
ఏ రంగంలోనైనా, ఎవరినీ అంచనా వేయలేం. సినిమా తారల విషయంలోనూ అంతే. ఎవరికి ఎప్పుడు? ఏ భాషలో అవకాశాలు వరిస్తాయో చెప్పడం కష్టం. ఫరియా అబ్దుల్లా విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ తెలుగమ్మాయి జాతి రత్నాలు అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. అందులో చిట్టి పాత్రలో ఆమె సూపర్‌గా మెప్పించారు. ఆ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. దీంతో 'ఫరియా అబ్దుల్లా'(Faria Abdullah) పంట పండినట్లే అవకాశాలు వరుస కడతాయి అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆమెకు అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అలా రవితేజతో కలిసి రావణాసుర చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.

కొంత గ్యాప్ తరువాత అల్లరి నరేశ్‌కు జంటగా ఆ ఒక్కటీ అడగొద్దు చిత్రంలో నటించారు. అదీ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఫరియా కోలీవుడ్‌పై దృష్టి సారించారు. ఇక్కడ విజయ్ ఆంటోనికి జంటగా వళ్లి మయిల్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడిని మరో లక్కీచాన్స్ వరించిందన్నది తాజా సమాచారం. విజయ్ వారసుడు 'జసన్ సంజయ్' మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఈయన దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.
ఇందులో నటించే కథానాయకి ఎవరన్న విషయంపై పలువురు స్టార్ హీరోయిన్ల పేరు ప్రచారం అయ్యారు. అలాంటిది చివరికి తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లాకు ఆ అవకాశం దక్కిందని తెలిసింది. కాగా తొలి చిత్రం విడుదలకు ముందే మరో అవకాశం వరించడం ఫరియా అదృష్టమేనని చెప్పాలి. ఈమె నటిస్తున్న వళ్లి మయిల్, తాజాగా విష్ణువిశాల్‌కు జంటగా నటిస్తున్న చిత్రాలు కోలీవుడ్‌లో ఎలాంటి పేరు తెచ్చిపెడతాయో చూడాలి.