విజయ్‌కి ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమాన గణం ఉంది. అదేవిధంగా విజయ్ చాలా కాలం నుంచి తన విజయ్ మక్కళ్ ఇయక్కమ్ (విజయ్ ప్రజా సంఘం) సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో విజయ్ రాజకీయ రంగప్రవేశం తథ్యం అనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శనివారం ఉదయం తమిళనాడులోని 234 నియోజకవర్గాలలో పది, ప్లస్‌టూ తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలను అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. చైన్నె, నీలాంగరై ప్రాంతంలో భారీ ఎత్తున నిర్వహించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ వేదికపై విజయ్ ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తలా రూ.25 వేలు, ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.15వేలు, తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రూ.10వేల నగదు అందించారు. అదేవిధంగా ప్లస్‌టూలో రాష్ట్రంలోనే 600లకు 600 మార్కులు పొందిన దిండిక్కల్ చెందిన నందిని అనే విద్యార్థినికి డైమండ్ నెక్లెస్ బహూకరించారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సహించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విజయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మీ వద్ద అడవినైనా లాక్కుంటారు... డబ్బు వున్నా దోచుకుంటారని, విద్య మాత్రమే నిరంతరం అని అన్నారు. విద్యార్థులు కచ్చితంగా రాజకీయ నాయకుల గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా అంబేడ్కర్, పెరియార్, కామరాజ్ వంటి గొప్ప నాయకుల గురించి తెలుసుకోవాలన్నారు. డబ్బుపోయినా పర్వాలేదని, అనారోగ్యంతో కొంతే నష్టపోతామని అయితే గుణాన్ని కోల్పోతే జీవితమే ఉండదని ఆయన అన్నారు. ఇక్కడ మన వేళ్లతోనే మన కళ్లు పొడిచేవారు ఉంటారని, కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని అన్నారు.
మీరే భావితర పౌరులని, ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు అని పేర్కొన్నారు. మంచి నాయకులను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నోటుకు ఓటు సంస్కృతికి స్వస్తి చెప్పాలన్నారు. తమిళనాడులో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఓటుకు నోటులు తీసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేయాలన్నారు. మీ ప్రయత్నం తప్పక ఫలిస్తుందనే నమ్మకాన్ని విజయ్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment