
అనాదిగా ఈ ఉగాది పర్వం
కొత్త చివురులకు ఆరంభం
గతమును తుడిచి వెతలను మరిచే
నూతనోత్సాహ సంరంభం
మోడులు వారి ఆకులు రాలిన
శిశిరానికిదే సీమంతం
చింత పులుపుకు మామిడి పిందెకు
మరువరానిదీ అనుభంధం
చెరుకు తీపితో చేదు వేప
తన చెలిమిని పంచే శుభ సమయం
కష్ట సుఖాలు కలిమి లేములు
కలగలిసిన జీవన గమనం
‘క్రోధి'ని వీడి వీడ్కోలీయగ
నవ నవోన్మేష నవ వర్షం
విమల తరళ విభుధాన్విత సంతుల
“విశ్వావసు” కి స్వాగతం!
- వెంకట్ కొత్తూర్, Ashburn VA USA
ఆదరణే ఆరాధన
కాలం ఓ మహా గ్రంథం
జీవితం మొత్తం
చదువుకోవడమే బ్రతుకు.
ప్రకృతిలో ప్రతి ప్రాణీ
మనిషికి బంధువు.
ఆదరించడమే ఆరాధించడం.
కాలం కంటి ఎదురుగా
ప్రకృతి ఒడిలో అనాదిగా
సాగుతున్న ఆనందమే ఉగాది.
– శ్రీ సాహితి
పచ్చడి
ఉగాది కాంతి
ఋతువుల స్రవంతి
రుచుల మార్గం
కోకిల రాగం
హామీల స్వరగానం
సాగని మేళం
జనం పచ్చడి
ఉచితాల ఉచ్చులు
లంకా దహనం
– రేడియమ్