంది. ఈ సమాజంలో నా గొంతు వినిపించాలని ఉంది. ఎవరెస్ట్ అధిరోహించి, ఆ యోగ్యతతో నేను చెప్పాలనుకున్నది స్త్రీల తరఫున అరచి చెప్తాను’ అంటోంది సమీరా ఖాన్. ఆమె పట్టుదల చూస్తుంటే త్వరలోనే స్త్రీల తరఫున ఒక గట్టి గొంతు వింటాం. – సాక్షి ఫ్యామిలీ -
మలుపులే జీవితం
ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. ఎవరెస్ట్ అధిరోహణకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బీఎడ్‌లో సీటు పరీక్ష పెట్టింది. పాఠాలు చెప్పడంలో ఉన్న ఇష్టం.. పర్వతారోహణను పక్కన పెట్టించింది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్‌గా ఆమె దిశ మారింది. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పెళ్లితో ఆడవాళ్లకు కెరీర్ ఆగిపోకూడదని, భర్త బదిలీలతో పాటుగా కెరీర్‌ను మలుచుకోవాలన్నారామె. ఆ మలుపులే తనను మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా మార్చాయన్నారు. తను సమాజానికి ఎలా ఉపయోగపడాలని భగవంతుడు నిర్ణయించి ఉంటే... తన పయనం ఆ దిశగా సాగుతుందని నమ్ముతున్నారు రేఖారావు. బచేంద్రిపాల్ నేర్పించిన జీవిత జ్ఞానమే తనకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తోందని చెప్తున్నారు రేఖారావు. రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడం తో బాల్యం, చదువు జమ్షెడ్పూర్ లో సాగాయి. బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నది కూడా జమ్‌షెడ్‌పూర్‌లోనే. జేఆర్‌డి టాటా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’లో శిక్షణ తరగతులు నిర్వహించేవారు బచేంద్రిపాల్. టీనేజ్‌లో మెదడు మైనపుముద్దలా ఉంటుంది. అప్పుడు పడిన ముద్ర జీవితాన్ని నడిపిస్తుంది. బచేంద్రిపాల్ దగ్గర నేర్చుకున్నది పర్వతారోహణ మాత్రమే కాదు, సామాజిక జీవి అయిన మనిషి ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా మెలగాలనే జ్ఞానాన్ని కూడా. ఆ శిక్షణతోపాటు ఆర్మీ నేపథ్యం కూడా తన మానసిక వికాసంలో కీలకమేనంటారు రేఖ. ‘‘పర్వతారోహణ శిక్షణలో ఉన్నప్పుడు నాకు భారతీయత అర్థమైంది. మేము గురువు పాదాలకు నమస్కారం చేస్తాం. సాహసమే జీవితంగా భావిస్తాం. ఆడపిల్లలకు ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకనే మాట వినిపించేది కాదు. దేహం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మానసికంగా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు. సాహసోపేతమైన క్రీడలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలిగిన మంచి లక్షణం కూడా అబ్బుతుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఏవీ బాధించనంత గా పరిణతి వచ్చేస్తుంది. అలాగని వైరాగ్య జీవనమూ కాదు. జీవితం విలువ తెలుస్తుంది. బతికున్న ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపడం అలవడుతుంది. అందుకే పిల్లలకు ఆటలు లేని విద్యాభ్యాసాన్ని అంగీకరించలేను. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర టీచర్ దే. ప్రభుత్వ పాఠశాలను దత్తత ఇస్తే అద్భుతాలు చేయవచ్చని కూడా అనిపిస్తుంటుంది. నన్ను ఆహ్వానించిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇస్తున్నాను’’ అని చెప్పారు రేఖ. ఉత్తర శిఖరం.. దక్షిణాపథం కశ్మీర్‌లోని లేహ్, లధాక్, శ్రీనగర్, అమృత్సర్ నుంచి చంఢీఘర్, భటిండా, అస్సాం, నాసిక్, బెంగుళూరు కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాల్లో నివసించాను. మనదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యతతోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూడగలిగాను. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేయగలగడానికి అప్పటి సామాజిక అధ్యయనం చాలా దోహదం చేసింది. ప్రాంతం, భాష ఏదైనా సరే... ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఒకటే. మంచి పరిపాలన. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ఫలాల పట్ల నిశితమైన గమనింపు ఉంటుంది. చదువు రాని వాళ్లలో రాజకీయ చైతన్యం ఉండదని మేధావులు భావిస్తుంటారు. కానీ తమ ప్రయోజనాల గురించిన చైతన్యాన్ని కలిగి ఉంటారు. కరెంటు, టీవీ, రేడియో లేని కుగ్రామాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తమకు అవసరమైన మేరకు తెలుసుకుంటూనే ఉంటారు. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం మాత్రం తీవ్రంగా ఉంది. గ్రామాలనే కాదు, మహానగరాల్లోని బస్తీల్లో కూడా సమతులాహారం తినడం తెలియదు. ఎక్కువమంది ఒబేసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. బస్తీల్లో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్ ఇస్తున్నాను. కరోనా సమయంలో ఇంటికి పరిమితం కాకుండా ఎక్కడ సహాయం అవసరమైతే రాచకొండ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తూ ఒక వారధి గా పని చేశాను. బస్తీల్లో పదోతరగతి ఫెయిలయ్యి చదువు మానేసిన పిల్లలు ఎక్కువగా కనిపిస్తారు. ఆ పిల్లలు అసాంఘిక శక్తులుగా పరిణమించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న మనందరి మీదా ఉంది. చదువు మీద ఆసక్తి లేకపోతే బలవంతం వద్దు, నీకు ఏ పని చేయడం ఇష్టమో చెప్పు, నేర్పిస్తానని అడిగితే పిల్లలు చక్కగా ఓపెన్ అవుతారు. టైలర్ కావాలని ఉంటే అదే పని చేయాలి. వంట చేయడం ఇష్టమైతే అదే చేయాలి. ఏది చేసినా అందులో నువ్వే బెస్ట్ అనిపించుకునేటట్లు నైపుణ్యాన్ని సాధించాలి... అని చెప్పినప్పుడు పిల్లలతోపాటు ఆ తల్లిదండ్రులు కూడా ఒక దారి కనిపించినట్లు సంతోషపడతారు. ఇలా భగవంతుడు నాకిచ్చిన నైపుణ్యం ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్నాను’’ అన్నారు రేఖారావు. పర్వతారోహణ శిక్షణ అనంతరం బచేంద్రీపాల్ నుంచి సర్టిఫికేట్ అందుకుంటున్న రేఖ మైక్ పట్టుకుని కామెంటరీ ఇవ్వడం అంటే నాకు చెప్పలేనంత. ఎంతగా అంటే... పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్లో కామెంటరీ అవకాశం కోసం ఐదేళ్ల పాటు ప్రయత్నించి సఫలమయ్యాను. అలాగే హైకోర్టు వందేళ్ల వేడుకల్లోనూ కామెంటరీ ఇవ్వగలిగాను. ‘నాట్ పాజిబుల్’ అన్నవాళ్లే ఇప్పుడు ‘పలానా రోజు ప్రోగ్రామ్. కామెంటరీ ఇవ్వడానికి మీకు వీలవుతుందా’ అని అడిగినప్పుడు ఎవరెస్టును అధిరోహించినంతగా సంతోషపడ్డాను. అలాగే 150 దేశాల ప్రతినిధులు హాజరైన సభలో అన్నా హజారే, బబితా పోగట్ల ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో అనువదించడం కూడా నన్ను నేను గర్వంగా తలుచుకోగలిగిన క్షణాలు. – రేఖారావు స్కిల్ ట్రైనర్ – వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
ఎంబీబీఎస్ టు ఐపీఎస్
సాక్షి, సిటీబ్యూరో: ఆయన పేరు తరుణ్ జోషి... డాక్టర్ చదివినా 2004లో సివిల్ సర్వీస్ ఉత్తీర్ణులై ఐపీఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్‌కు సంయుక్త పోలీసు కమిషనర్ హోదాలో నేతృత్వం వహిస్తున్నారు. అదిలాబాద్ ఎస్పీగా పని చేస్తుండగా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నారు... రెండేళ్ళ కాలంలో ఐదు పర్వతాలను అధిరోహించారు... గత నెలలోనే అంటార్కిటికా, ఆస్ట్రేలియాల్లో ఉన్న రెండింటిపై పాద మోపారు... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా అనునిత్యం సాధన చేస్తున్న ఆయన విజయాలపై ప్రత్యేక కథనం.. ఎంబీబీఎస్ టు ఐపీఎస్ పంజాబ్‌కు చెందిన తరుణ్ జోషి పటియాలాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యుడిగా మారారు. 2004లో సివిల్ సర్వీసెస్ ఉత్తీర్ణులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఐపీఎస్ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉండి డీఐజీ హోదాలో సిటీ స్పెషల్ బ్రాంచ్‌కు నేతృత్వం వహిస్తున్నారు. ఓపక్క తన విధుల్ని సమర్థవంతంగా నిర్వరిస్తూనే... మరోపక్క ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఆరేళ్ళ క్రితం ఓయూ నుంచి పోలీస్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆపై ఎల్ఎల్బీలో చేరిన ఆయన గత ఏడాది జూలైలో ఉత్తీర్ణులు కావడమే కాదు... ఓయూలోనే టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. రాచకొండ నుంచే నాంది అదిలాబాద్ ఎస్పీగా పని చేసినన్నాళ్లూ పని ఒత్తిడి నేపథ్యంలో డార్జిలింగ్ వెళ్లడం ఆయనకు సాధ్యం కాలేదు. అక్కడ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సంయుక్త పోలీసు కమిషనర్‌గా వచ్చిన తరుణ్ తనలో ఉన్న పర్వతారోహణ ఆసక్తికి పదును పెట్టారు. 2017లో హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న ఆయన అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్ రీనాక్‌కు ఎక్కారు. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా పర్వతారోహణ చేస్తున్న ఆయన ఇప్పటి వరకు ఐదింటిపై తన కాలు మోపారు. అనునిత్యం ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఈయన పర్వతారోహణ కోసం అదనపు కసరత్తు చేస్తుంటారు. సమయం చూసుకుని ఎవరెస్ట్‌పై కాలు పెట్టడమే తన లక్ష్యమని తరుణ్ జోషి చెప్తున్నారు. అనుకోకుండా ఆసక్తి.. తరుణ్ జోషి 2014 నుంచి 2016 వరకు అదిలాబాద్ జిల్లా ఎస్పీగా పని చేశారు. అప్పట్లో అదనపు ఎస్పీ జి.రాధిక ఆ జిల్లాలోనే పని చేశారు. పర్వతారోహణపై పట్టున్న ఈమె అప్పట్లోనే కొన్నింటిని అధిరోహిస్తూ ఉండే వారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం తరుణ్ జోషిని కలిసే ఆమె తన పర్వతారోహణ అనుభవాలను పంచుకునే వారు. ఇలా అనుకోకుండా ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్న ఆయన తాను పర్వతారోహకుడిని కావాలని భావించారు. సంతృప్తితో పాటు మానసిక, శారీరక దారుణ్యాలకు ఇది ఉపకరిస్తుందనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని రాధికతో చెప్పగా... తొలుత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకోవాలని, ఆపై తుది నిర్ణయానికి రావాలని ఆమె సూచించారు. అదో చిత్రమైన అనుభూతి ఓ బృందంతో ఈ నెలలో అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌ను అధిరోహించా. దక్షిణ ధృవంలో ఉన్న అంటార్కిటికాలో ప్రస్తుతం 24 గంటలూ పగలే ఉంటుంది. దీంతో రెండు రోజుల పాటు నిద్రపోవడానికి, సమయం గుర్తించడానికి చాలా ఇబ్బంది పడ్డా. వాచీ చూసుకుంటే 11, 12 గంటలు చూపించేది. అది పగలో, రాత్రో తెలియక తికమక పడాల్సి వచ్చింది. ఆపై ఫోన్లో టైమ్‌ను 24 గంటల ఫార్మాట్‌కు మార్చుకుని.. రాత్రి అయిందని తెలుసుకుని నిద్రపోయే వాళ్ళం. సూర్యరస్మి కారణంగా గరిష్టంగా 3 గంటలకు మించి నిద్ర పట్టేదికాదు. అది పర్వతారోహణ పూర్తయిన వారంలోనే ఆస్ట్రేలియాలోని మరో పర్వతాన్ని అధిరోహించాం. తదుపరి టార్గెట్... మౌంట్ ఎవరెస్ట్.– డాక్టర్ తరుణ్ జోషి, సంయుక్త సీపీ, సిటీ ఎస్బీ తరుణ్ జోషి అధిరోహించిన పర్వతాలు... ♦ 2018 మేలో సదరన్ రష్యాలోని భారీ అగ్నిపర్వతమైన మౌంట్ ఎల్బ్రస్ను చేరుకున్నారు. సముద్ర మట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం యూరప్‌లోనే పెద్దది. ♦ 2019 జనవరిలో అర్జెంటీనాలో ఉన్న మౌంట్ ఎకనగ్వాపై అడుగుపెట్టారు. మెండౌజా ప్రావెన్సీలో ఉన్న దీని ఎత్తు 6962 మీటర్లు. దక్షిణ అమెరికాలోనే ఎత్తైనది. ♦ అదే ఏడాది ఆగస్టులో ఇండోనేషియాలో ఉన్న మౌంట్ కార్‌స్టెంజ్స్ ఎక్కారు. ఇది ప్రపంచంలోని మైదాన ప్రాంతంలో ఉన్న శిఖరాల్లో అతి పెద్దది. దీని ఎత్తు 4,884 మీటర్లు. ♦ ఈ నెల 21న అంటార్కిటికాలోనే అత్యంత ఎల్తైన మౌంట్ విన్సన్‌ను అధిరోహించారు. దీని ఎత్తు 4897 మీటర్లే అయినప్పటికీ.. మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్ర ప్రతికూల వాతావరణం ఉంటుంది. ♦ విన్సన్ అధిరోహించిన మూడు రోజుల్లోనే ఆస్ట్రేలియాలోని అత్యంత ఎత్తయిన మౌండ్ కోస్యూస్కోపై కాలు పెట్టారు. ఇది సముద్ర మట్టానికి 2280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. -
‘శిఖర’ సమానం
రాంగోపాల్‌పేట్: కొండ అద్దమందు కొంచమై ఉండదా.. అన్నాడు వేమన. కానీ, వీరి ఆత్మబలమందు శిఖరమే కొంచమైంది! మంచు కొండలు కరిగిపోతున్నా.. ఇంచు కూడా వెనుకడుగు వేయలేదు. ఎత్తువెళ్లే కొద్దీ ఆక్సిజన్ దొరక్క ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని టెన్షన్ ఉన్నా ఆత్మవిశ్వాసమే శ్వాసగా.. హిమశిఖరం అధిరోహించారు. భాగీరథ–2 పర్వతాన్ని 18,000 అడుగుల మేర ఎక్కి ‘దివ్య’ మైన చరిత్ర సృష్టించారు. దివ్యాంగులు ఎవరికీ తీసిపోరని నిరూ పించారు. సాహసంలోనూ వారిది సహవాసమే. పర్వతారోహణను పూర్తిచేసుకుని మంగళవారం తెల్లవారుజామున నగరానికి చేరుకు న్నారు. వారికి గోపాలపురం పోలీసులు ఘనస్వాగతం పలికారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిన తెలుగుతేజాలైన షేక్ అర్షద్(26), ఆర్యవర్ధన్(17)లపై ప్రత్యేక కథనం... కాలు లేదని కుంగి పోలేదు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇస్మాయిల్, మోసిమ్ల కుమారుడు షేక్ అర్షద్(26). 2004 సంవ త్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు మోకాలి పైవరకు పోయింది. అయినా కుంగిపోకుండా డిగ్రీ చేశాడు. ఇటీవల ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ ప్యారా హ్యాండ్ సైక్లింగ్ పోటీల్లో 4వ స్థానంలో నిలిచాడు. సరూర్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల ఆర్య వర్ధన్ డిగ్రీ చదువుకున్నాడు. నాలుగేళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. ఆటోలో వస్తుండగా కింద పడ్డాడు. కుడికాలు నుజ్జు్జకావడంతో మోకాలి పైవరకు తీసేశారు. తండ్రి లేడు. తల్లి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మనవాళ్లే.. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సహకారంతో బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వెంచర్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లో అర్షద్, ఆర్యవర్ధన్ నాలుగేళ్లు కలిసే శిక్షణ తీసుకున్నారు. వీరి కోసం ఖరీదైన కృత్రిమ కాలును తయారు చేయించారు. బీఎస్ఎఫ్ శిక్షణ పొందారు. దేశవ్యాప్తంగా మొత్తం ఆరుగురు ప్యారాఅథ్లెట్స్ను పర్వతారోహణకు ఎంపిక చేయగా వారిలో వీరిద్దరు ఉన్నారు. ఈ ఆరుగురు ఆగస్టు 10న ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి పర్వతారోహణ ప్రారంభించారు. వీరిలో నలుగురు అథ్లెట్స్ 21,365 అడుగుల ఎత్తుండే భాగీరథ శిఖరాన్ని అదిరోహించారు. కానీ ఆర్యన్, అర్షద్‌లకు తీవ్రమైన ప్రతికూల వాతారణ పరిస్థితులు ఎదురుకావడంతో ఆగస్టు 27వ తేదీనాటికి భాగీరథ పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేర అధిరోహించారు. పర్వతాన్ని 18,000 అడుగుల ఎత్తు మేరకు ఎక్కిన తెలుగు దివ్యాంగులుగా చరిత్ర సృష్టించారు. 16కి.మీ. ఒకేరోజు నడిచాం: అర్షద్ గతంలో నేను ఎప్పుడూ 3 కి.మీ.ల కంటే ఎక్కు వగా నడవలేదు. పర్వతారోహణలో ఒకేరోజు 16 కి.మీ. ఏకధాటిగా నడిచా. ప్రొస్తటిక్ లింబ్‌తో దీన్ని పూర్తి చేయగలిగాను. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చాయి. ఒక మృతదేహం కనిపించినా భయపడలేదు. పైకి వెళ్తుంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించేది. 13కేజీల బరువుతో: ఆర్యవర్ధన్ జీవితంలో ఇలాంటి ప్రదేశాలు చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. హిమపాతాలు, బండరాళ్లు, నదులు, మంచుపగుళ్లు, వడగళ్లు, భారీ వర్షాలు ఎన్నెన్నో అనుభవాలు ఎదుర య్యాయి. 12 నుంచి 13 కిలోల బరువున్న బ్యాగులు భుజానికి తగిలించుకుని ముందుకు సాగాం. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అది రోహించడానికి మానసికంగా సిద్ధమయ్యాను. 2020లో ఎవరెస్ట్‌ను అధిరోహిస్తాం 2020 సంవత్సరంలో 12 మంది ప్యారా అథ్లెట్స్‌కు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేదికు సిద్ధం చేస్తాం. దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే ఏదైనా సాధిస్తారనేది నిరూపిస్తాం. – ఆదిత్య మెహతా, ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
చిన్నారి శిఖరం
పర్వతారోహణ ఒక సాహసం. సాహసం కన్నా కూడా ఒక దుస్సాహసం. ఇంకా చెప్పాలంటే అదొక జీవన్మరణ ప్రయత్నం. ‘ఆడపిల్ల ఇంత సాహసానికి ఒడిగట్టడం అవసరమా’ అని తన గ్రామంలో ఎవరైనా అంటే.. ‘‘ఆ సాహసమే చేయకపోతే అందరిలో ఒకమ్మాయిగా ఉండిపోయేదాన్ని. ఆ సాహసమే నన్నీ రోజు అరుదైన కొందరిలో ఒక అమ్మాయిగా నిలబెట్టింది. ఎందరో అమ్మాయిలకు నన్ను రోల్ మోడల్ని చేసింది’’ అంటుంది మలావత్ పూర్ణ. ‘అమ్మాయి అనే కారణంగా ఎవరూ తమకొచ్చిన అవకాశాలను, తమ ఆశయాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని చేరడానికి అమ్మాయిగా పుట్టడం అనేది అడ్డంకి కాబోదు’ అని నిరూపించింది పూర్ణ. ‘సంకల్పబలం ముందు పేదరికం పక్కకు తప్పుకుంటుంది’ అంటున్నప్పుడు ఆమె కళ్లలో కనిపించిన ఆత్మవిశ్వాసం శిఖర సమానం అనిపించింది. అందుకే పూర్ణ.. ఒక చిన్నారి శిఖరం. మలావత్ పూర్ణది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పాకాల గ్రామం. ఎనిమిది వందల జనాభా కూడా లేని ఓ కుగ్రామం. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి వరకు చదివింది. ఆరవ తరగతి నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకుంటోంది. ఇప్పుడు కామారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీ.ఎ. రెండవ సంవత్సరం చదువుతోంది. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్‌కి ప్రిపేరవ్వాలనేది ఆమె కెరీర్ ప్లాన్. తానీరోజు నడుస్తున్న విజయమార్గానికి తొలి అడుగులు వేయించింది అమ్మానాన్నల ముందుచూపే అంది పూర్ణ. ‘‘మమ్మల్ని (పూర్ణ, ఆమె అన్న నరేశ్) చదివించాలని అనుకోక పోయి ఉంటే ఈ రోజు ఈ సక్సెస్ మా ఊహకు కూడా అందేది కాదు. మా బంజారా తండాల్లో నా వయసు అమ్మాయిలు పెళ్లి చేసుకుని పిల్లల తల్లులయి ఇంటి బాధ్యతల్లో మునిగిపోయి ఉన్నారు. మా నాన్న కల మమ్మల్ని చదివించాలని. నాన్న కలను అమ్మ గౌరవించింది. ఆరవ తరగతిలో వాళ్లు మమ్మల్ని హాస్టల్‌కి పంపించడం వల్లనే నేను కొత్త ప్రపంచాన్ని చూడగలిగాను. మా నాన్న ఆరేడు కిలోమీటర్ల దూరం సైకిల్ మీద వెళ్లి ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాడు. తనకు చదువు లేదు, మేము చదువుకుంటే చూడాలనుకున్నాడు’’ అంటూ తాను మౌంటనీర్ కావడానికి దారి తీసిన సంఘటనలను పంచుకుంది పూర్ణ. అప్పుడు ఎయిత్ క్లాస్ ‘‘నేను ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ శాఖ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో చదువుకునే పిల్లల పట్ల సమాజంలో ఉన్న చిన్న చూపును తుడిచేయాలనుకున్నారాయన. ‘ఈ పిల్లలు దేనిలోనూ వెనుకబడరు, అవకాశాలు కల్పించి, ప్రోత్సహిస్తే దేన్నయినా సాధించి తీరుతారు, శిఖరాలను చేరుతారు’ అని సమాజానికి చెప్పాలనుకున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కోసం రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకూ సర్క్యులర్ పంపించారు. నేను స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉండేదాన్ని. ఆల్‌రౌండర్‌గా ఉండడంతో మా స్కూల్ నుంచి నా పేరు కూడా పంపించారు. అలా సెలెక్ట్ చేసిన నూట పదిమంది స్టూడెంట్స్‌ని భువనగిరికి రాక్ క్లైంబింగ్‌కి తీసుకెళ్లారు. అందులో అర్హత సాధించిన పదిమంది అమ్మాయిలు, పదిమంది అబ్బాయిలను పేరెంట్స్ నుంచి అంగీకారం తీసుకున్న తర్వాత స్పెషల్ కోచింగ్‌కి డార్జిలింగ్కి తీసుకెళ్లారు. కోచింగ్ తర్వాత పదిహేను వేల అడుగుల ఎత్తున్న రినాక్ పీక్‌కి చేరుకున్నాను. అది నా తొలి రికార్డు. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న పిల్లల కేటగిరీలో ఆ రికార్డు వచ్చింది. అప్పటి వరకు ఎవరెస్టు ఆలోచన లేదు. ఆ రికార్డు తర్వాతనే ప్రవీణ్ సర్కి ఎవరెస్టు అధిరోహణలో కూడా వీళ్లు విజయవంతం అవుతారని ఎందుకు నిరూపించకూడదు అనిపించింది. ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్ కోసం లధాక్ (3,000 మీటర్లు), స్టోక్ కాంగ్రి (ఎత్తు 6,153 మీటర్లు) పర్వతాలలో ప్రాక్టీస్ చేశాం. 2013 ఇలా ప్రిపరేషన్లో గడిచింది. ఎవరెస్టు శిఖరాన్ని 2014లో ఎక్కాను. అప్పుడు నేను నైన్త్ క్లాస్. నేపాల్‌కు దారి లేదు ఆ ఏడాది వాతావరణం ఏ మాత్రం అనుకూలించలేదు. మంచు చరియలు విరిగిపడడంతో రూట్ ఓపెన్ చేయడానికి వెళ్లిన 17 మంది షెర్పాలు (పర్వతారోహణ సహాయకులు) ప్రాణాలు కోల్పోయారు. దాంతో నేపాల్ వైపు నుంచి దారి మూసేసి, ఆ ఏడాదికి నిషేధం విధించారు. మేము చైనా వైపు నుంచి వెళ్లాం. నా బరువు 45 కిలోలు. మేము మోసుకెళ్లే బ్యాగ్ బరువు 15 కిలోలు. అదేమీ ఇబ్బంది కాలేదు, కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఇబ్బంది పెడుతుంది. ఆక్సిజన్ అందక తలనొప్పి, వాంతులు వచ్చాయి. రెస్ట్ కోసం రెండు రోజులు బేస్ క్యాంపుకి పంపేశారు. అడ్వాన్స్డ్ బేస్ క్యాంపునకు చేరిన తర్వాత మళ్లీ సిక్నెస్ వచ్చింది. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత నార్మల్ అయ్యాను, తీసేస్తే వాంతులయ్యేవి. వాతావరణం సహకరించక పది రోజులు బేస్ క్యాంపులో ఉండాల్సి వచ్చింది. అయితే... అవేవీ భయపెట్టవు. మౌంటెనీరింగ్‌కి దేహం కంటే మైండ్ ఫిట్‌గా ఉండాలి. మానసిక స్థైర్యమే ముందుకు నడిపిస్తుంది. అయినప్పటికీ ఒక సంఘటన నాలో వణుకు పుట్టించింది. డ్రస్ కాదది! ఎవరెస్ట్‌ను చేరే క్రమంలో సంభవించే మరణాల్లో ఎక్కువ భాగం మూడవ క్యాంపు తర్వాతనే. నా జర్నీలో స్టెప్ త్రీ దాటిన తర్వాత మరో ఇరవై నిమిషాల్లో శిఖరాన్ని చేరుతాననగా, ఆరెంజ్ కలర్లో ఉన్న డ్రస్ ఒకటి కనిపించింది. పక్కనే ఉన్న షెర్పాతో ‘ఎందుకిలా డ్రస్‌ని ఇక్కడ వదిలేశారు’ అని అడిగాను. ‘డ్రస్ కాదు, డెడ్ బాడీ’ అన్నారు షెర్పా. పరిశీలనగా చూస్తే... బోర్లా తిరిగి ముడుచుకుని పడుకున్నట్లుగా ఉంది బాడీ. అప్పుడు వణికి పోయాను. వెంటనే నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ‘అమ్మాయిలు గెలవగలరని సమాజానికి చెప్పాలని ఇంతదూరం వచ్చాను. పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించాలనేది నా మెంటార్ ప్రవీణ్ సర్ కల. నేను గెలిచి రావాలని ఎదురు చూసే వాళ్లు చాలా మంది ఉన్నారు. నేను ఓడిపోకూడదు, వెనుకడుగు వేయకూడదు’ అని కౌన్సెలింగ్ ఇచ్చుకుని, అందరిలాగానే డెడ్‌బాడీకి దణ్ణం పెట్టుకుని ముందుకు అడుగేశాను. ఎవరెస్టు ఆరోహణలో చివరి రోజు రాత్రి కాళ్లకు శవాలు తగులుతూ, ఒళ్లు గగుర్పొడిచేది. మూడవ క్యాంపు కంటే ముందయితే షెర్పాలు పర్వతారోహకులను రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మూడవ క్యాంపు తర్వాత రక్షించడం సాధ్యమయ్యే పని కాదు. సంతోషంతో కన్నీళ్లు ఎవరెస్టు శిఖరాన్ని చేరిన తరువాత ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్లు ఉంది. ఓ పది నిమిషాల సేపు ఫొటోలు తీసుకుంటూ గడిపేశాం. ఎటు చూసినా మనుషులు కనిపించే వాతావరణం నుంచి ఎటు చూసినా మంచు పర్వతాలే కనిపించే శిఖరం మీద ఉన్నాం... అనే భావనను చెప్పడానికి పదాలు దొరకవు. నాకు తెలిసిన పదాల్లోనే ప్రతి జ్ఞాపకాన్నీ డైరీ రాశాను. ఏడు శిఖరాల ఆరోహణ పూర్తయిన తర్వాత పుస్తకం రాస్తాను. ఏడు శిఖరాల ఆలోచన మొదట్లో లేదు. ఎవరెస్టును సాధించిన తరువాత కలిగింది. ఎవరెస్టు తర్వాత మరో మూడు శిఖరాలను అధిరోహించాను. మొదటగా ఎల్తైన శిఖరాన్ని చేరడంతో కావచ్చు అదే తీపిగుర్తుగా ఉండిపోయింది. మిగిలినవి ప్రయాణంలో మైలురాళ్లుగా అనిపిస్తున్నాయి. నా విజయానికి బహుమతిగా ప్రభుత్వం పాతిక లక్షల డబ్బు, ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు, చదువుకి అయ్యే ఖర్చు కూడా శాంక్షన్ చేసింది. స్పానిష్ నచ్చింది ఎవరెస్టు అధిరోహణకు ప్రభుత్వమే స్పాన్సర్ చేసింది. మిగిలిన వాటికి ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ మౌంటెనీరింగ్, ట్రెక్కింగ్ సర్వీసెస్ వాళ్లు స్పాన్సర్ చేస్తున్నారు. మాతోపాటు ఎవరెస్టు ఆరోహణలో కోచ్ శేఖర్‌బాబు కూడా ఉన్నారు కాబట్టి భాష ఇబ్బంది కాలేదు. శిఖరాధిరోహణలో నాకు ఎదురైన మనుషుల్లో అర్జెంటీనా వాళ్లు బాగా నచ్చారు. స్పానిష్, నేపాలీ భాషలు నచ్చాయి. నాకిప్పుడు బంజారా, తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలు వచ్చు. స్పానిష్, నేపాలీ భాషలు కూడా నేర్చుకుంటాను’’ అంటూ పరిపూర్ణంగా నవ్వింది మలావత్ పూర్ణ. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : శివ మల్లాల అందరి బడి ప్రవీణ్ సర్ నా రోల్ మోడల్. ఆయనలాగే సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్‌లు చేయాలని కోరిక. ప్రభుత్వం పేద ప్రజల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకునేటట్లు చూడాలి. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకంటే మెరుగ్గా తయారుచేస్తాను. గవర్నమెంట్ స్కూల్ పేదవాళ్ల బడి అనే దురభిప్రాయాన్ని పోగొట్టి, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేటట్లు మెరుగుపరుస్తాను. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే మాట... ‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. ఎవరెస్టు మీదకే కాదు అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు. ఒకరి ఆసరా కోసం ఎదురు చూడవద్దు. మీ శక్తిని మీరు తెలుసుకోండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువుని నిర్లక్ష్యం చేయవద్దు’. – మలావత్ పూర్ణ, మౌంటనీర్ ఈ రికార్డు చెరిగిపోదు పూర్ణ మలావత్.. ఎవరెస్టును అధిరోహించిన భారతీయుల్లో అత్యంత చిన్న వయస్కురాలు. ఎవరెస్టు శిఖరం మీద అడుగుపెట్టే నాటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాల పదకొండు నెలలు. ఈ రికార్డు కొంతకాలం డిక్కీ దోల్మాకు ఉండేది. డోల్మా 1974లో పుట్టారు, 1993లో ఎవరెస్టును అధిరోహించారు. అప్పటికి ఆమె వయసు 19. అప్పటి నుంచి 2003 వరకు పదేళ్ల పాటు ఆమెదే రికార్డు. 2003లో 15 ఏళ్ల మింగ్ కిపా ఆ రికార్డును బ్రేక్ చేసింది. కిపా పేరుతో ఆ రికార్డు 2010 వరకు కొనసాగింది. ఆ ఏడాది అమెరికాకు చెందిన పదమూడేళ్ల పది నెలల కుర్రాడు జోర్డాన్ రోమెరో సొంతం చేసుకోగా 2014, మే నెల 25వ తేదీన పూర్ణ కొత్త రికార్డును రాసుకుంది. ‘యంగెస్ట్ ఇండియన్, యంగెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ స్కేల్ మౌంట్ ఎవరెస్ట్’ రికార్డులు పూర్ణ సొంతం చేసుకుంది. పూర్ణకు కలిసి వచ్చిన మరో అంశం ఏమిటంటే... ఎవరెస్టును అధిరోహించడానికి కనీస వయసును నేపాల్ 16 ఏళ్లకు, చైనా 18 ఏళ్లకు పెంచేశాయి. ఈ నిబంధన ప్రకారం ఇక ఇంకా చిన్న వయసు వాళ్లెవరూ ఎవరెస్టును అధిరోహించడానికి వీలుకాదు. కాబట్టి పూర్ణకు ఈ రికార్డు ఎప్పటికీ అలాగే ఉంటుంది. పూర్ణ చేరిన శిఖరాలు 2014 : ఆసియాలో ఎవరెస్టు (29 వేల అడుగుల ఎత్తు) 2016 : ఆఫ్రికాలో కిలిమంజారో (19 వేలకు పైగా అడుగులు) 2017 : యూరప్‌లో ఎల్బ్రస్ (18 వేల ఐదొందల అడుగులు) 2019 : సౌత్ అమెరికాలో అకాంకగువా (దాదాపు 23 వేల అడుగులు) (పూర్ణ ఈ నెల 14వ తేదీన అకాంకగువా శిఖరారోహణ పూర్తి చేసి, 21వ తేదీన ఇండియాకి తిరిగొచ్చింది) -
