హైటెక్ స్టాలిన్స్ | High-tech stalins | Sakshi
Sakshi News home page

హైటెక్ స్టాలిన్స్

Published Tue, Nov 11 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

హైటెక్    స్టాలిన్స్

హైటెక్ స్టాలిన్స్

‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
 సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను
 పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న మూడో కథనమిది. ఒకరి సాయం పొందిన వ్యక్తి  మరికొందరికి సాయం చేయాలి. అలా ఒకరికొకరు.. ‘స్టాలిన్’ సినిమాలోని కాన్సెప్ట్ మాదిరిగా పనిచేస్తోంది  కేఎస్‌పీ సంస్థ. టెక్కీ జాబ్స్ రూపంలో ఎందరికో లక్కీచాన్స్‌లు ఇప్పిస్తున్న ఆ సంస్థ పరిచయం..
 
చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించడం అంత ఈజీ కాదు. లక్షలు వెచ్చించి చదువు‘కొన’డమే సులభం కానీ, దానికి తగ్గ జాబ్ దక్కించుకోవడమే కష్టం. ఇక టెక్కీ జాబ్స్ గురించైతే చెప్పనవసరం లేదు. అదృష్టం బాగుంటే క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే ఓకే. లేదంటే...‘టెక్కీ’ డ్రీమ్ నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం కోసం ఐటీ కంపెనీల చుట్టూ చక్కర్లు కొట్టే ఇంజనీరింగ్ కుర్రాళ్లు మన కంటికి కనిపించినప్పుడల్లా...పాపం లక్షలు పోసి చదువుకున్నారు... ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటని అనిపిస్తుంటుంది. ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇప్పించడానికే నడుం బిగించారు కొందరు టెక్కీలు. వాళ్లలోని ‘సాఫ్ట్’ కార్నర్ ఇదీ..
 ఒకరు మరొకరికి..

సాంబశివ అనే టెక్కీ ఈ మధ్యనే రమ్య అనే అమ్మాయికి యూహెచ్‌సీ (యునెటైడ్ హెల్త్ గ్రూప్)లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పించాడు. ఆ క్షణం రమ్యకు సాంబశివ చెప్పిన మాటొక్కటే. ‘ఉద్యోగం కోసం ఎదురుచూసే మరో టెక్కీకి ఇలాంటి సాయం చేయి చాలు’ అని. ఎందుకంటే రెండేళ్ల క్రితం సాంబశివకి మరో టెక్కీనే ఉద్యోగం ఇప్పించాడు. అతని పేరు వరప్రసాద్. సాఫ్ట్‌వేర్ రంగంలో చేరాలనుకునే వారు అవగాహన లోపం వల్ల ఉద్యోగాలు సంపాదించ లేకపోతున్నారు. అలాంటి వారికి చేయూతనిచ్చేందుకు వరప్రసాద్.. కృష్ణదేవరాయ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేఎస్‌పీ) అనే స్వచ్ఛంద సంస్థని నెలకొల్పారు. 4 వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ ఉద్యోగ కల్పనతో పాటు వివిధ సేవలూ అందిస్తోంది.

విదేశీ టెక్కీలు సైతం...

ఇప్పటి వరకు తొంభై మందికి ఉద్యోగాలు ఇప్పించిన కేఎస్‌పీ సభ్యులు.. తమ సేవల్ని మరింత విసృ్తతం చేయడానికి అప్పుడప్పుడు వర్క్‌షాపులూ నిర్వహిస్తున్నారు. ‘నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో నాకు తెలిసిన చాలామంది, చివరికి అప్పుడే పరిచయమైన వారితో సహా చాలామంది ఐటీ ఉద్యోగాల కోసం రిఫరెన్స్ అడిగేవారు. అర్హత లేక కాదు.. విధానం తెలియక, సరైన ఇన్ఫర్మేషన్ లేక, రకరకాల కారణాలతో ఉద్యోగం పొందలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది. వెంటనే నాతోటి టెక్కీలతో మాట్లాడి.. అందరం కలిసి మూడేళ్ల క్రితం ఈ సంస్థను నెలకొల్పాం. నా స్నేహితులు శివ, రమేష్, రామకృష్ణ, శ్రీనివాస్ వంటి కీలకపాత్ర పోషించే వారు మరో ఇరవై మంది ఉన్నారు. మా వాళ్లంతా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు. ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అప్‌డేట్స్ పంపిస్తారు. దాన్ని బట్టి మా దగ్గరికి వచ్చిన వారికి చాన్స్‌లు ఇప్పిస్తాం’ అని చెప్పారు వరప్రసాద్. కేఎస్‌పీలో ఉన్న 3,500 మంది సభ్యుల్లో  మన దేశానికి చెందిన వారేకాక విదేశీ టెక్కీలూ ఉన్నారు.

రిఫరెన్స్‌తో పాటు...

ఐటీ ఉద్యోగం కావాలంటూ ఆశ్రయించిన వారికి కేఎస్‌పీ.. కేవలం రిఫరెన్స్ ఇచ్చి ఊరుకోవడంలేదు. ముందు వారికి కంపెనీకి సంబంధించిన విషయాలను వివరిస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. శ్రీనివాస్ అనే టెక్కీ మాటల్లో చెప్పాలంటే...‘చాలామంది చేతుల్లో అద్భుతమైన మార్కులతో సర్టిఫికెట్లు ఉంటాయి కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా ఉండవు. అలాంటి వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాం. ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పించడం చిన్న సాయమే కావొచ్చు. కానీ ప్రతీ టెక్కీ తోటి వ్యక్తికి ఇలాంటి సాయం చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికీ వచ్చేలా చేసే ప్రయత్నం చాలా పెద్దది’ అంటారు. టెక్కీ ఉద్యోగాలే కాక, మిగతా రంగాల విద్యార్థులకూ ఉద్యోగ సాయం చేస్తున్న కేఎస్‌పీ సంస్థ.. పేద విద్యార్థులను చదివించడంలోనూ ముందుంది. ‘యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం డాక్టరుగా పనిచేస్తున్న రామకృష్ణ.. చదువుకునే రోజుల్లో తండ్రి చనిపోవడంతో మెడిసిన్ కోర్సు మధ్యలోనే ఆపేశారు. ఇది తెలిసి మేం వెంటనే అతని చదువుకి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఎంబీబీఎస్ పూర్తి చేయించాం’ అని చెప్పారు వరప్రసాద్.
 
ఇతర మార్గాల్లో...

‘చేంజ్ ఆర్గనైజేషన్’ పేరుతో కేఎస్‌పీలో సభ్యులుగా ఉన్న వారంతా వారాంతాల్లో అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడి వారితో గడిపి వస్తుంటారు. పుట్టిన రోజు వేడుకలు, పండుగల సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బాలకార్మికుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ‘మా చేతికి చేతనైనంత’ అనే నినాదంతో ముందుకెళ్తున్న వీరు మరికొందరికి ఉపాధి ‘దారి’ చూపించాలని కోరుకుందాం.
 
 ప్రెజెంటేషన్: భువనేశ్వరి
 bhuvanakalidindi@gmail.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement