
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ రెగ్యూలర్‌గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్‌కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్‌కు మదురైలో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్‌ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్‌కు జననాగయం సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్ అభిమానులకు కమిషనర్ లోకనాథన్ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్‌ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు.
తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్‌ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్‌ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం.