మలుపులే జీవితం | Sakshi Special Story on Mountaineer Rekha Rao | Sakshi
Sakshi News home page

మలుపులే జీవితం

Published Tue, Dec 8 2020 12:38 AM | Last Updated on Tue, Dec 8 2020 5:34 AM

Sakshi Special Story on Mountaineer Rekha Rao

ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్‌ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. ఎవరెస్ట్‌ అధిరోహణకు అవకాశం వచ్చింది. అదే సమయంలో బీఎడ్‌లో సీటు పరీక్ష పెట్టింది. పాఠాలు చెప్పడంలో ఉన్న ఇష్టం.. పర్వతారోహణను పక్కన పెట్టించింది. తర్వాత కమ్యూనికేషన్‌ స్కిల్‌ ట్రైనర్‌గా ఆమె దిశ మారింది. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు!  

పెళ్లితో ఆడవాళ్లకు కెరీర్‌ ఆగిపోకూడదని, భర్త బదిలీలతో పాటుగా కెరీర్‌ను మలుచుకోవాలన్నారామె. ఆ మలుపులే తనను మల్టీ టాలెంటెడ్‌ పర్సనాలిటీగా మార్చాయన్నారు. తను సమాజానికి ఎలా ఉపయోగపడాలని భగవంతుడు నిర్ణయించి ఉంటే... తన పయనం ఆ దిశగా సాగుతుందని నమ్ముతున్నారు రేఖారావు. బచేంద్రిపాల్‌ నేర్పించిన జీవిత జ్ఞానమే తనకు ఇప్పటికీ మార్గదర్శనం చేస్తోందని చెప్తున్నారు రేఖారావు.

రేఖారావుది హైదరాబాద్, కూకట్‌పల్లి. తండ్రి ఆర్మీ ఆఫీసర్‌ కావడం తో బాల్యం, చదువు జమ్‌షెడ్‌పూర్‌ లో సాగాయి. బచేంద్రిపాల్‌ దగ్గర పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నది కూడా జమ్‌షెడ్‌పూర్‌లోనే. జేఆర్‌డి టాటా కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న ‘టాటా స్టీల్‌ అడ్వెంచర్‌ ఫౌండేషన్‌’లో శిక్షణ తరగతులు నిర్వహించేవారు బచేంద్రిపాల్‌. టీనేజ్‌లో మెదడు మైనపుముద్దలా ఉంటుంది. అప్పుడు పడిన ముద్ర జీవితాన్ని నడిపిస్తుంది.

బచేంద్రిపాల్‌ దగ్గర నేర్చుకున్నది పర్వతారోహణ మాత్రమే కాదు, సామాజిక జీవి అయిన మనిషి ఇతరులతో ఎంత స్నేహపూర్వకంగా మెలగాలనే జ్ఞానాన్ని కూడా. ఆ శిక్షణతోపాటు ఆర్మీ నేపథ్యం కూడా తన మానసిక వికాసంలో కీలకమేనంటారు రేఖ. ‘‘పర్వతారోహణ శిక్షణలో ఉన్నప్పుడు నాకు భారతీయత అర్థమైంది. మేము గురువు పాదాలకు నమస్కారం చేస్తాం. సాహసమే జీవితంగా భావిస్తాం. ఆడపిల్లలకు ఈ అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఎందుకనే మాట వినిపించేది కాదు. దేహం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే మానసికంగా ఆలోచనలు కూడా ఆరోగ్యంగా, స్థిరంగా ఉంటాయని చెప్పి ప్రోత్సహించేవారు.

సాహసోపేతమైన క్రీడలతో జీవితాన్ని ఆనందమయం చేసుకోగలిగిన మంచి లక్షణం కూడా అబ్బుతుంది. జీవితంలో ఒడిదొడుకులు, కష్టనష్టాలు, సుఖదుఃఖాలు ఏవీ బాధించనంత గా పరిణతి వచ్చేస్తుంది. అలాగని వైరాగ్య జీవనమూ కాదు. జీవితం విలువ తెలుస్తుంది. బతికున్న ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపడం అలవడుతుంది. అందుకే పిల్లలకు ఆటలు లేని విద్యాభ్యాసాన్ని అంగీకరించలేను. పిల్లల్ని తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర టీచర్‌ దే. ప్రభుత్వ పాఠశాలను దత్తత ఇస్తే అద్భుతాలు చేయవచ్చని కూడా అనిపిస్తుంటుంది. నన్ను ఆహ్వానించిన స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి ఉచితంగా స్కిల్‌ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ సెషన్స్‌ ఇస్తున్నాను’’ అని చెప్పారు రేఖ.


ఉత్తర శిఖరం.. దక్షిణాపథం
కశ్మీర్‌లోని లేహ్, లధాక్, శ్రీనగర్, అమృత్‌సర్‌ నుంచి చంఢీఘర్, భటిండా, అస్సాం, నాసిక్, బెంగుళూరు కన్యాకుమారి వరకు అనేక ప్రదేశాల్లో నివసించాను. మనదేశంలో ఉన్న భౌగోళిక వైవిధ్యతతోపాటు సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూడగలిగాను. ఇప్పుడు రాజకీయ విశ్లేషణ చేయగలగడానికి అప్పటి సామాజిక అధ్యయనం చాలా దోహదం చేసింది. ప్రాంతం, భాష ఏదైనా సరే... ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది ఒకటే. మంచి పరిపాలన. ప్రభుత్వం నుంచి తమకు అందుతున్న ఫలాల పట్ల నిశితమైన గమనింపు ఉంటుంది. చదువు రాని వాళ్లలో రాజకీయ చైతన్యం ఉండదని మేధావులు భావిస్తుంటారు. కానీ తమ ప్రయోజనాల గురించిన చైతన్యాన్ని కలిగి ఉంటారు.

కరెంటు, టీవీ, రేడియో లేని కుగ్రామాలు మినహా మిగిలిన అన్ని చోట్ల తమకు అవసరమైన మేరకు తెలుసుకుంటూనే ఉంటారు. కాని ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం మాత్రం తీవ్రంగా ఉంది. గ్రామాలనే కాదు, మహానగరాల్లోని బస్తీల్లో కూడా సమతులాహారం తినడం తెలియదు. ఎక్కువమంది ఒబేసిటీ, మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. బస్తీల్లో ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాను. కరోనా సమయంలో ఇంటికి పరిమితం కాకుండా ఎక్కడ సహాయం అవసరమైతే రాచకొండ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందిస్తూ ఒక వారధి గా పని చేశాను. బస్తీల్లో పదోతరగతి ఫెయిలయ్యి చదువు మానేసిన పిల్లలు ఎక్కువగా కనిపిస్తారు.

ఆ పిల్లలు అసాంఘిక శక్తులుగా పరిణమించకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత చదువుకున్న మనందరి మీదా ఉంది. చదువు మీద ఆసక్తి లేకపోతే బలవంతం వద్దు, నీకు ఏ పని చేయడం ఇష్టమో చెప్పు, నేర్పిస్తానని అడిగితే పిల్లలు చక్కగా ఓపెన్‌ అవుతారు. టైలర్‌ కావాలని ఉంటే అదే పని చేయాలి. వంట చేయడం ఇష్టమైతే అదే చేయాలి. ఏది చేసినా అందులో నువ్వే బెస్ట్‌ అనిపించుకునేటట్లు నైపుణ్యాన్ని సాధించాలి... అని చెప్పినప్పుడు పిల్లలతోపాటు ఆ తల్లిదండ్రులు కూడా ఒక దారి కనిపించినట్లు సంతోషపడతారు. ఇలా భగవంతుడు నాకిచ్చిన నైపుణ్యం ద్వారా పదిమందికి ఉపయోగపడుతున్నాను’’ అన్నారు రేఖారావు.

పర్వతారోహణ శిక్షణ అనంతరం బచేంద్రీపాల్‌ నుంచి సర్టిఫికేట్‌ అందుకుంటున్న రేఖ

మైక్‌ పట్టుకుని కామెంటరీ ఇవ్వడం అంటే నాకు చెప్పలేనంత. ఎంతగా అంటే... పోలీస్‌ పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌లో కామెంటరీ అవకాశం కోసం ఐదేళ్ల పాటు ప్రయత్నించి సఫలమయ్యాను. అలాగే హైకోర్టు వందేళ్ల వేడుకల్లోనూ కామెంటరీ ఇవ్వగలిగాను. ‘నాట్‌ పాజిబుల్‌’ అన్నవాళ్లే ఇప్పుడు ‘పలానా రోజు ప్రోగ్రామ్‌. కామెంటరీ ఇవ్వడానికి మీకు వీలవుతుందా’ అని అడిగినప్పుడు ఎవరెస్టును అధిరోహించినంతగా సంతోషపడ్డాను. అలాగే 150 దేశాల ప్రతినిధులు హాజరైన సభలో అన్నా హజారే, బబితా పోగట్‌ల ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో అనువదించడం కూడా నన్ను నేను గర్వంగా తలుచుకోగలిగిన క్షణాలు.
– రేఖారావు స్కిల్‌ ట్రైనర్‌

– వాకా మంజులారెడ్డి ‘సాక్షి’ ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement