కఠోర సాధనతో జాతీయ క్రీడాకారిణిగా ఎదిగిన రేఖ
కరోనా కారణంగా ఆటకు ఫుల్‌స్టాప్
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి
పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు
సొంతగడ్డకు సాయమందిస్తున్న రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ.
అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.
ముంబైలో కోచింగ్..
తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్‌లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.
సింగిల్స్‌గానే..
రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు.
స్పెయిన్‌కు పయనం
జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్‌డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్‌షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.
ఆటకు ‘లాక్‌డౌన్’
రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.
సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు
రేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్‌ఓ ప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment