మనసుకు కనులుంటే..
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న 15వ కథనమిది...
ప్రపంచాన్ని మనసుతో సందర్శించే నిష్కల్మషులు వారు. రంగులకు, హంగులకు శూన్యంలోనే కొత్త భాష్యం చెప్పగలరు. పుట్టుకతోనే చూపు కరవైనా హృదయరాగంతో దైవాన్ని నేరుగా చూడగలిగే భాగ్యవంతులు. ఆ రాగాలను ఒడిసిపట్టి.. వాటికో రూపమిచ్చి.. ఆ గానామృతాన్ని వారికే కానుకగా అందజేస్తే.. ఈ ఆలోచన వచ్చిన మహిళ వందన. హైదరాబాద్ మలక్‌పేట వాసి అయిన వందన అంధుల ‘మనసుకు కనులుంటే’ ఏం చూపుతారో.. ఆ కళ్లలో దాగున్న కలలేంటో.. కమ్మని పాటలుగా వారి నోటనే పలికించారు. ఆ పాటల ఆల్బమ్‌ని వారికే కానుకగా ఇచ్చారు.
గృహిణిగా బాధ్యతలను నెరవేరుస్తూనే తనదైన కళతో రాణించాలనుకున్నారు వందన. చదువుకునే రోజుల్లోనే లలిత సంగీతంలో రాణింపు, సాహిత్యంపై మక్కువ ఆమెలోని కళాభిరుచిని రెట్టింపు చేశాయి. ఆ కళాసాధనలో ఉండగా తెలిసిన వారితో రెండేళ్లక్రితం ఒకసారి మలక్‌పేట్‌లోని అంధ పిల్లల హోమ్‌ని సందర్శించారు. ఆ సమయంలోనే అక్కడ వసతుల కోసం ఎంతో కొంత సాయం చేయాలనిపించింది. అయితే అలా ఇచ్చిన సొమ్ముతో తాత్కాలికంగా కొన్ని వసతులు ఏర్పడతాయేమో కానీ, అవి అక్కడి పిల్లలకు పెద్ద ప్రయోజనం తెచ్చేది మాత్రం ఏమీ లేదని గుర్తించారామె.
గాత్రానికి ప్రాణం...
మనిషి రూపు రేఖలు వారికి తెలియవు. ఏది మంచి, ఏది చెడు పట్టదు. కదిలిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. చూపు లేకపోయినా తమదైన లోకంలో విహరింపజేస్తారు. కమ్మని గాత్రంతో ఆకట్టుకుంటారు. కొంతమంది పిల్లల గానానికి పరవశించడంతో వారితోనే ఒక ఆడియో ఆల్బమ్ చేసి, దానిని వారికే కానుకగా ఇవ్వాలనుకున్నారు. అందుకు ఖర్చు, టైమూ బోలెడంతవుతుంది. అయినా ఆ లేత మనసుల్లో నుంచి వచ్చే గానాన్ని ఒడిసిపట్టాలనుకున్నారు. అందుకు ఆరుగురు అమ్మాయిలను ఎంపిక చేసుకున్నారు. భాగ్య, ప్రియాంక, సోని, మనీషా, సౌమ్య, గాయత్రిలను బృందంగా తయారు చేశారు. వీరు ఇప్పుడు పదో తరగతి చదువుతున్నారు.
రేయింబవళ్లూ సాధన...
‘మనసుకు కనులుంటే..’ ఆల్బమ్ ద్వారా అంధులైన వారి నోట పలికే ఒక్కో పాట పూదోటలో గుబాళింపులా మనసును తడుతున్నాయి. ‘వేయి కనులు కావాలా... వేల్పును కొలిచేందుకు.. మది మందిరమైన చోట కొలువుండడా వేల్పు...’ ఎక్కడెకిళ్లినా ఇప్పుడా ఆల్బమ్‌లోని పాటలు పాడుతూ వేదికల మీదా తమదైన గానామృతాన్ని పంచుతున్నారు. ‘ఆల్బమ్‌కి అవసరమైన ఆరు పాటలు పాడించడానికి దాదాపు ఆరునెలలు కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇది కష్టమనుకోను. నా జన్మ ధన్యంగా భావిస్తాను. చూపులేని వారి హృదయపు లోతుల్లోకి వెళ్లి, వారి భావాలతో ఆరు పాటలు రాశా. వాటికి సంగీతాన్ని అందించమని కోరినప్పుడు రామాచారి వెంటనే ఒప్పుకున్నారు. పిల్లలకు రోజూ సంగీతంలో క్లాస్‌లు ఇప్పించి, రిహార్సల్స్ చేయించి, రికార్డింగ్ స్టూడి యోకి తీసుకెళ్లా. ఈ ప్రయత్నానికి బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సహకారాన్ని అందించారు. పిల్లలు కూడా నాతో బాగా కలిసి పోయి, అద్భుతంగా పాటలు పాడారు. ఆ తర్వాత తమ గొంతును ఆల్బమ్ పాటలలో విని, ఎంతో సంతోషించారు. ఇప్పుడా ఆల్బమ్‌కి వచ్చే ప్రతి రూపాయి వారి ఖాతాలోనే జమ అవుతుంది. అలా వచ్చిన డబ్బు వారి అవసరాలను ఎంతో కొంత తీర్చుతుంది. రాబోయే రోజుల్లో అంధుల చేత వీడియో ఆల్బమ్ ఒకటి చేయాలనే సంకల్పంతో ఉన్నాను’ అని తెలిపారు వందన.
గానంతో సందర్శన...
ఈ పాటలు పాడిన వారిలో ప్రియాంక మాట్లాడుతూ... ‘శూన్యమైన మా లోకంలో వందన వెలుగు నింపారు’ అంటూనే - ‘మమతల కోవెలలో... మానవీయ లోగిలిలో.. విరిసిన కుసుమాలమే మేమూ! ఓ చల్లని మనసు మాకు తోడుంటే .. లాలనగా ఓ చేయి మము నడిపిస్తే.. గగనాలైనా ఇలకు దించి చూపమా’ అంటూ గానంతోనే తన అభిప్రాయాన్ని తెలిపింది. ‘రంగులంటే ఎలా ఉంటాయో తెలియదు. దైవాన్ని చూడలేము. అయినా ఈ పాటల ద్వారా అవన్నీ మేం సందర్శించాం. చూపు లేదని చిన్నచూపు చూడకుండా మా మనసుతో దర్శించిన దైవాన్ని (పాటలను) మీరూ వినండి’... ఇది సోని మాట.
నిర్మలారెడ్డి
ఫొటో: జి.రాజేష్