Social service programs
-
దేవర మనోజ్ ఖన్నాకు రాష్ట్రపతి అవార్డు
హైదరాబాద్: గత కొన్ని సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న దేవర మనోజ్ ఖన్నాకు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు లభించింది. గోషామహల్ నియోజకవర్గంలోని గాంధీభవన్ ప్రాంతానికి చెందిన దేవర మనోజ్ ఖన్నా ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా ఉంటూ పర్యావరణ కార్యక్రమాలపై 7 లక్షల మంది విద్యార్థులకు 650 కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించారు. 1300 మొక్కలు నాటడంతో పాటు 160 యూనిట్ల రక్తదాతలను సమీకరించడం, కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో నిరుపేద పిల్లలు, గ్రామీణ కుటుంబాలకు నిత్యవసరాల వస్తువుల పంపిణీ, పలు విద్యాసంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేశారు. వీటికి గుర్తింపుగా దేవర మనోజ్ ఖన్నాకు ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మనోజ్ ఖన్నా మాట్లాడుతూ..2016వ సంవత్సరం నుండి తాను నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాతీయస్థాయిలో రాష్ట్రపతి అవార్డు పొందడం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. పలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి 5 వేల కిట్స్‌లను పంపిణీ చేశానన్నారు. జీవితాంతం సామాజిక సేవా కార్యక్రమాలకే అంకితమవుతానన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్, పటేల్నగర్తో పాటు గోషామహల్ నియోజకవర్గంలో పలువురు మనోజ్ ఖన్నాను అభినందించారు. -
భారత భావితరం మీరే
విజయ్‌కి ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమాన గణం ఉంది. అదేవిధంగా విజయ్ చాలా కాలం నుంచి తన విజయ్ మక్కళ్ ఇయక్కమ్ (విజయ్ ప్రజా సంఘం) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో విజయ్ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ఉదయం తమిళనాడులోని 234 నియోజకవర్గాలలో పది, ప్లస్‌టూ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె, నీలాంగరై ప్రాంతంలో భారీ ఎత్తున నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ వేదికపై విజయ్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తలా రూ.25 వేలు, ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.15వేలు, తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.10వేల నగదు అందించారు. అదేవిధంగా ప్లస్‌టూలో రాష్ట్రంలోనే 600లకు 600 మార్కులు పొందిన దిండిక్కల్ చెందిన నందిని అనే విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ బహూకరించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీ వద్ద అడవినైనా లాక్కుంటారు... డబ్బు వున్నా దోచుకుంటారని, విద్య మాత్రమే నిరంతరం అని అన్నారు. విద్యార్థులు కచ్చితంగా రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా అంబేడ్కర్, పెరియార్, కామరాజ్ వంటి గొప్ప నాయకుల గురించి తెలుసుకోవాలన్నారు. డబ్బుపోయినా పర్వాలేదని, అనారోగ్యంతో కొంతే నష్టపోతామని అయితే గుణాన్ని కోల్పోతే జీవితమే ఉండదని ఆయన అన్నారు. ఇక్కడ మన వేళ్లతోనే మన కళ్లు పొడిచేవారు ఉంటారని, కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని అన్నారు. మీరే భావితర పౌరులని, ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు అని పేర్కొన్నారు. మంచి నాయకులను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నోటుకు ఓటు సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. తమిళనాడులో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఓటుకు నోటులు తీసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. మీ ప్రయత్నం తప్పక ఫలిస్తుందనే నమ్మకాన్ని విజయ్ వ్యక్తం చేశారు. -
మీరు రావొద్దు నేనే వస్తా
తమిళసినిమా: సామాజిక సేవలందించడంలో ముందుండే వారిలో నటుడు లారెన్స్ ఒకరని చెప్పవచ్చు. పలువురు అనాథలకు ఆశ్రయం ఇచ్చి వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న ఈయన, పలువురు చిన్నారులకు శస్త చికిత్స చేయించి మరు జన్మనిస్తున్నారు. లారెన్స్‌కు అభిమానులు అధికమనే చెప్పాలి. వారిలో చాలా మంది లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటోలు దిగాలని కోరుకుంటారు. అలా కడలూరుకు చెందిన ఆర్.శేఖర్ అనే యువకుడు ఇటీవల లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటో దిగాలని చెన్నైకి వస్తూ మార్గమధ్యలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన లారెన్స్‌ను ఎంతగానో కలచివేసిందట.ఆ అభిమాని అంతక్రియలకు హాజరైన లారెన్స్ శేఖర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సంఘటనతో లారెన్స్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారట. దీని గురించి ఆయన తెలుపుతూ ఇకపై తన అభిమానులెవ్వరూ ఫొటోల కోసం అంటూ తన వద్దకు రావద్దని, సమయం దొరికినప్పుడల్లా తానే మీ వద్దకు వచ్చి ఫొటోల కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. కాగా ఈ నేపథ్యంలో ఈ నెల 7నన లారెన్స్ సేలం వెళ్లి అక్కడ అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగనున్నట్లు వెల్లడించారు. -
మనసుకు కనులుంటే..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న 15వ కథనమిది... ప్రపంచాన్ని మనసుతో సందర్శించే నిష్కల్మషులు వారు. రంగులకు, హంగులకు శూన్యంలోనే కొత్త భాష్యం చెప్పగలరు. పుట్టుకతోనే చూపు కరవైనా హృదయరాగంతో దైవాన్ని నేరుగా చూడగలిగే భాగ్యవంతులు. ఆ రాగాలను ఒడిసిపట్టి.. వాటికో రూపమిచ్చి.. ఆ గానామృతాన్ని వారికే కానుకగా అందజేస్తే.. ఈ ఆలోచన వచ్చిన మహిళ వందన. హైదరాబాద్ మలక్‌పేట వాసి అయిన వందన అంధుల ‘మనసుకు కనులుంటే’ ఏం చూపుతారో.. ఆ కళ్లలో దాగున్న కలలేంటో.. కమ్మని పాటలుగా వారి నోటనే పలికించారు. ఆ పాటల ఆల్బమ్‌ని వారికే కానుకగా ఇచ్చారు. గృహిణిగా బాధ్యతలను నెరవేరుస్తూనే తనదైన కళతో రాణించాలనుకున్నారు వందన. చదువుకునే రోజుల్లోనే లలిత సంగీతంలో రాణింపు, సాహిత్యంపై మక్కువ ఆమెలోని కళాభిరుచిని రెట్టింపు చేశాయి. ఆ కళాసాధనలో ఉండగా తెలిసిన వారితో రెండేళ్లక్రితం ఒకసారి మలక్‌పేట్‌లోని అంధ పిల్లల హోమ్‌ని సందర్శించారు. ఆ సమయంలోనే అక్కడ వసతుల కోసం ఎంతో కొంత సాయం చేయాలనిపించింది. అయితే అలా ఇచ్చిన సొమ్ముతో తాత్కాలికంగా కొన్ని వసతులు ఏర్పడతాయేమో కానీ, అవి అక్కడి పిల్లలకు పెద్ద ప్రయోజనం తెచ్చేది మాత్రం ఏమీ లేదని గుర్తించారామె. గాత్రానికి ప్రాణం... మనిషి రూపు రేఖలు వారికి తెలియవు. ఏది మంచి, ఏది చెడు పట్టదు. కదిలిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. చూపు లేకపోయినా తమదైన లోకంలో విహరింపజేస్తారు. కమ్మని గాత్రంతో ఆకట్టుకుంటారు. కొంతమంది పిల్లల గానానికి పరవశించడంతో వారితోనే ఒక ఆడియో ఆల్బమ్ చేసి, దానిని వారికే కానుకగా ఇవ్వాలనుకున్నారు. అందుకు ఖర్చు, టైమూ బోలెడంతవుతుంది. అయినా ఆ లేత మనసుల్లో నుంచి వచ్చే గానాన్ని ఒడిసిపట్టాలనుకున్నారు. అందుకు ఆరుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకున్నారు. భాగ్య, ప్రియాంక, సోని, మనీషా, సౌమ్య, గాయత్రిలను బృందంగా తయారు చేశారు. వీరు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నారు. రేయింబవళ్లూ సాధన... ‘మనసుకు కనులుంటే..’ ఆల్బమ్ ద్వారా అంధులైన వారి నోట పలికే ఒక్కో పాట పూదోటలో గుబాళింపులా మనసును తడుతున్నాయి. ‘వేయి కనులు కావాలా... వేల్పును కొలిచేందుకు.. మది మందిరమైన చోట కొలువుండడా వేల్పు...’ ఎక్కడెకిళ్లినా ఇప్పుడా ఆల్బమ్‌లోని పాటలు పాడుతూ వేదికల మీదా తమదైన గానామృతాన్ని పంచుతున్నారు. ‘ఆల్బమ్‌కి అవసరమైన ఆరు పాటలు పాడించడానికి దాదాపు ఆరునెలలు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇది కష్టమనుకోను. నా జన్మ ధన్యంగా భావిస్తాను. చూపులేని వారి హృదయపు లోతుల్లోకి వెళ్లి, వారి భావాలతో ఆరు పాటలు రాశా. వాటికి సంగీతాన్ని అందించమని కోరినప్పుడు రామాచారి వెంటనే ఒప్పుకున్నారు. పిల్లలకు రోజూ సంగీతంలో క్లాస్‌లు ఇప్పించి, రిహార్సల్స్ చేయించి, రికార్డింగ్ స్టూడి యోకి తీసుకెళ్లా. ఈ ప్రయత్నానికి బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సహకారాన్ని అందించారు. పిల్లలు కూడా నాతో బాగా కలిసి పోయి, అద్భుతంగా పాటలు పాడారు. ఆ తర్వాత తమ గొంతును ఆల్బమ్ పాటలలో విని, ఎంతో సంతోషించారు. ఇప్పుడా ఆల్బమ్‌కి వచ్చే ప్రతి రూపాయి వారి ఖాతాలోనే జమ అవుతుంది. అలా వచ్చిన డబ్బు వారి అవసరాలను ఎంతో కొంత తీర్చుతుంది. రాబోయే రోజుల్లో అంధుల చేత వీడియో ఆల్బమ్ ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నాను’ అని తెలిపారు వందన. గానంతో సందర్శన... ఈ పాటలు పాడిన వారిలో ప్రియాంక మాట్లాడుతూ... ‘శూన్యమైన మా లోకంలో వందన వెలుగు నింపారు’ అంటూనే - ‘మమతల కోవెలలో... మానవీయ లోగిలిలో.. విరిసిన కుసుమాలమే మేమూ! ఓ చల్లని మనసు మాకు తోడుంటే .. లాలనగా ఓ చేయి మము నడిపిస్తే.. గగనాలైనా ఇలకు దించి చూపమా’ అంటూ గానంతోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘రంగులంటే ఎలా ఉంటాయో తెలియదు. దైవాన్ని చూడలేము. అయినా ఈ పాటల ద్వారా అవన్నీ మేం సందర్శించాం. చూపు లేదని చిన్నచూపు చూడకుండా మా మనసుతో దర్శించిన దైవాన్ని (పాటలను) మీరూ వినండి’... ఇది సోని మాట. నిర్మలారెడ్డి ఫొటో: జి.రాజేష్ -
జాయ్ ఆఫ్ సేవ
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేముసైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న పదకొండవ కథనమిది... నలుగురు స్నేహితులు ఓ చోట కూడితే...ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తారు. కానీ నలుగురి కోసం ఏం చేయాలనే ఆలోచిస్తే.. ‘సంభవామి’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఇలాంటి స్నేహితుల బృందమే. వరంగల్ కిట్స్ (కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) కాలేజీలో చదువుకున్న ఓ నలభై మంది విద్యార్థులు ఉద్యోగాల్లో స్థిరపడ్డాక పేద పిల్లలకు సాయం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థను స్థాపించారు. చదువు... మొదలు ప్రకృతి వైపరీత్యాల వరకూ.. చేతనైనంత సాయం చేస్తూ తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సదా మీ సేవలో.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదివుందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదివుందికీ తెలిస్తే.. వురెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సవూజం కోసం మీరు చేతులు కలిపి చేసిన చేతల వివరాలు వూకు తెలియుజేయుండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సవుంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెరుుల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. ఇలా ఉత్తమ సేవలు అందిస్తూ సమాజహితానికి పాటుపడుతున్న ‘సేవకుల’ను సవుంత పలకరిస్తారు. ఒక్క సవుంత వూత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి వురెందరో సెలబ్రిటీలు వుుందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెరుుల్ టు.. sakshicityplus@gmail.com నాలుగేళ్ల క్రితం స్నేహితులంతా కలిసినపుడు తోచినట్టు చేసుకుపోవడం కాకుండా ఏదైనా సంస్థని స్థాపిస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చారు. ‘కాలేజీ రోజుల నుంచే మాకు ఇలాంటి ఆలోచనలు ఉండేవి. చిన్న చిన్న సహాయాలు చేస్తుండేవాళ్లం. మా ఫ్రెండ్స్ మొత్తం నలభై మంది వరకూ ఉంటారు. అందరూ చెన్నై, హైదరాబాద్ నగరాల్లో సెటిల్ అయ్యారు. ఒకరోజు అందరం కలిసి స్వచ్ఛంద సంస్థని స్థాపించాలనుకుని ‘సంభవామి’ పేరుతో సేవకు సిద్ధపడ్డాం. మొదట్లో అందరం నగరంలోని అనాథ పిల్లల ఆశ్రమాలకు వెళ్లి అక్కడ కాసేపు గడిపి వచ్చేవాళ్లం. వెళ్లేటప్పుడు ఊరికే వెళ్లకుండా...బియ్యం, నోటు పుస్తకాలు, బట్టలు, కూరగాయలు వంటివి తీసుకెళ్లేవాళ్లం. అలా నాలుగైదు సార్లు వెళ్లాక ఏదో ఒక సంస్థకు పూర్తిస్థాయిలో అండగా నిలబడితే బాగుంటుందనుకుని ఆశ్రీత అనాథాశ్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం మొదలుపెట్టాం. దీంతో పాటు వార్తాపత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించి జిల్లాలకు వెళ్లి కూడా తోచిన సాయం చేస్తున్నాం’ అని చెప్పారు అలైఖ్య. ఈసీఐ కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న అలైఖ్య.. తన స్నేహితులైన అఖిల, హర్ష, విక్రమ్, శ్రీనివాస్, అనూషల సేవాభావాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ఆశ్రీతతో పాటు... ఒంటరి సేవలు కాకుండా...ఒక బృందంగా ముందుకెళ్లాలన్న ఆలోచన తేజశ్వినిది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తున్న తేజశ్విని ‘సంభవామి’ టీమ్‌కి లీడర్. ఆమె మాటల్లో చెప్పాలంటే ‘విద్యార్థి దశలో వచ్చిన ఆలోచనలు పెద్దయ్యాక ఆచరణలో పెడితే మంచి లక్ష్యాలను చేరుకున్నవాళ్లమవుతాం. ఏ స్వార్థమూ తెలియని వయసులో మనసుకు వచ్చే ఆలోచనలు చాలా స్వచ్ఛమైనవి. జీవితంలో స్థిరపడే వయసులో ఇలాంటి బాధ్యతలు నెత్తినేసుకోవడం మన ఎదుగుదలకు అడ్డంకి అవుతుందనే ఆలోచనతో చాలామంది రిటైర్ అయ్యాక సేవాకార్యక్రమాలకు ముందుకొస్తారు. కానీ మేం అలా చేయాలనుకోలేదు. ఏం చేసినా ఈ వయసులోనే చేయాలి. సొంతపని, సమాజం పని....రెండింటినీ చేసే సామర్థ్యం ఈ వయసులోనే ఉంటుందనేది మా ఉద్దేశం. అందుకే పుట్టింది ‘సంభవామి’. ఈ టీం అనాథ పిల్లల బాగోగులతో పాటు సొంత జిల్లా వరంగల్‌కి కూడా వెళ్లి అక్కడున్న ఆర్ఫనైజ్ హోమ్స్కీ సహాయపడుతోంది. జిల్లాలకేగి... కిందటేడు ‘సంభవామి’ బృందం వరంగల్ పబ్లిక్ గార్డెన్లో ‘ప్లాస్టిక్లెస్ ఎర్త్’ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మూడు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో ఇరవై పాఠశాలల్లో వీడియో ప్రజెంటేషన్లు వేశారు. రోజంతా ర్యాలీ నిర్వహించారు. పిల్లలతో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. ‘ఉద్యోగాలకు సెలవులు పెట్టి మేమంతా ఓ నాలుగు రోజులు వరంగల్‌లోనే ఉండిపోయాం. ప్లాస్టిక్లెస్ ఎర్త్ కార్యక్రమం అక్కడి ప్రజల్లో మంచి అవగాహన పెంచిందని చెప్పాలి. ఎందుకంటే వాటి వాడకం విషయంలో ప్రత్యామ్నాయ వస్తువుల్ని వాడడం గమనించాం మేం. అలాగే ఖమ్మం జిల్లా కొత్తూరు తండాలో ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారనే వార్త చదివి అక్కడికి వెళ్లాం. బట్టలు, రాగి, గోధుమ పిండి ప్యాకెట్లను తీసుకెళ్లి పంచాం. దానికోసం తెలిసినవాళ్ల దగ్గర మేమే స్వయంగా బట్టలు సేకరించాం. కొన్నింటిని కొత్తవి కొన్నాం’ అంటూ తన సంస్థ కార్యక్రమాల్ని వివరించారు అలైఖ్య. హుద్‌హుద్ కోసం... విశాఖపట్నంలో అల్లకల్లోలం సృష్టించిన హుద్‌హుద్ సంఘటనపుడు ‘సంభవామి’ సంస్థ వెంటనే స్పందించింది. పది మంది బృందం అక్కడికి చేరుకుంది. తాగునీటి సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న పల్లెలకు చేరుకుని వాటర్‌ప్యాకెట్లను, ఆహారపొట్లాలను పంచారు. వారి సమస్యల కోసం... కంటికి కనిపించిన, చెవికి వినిపించిన ఎలాంటి సమస్యపైనైనా స్పందించే ‘సంభవామి’ సంస్థ ఆశయం నెరవేరుస్తున్న ఈ స్నేహితులు మరింతమందకి ఆదర్శంగా నిలుస్తారని ఆశిద్దాం. - teamsambhavami@gmail.com ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
బాల సంస్కార్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న ఎనిమిదవ కథనమిది... మురికివాడలకు వెళ్లినపుడు మొదట మన చూపు పడేది అక్కడి పిల్లలపైనే. అక్కడి జీవన విధానం వారి భవిష్యత్తుపై ఏ స్థాయి ప్రభావం చూపుతుందో కనిపిస్తుంటుంది. అక్కడి వాతావరణం, మనుషులు, పరిసరాలు, వారి అలవాట్లు... వీటిని మార్చడం అంత సులువు కాదు. కానీ... ఆ మురికివాడల్లోని పిల్లలు, ఆలోచనలు... తద్వారా వారి జీవన విధానాన్ని మార్చగలం. ఇదే సంకల్పంతో గౌరుగారి గంగాధరరెడ్డి ఆ వాడల్లో అడుగుపెట్టారు. ‘శ్రీ శారదాధామం’ ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ స్థాపించి రేపటి పౌరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. రాజేంద్రనగర్ మండలం పరిధిలో 21 పాఠశాలల్లో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఉన్నాయి. శ్రీశారదాధామం హైస్కూలు పరిధిలో నిర్వహించే ఈ కేంద్రాల్లో ప్రతిరోజూ యోగా, మెడిటేషన్, కరాటే వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘శ్రీశారదాధామం పాఠశాల నెలకొల్పి ఇరవై ఏళ్లు దాటింది. బాల సంస్కార కేంద్రాలు నెలకొల్పి నాలుగేళ్లయింది. వెనకపడ్డ గ్రామాల్లోని పాఠశాలల్లో మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఏదో పాఠశాలకు వస్తున్నామంటే వస్తున్నాం అన్నట్టు కాకుండా... పిల్లల మనస్తత్వం, పాఠశాలకు పంపితే పనైపోతుందనుకునే తల్లిదండ్రుల ఆలోచనా తీరుని మార్చడాన్నే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు కదిలాం. తొలుత పాఠశాలలకు వెళ్లి మా సేవా కార్యక్రమాల గురించి చెప్పి, కొంత సమయం తీసుకున్నాం. ఆ సమయాల్లో మా టీం వెళ్లి వివిధ అంశాలను బోధిస్తుంది’ అని చెప్పారు గంగాధరరెడ్డి. విద్యార్థుల సాయంతో... 21 సెంటర్లలో పేద విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు, దేశభక్తి గీతాలు, కథలు నేర్పడానికి కాలేజీ విద్యార్థులు ముందుకొస్తున్నారు. కొందరు గృహిణులు కూడా బోధకులుగా చేరారు. ‘మా లక్ష్యాలు ఎంత గొప్పవైనా... వాటిని అమలు చేసేవారు ఉండాలి కదా. దాని కోసం మా ప్రాంతంలో ఉండే కాలేజీ విద్యార్థులు, కొందరు చదువుకున్న గృహిణులు ముందుకొచ్చారు. దాంతో మా పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఉదయం పిల్లలకు యోగా, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. సాయంత్రం డ్రిల్, కరాటే వంటి శిక్షణా తరగతులు ఉంటున్నాయి’ అని చెప్పారు గంగాధర్‌రెడ్డి. వీటితో పాటు బాల సంస్కార కేంద్రాల నిర్వాహకులు నెలరోజులకోసారి మురికివాడల్లోని పిల్లలకు పాజిటివ్ హోమియోకేర్ ద్వారా ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా... చాలీచాలని సంపాదన వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే జీవితాలను చూస్తూనే ఉంటాం. వీరి పరిస్థితే ఇలా ఉంటే సంపాదించిన నాలుగు డబ్బులను వ్యసనాలకు ఖర్చు పెట్టే పేద తల్లిదండ్రుల కడుపున పుట్టిన చిన్నారుల సంగతి ఎలా ఉంటుందో ఊహించగలం. దీని కోసం బాల సంస్కార కేంద్రం నిర్వాహకులు ఏడాదికి రెండుసార్లు మురికివాడల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నారు. చదువుకున్న పిల్లల భవిష్యత్తును వారి ముందుంచుతూ వారి భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి.. ఏ విధంగా నడుచుకోవాలో బోధిస్తోంది. ‘ఈ కార్యక్రమం వల్ల చాలామంది తల్లిదండ్రుల్లో మార్పుని చూశాం. ముఖ్యంగా ఆడపిల్లల చదువును అర్ధంతరంగా ఆపేయడం తగ్గింది. అలాగే పదో తరగతి తర్వాత పిల్లల్ని కాలేజీకి పంపేవారి శాతం కూడా పెరిగింది’ అంటారు గంగాధర్. ఆర్థిక సాయంకన్నా అక్షర సాయం గొప్పదని నమ్మిన శ్రీ శారదాధామం పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్న బాల సంస్కార కేంద్రాల ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుందాం. ప్రజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
హైటెక్ స్టాలిన్స్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న మూడో కథనమిది. ఒకరి సాయం పొందిన వ్యక్తి మరికొందరికి సాయం చేయాలి. అలా ఒకరికొకరు.. ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్ మాదిరిగా పనిచేస్తోంది కేఎస్పీ సంస్థ. టెక్కీ జాబ్స్ రూపంలో ఎందరికో లక్కీచాన్స్లు ఇప్పిస్తున్న ఆ సంస్థ పరిచయం.. చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదు. లక్షలు వెచ్చించి చదువు‘కొన’డమే సులభం కానీ, దానికి తగ్గ జాబ్ దక్కించుకోవడమే కష్టం. ఇక టెక్కీ జాబ్స్ గురించైతే చెప్పనవసరం లేదు. అదృష్టం బాగుంటే క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే ఓకే. లేదంటే...‘టెక్కీ’ డ్రీమ్ నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం ఐటీ కంపెనీల చుట్టూ చక్కర్లు కొట్టే ఇంజనీరింగ్ కుర్రాళ్లు మన కంటికి కనిపించినప్పుడల్లా...పాపం లక్షలు పోసి చదువుకున్నారు... ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటని అనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇప్పించడానికే నడుం బిగించారు కొందరు టెక్కీలు. వాళ్లలోని ‘సాఫ్ట్’ కార్నర్ ఇదీ.. ఒకరు మరొకరికి.. సాంబశివ అనే టెక్కీ ఈ మధ్యనే రమ్య అనే అమ్మాయికి యూహెచ్‌సీ (యునెటైడ్ హెల్త్ గ్రూప్)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పించాడు. ఆ క్షణం రమ్యకు సాంబశివ చెప్పిన మాటొక్కటే. ‘ఉద్యోగం కోసం ఎదురుచూసే మరో టెక్కీకి ఇలాంటి సాయం చేయి చాలు’ అని. ఎందుకంటే రెండేళ్ల క్రితం సాంబశివకి మరో టెక్కీనే ఉద్యోగం ఇప్పించాడు. అతని పేరు వరప్రసాద్. సాఫ్ట్వేర్ రంగంలో చేరాలనుకునే వారు అవగాహన లోపం వల్ల ఉద్యోగాలు సంపాదించ లేకపోతున్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు వరప్రసాద్.. కృష్ణదేవరాయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేఎస్పీ) అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పారు. 4 వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ ఉద్యోగ కల్పనతో పాటు వివిధ సేవలూ అందిస్తోంది. విదేశీ టెక్కీలు సైతం... ఇప్పటి వరకు తొంభై మందికి ఉద్యోగాలు ఇప్పించిన కేఎస్పీ సభ్యులు.. తమ సేవల్ని మరింత విసృ్తతం చేయడానికి అప్పుడప్పుడు వర్క్షాపులూ నిర్వహిస్తున్నారు. ‘నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో నాకు తెలిసిన చాలామంది, చివరికి అప్పుడే పరిచయమైన వారితో సహా చాలామంది ఐటీ ఉద్యోగాల కోసం రిఫరెన్స్ అడిగేవారు. అర్హత లేక కాదు.. విధానం తెలియక, సరైన ఇన్ఫర్మేషన్ లేక, రకరకాల కారణాలతో ఉద్యోగం పొందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. వెంటనే నాతోటి టెక్కీలతో మాట్లాడి.. అందరం కలిసి మూడేళ్ల క్రితం ఈ సంస్థను నెలకొల్పాం. నా స్నేహితులు శివ, రమేష్, రామకృష్ణ, శ్రీనివాస్ వంటి కీలకపాత్ర పోషించే వారు మరో ఇరవై మంది ఉన్నారు. మా వాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అప్డేట్స్ పంపిస్తారు. దాన్ని బట్టి మా దగ్గరికి వచ్చిన వారికి చాన్స్‌లు ఇప్పిస్తాం’ అని చెప్పారు వరప్రసాద్. కేఎస్పీలో ఉన్న 3,500 మంది సభ్యుల్లో మన దేశానికి చెందిన వారేకాక విదేశీ టెక్కీలూ ఉన్నారు. రిఫరెన్స్‌తో పాటు... ఐటీ ఉద్యోగం కావాలంటూ ఆశ్రయించిన వారికి కేఎస్పీ.. కేవలం రిఫరెన్స్ ఇచ్చి ఊరుకోవడంలేదు. ముందు వారికి కంపెనీకి సంబంధించిన విషయాలను వివరిస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. శ్రీనివాస్ అనే టెక్కీ మాటల్లో చెప్పాలంటే...‘చాలామంది చేతుల్లో అద్భుతమైన మార్కులతో సర్టిఫికెట్లు ఉంటాయి కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. అలాంటి వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాం. ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పించడం చిన్న సాయమే కావొచ్చు. కానీ ప్రతీ టెక్కీ తోటి వ్యక్తికి ఇలాంటి సాయం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికీ వచ్చేలా చేసే ప్రయత్నం చాలా పెద్దది’ అంటారు. టెక్కీ ఉద్యోగాలే కాక, మిగతా రంగాల విద్యార్థులకూ ఉద్యోగ సాయం చేస్తున్న కేఎస్పీ సంస్థ.. పేద విద్యార్థులను చదివించడంలోనూ ముందుంది. ‘యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం డాక్టరుగా పనిచేస్తున్న రామకృష్ణ.. చదువుకునే రోజుల్లో తండ్రి చనిపోవడంతో మెడిసిన్ కోర్సు మధ్యలోనే ఆపేశారు. ఇది తెలిసి మేం వెంటనే అతని చదువుకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఎంబీబీఎస్ పూర్తి చేయించాం’ అని చెప్పారు వరప్రసాద్. ఇతర మార్గాల్లో... ‘చేంజ్ ఆర్గనైజేషన్’ పేరుతో కేఎస్పీలో సభ్యులుగా ఉన్న వారంతా వారాంతాల్లో అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారితో గడిపి వస్తుంటారు. పుట్టిన రోజు వేడుకలు, పండుగల సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాలకార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ‘మా చేతికి చేతనైనంత’ అనే నినాదంతో ముందుకెళ్తున్న వీరు మరికొందరికి ఉపాధి ‘దారి’ చూపించాలని కోరుకుందాం. ప్రెజెంటేషన్: భువనేశ్వరి bhuvanakalidindi@gmail.com -
చీకటి ఖండంలో చిరు దివిటీ..!
‘‘సమాజాన్ని సంస్కరించడం కోసం ఒకరే అంతా చేయనక్కర్లేదు... ప్రతి ఒక్కరూ కొంత బాధ్యత తీసుకొన్నా సమాజం మొత్తం మారిపోతుంది...’’అని అంటాడు విక్టర్ క్వెజడా నవరో. ఇలా అనడమే కాదు, తనవంతు బాధ్యతను తీసుకొని చీకటి ఖండంలో చిన్నపాటి దివిటీగా మారాడితను. చిలీలో పుట్టి కెన్యాలో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న పాతికేళ్ల ఆ యువకుడి కథ ఇది. ఆఫ్రికాలోని కొన్ని దేశాలు... అస్తవ్యస్తమైన పరిస్థితులకు ఆవాసాలు. అక్కడ అన్నీ అవస్థలే. పట్టించుకొనేందుకు ప్రభుత్వాలకు తీరిక లేదు. విలువలు బోధించే గురువులు లేరు. చట్టాలు, న్యాయాలకూ స్థానమే లేదు. ఇటువంటి అనాగరికమైన పరిస్థితుల మధ్య ఉన్న ఆ ప్రాంతంలో నివసించడమే కష్టమైన పని. పచ్చగా కనిపించే ఆ పరిసరాల మధ్య జీవించే ప్రజల జీవితాల్లో అంతా చీకటే. మరి అలాంటి చోట బతికే వాళ్ల పరిస్థితి ఏమిటి? ప్రత్యేకించి చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? అనేది చిన్నప్పటి నుంచి విక్టర్‌కు ఉన్న ఒక మానసిక చింతన. చిలీలో చదువుకొంటున్న రోజుల నుంచి ఆఫ్రికాలోని పరిస్థితుల గురించి అధ్యయనం ప్రారంభించాడు. ఇంటర్నెట్ సాయంతో అక్కడ ఉన్న అరాజక స్థితి గురించి అర్థం చేసుకొన్నాడు. దాదాపు రెండేళ్ల కిందట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆఫ్రికా బయలుదేశాడు. సేవా దృక్పథంతో చీకటి ఖండం దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు. కెన్యా, జింబాబ్వేల మధ్య సరిహద్దు ప్రాంతంలోని పరిస్థితులు నిజంగా ఆ యువకుడిని షాక్ గురి చేశాయి. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలేవీ పనిచేస్తున్న దాఖలాలు కనిపించలేదు. అవినీతి కూపాల్లో మునిగిపోయిన ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం అనే విషయం గురించి ఆలోచించడం లేదు. ఈ విషయంలో ఎవరినో నిందించడం వల్ల, అక్కడి రాజకీయ వ్యవహారాల గురించి బాధ్యత మరచిన ప్రభుత్వాల గురించి అంతర్జాతీయ పత్రికలకు వార్తలు రాయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు... అనే అభిప్రాయం మొదట్లోనే కమ్మేసింది విక్టర్ని. అతడి ఆలోచన అంతా అక్కడి చిన్నారుల దీన స్థితి గురించే! కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న పిల్లలను పరిగణనలోకి తీసుకొని ఒక సర్వే చేసుకొంటే వందకు 75 మంది ఎయిడ్స్ బాధితులే! దాష్టికం ఏమిటంటే బాలికల్లో ఎక్కువమంది లైంగిక దాడులకు గురైన వాళ్లు. చిన్న వయసులోనే అత్యాచారాలకు గురై ఫలితంగా ఎయిడ్స్ బారిన పడ్డవాళ్లు. కొంతమందికి మాత్రం పుట్టుకతోనే ఎయిడ్స్ సోకింది. ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? వాళ్ల పరిస్థితులను ఎలా చక్కదిద్దాలి? అనేది విక్టర్‌కు అప్పటికి ఒక అంతుబట్టని విషయమే అయ్యింది. ఆకలితో బాధపడుతున్న వాళ్లకు అయితే అన్నం పెడితే చాలు... సంస్కారం నేర్పాలంటే చదువు చెప్పే గురువుగా మారవచ్చు... అయితే ఆ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే అందరికీ చికిత్స చేయాలి. కొందరికి మానసికంగా, మరికొందరికి శారీరకంగా. పిల్లలకు అయితే విద్య, పెద్దలకు అయితే కనీస అవగాహన కల్పించాలి... దీనికితోడు తిండి కూడా సమస్యే. పోషకాహారం కాకపోయినా... సరైన ఆహారం అయినా అందించాల్సిన అవసరం ఉంది. ఆ సమయానికి సాధించిన విజయం ఏదైనా ఉంటే... స్థానికులతో మమేకం కావడం. వాళ్లు తనను వెలివేయలేదు. వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిగా తనను గుర్తించారు. ఇటువంటి పరిణామాల మధ్య స్థానికంగా పరిస్థితులను మార్చాలంటే ఆర్థిక శక్తి కావాలనే విషయం విక్టర్‌కు చాలా సులభంగా అర్థమైంది. అందుకోసం అతడు బృహత్తర ప్రయత్నం చేశాడు. అనేక సామాజిక సేవా సంస్థలకు, సామాజిక సేవ కులకు లేఖలు రాయడం మొదలు పెట్టాడు. తను వచ్చిన ప్రాంతంలోని పరిస్థితుల గురించి వివరిస్తూ... ఏదో విధమైన సాయాన్ని చేయాలని... ఆర్థికంగా అండగా నిలబడటమో లేక వైద్య, విద్య, పోషకాహారం వంటి విషయాల్లో సహాయం చేయడమో చేయాలని విక్టర్ కోరాడు. ఈ విజ్ఞప్తితోనే వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపు ఐదువందల లేఖలు రాసిపంపాడట. అయితే వాటికి స్పందన అంత సులభంగా రాలేదు. చాలా మంది ఇదంతా మామూలే కదా.. అని అభిప్రాయంతో విక్టర్ లేఖలను నిర్లక్ష్యం చేశారు. అయితే కొంతమంది మాత్రం సానుకూలంగా స్పందించారు. కొందరు వలంటీర్లుగా ముందుకు వస్తే... మరికొందరు వైద్య పరమైన , విద్యకు సంబంధించిన వితరణతో అండగా నిలిచారు. కొన్ని సంస్థల నుంచి ఆర్థికంగా అండ లభించింది. ఒక్కొక్కటికీ అందుబాటులోకి వస్తున్న వనరులను సమకూర్చుకొంటూ అక్కడి పిల్లల పరిస్థితి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు విక్టర్. ఇప్పటి వరకూ దాదాపు 150 మంది చిన్నారుల కోసం ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పటం మంచి తిండి పెట్టడం వరకూ ఈ యువకుడు విజయం సాధించాడు. 150 అనే సంఖ్య చాలా చిన్నదిగా కనిపించవచ్చు. అయితే ఆ దుర్భరమైన పరిస్థితుల నుంచి అంతమందిని బయటకు తీసుకురావడం విక్టర్ సాధించిన అద్వితీయ విజయంగా చెప్పవచ్చు. ఈ విజయం నుంచి తనకు తానే స్ఫూర్తి పొందుతూ మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. - జీవన్ -
ఆ ఇద్దరు!
ఆ ప్రేమికుల గురించి చెప్పగానే... సినిమా కథ గుర్తు రావచ్చు. ‘‘నిజజీవితంలో ఇలాంటి వారు కూడా ఉంటారా?’’ అని అనుమానం కూడా రావచ్చు. అణుమాత్రం సందేహం లేదు. ఇది నిజమైన కథ. నిజాయితీ నిండిన తిలక్, ధనల ప్రేమ, పెళ్లి కథ. *********** వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ‘నువ్వు లేకపోతే నేను బతకలేను’లాంటి భారీ డైలాగులేవీ చెప్పుకోలేదు. ‘పేద వాళ్ల కోసం బతకాలి’ అనుకున్నారు. చెన్నైకి చెందిన తిలక్, ధనలకు మొదటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహంగా మారింది. ధన పెళ్లిచేసుకోవాలనుకోలేదు. కారణం...సామాజిక సేవ, వన్యప్రాణి సంరక్షణ అంటే ఆమెకు ఇష్టం. వాటికి సంబంధించిన పనుల్లో చురుగ్గా పాల్గొవాలనేది ఆమె ఆలోచన. తిలక్‌కు పెళ్లి ఆలోచన ఎప్పుడూ లేదు. కారణం....ఆధ్యాత్మిక, సామాజిక కార్యకలాపాలలోనూ, ట్రెక్కింగ్ లాంటి సాహసిక పనుల్లో కాలం గడపాలని ఆయన ఆలోచన. దేవుడు...ఈ ఇద్దరినీ చూసి నవ్వి ఉంటాడు. మంచి ఆలోచనలు ఉన్న ఈ ఇద్దరికీ పెళ్లి చేస్తే లోకానికి మేలు జరుగుతుందని కూడా అనుకొని ఉంటాడు! *********** ‘సేవై కరంగళ్’ పేరుతో పిల్లల సంక్షేమానికి సంబంధించిన రకరకాల కార్యక్రమాలను చెన్నైలో నిర్వహించేవాడు తిలక్. ‘సేవై కరంగళ్’ సంస్థ పనితీరు కూడా భిన్నంగా ఉండేది. ఎంతో కొంత సహాయం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా పిల్లల చదువులు, ఆరోగ్యం...