
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో అభిమానులు భగ్గుమన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీ ఆవిర్భవించి ఏడాది కాలం పూర్తయిన విషయం తెలిసిందే. బుధవారం 2వ వసంతంలోకి పార్టీ ప్రస్తుతం అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈసీఆర్‌లోని మహాబలిపురం సమీపంలో ఉన్న పూంజేరి గ్రామంలో ఉన్న రిసార్ట్‌లో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు పార్టీ తరపున జిల్లాల కార్యదర్శులు, 2,500 మంది ముఖ్య నిర్వాహకులను మాత్రమే ఆహ్వానించారు.
వేదికపై జిల్లాల కార్యదర్శులు, రాష్ట్ర నేతలు ఆశీనులయ్యారు. తమిళ హక్కులు, భాషా అభిమానం, రాజకీయ శాసనాలు, మత సామరస్యం, సహోదరత్వం తదితర అంశాల పరిరక్షణ లక్ష్యంగా గుండెల మీద చేతులు వేసుకుని నేతలందరూ ప్రతిజ్ఞ చేసినానంతరం సమావేశం ప్రారంభమైంది. ఇటీవల వీసీకేను వీడి టీవీకేలో చేరిన ఆదవ అర్జునన్ మాట్లాడుతూ, ప్రస్తుతం బలంగా ఉన్న డీఎంకే కూటమిలో మున్ముందు బీటలు వారనున్నట్టు పేర్కొంటూ, ఇక విజయ్‌ను దళపతి అని కాకుండా తలైవా అని పిలుద్దామని సూచించారు.
తమిళనాడులో 1967, 1977 ఎన్నికల చరిత్రను పునరావృతం చేసే విధంగా 2026లో మార్పు తథ్యం అని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. మరో చరిత్రను సృష్టించే విధంగా విజయ బావుటా ఎగుర వేస్తామన్నారు. త్వరలో బూత్ కమిటీ మహానాడు నిర్వహించబోతున్నామని, ఇదే తమిళగ వెట్రికళగం బలాన్ని చాటే వేదిక కానున్నట్టు వ్యాఖ్యలు చేశారు. టీవీకే గెలుపు అన్నది ఇక్కడున్న వారి చేతులలోనే కాదు, ఈ రాష్ట్ర ప్రజల చేతులలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్త పడే శ్రమ మీదే అది ఆధారపడి ఉందన్నారు.
విజయ్ ఇంటిపై చెప్పు విసిరిన యువకుడు
మహాబలిపురంలో విజయ్ సభ జరుగుతున్న సమయంలో చాలామంది అభిమానులు టీవీల ముందు కూర్చొన్నారు. తమ అభిమాన హీరో రాజకీయ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తుండగా ఆయన ఇంటిపై ఒక యువకుడు చెప్పు విసరడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంటి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి, అకస్మాత్తుగా చెప్పును ఇంటిలోకి విసిరాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ ఆ వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అతను అక్కడి నుంచి పరారీ అయ్యాడు. అయితే, అతనొక మానసిక రోగి అని కొందరు చెబుతున్నారు. ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జకీయ దురుద్దేశంతో కావాలనే ఎవరో ఈ పని చేసి ఉంటారని విజయ్ అభిమానులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment