'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం! | The Kannada Sahitya Akademi Award Winning Work O Sanchari Antharangam | Sakshi
Sakshi News home page

'ఓ సంచారి అంతరంగం'..మనసును కదిలించే పుస్తకం!

Published Thu, May 9 2024 11:51 AM | Last Updated on Thu, May 9 2024 11:52 AM

The Kannada Sahitya Akademi Award Winning Work O Sanchari Antharangam

విపులాచపృథ్వీ అన్నట్టు తెలుసుకోవడానికి బయలుదేరితే భూమి చాలా పెద్దది. కంటికి నిత్యం కనపడే మానవుడు అంతకంటే లోతు . నా బాల్యంలో మా గ్రామంలో ప్రతి ఉదయాన్నే ఇళ్ల ముందుకు "అమ్మా రాత్రి అన్నం, కూరలు మిగిలి ఉంటే. ఇయ్యండమ్మా" అని సాధారణంగా నిత్యం వినపడే కేక వెనుక ఎంత ఆకలి పేగుల ఏడుపు ఉందో, అన్నపు మెతుకు ఎంత బరువైనదో తెలుసుకునే శక్తి అప్పుడు లేదు. సాహిత్యం ఎందుకు అంటే ఇందుకే అంటాను. సాహిత్యం చెవులకు కొత్తగా వినడాన్నీ, కళ్ళకు కొత్తగా చూడటాన్నీ, మనసుకు కొత్తగా అందటాన్ని సాధన చేయిస్తుంది.

సాధన జీవితానికి ప్రాణవాయువు, సాధన జీవితపు ఆ దరికి చేరడానికి సులువు కానించే తెడ్డు. మా ఊళ్ళో మేము సంచార జాతి వారిని, వారి పిల్లా పీచు, గొడ్డు మేకలు సమస్తాన్ని రోజూ చూస్త్తోనే ఉండేవాళ్ళం. మా ఇంటి ముందే డేరాలు వేసుకుని ఉండేవాళ్ళు, ఆ డేరాలు ముందే వాళ్ళ ఉడుములు కట్టేసి ఉండేవి. నేను ఆ ఉడుముల్లో ఒకదానిని ఎలాగైనా తెచ్చుకుని దాని తోకకు తాడుకట్టి ఏ కోటయినా సరే దానిని ఎక్కి ఆక్రమించుకుందామా అని చూసేవాడిని తప్పా ఆ డేరాల లోపల బీద మనుషుల బ్రతుకులు ఏమా అని తొంగి చూడాలనుకున్న వాడిని కాను.

ఇంట్లో పెద్దలు కూడా వారేమిటో, వారి బ్రతుకులు ఏమిటో, బ్రతుకు దారి ఎంత పొడవో, లోతో కొలత పాఠం చెప్పిన పాపానికి పోలేదు. ఈ జాతుల పిల్లలు జన్మజన్మల దారిద్య్రం, ఆకలితో క్యాట్ బెల్ చేతపట్టి కాకుల్ని కొట్టేవాళ్ళు. ఆ కాకుల్ని వాళ్ళు తింటారని తెలిసినపుడు అసహ్యం వేసింది. కాకుల్నే కాదు అవసరం, ఆకలి అయినపుడు మనిషి మనిషిని కూడా పీక్కు తింటాడని సాహిత్యమే చెప్పింది, ఒక మనిషి తన పొట్ట ఆకలిని తీర్చడానికి స్వయాన తన కాలిని తిన్న సంగతి కూడా సాహిత్యమే నేర్పింది. 

నా చిన్న తనంలో చిన్న మా ఊరులో రోజూ కనపడుతూ ఉండే ఈ సంచార మనుషులు ఉన్నట్టుండి, ఊర్లు బలిసి, పసిరిక పాము వంటి మెలిక దారులు అజగరల్లా వైశ్యాల్యమయి పోయి ,ప్రపంచం పెద్దదై పోయి వీరెక్కడ కానరాకుండా పోయిన కాలంలో ఒక టీచరమ్మ పూదోట శౌరీలు నాకు " ఒక సంచారి అంతరంగం" అనే ఈ పుస్తకాన్ని కానుక చేసారు.

ఈ రచనను చాలా కాలం క్రితం "అమ్మ నుడి " పత్రికలో ధారావాహిక గా చూసేవాడిని. చదవలేదు. 2017 లో అచ్చు పుస్తకంగా వచ్చిన ఈ రోజు చదివే అవకాశం కలిగింది. శ్రీ రంగనాధ రామచంద్రరావు గారి అనువాదం బావుంది. మూల రచయిత కుప్పే నాగరాజుగారు తన చేయి పట్టుకుని పాఠకుడిని 192 పేజీల సంచారం చేయించారు. ఈ పుస్తకంలో కనపడే మనుష్యులకు,తాము కనపడకుండా పుస్తకం రావడానికి దోహదం చేసిన మహా మానవులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.

పుస్తకం వెల: రూ. 200/-
ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు,  1-2-740, హనుమాన్ మందిరం దగ్గర, రాకాసిపేట, బోధన్-503 185 నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. 

--అన్వర్‌, సాక్షి

 

(చదవండి: సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement