చీకటి ఖండంలో చిరు దివిటీ..!
‘‘సమాజాన్ని సంస్కరించడం కోసం ఒకరే అంతా చేయనక్కర్లేదు... ప్రతి ఒక్కరూ కొంత బాధ్యత తీసుకొన్నా సమాజం మొత్తం మారిపోతుంది...’’అని అంటాడు విక్టర్ క్వెజడా నవరో. ఇలా అనడమే కాదు, తనవంతు బాధ్యతను తీసుకొని చీకటి ఖండంలో చిన్నపాటి దివిటీగా మారాడితను. చిలీలో పుట్టి కెన్యాలో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న పాతికేళ్ల ఆ యువకుడి కథ ఇది.
ఆఫ్రికాలోని కొన్ని దేశాలు... అస్తవ్యస్తమైన పరిస్థితులకు ఆవాసాలు. అక్కడ అన్నీ అవస్థలే. పట్టించుకొనేందుకు ప్రభుత్వాలకు తీరిక లేదు. విలువలు బోధించే గురువులు లేరు. చట్టాలు, న్యాయాలకూ స్థానమే లేదు. ఇటువంటి అనాగరికమైన పరిస్థితుల మధ్య ఉన్న ఆ ప్రాంతంలో నివసించడమే కష్టమైన పని. పచ్చగా కనిపించే ఆ పరిసరాల మధ్య జీవించే ప్రజల జీవితాల్లో అంతా చీకటే. మరి అలాంటి చోట బతికే వాళ్ల పరిస్థితి ఏమిటి? ప్రత్యేకించి చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? అనేది చిన్నప్పటి నుంచి విక్టర్‌కు ఉన్న ఒక మానసిక చింతన. చిలీలో చదువుకొంటున్న రోజుల నుంచి ఆఫ్రికాలోని పరిస్థితుల గురించి అధ్యయనం ప్రారంభించాడు. ఇంటర్నెట్ సాయంతో అక్కడ ఉన్న అరాజక స్థితి గురించి అర్థం చేసుకొన్నాడు.
దాదాపు రెండేళ్ల కిందట గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆఫ్రికా బయలుదేశాడు. సేవా దృక్పథంతో చీకటి ఖండం దిశగా ప్రయాణం మొదలు పెట్టాడు. కెన్యా, జింబాబ్వేల మధ్య సరిహద్దు ప్రాంతంలోని పరిస్థితులు నిజంగా ఆ యువకుడిని షాక్ గురి చేశాయి. అక్కడ ప్రభుత్వ వ్యవస్థలేవీ పనిచేస్తున్న దాఖలాలు కనిపించలేదు. అవినీతి కూపాల్లో మునిగిపోయిన ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం అనే విషయం గురించి ఆలోచించడం లేదు.
ఈ విషయంలో ఎవరినో నిందించడం వల్ల, అక్కడి రాజకీయ వ్యవహారాల గురించి బాధ్యత మరచిన ప్రభుత్వాల గురించి అంతర్జాతీయ పత్రికలకు వార్తలు రాయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు... అనే అభిప్రాయం మొదట్లోనే కమ్మేసింది విక్టర్‌ని. అతడి ఆలోచన అంతా అక్కడి చిన్నారుల దీన స్థితి గురించే!
కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న పిల్లలను పరిగణనలోకి తీసుకొని ఒక సర్వే చేసుకొంటే వందకు 75 మంది ఎయిడ్స్ బాధితులే! దాష్టికం ఏమిటంటే బాలికల్లో ఎక్కువమంది లైంగిక దాడులకు గురైన వాళ్లు. చిన్న వయసులోనే అత్యాచారాలకు గురై ఫలితంగా ఎయిడ్స్ బారిన పడ్డవాళ్లు. కొంతమందికి మాత్రం పుట్టుకతోనే ఎయిడ్స్ సోకింది.
ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? వాళ్ల పరిస్థితులను ఎలా చక్కదిద్దాలి? అనేది విక్టర్‌కు అప్పటికి ఒక అంతుబట్టని విషయమే అయ్యింది. ఆకలితో బాధపడుతున్న వాళ్లకు అయితే అన్నం పెడితే చాలు... సంస్కారం నేర్పాలంటే చదువు చెప్పే గురువుగా మారవచ్చు... అయితే ఆ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే అందరికీ చికిత్స చేయాలి. కొందరికి మానసికంగా, మరికొందరికి శారీరకంగా.
పిల్లలకు అయితే విద్య, పెద్దలకు అయితే కనీస అవగాహన కల్పించాలి... దీనికితోడు తిండి కూడా సమస్యే. పోషకాహారం కాకపోయినా... సరైన ఆహారం అయినా అందించాల్సిన అవసరం ఉంది. ఆ సమయానికి సాధించిన విజయం ఏదైనా ఉంటే... స్థానికులతో మమేకం కావడం. వాళ్లు తనను వెలివేయలేదు. వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తిగా తనను గుర్తించారు. ఇటువంటి పరిణామాల మధ్య స్థానికంగా పరిస్థితులను మార్చాలంటే ఆర్థిక శక్తి కావాలనే విషయం విక్టర్‌కు చాలా సులభంగా అర్థమైంది.
అందుకోసం అతడు బృహత్తర ప్రయత్నం చేశాడు. అనేక సామాజిక సేవా సంస్థలకు, సామాజిక సేవ కులకు లేఖలు రాయడం మొదలు పెట్టాడు. తను వచ్చిన ప్రాంతంలోని పరిస్థితుల గురించి వివరిస్తూ... ఏదో విధమైన సాయాన్ని చేయాలని... ఆర్థికంగా అండగా నిలబడటమో లేక వైద్య, విద్య, పోషకాహారం వంటి విషయాల్లో సహాయం చేయడమో చేయాలని విక్టర్ కోరాడు.
ఈ విజ్ఞప్తితోనే వివిధ సంస్థలకు, వ్యక్తులకు దాదాపు ఐదువందల లేఖలు రాసిపంపాడట. అయితే వాటికి స్పందన అంత సులభంగా రాలేదు. చాలా మంది ఇదంతా మామూలే కదా.. అని అభిప్రాయంతో విక్టర్ లేఖలను నిర్లక్ష్యం చేశారు. అయితే కొంతమంది మాత్రం సానుకూలంగా స్పందించారు. కొందరు వలంటీర్లుగా ముందుకు వస్తే... మరికొందరు వైద్య పరమైన , విద్యకు సంబంధించిన వితరణతో అండగా నిలిచారు.
కొన్ని సంస్థల నుంచి ఆర్థికంగా అండ లభించింది. ఒక్కొక్కటికీ అందుబాటులోకి వస్తున్న వనరులను సమకూర్చుకొంటూ అక్కడి పిల్లల పరిస్థితి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు విక్టర్. ఇప్పటి వరకూ దాదాపు 150 మంది చిన్నారుల కోసం ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పటం మంచి తిండి పెట్టడం వరకూ ఈ యువకుడు విజయం సాధించాడు.
150 అనే సంఖ్య చాలా చిన్నదిగా కనిపించవచ్చు. అయితే ఆ దుర్భరమైన పరిస్థితుల నుంచి అంతమందిని బయటకు తీసుకురావడం విక్టర్ సాధించిన అద్వితీయ విజయంగా చెప్పవచ్చు. ఈ విజయం నుంచి తనకు తానే స్ఫూర్తి పొందుతూ మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు ఈ యువకుడు.
- జీవన్