ఇలా అన్ని విషయాలలో పిల్లలతో మమేకమయ్యేది. అలాగే ‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ ద్వారా ఒక సహకారం కూడా తీసుకుంది సంస్థ. ‘చెన్నై ట్రెక్కింగ్ క్లబ్’ తరపున ఎంతో మంది ‘చిల్డ్రన్స్ హోం’లలో తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని పిల్లలకు కానుకలు, వారి సంక్షేమానికి విరాళాలు ఇచ్చేవారు. తమతో పాటు పిల్లలను ట్రెక్కింగ్‌కు తీసుకువెళ్లేవాళ్లు. వాళ్లలో సంతోషం నింపేవాళ్లు. ‘‘పిల్లలకు కావాల్సింది తిండి, బట్ట మాత్రమే కాదు. ప్రేమ, ఆత్మీయతలు కూడా’’ అని చెప్పే తిలక్ ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎక్కడైనా ‘చిల్డ్రన్స్ హోమ్’లు పిల్లలతో కిక్కిరిసి ఉన్నాయంటే, మరిన్ని గదుల నిర్మాణం కోసం నిధులు సేకరించి కొత్త గదులు కట్టించేవాడు. సేవాకార్యక్రమాలే కాకుండా పిల్లల్లో సృజనాత్మకతను తీర్చిదిద్దడానికి ‘నేవిగేటర్’ పేరుతో ఒక సంస్థను కూడా నిర్వహించాడు. ఎక్కడ... ఏ చిల్డ్రన్ హోంలో మౌలిక వసతులు సరిగా లేకపోయినా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపాదికన రంగంలోకి దిగేవాడు. నాలుగు సంవత్సరాల కాలంలో చైల్డ్‌హోమ్, వృద్ధాశ్రమాలకు తిలక్ అందించిన సహకారం గురించి చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితాయే అవుతుంది. తిలక్ వ్యక్తిగత విషయానికి వస్తే, అతనేమీ సంపన్న కుటుంబం నుంచి రాలేదు. పేద కుటుంబం నుంచే వచ్చాడు. అతని హృదయం మాత్రం సంపన్నమైంది. ధన కూడా అంతే. *********** పెళ్లే వద్దనుకున్న ధన కాస్తా తిలక్ విశిష్ట వ్యక్తిత్వాన్ని చూసి ముచ్చటపడింది. ఒకానొక రోజు ‘‘మనం పెళ్లి చేసుకుందాం’’ అని ప్రతిపాదన పెట్టింది. ‘‘వద్దు’’ అనదగిన కారణం ఒక్కటీ అతనికి కనిపించలేదు. ఆమె ఆసక్తులు, అభిరుచులు కూడా తన లాంటివే! ‘‘తప్పకుండా’’ అన్నాడు సంతోషంగా. కానీ రెండు వైపులా కుటుంబ పెద్దలను ఒప్పించడానికి రెండు సంవత్సరాలు ఓపిక పట్టారు. ఈమధ్య కాలంలో ప్రేమికులుగా మాత్రమే ఉండిపోయారు. పెద్దలకు తమ భావాలను అర్థం చేయించే ప్రయత్నం చేయించారు తప్ప ‘ఈ పెద్దలు ఉన్నారే..’ అని అనుకోలేదు. ఓపికతో ఎదురుచూశారు. ఎట్టకేలకు పెద్దలు ఒప్పుకున్నారు. సాధారణంగా మనం చూసే ‘పెళ్లిళ్ళ’తో పోలిస్తే ఆ పెళ్లికి ఎక్కడా పోలిక, పొంతన లేదు. నిరాడంబరంగా జరిగింది. విశేషం ఏమిటంటే ఈ పెళ్లివేడుక పేద పిల్లల చదువులకు ఉద్దేశించిన నిధుల సమీకరణకు వేదిక అయింది. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన రీతిలో వారు విరాళాలు ఇచ్చారు. పెళ్లికి ముఖ్య అతిథులుగా...చెన్నైలోని ఎనిమిది ‘చిల్డ్రన్స్ హోమ్స్’ నుంచి పిల్లలు వచ్చారు. పెళ్లి పందిరిలో వధువు తన ఒడిలో కూర్చోబెట్టుకున్న ఆరు నెలల అమ్మాయి గురించి అందరూ ఆసక్తిగా ఆరా తీయడం ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు ‘థెరిసా’ హెచ్ఐవి సోకిన ఒక టీనేజ్ అమ్మాయికి పుట్టిన బిడ్డ. ‘థెరిసా’ను పెళ్లికి ముందే దత్తత తీసుకున్నారు ధన, తిలక్‌లు. ‘‘చాలా కాలం తరువాత నా మనసుకు నచ్చిన పెళ్లికి వచ్చాను. మన దేశంలో ఎందరికో స్ఫూర్తినిచ్చే పెళ్లి ఇది’’ అన్నాడు పెళ్లికి వచ్చిన ఒక అతిథి. ఇది ఆయన అభిప్రాయం మాత్రమే కాదు...పెళ్లికి వచ్చిన అందరి అభిప్రాయం. *********** తిలక్, ధనలు కలిసికట్టుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నారనేది ఒక కోణం అయితే, చాలామంది యువకులకు వీరి పెళ్లి స్ఫూర్తిగా నిలిచింది. సేవాస్పృహ ఉన్న యువకులు తిలక్-ధనల తరహాలోనే వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తిలక్, ధనలు కలిసి ఏడడుగులు మాత్రమే వేయలేదు. చాలామందికి స్ఫూర్తినిచ్చే ఒక కొత్త అడుగు కూడా వేశారు! -
కానుకనువేలం పెట్టిన నమ్రత
సామాజిక సేవా కార్యక్రమాల కోసం నటీనటులు తమకు తోచిన రీతిలో సాయపడడం తరచూ జరిగేదే. నటుడు మహేశ్‌బాబు భార్య, మాజీ నటి అయిన నమ్రతా శిరోద్కర్ సైతం ఇప్పుడు ఆ బాటపట్టారు. స్వతహాగా పెయింటింగ్‌ల సేకరణపై ఆసక్తి ఉన్న ఈ మాజీ మిస్ ఇండియా ఇప్పుడు తన దగ్గరున్న ప్రసిద్ధ వర్ణచిత్రాల్ని వేలం వేయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును పిల్లల బాగు కోసం కృషి చేసే ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్’ అనే సేవాసంస్థకు అందించనున్నారు. ఈ నెల 27న జరగనున్న ‘బిడ్ అండ్ హ్యామర్’ వేలంలో తన దగ్గరున్న ప్రసిద్ధ కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్‌ను విక్రయించాలని నమ్రత నిర్ణయించుకున్నారు. దాదాపు పదిహేనేళ్ళ క్రితమే హుస్సేన్ సాబ్తో ఆమెకు పరిచయముంది. ‘‘ఆయన రూపొందించిన ‘గజగామిని’ చిత్రంలో మా అక్కయ్య శిల్పా శిరోద్కర్ నటించింది. ఆ సమయంలో ఆయన తరచూ వస్తూ ఉండేవారు. అలా అప్పుడు ఆయనను కలుసుకొంటూ ఉండేదాన్ని’’ అని నమ్రత గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన శిల్పకూ, నమ్రతకూ తన పెయింటింగ్‌లు కొన్ని కానుకగా ఇచ్చారు. ‘‘ఒకసారి పిచ్చాపాటీ మాట్లాడుతూ, ఆయన గీసిన బొమ్మ కావాలని అడిగాను. ఆ తరువాత కొద్ది రొజులకే ఆయన తాను గీసిన గుర్రపు బొమ్మల పెయింటింగ్‌ను కానుకగా ఇచ్చారు. అంతేకాకుండా, ‘చినూకు... ప్రేమతో’ అని సంతకం పెట్టి మరీ ఇచ్చారు’’ అని ఈ మాజీ హీరోయిన్ వివరించారు. ‘సిగ్నిఫికెంట్ ఇండియన్ ఆర్ట్’ పేరిట ఈ నెలాఖరులో జరగనున్న వేలంలో దాన్ని నమ్రత విక్రయిస్తున్నారు. హుస్సేన్ గీసిన ఈ గుర్రాల సిరీస్ పెయింటింగ్‌లే కాక, 8వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్య కాలంలోని గొప్ప భారతీయ పెయింటర్లయిన నందలాల్ బోస్, రాధాదేవి గోయెంకా లాంటి పలువురి వర్ణచిత్రాలను కూడా విక్రయించనున్నారు. నిజానికి, ఇంటి గోడలకు పెయింటింగ్‌లు అలంకరించి పెట్టుకోవడమంటే నమ్రతకు ఇష్టం. అయితే, ఎప్పటికప్పుడు కొత్త పెయింటింగ్‌లు తెచ్చి, ఇంటిని కొత్తగా తీర్చిదిద్దుకోవడం ఈ మహారాష్ట్ర వనితకు అలవాటు. ఆ రకంగా ఎంతో మంది కళాకారుల వర్ణచిత్రాలను ఆమె సేకరించారు. ‘‘పేరొందిన ఈ వేలంలో పాల్గొనాల్సిందిగా మా మిత్రులు ఒకరు నాకు నచ్చజెప్పారు. వేలం ద్వారా వచ్చిన సొమ్ము ‘హీల్ ఎ చైల్డ్’ ద్వారా సేవా కార్యక్రమాలకు వెళుతుంది కాబట్టి, నేను కూడా ఆనందంగా ఒప్పుకున్నాను’’ అని నమ్రత చెప్పారు. అన్నట్లు, మహేశ్‌బాబు సైతం ఈ సంస్థకు అండదండలందిస్తూ ఉంటారు. మొత్తానికి, సంపాదించి కూర్చోవడంతో సరిపెట్టుకోకుండా, వీలైనంత మేర సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఈ స్టార్ దంపతులు అనుకోవడం మంచి విషయమేగా! -
‘సర్వీస్’లో భేష్
లక్ష్మీదేవిపల్లి(కొత్తగూడెం), న్యూస్‌లైన్ : విధి నిర్వహణలో తనదైన శైలిలో నిత్యం రేయింబవళ్లు చురుకైన పాత్ర పోషిస్తూ అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు కొత్తగూడెం 108 పెలైట్ గంగ ఉమాశంకర్. ఏ సమయంలో ఫోన్ వచ్చినా సరై విసుగనేది లేకుండా క్షణాల్లో సంఘటన స్థలానికి చేరుకుని ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలించడమే కాకుండా వారికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. కొత్తగూడెం రామవరంలోని సీఆర్పీ క్యాంప్‌కు చెందిన గంగ ఉమాశంకర్ ఏడు సంవత్సరాలుగా 108 పెలైట్‌గా పని చేస్తున్నాడు. ఆయన నిత్యం పలు సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పలువురు అధికారులు, వ్యాపారులు, పలు సంఘాల నుంచే కాక 108 మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి గుర్తింపు పొందారు. డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇంటిపేరే ‘108’గా మారి... జిల్లావ్యాప్తంగా 108 వాహనాలు 32 ఉన్నా యి. ఒక్కో వాహనంలోని ఐదుగురు సిబ్బం ది పనిచేస్తున్నారు. కొత్తగూడెం వాహనంలో గంగ ఉమాశంకర్ పెలైట్‌గా పని చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. విధి నిర్వహణలో క్రమశిక్షణగా ఉంటూ ఇంటి పేరునే 108గా మార్చుకున్నాడు. ఉమాశంకర్ ఏడు సంవత్సరాలుగా ఎంతో మంది క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి కాపాడాడు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నో అవార్డులు.. సన్మానాలు... విధి నిర్వహణలో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉమాశంకర్‌కు ఎన్నో అవార్డులు దక్కాయి. 2008లో కొత్తగూడెం డీఎస్పీ, ఆర్డీఓ చేతులు మీదుగా భగవద్గీతను అందుకున్నారు. 2009లో జిల్లా మేనేజ్మెంట్ చేతులు మీదుగా మెమోంటో, 2011లో అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 2013లో అప్పటి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అదే ఏడాది జీవికే ఈఎంఆర్ఐ ఆర్ఎల్ఓ సిద్ధార్థ భట్టాచార్య చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. అదే ఏడాది జీ. వెంృటకష్ణారెడ్డి చేతుల మీదుగా నేషనల్ లైఫ్ సేవియర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు వచ్చినందుకు 2013లో కొత్తగూడెం సింగరేణి డెరైక్టర్ విజయ్‌కుమార్ చేతులు మీదుగా జ్ఞాపికను అందుకున్నారు. ఇవే కాక పట్టణంలోని పలువురు ఆయనను సన్మానించారు. బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. -
ఆయనే నాకు స్ఫూర్తి!
మా ఆయన బంగారం ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, ప్రోత్సహించడంలో షారుక్‌ఖాన్ ముందుంటారు. సామాజిక సేవాకార్యక్రమాలలో పాల్గొనడానికి నన్ను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తారు. అవసరమైన సలహాలు ఇస్తారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు షారుక్. సమాజసేవ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి. క్రమశిక్షణ, కష్టపడే తత్వాన్ని తన సక్సెస్మంత్రగా చేసుకున్నారు షారుక్. బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎంత కష్టాన్నయినా తేలికగా తీసుకుంటారు. కొన్నిసార్లు మాత్రం చిన్న విషయాలకు భావోద్వేగాలకు గురవుతారు. ‘‘కొత్తవాళ్ల ముందు మాట్లాడడానికి నాకు బెరుకు’’ అంటారుగానీ ఒక్కసారి వాళ్లకు దగ్గరైతే చాలు సన్నిహితమైపోతారు. వాళ్ల కష్టసుఖాల్లో భాగం అవుతారు.పిల్లలకు మించిన బెస్ట్‌ఫ్రెండ్స్ అతనికి ఈ లోకంలో ఎవరూ లేరు. మౌనంగా ఉండడం షారుక్‌కు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎవరూ లేకపోతే పెంపుడు జంతువుల దగ్గరికి వెళ్లి మరీ ముచ్చటపెడతారు! - గౌరీఖాన్