ప్రపంచ రికార్డు సాధించిన పూర్ణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ రికార్డులు మీద రికార్డులు సాధిస్తోంది. చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ తాజాగా మరో ప్రపంచ రికార్డు సాధించింది. శుక్రవారం అర్జెంటీనాలోని అకాన్కాగో శిఖరాన్ని(6,962 మీటర్లు) అధిరోహించింది. ఇప్పటివరకు ఆమె నాలుగు ఖండాలలోని నాలుగు ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా ఆమె ప్రపంచ రికార్డు సృష్టించింది. అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన అనంతరం పూర్ణ మాట్లాడుతూ తెలంగాణ, ఇండియా గర్వపడేలా ప్రపంచంలో ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని పేర్కొంది. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపింది. ‘ఎవరెస్ట్ కంటే అకాన్కాగో అధిరోహించడం చాలా కష్టతరంగా అనిపించింది. అప్పుడు ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలన్న స్వేరోస్ టెన్ కమాండ్మెంట్స్ గుర్తు చేసుకున్నాను. ఇప్పటివరకు ఎవరెస్ట్(ఆసియా), కిలిమంజారో(ఆఫ్రికా), ఎల్బ్రూస్(యూరప్), అకాన్కాగో(దక్షిణ అమెరికా) పర్వతాలు అధిరోహించాను. ఇకముందు డెనాయ్(నార్త్ అమెరికా), విన్సన్ మసిఫ్(అంటార్కిటికా), కాస్కిజ్కో(ఆస్ట్రేలియా) పర్వతాలను అధిరోహించడమే నా ధ్యేయం’అని తెలిపింది. గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ చిన్న వయసులో పూర్ణ ఇలాంటి ఘనత సాధించడం చాలా గొప్పవిషయమని, ఆమె సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. -
శిఖరాన చేనేత
చేనేత గొప్పతనాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లేందుకు చీరలు, చేనేత వస్త్రాలు ధరించి ఆస్ట్రేలియాలోని కొసియోస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి వచ్చిన ఈ ఐదుగురు పర్వతారోహకులు.. చేనేత కార్మికుల దైనందిన జీవన సాహస యాత్రలో పోలిస్తే తమదసలు కష్టమే కాదని అంటున్నారు. ట్రెకింగ్, మౌంటెనీరింగ్.. సాహసక్రీడలు. మగవాళ్లు వాటిని హాబీగా మలుచుకుంటే హీరోలుగా అభివర్ణిస్తుంది లోకం. మహిళలు ట్రాక్‌సూట్ వేసుకుంటే ‘ఇదేం పోకడ’ అంటూ పెదవి విరుస్తుంది. అదీ పెళ్లయి, పిల్లలు పుట్టాక ఈ అభిరుచికి ప్రాక్టికల్ రూపమిస్తామంటే హవ్వ అంటూ బుగ్గలు నొక్కకుంటుంది. ఇవన్నీ ఎదుర్కొన్నారు వీళ్లు. లక్షల్లో డబ్బునూ ఖర్చుపెట్టుకున్నారు. ట్రాక్‌సూట్ కాదు.. చీరకుచ్చిళ్లను బొడ్లో దోపుకొని మరీ 7,310 అడుగుల ఎత్తున్న కొసియోస్కో పర్వతాన్ని అధిరోహించారు. సరదా కోసం కాదు. తెలుగు నేతకు చేయూతనివ్వడానికి! మన చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి! ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ.. టాప్ ఆఫ్ మౌంట్ కొసియోస్కో’ థీమ్‌తో జరిగిన ఈ అధిరోహణలో రాజీ, లావణ్య, సృజన, హసిత, సమన్యు పాల్గొన్నారు. ఈ టీమ్‌లో అందరికన్నా చిన్నవాడు సమన్యు. ఏడేళ్లు. పిన్న వయసు పర్వతారోహకుడిగానూ (కిలిమంజారో) వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఒకరికి ఒకరు ఎలా పరిచయం? ఈ బృందానికి నాయకత్వం వహించిన రాజీ ప్రొఫెషనల్ మౌంటెనీర్. ఈమె చిన్ననాటి స్నేహితురాలే లావణ్య. ఉన్నత చదువులు, పెళ్లితో ఈ ఇద్దరి దారులు వేరయ్యారు. కూతురి కోసం తనూ పర్వతారోహకురాలిగా మారిన లావణ్య మౌంటెనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చిన్నప్పటి ఫ్రెండ్ రాజీని కలుసుకుంది. జీవితంలోని మంచిచెడ్డలతోపాటు మౌంటెనీరింగ్ గురించీ మాట్లాడుకున్నారు. పెళ్లి, పిల్లలతో ఒళ్లుచేసిన తాను మౌంటెనీ రింగ్ చేయగలనా అన్న లావణ్య సందేహాన్ని పటాపంచలు చేస్తూ ధైర్యాన్నిచ్చింది రాజీ. అంతకుముందే ఇతర పర్వతారోహణలో సృజనతో పరిచయం ఉంది రాజీకి. అలా వీళ్లంతా ఒక ఫ్యామిలీలా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశారు. ఆ టైమ్‌లోనే వీవర్స్ కష్టనష్టాల గురించి విన్నది రాజీ. వాళ్లకు ఏదైనా సాయం చేయాలనుకుంది. లావణ్య, సృజనలతో చెప్పింది. అందరూ కలిసి సిద్దిపేట, నారాయణ్‌పేట, గద్వాల, పొచంపల్లి వెళ్లారు. గ్రౌండ్ వర్క్ చేశారు. నేయడమూ నేర్చుకున్నారు. రాజీ అయితే ఓ డాక్యుమెంటరీ కూడా తీసింది. ఈ నాలుగు ప్రాంతాలకు ప్రాతినిధ్యంగా నలుగురు నాలుగు చీరలను తీసుకున్నారు. రాజీ, లావణ్య, సృజన చీరలు కట్టుకుంటే గద్వాల చీరను మ్యాక్సిలా హసితకు, పోచంపల్లి కుర్తాను సమన్యుకి కుట్టించారు. దేశం హద్దులు దాటి ప్రపంచ పర్వతాల మీద ఈ నేతను రెపరెపలాడించాలనుకుని ఆస్ట్రేలియాలోని కొసియోస్కొ పర్వతం అధిరోహించారు. మామూలుగా ట్రాక్ సూట్లో అయితే ఆరుగంటల్లో ఎక్కి దిగొచ్చు ఈ పర్వతాన్ని. చీరలో కాబట్టి వీళ్లకు పదిగంటలు పట్టింది. భవిష్యత్‌లోనూ దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. చీరలు కట్టుకుని పర్వతం ఎక్కిన ప్పుడు ఫారిన్ మౌంటెనీర్స్ వీళ్లను ఆసక్తిగా గమనించి, దగ్గరకు వచ్చి ఆ చీరల గురించి, ఫ్యాబ్రిక్ గురించి, అవి ఎక్కడ దొరుకుతాయో అడిగి మరీ తెలుసుకున్నారట. అలా తమ మోటో, పర్పస్ సర్వైవ్ అయింది అంటున్నారు రాజీ. ‘‘యాక్చువల్‌గా యూత్‌లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్‌ను బిల్డప్ చేయడానికి మౌంటెనీరింగ్‌ను ప్రమోట్ చేస్తున్నాం. దాంతోపాటు చేనేతనూ థీమ్‌గా తీసుకున్నాం. యువత చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతోంది. ఆత్మహత్య దాకా వెళ్తోంది. ఆ టెండెన్సీని పోగొట్టి వాళ్లలో ధైర్యం నింపాలన్నదే మా లక్ష్యం. మౌంటెనీరింగ్ వల్ల.. మనకున్న సమస్యలు చాలా చిన్నగా కనిపిస్తాయి. వీటిని మనం ఇంత పెద్దగా చూస్తున్నాం అనిపిస్తుంది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఉండే గుణం అలవడుతుంది. ముందసలు ‘వాట్ పీపుల్ విల్ సే’ అన్న థాట్‌కే చెక్ పెట్టే అటిట్యూడ్ అలవడుతుంది. దీనివల్ల లైఫ్‌లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా గాభరాపడం. చాలెంజ్గాతీసుకుంటాం. స్పోర్టివ్‌గా ఉంటాం. ఇది మేం ఎక్స్‌పీరియెన్స్ అవుతున్నాం కూడా! మౌంటెనీ రింగ్‌లో విమెన్‌కు స్పెషల్ చాలెంజెస్ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ వాష్ రూమ్స్ ఉండవు. మెన్స్ట్రు వల్ సైకిల్ ఉంటుంది. ఇలాంటి ఆడ్ సిట్యువేషన్స్ అన్నిటినీ తట్టుకునే శక్తిని అలవాటు చేస్తాయి. షైని తగ్గించి కలివిడితనాన్ని పెంచుతాయి. మొత్తంగా స్ట్రాంగ్ అండ్ స్టబర్స్ పర్సనాలిటీ తయారవుతుంది’’ అంటారు రాజీ. మంచి షెఫ్‌ని అవుతా రాజీ ఆంటీ వాళ్లు ట్రెడిషనల్ క్యాస్టూమ్స్ వేసుకొని కొసియోస్కో వెళ్దామని చెప్పినప్పుడు అబ్బా... ఎందుకు అనిపించింది. కాని వాళ్లతోపాటు వీవర్స్ దగ్గరకు వెళ్లి డే టు డే లైఫ్‌లో వాళ్లు ఫేస్ చేస్తున్న హర్డిల్స్ చూసినప్పుడు వాళ్లకోసం ఏదైనా చేయాలనిపించింది. బేసిగ్గా నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. మౌంటెనీరింగ్ కంటే కూడా డ్యాన్స్, కుకింగ్ అంటే ఎక్కువ ఇష్టం. పెద్దయ్యాక మంచి షెఫ్ కావాలనుకుంటున్నా. ఆస్ట్రేలియాలో కొసియోస్కో దగ్గర రెస్టారెంట్ పెట్టాలనుంది. అక్కడ గైడ్‌తో మాట్లాడేసుకున్నా కూడా (నవ్వుతూ). – హసిత నాన్న డ్యాన్స్ చేశారు అక్క, అమ్మ వాళ్లతో ఫస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు వెళ్లా. తర్వాత రాజీ ఆంటీతో కిలిమంజారో ఎక్కాను. కిలిమంజారో ఎక్కిన అందరికన్నా యంగెస్ట్ కిడ్ నేనే అని తర్వాత తెలిసింది నాకు. స్కూల్లో నా ఫ్రెండ్స్ అంతా హ్యాపీగా ఫీలయ్యారు – పేపర్లో నీ పేరు వస్తుందిరా అని. టీచర్స్ క్లాప్స్ కొట్టించారు. నాన్నేమో ఎయిర్‌పోర్ట్‌లోనే డ్యాన్స్ చేసేశాడు. తాతయ్యేమో ఫైవ్ థౌజెండ్ పెట్టి సైకిల్ కొనిచ్చారు. కొసియోస్కో ఎక్కేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశా. పెద్దయ్యాక కూడా మౌంటెనీరింగ్ కంటిన్యూ చేస్తా. – సమన్యూ నమ్మినదాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి నేను ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్‌ని.అరుణిమ సిన్హా (కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ ఎక్కిన పర్వతారోహకురాలు) ఇన్స్పిరేషన్తో మౌంటెనీర్నయ్యా. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. హ్యాండ్లూమ్స్ ప్రమోషన్ కోసం చీరలతో మౌంటెనీరింగ్ చేద్దామన్న రాజీ థాట్ నచ్చడంతో ఆస్ట్రేలియా కొసియోస్కో ప్లాన్ చేసుకున్నాం. సక్సెస్ అయ్యాం. మా ఈ టూర్ వల్ల చేనేత కార్మికుల జీవితాల్లో రాత్రికిరాత్రే మార్పు రాకపోవచ్చు. కాని వాళ్ల కళను, కష్టాన్ని ప్రపంచానికి చాటామన్న సంతృప్తి మిగిలింది. మౌంటెనీరింగ్. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేయకుండా కొండలు గుట్టలు పట్టుకు తిరుగు తోందని తెలిసినవాళ్లు చాలా కామెంట్సే చేస్తుంటారు. పెళ్లి చేయకుండా ఏంటీ ఇదంతా అని మా పేరెంట్స్ మీదా ప్రెజర్ ఉంటోంది. విని నవ్వుకోవడమే. లిజన్ టు యువర్ సెల్ఫ్ డోంట్ లిజన్ టు సొసైటీ.. మౌంటెనీరింగ్ నేర్పిన లెసన్, పెరిగిన సెల్ప్ కాన్ఫిడెన్స్ ఇది. – సృజన మా పాప వల్లే..! నేను, మావారు ఇద్దరం బిజినెస్ ఫీల్డ్‌లోనే ఉన్నాం. నిజానికి మౌంటెనీరింగ్ వంటివన్నీ నా కప్ ఆఫ్ టీ కాదు. మా అమ్మాయి (హసిత)కి తోడుగా మౌంటెనీరింగ్‌కి వెళ్లాల్సి వచ్చింది. మౌంటెనీరింగ్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికి ఇన్స్టిట్యూట్కి మాతో పాటు మా బాబునూ (సమన్యు) తీసుకెళ్లేదాన్ని. వాడూ ఇంట్రెస్ట్ చూపడంతో ఫిట్నెస్ టెస్ట్ చేశారు. అట్లా మావారు తప్పించి మా ఫ్యామిలీ అంతా మౌంటెనీరింగ్ స్టార్ట్ చేశాం (నవ్వుతూ). మా ఫస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్. తర్వాత కిలిమంజారో ఎక్కాం. మా పాప వల్ల వచ్చి ఇలా కంటిన్యూ అవుతున్నా. దీనివల్ల కనిపించే ప్రాఫిట్ ఏమీ ఉండదు. పైనుంచి ఖర్చు. కాబట్టి చూసేవాళ్లకు ఇదంతా పిచ్చిగానే అనిపిస్తోంది. కాని మౌంటెనీరింగ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్ వేరు. దేన్నయినా ఎదర్కోగలమనే ధైర్యం వచ్చింది. ఫిట్నెస్ పెరిగింది. మొన్న ట్రిప్‌లోనే ఎయిట్ కేజెస్ తగ్గా. – లావణ్య వీవర్స్ ముందు మనమెంత? మా తమ్ముడు భరత్ మౌంటెనీర్. నాకు అక్రోఫోబియా (ఫియర్ ఫర్ హైట్స్). ఒకసారి తమ్ముడితో కలిసి మౌంటెనీరింగ్‌కు వెళ్లా. హైట్స్ æ భయం పోయి అప్పటి నుంచి నాకూ మౌంటెనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది.అంతకుముందు కార్పొరేట్ ఫీల్డ్‌లో వర్క్ చేసేదాన్ని. ఫైవ్ ఇయర్స్ కిందట మౌంటెనీర్గా జర్నీ స్టార్ట్ చేశా. ఆడపిల్లలు కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలని అలాగే పెంచారు మా నాన్న. మా సొంతూరు కర్నూలు. ఎక్స్పోజర్ ఉండాలని నన్ను హైదరాబాద్‌లో, హాస్టల్లో ఉంచి చదివించారు నాన్న. లోకజ్ఞానం వచ్చేవరకే ఆయన నన్ను హాస్టల్లో దింపడం, హాలిడేస్‌లో తీసుకెళ్లడం చేశారు. తర్వాత నుంచి నన్నే రమ్మనేవారు. అలా చిన్నప్పటి నుంచి ఇండిపెండెంట్‌గా ఉండడం అలవాటు చేశారు. కాబట్టి నా మౌంటెనీరింగ్ పట్లా అభ్యంతరమేమీ లేదు వాళ్లకు. అత్తింట్లో కూడా అబ్జెక్షన్స్ లేవు. మావారు ఎంకరేజ్ చేశారు. నేను బయటిదేశాలకు వెళితే బాబునూ చూసుకుంటారు. చుట్టాలు, బయటి వాళ్ల నుంచే కామెంట్స్ తప్ప ఇంట్లో వాళ్లందరూ ఫుల్ సపోర్టే. – రాజీ -
కీర్తి శిఖరాన్ని తాకారు
సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ ఎవరెస్టు...ఈ పేరు విన్న ఔత్సాహికులు ఒక్కసారైనా దాన్ని అధిరోహించాలని తహతహలాడుతుంటారు. కొంతమంది ఒంటరిగా, మరికొంతమంది బృందంగా దీనిని అధిరోహిస్తుంటారు. పర్వతారోహకుల్లో బంధువులు లేదా కుటుంబసభ్యులు ఉండడమనేది అరుదు. అందులోనూ తండ్రీకూతుళ్లు ఉండడం అనేది ఇంకా అరుదు. ఆ కోవకే చెందుతారు అజీత్ బజాజ్ ఆయన కుమార్తె దియా బజాజ్. గుర్గావ్కు చెందిన వీరు ఈ నెల 16వ తేదీన 8,848 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు అధిరోహించారు. ఈ పర్వతాన్ని ఎక్కడమంటే కఠినమైన పరిస్థితుల్లో ముందుకు సాగడమే. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన అజీత్ ఆయన కుమార్తె దియా తొలి ప్రయత్నంలోనే తమ లక్ష్యాన్ని సాధించడం విశేషం. ప్రాణాంతకమైన సవాళ్లను లెక్కచేయకుండా, తీవ్ర చలి వాతావరణమనే ఆందోళన లేకుండా గమ్యాన్ని చేరుకున్నారు. దశాబ్దం క్రితం సాహసోపేత ప్రయాణ సంస్థల నిర్వాహకుడైన 53 ఏళ్ల బజాజ్ ...ఒకే ఏడాది వ్యవధిలో దక్షిణ, ఉత్తర ధ్రువాలను తిలకించారు. అలా ఒకే ఈ రెండుచోట్లకి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచారు. ఆయన పెద్దకుమార్తె దియా...పర్యావరణ సైన్సులో డిగ్రీ చదివి ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ సంస్థలో పర్వతారోహణపై శిక్షణ పొందింది. 14 ఏళ్ల లేలేత వయసులోనే ట్రాన్స్ గ్రీన్లాండ్ యాత్ర చేసింది. 2012లో యూరప్‌లో అత్యంత ఎత్తయిన 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించింది. ఏడాదిపాటు శిక్షణ: ‘ఎవరెస్టు శిఖరాన్ని తిలకించాలని ఇరువురం గతేడాది నిర్ణయించుకున్నాం. శిక్షణ అత్యంత ఉల్లాసభరితంగా సాగింది. శారీరకంగా మంచి ఆకృతిని పొందడం కోసం జిమ్‌లో రకరకాల వ్యాయామాలు చేశాం. పరుగులు తీశాం. ఈత కొట్టాం. గతేడాది ఆగస్టులో లడఖ్ యాత్రకు వెళ్లాం. ఎవరెస్టుకు ముందు ట్రయలర్‌గా ఈ యాత్ర సాగించాం’ అని అజీత్ చెప్పారు. ‘ఇటువంటి మూడు సాహస యాత్రల తర్వాత గతేడాది డిసెంబర్లో నేపాల్ వెళ్లాం. అవసరమైన సామగ్రి కొనుగోలు చేశాం. ఆ తర్వాత రెంజోలా పాస్ చేరుకున్నాం. తిరిగి లడఖ్ చేరుకుని అక్కడ కొద్దిరోజులు గడిపాం, మాపై పూర్తి నమ్మకం కలిగింది. ఏప్రిల్ పదిన టిబెట్ వెళ్లాం. ఈ నెల 16న ఎవరెస్టు పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం ’ అని దియా చెప్పారు. అజిత్, దియా స్వస్థలం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల. అజీత్‌ను చిన్నతనంలో వాళ్ల నాన్న సరదాగా తరచూ పర్వతారోహణకు తీసుకెళ్లేవాడు. ఢిల్లీలోని స్టీఫెన్ కళాశాలలో చదువుకునే రోజుల్లో అజీత్ ఔట్‌డోర్ క్లబ్లో సభ్యుడయ్యాడు. అదే సమయంలో తరచూ సాహసోపేత క్రీడల్లోనూ పాలుపంచుకునేవాడు. ఆ తర్వాత అదో వ్యాపకంగా మారిపోయింది. దియాను కూడా తరచూ తన వెంట తీసుకుపోయేవాడు. తనకు ఇటువంటి తండ్రి దొరకడం పూర్వజన్మ సుకృతమంటూ దియా పొంగిపోయింది. పైగా సాహసయాత్రలో తండ్రే భాగస్వామి కావడం అదృష్టమని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో ఈత అంటే సరదా అని, ఆ తర్వాత జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాలుపంచుకున్నానంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకుంది. ‘అంటార్కిటాలో రెండో అతిపెద్ద భాగమైన గ్రీన్లాండ్ ఐస్ క్యాప్‌ను అతి చిన్న వయసులో దాటిన రికార్డు నా సొంతం. ఎవరెస్టుపై మా యాత్ర సాగే సమయంలో ఓ రాత్రి భీకర తుపాను వచ్చింది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు కూడా వీచాయి. తీవ్ర ఆందోళనకు గురయ్యాం. తెల్లవారాక అంతా సర్దుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాం’ అని తెలిపింది. -
కొండల కింగ్
ఆయన ఆశయం పర్వతాలను అధిరోహించడం. ఆర్థికంగా, ఆరోగ్యంగానూ అనుకూలించకపోయినా లక్ష్యసాధనలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ప్రపంచంలోనే గొప్ప పర్వతాలపైకి అడుగిడి భారత కీర్తిపతాకను ఎగురవేసే సన్నాహాల్లో ఉన్నారు. సాక్షి, బెంగళూరు: ఆస్తమాతో బాధపడుతున్నా లెక్కచేయకుండా పట్టుదలతో బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించి త్వరలో ప్రపంచంలో ఏడవ ఎౖల్తైన పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సత్యరూప్ చిన్న వయసులోనే ఆస్తమా బారిన పడడంతో పాఠశాలలో తరగతి గదుల మెట్లను ఎక్కడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. చిన్న వయసు నుంచి మెల్లిగా చిన్న గుట్టలు,కొండలు ఎక్కడం ప్రారంభించారు. సిక్కింలో ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించారు. మౌంట్ విన్సన్‌పై గురి అయితే పర్వతారోహణ లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయారు. 2008లో పర్వతారోహణకు నడుం బిగించారు. ఇప్పటివరకు ప్రపంచలోని అతిఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించిన సత్యరూప్ డిసెంబర్ 1 నుంచి ప్రపంచంలో ఏడవ ఎత్తైన అంటార్కిటికా (దక్షిణ ధృవం) ఖండంలోని దక్షిణ ధృవ పర్వతశ్రేణికి చెందిన మౌంట్ విన్సన్ మ్యాసిఫ్ పర్వతాన్ని అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది విజయవంతమైతే ప్రపంచంలో ఏడు ఎత్తైన శిఖరాలు (సెవెన్ సమిట్స్) అధిరోహించిన అతికొద్ది మందిలో ఒకరిగా కీర్తి గడించనున్నారు. ఇది పూర్తయితే అర్జెంటీనా,చీలి దేశాల మధ్యనున్న ప్రపంచలోని ఎత్తైన, ప్రమాదాలతో కూడిన మౌంట్డెల్ సలాడూ అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎవరెస్టుపై మృత్యు పోరాటం పర్వతారోహణలో ఎన్నో కష్టాలు ఆయనను చుట్టుముట్టినా వెనుతిరగలేదు. 2015లో ఎవరెస్ట్ అధిరోహణ సమయంలో నేపాల్‌లో సంభంవించిన భూకంపం అడ్డంకిగా నిలిచింది. దీంతో 2016లో ప్రయత్నించి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించసాగారు. ప్రమాదవశాత్తు తమ ముగ్గురు సహచరులను కోల్పోవాల్సి వచ్చింది. బాధను దిగమింగి ప్రయాణం కొనసాగించారు.ఎవరెస్ట్ తుదికి చేరుకునే సరికి ఆక్సిజన్ మాస్క్‌లో లోపం వల్ల అరగంట పాటు మృత్యువు అంచుల్లోకి వెళ్లారు. కాగా, డిసెంబర్ నుంచి చేపట్టే యాత్రకు ఆర్థిక సాయం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. -
మంచు కప్పేసిన ప్రేమ
మోంటానా : ఎన్నో పర్వతాలను అధిరోహించి తన పేరును చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకున్న సుప్రసిద్ధ పర్వతారోహకుడు హేడెన్ కెన్నడీ(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. పర్వతారోహణే తన జీవిత పరమావధిగా సాగిన హేడెన్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా ఓ పర్వతమే. హేడెన్‌కు ఓ ప్రేయసి ఉంది. ఆమె పేరు ఇంజ్ పెర్కిన్స్(23). ఇద్దరూ అథ్లెట్లే. స్కీయింగ్ కోసం అమెరికాలోని మోంటానాలోని ఓ పర్వతం వద్దకు పెర్కిన్స్తో కలసి వెళ్లాడు హేడెన్. ఇద్దరూ ఆహ్లాదకరంగా స్కీయింగ్ చేస్తుండగా.. పర్వతం మీద నుంచి మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పెర్కిన్స్ చరియల అడుగును కూరుకుపోయి ప్రాణాలు కోల్పోగా.. హేడెన్ చరియలు పడిన ప్రాంతానికి దూరంగా ఉండటంతో స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు. ప్రేయసి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడం చూసిన హేడెన్ తీవ్రంగా కలత చెందాడు. మర్నాడే మోంటానాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అమెరికాలోని మౌంటెనీర్లు షాక్‌కు గురయ్యారు. ఒకేసారి ఇద్దరు పర్వతారోహకులను కోల్పోవడం తమను తీవ్రంగా కలచి వేసినట్లు పేర్కొన్నారు. 'పెర్కిన్స్ను హేడెన్ తనలో సగంగా భావిస్తాడు. అందుకే ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కన్నీళ్లతో హేడెన్ తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాంస అని హేడెన్ తండ్రి చెప్పారు. -
అయినా... వారు బతికారు
చావు’..ఇది అందరికీ సహజంగా రాదు. కొందరి వయోవృద్ధులై చనిపోతే..మరికొందరు ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. మనిషే కాదు, ఏ జంతువైనా సరే పుట్టిన మరుసటి రోజే జీవించి ఉంటుందో లేదో అన్న గ్యారంటీ లేదు. కాని కొందరి జీవిత చరిత్రలు గమనిస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వెనక్కి వచ్చేస్తుంటారు. కొన్ని అనుకోని పరిస్థితులు మనిషిని మృత్యువు ముంగటి వరకూ తీసుకెళ్తాయి. ఈ స్థితిలో బతికేందుకు ప్రయత్నించిన వారిలో కొందరే చావును జయిస్తారు. అలాంటివారి గాథలు ఎప్పుడూ ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలా పట్టువదలకుండా ప్రయత్నించి, మృత్యువును జయించిన వారి గురించి నేటి ‘బిలీవ్’ లో తెలుసుకుందాం..! విమానం కూలినా..ఏం తినకున్నా.. 42 రోజులు సాధారణంగా ఎవరైనా ఆహారం లేకుండా పది రోజులకు మించి ఉంటే..పూర్తిగా నీరసించి చావుకు దగ్గరవుతారు. ఒకవేళ అప్పటికే అనారోగ్యంతో బాధపడేవారైతే చనిపోవడం ఖాయం. కాని కెనడాకు చెందిన హెలెన్ కెల్బెన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఆమె ఆహారం లేకుండా ఏకంగా 42 రోజులు జీవించింది. అమెరికాకు చెందిన కెలెన్ ఫెయిర్ బ్యాంక్స్ నగరం నుంచి సీటిల్కు వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. 1963 ఫిబ్రవరి 4న పైటట్ రాల్ఫ్ ఫ్లోర్స్‌తో కలిసి ప్రత్యేక విమానంలో సీటిల్కు బయలుదేరింది. అయితే మంచు తుపాను కారణంగా మధ్యలోనే కెనడా సమీపంలోని ఓ మంచు పర్వతం వద్ద వారి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారికి కొన్ని చోట్ల ఎముకలు విరగడంతోపాటు, చిన్నచిన్న గాయాలు కూడా అయ్యాయి. వారి వద్ద అత్యవసర స్థితిలో రక్షణకు ఉపయోగపడే పూర్తిస్థాయి సామాగ్రి కూడా లేదు. కానీ అగ్గిపెట్టెతోపాటు, వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రం ఉంది. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంచు ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తక్కువగా (–41 డిగ్రీలు) ఉన్నాయి. ఈ స్థితిలో వారు ప్రాణాలు నిలుపుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం క్యాబిన్లోంచి ఓ బ్లాంకెట్‌ను తయారు చేసుకుని, ఇంధనంతో మంట వెలిగించుకున్నారు. వారం తర్వాత ఆహారం అయిపోయింది. మంచుకరగసాగింది. ఈ సమయంలో వారికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మంచును కరిగించడం వల్ల లభించినవే. అలా నీటితోనే ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 42 రోజులపాటు జీవించారు. చివరకు ఓ విమానం వారి జాడను కనిపెట్టడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా ఆహారం లేకుండా అన్ని రోజులు జీవించడం కష్టమే. కానీ వారిరువురూ చాలా లావుగా ఉండడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వే వారిని రక్షించిందని వైద్యుల విశ్వాసం. ప్రాణం కోసం చేతినే..! అమెరికాకు చెందిన ఆరన్ రాల్ స్టన్‌కు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు ఏదో ఓ కొత్త రికార్డు సృష్టించాలని తాపత్రయం పడేవాడు. ఎప్పటిలాగే 2003 ఏప్రిల్ నెలలో ఉత్తాహ్ ప్రాంతంలోని బ్లూజాన్ అనే పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్లాడు. దాదాపు సగం పర్వతాన్ని ఎటువంటి సమస్యా లేకుండా అధిరోహించాడు. మంచు కురుస్తున్న సమయం కావడంతో అతనికి దారి సరిగా కనిపించలేదు. అయితే ఈ సమయంలోనే ఓ పెద్ద రాయి(దాదాపు 360 కేజీల బరువు) ఒక్కసారిగా పై నుంచి పడింది. దీంతో రాల్స్టన్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన రాయి అతని కుడి చేతిపై పడింది. రాల్స్టన్ ఎంత ప్రయత్నించినా చేతిని రాయి కింది నుంచి తీయలేకపోయాడు. రాయి కిందనే చేయి ఇరుక్కుపోయి పూర్తిగా నలిగిపోయింది. ఆ రాయిని పక్కకు జరిపేందుకు అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒంటరిగా చిక్కుకుపోయిన అతడిని రక్షిచేవారెవరూ అక్కడలేరు. అలా ఆరు రోజులపాటు చేయి రాయికింద ఇరుక్కుపోయి అలాగే ఉంది. ఆ చేయి అలాగే రాయికింద ఉంటే, ఇంకా కొద్ది రోజులకు అతడి ప్రాణాలు పోవడం ఖాయమని అనుకున్నాడు. అప్పటికే అతని చేతి నరాలు పూర్తిగా నలిగిపోయినట్టు రాల్స్టన్ గమనించాడు. చేతికి స్పర్శ కూడా లేకుండా పోయింది. చివరకు ఈ సమస్య నుంచి బయపడేందుకు అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాతికింద ఇరుక్కున్న భాగాన్ని కోసేసుకోకుంటే కనీసం ప్రాణమైనా మిగులుతుందని అనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న ఓ చిన్న కత్తి సాయంతో అక్కడివరకు చేయిని కోసేసి, ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథతో ‘127 అవర్స్’ అనే మూవీ కూడా రూపొందింది. –సాక్షి, స్కూల్ ఎడిషన్ -
మేనమామ బాటలో..
‘స్టాక్ కాంగ్రి’ పర్వతాన్ని అధిరోహించిన మల్లి మస్తాన్‌బాబు మేనల్లుడు వెంకటరమణ సంగం: పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మార్గంలో ఆయన మేనల్లుడు ఆమాస వెంకటరమణ కూడా పయనిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతాల్లో ఎత్తై శిఖరం ‘స్టాక్ కాంగ్రి’ని ఇటీవల ఆయన అధిరోహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని జనసంఘానికి చెందిన వెంకటరమణ పర్వతారోహణ వివరాలను గురువారం విలేకరులకు వివరించారు. లడక్‌లోని మౌంటనీరింగ్ ఫౌండేషన్ కార్యాలయానికి వెళ్లగా, ఫౌండేషన్ సభ్యులు ఆలోచించారన్నారు. తన మారథాన్ యాత్రతోపాటు ఇతర రికార్డులు ఉన్నాయని తెలుసుకుని ఫౌండేషన్ సభ్యులు పర్వతారోహణకు అనుమతిచ్చారని చెప్పారు. ఈ నెల 14న పర్వతారోహణ ప్రారంభించానని తెలిపారు. 6,153 మీటర్ల ఎత్తున్న స్టాక్ కాంగ్రి పర్వతాన్ని ఈ నెల 14 అర్ధరాత్రి ప్రారంభించి 15 మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరు వేల మీటర్ల ఎత్తుకు చేరానన్నారు. కానీ శరీర దారుఢ్యం, సరైన భోజనం లేనందున తిరిగి బేస్‌క్యాంపునకు చేరుకున్నానన్నారు. తర్వాత 15 అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి 16 మధ్యాహ్నం ఒంటి గంటకు పర్వతాన్ని చేరుకున్నాన ని పేర్కొన్నారు. అక్కడ తన గురువు, మేనమామ మల్లి మస్తాన్‌బాబు చిత్రపటాన్ని, జాతీయపతాకాన్ని ఎగురవేశానన్నారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. -
నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలి
-ఎంఈఓ ఉదయ్‌భాస్కర్ జగదేవ్‌పూర్:ఆఫ్రికాలో పర్వాతారోహణ చేసి జాతీయ జెండాను ఎగురవేసిన విద్యార్థి నాగమణిని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ఎంఈఓ ఉదయ్‌భాస్కర్, జెడ్పీటీసీ రాంచంద్రం అన్నారు. జగదేవ్‌పూర్ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని ఆఫ్రికాలో పర్వతరోహణ చేసి శుక్రవారం జగదేవ్‌పూర్ చేరుకుంది. ఈ సందర్భంగా నాగమణికి జగదేవ్‌పూర్ ప్రభుత్వ, ప్రైవైట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అధకారులు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్సీ కార్యాలయం వద్ద నాగమణికి పూలమాలలు వేసి అభినందించారు. రత్నశ్రీ గ్యాస్ ఎజెన్సీ నిర్వాహకులు నగదు బహుమతి అందించారు. అనంతరం ఎంఈఓ, జెడ్పీటీసీ మాట్లాడుతూ నాగమణి మట్టిలో మణిక్యమని, పేదింట్లో వెలుగు జ్యోతి అని అభినందించారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన రంగంలో రాణించినప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పరమేశం, ఎంపీడీఓ పట్టాభిరామారావు, పాఠశాల ప్రత్యేక అధికారి శారద, పీఆర్టీయూ, టీటీఎఫ్ నాయకులు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రావు, శశిధర్‌శర్మ, శంకర్, కో-ఆప్షన్ సభ్యుడు మునీర్ ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.