Telugu poetry
-
మహాత్మా! చూస్తున్నావా!!
ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం. అహింసాయోధుడవు నీవు, హింసా వీరులు నేటి నాయకగణం. సర్వమత ఐక్యత నీ పథం అనైక్యతే నేటి జనుల మార్గం. మద్యం వద్దని నీవు, అదే ముద్దని నేటి ప్రభుత. మహిళా సాధికారత నీ కల, మరి నేడో కలకంఠి కంట కన్నీరు చూడందే నిద్రపోని పాషండులెందరో! గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి, దాని అభావానికై నేటి పాలకుల శక్తివంచన లేని కృషి. నీవు చూపిన నాటి విరి బాట నేటి రాజకీయులకు ముళ్లబాట. సమానతే నీ ధ్యేయం, అసమానతే నేటి తరం లక్ష్యం. నిరాడంబరతే నీ భావనైతే ఆడంబరయుత పోకడలు నేటి యువత చిరునామా! నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే నేటి పాదయాత్రలు హింసాయుత మార్గాలు, శాంతి భద్రతల భగ్నానికి దగ్గర దారులు. బాపూ! నీ మార్గంలో నేటితరం పయనించేలా దీవించవా! – వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం (నేడు మహాత్మా గాంధీ వర్ధంతి) -
ఒక దేశం – ఒకే పువ్వు
ఎవరో ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు వీచే ముందు గాలులు అనుమతి తీసుకోవాలని వీచే ముందు గాలులు తమ దిశ దశ ఏమిటో ఎటో వివరాలు తెలియ జేయాలని ఎవరో కొత్త చట్టం తెచ్చారు గాలులు ఎంత దూరం పోవాలనుకున్నాయో అవి ఎంత వేగంగా వీచాలనుకున్నాయో వివరాలు సమర్పించనిదే అనుమతి దొరకదని ఎవరో కొత్త చట్టం తెచ్చారు ఇప్పుడిక్కడ సుడిగాలులకు అనుమతి లేదు మేం కడుతున్న ఆ పేకమేడల్ని సంరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది అందువల్ల ఈ చట్టాలు సత్వరమే అమల్లోకొస్తున్నాయి! తమ చుట్టాలకు అనుగుణంగా ఎవరో ఇక్కడ కొత్త చట్టాలు తెచ్చారు ఒడ్డును తాకే కెరటాలక్కూడా ఒక హెచ్చరిక! ఎగిసెగిసి పడటం మళ్లీ తిరిగి వెళ్ళడం బలం పుంజుకుని మళ్లీ నీటి పిడికిళ్ళతో తిరిగి రావడం ఇవన్నీ ఇప్పుడిక కుదరదు తిరుగుబాట్లు, ఉద్యమాలు, హోరెత్తిపోవడాలు నిషిద్ధం ఎంతటి ఉధృతి ఉన్నా బుద్ధిగా ఒడ్డులోపల మాత్రమే నిశ్శబ్దంగా ప్రవహించాల్సి ఉంటుంది! తోటలోని మొక్కలన్నీ ఒకే విధంగా పూయాలని పూచే పూల రంగు కూడా ఒకటిగానే ఉండాలని కొత్త చట్టం అమలులో కొచ్చింది ఒకే రంగు మాత్రమే కాదు ఏ పువ్వు రంగు ఎంత గాఢంగా ఉండాలో కూడా వారు నియమించిన వారి అధికారులే నిర్ణయిస్తారట! ఒక దేశం – ఒకే పువ్వు!! ఈ చట్టాలు చేసిన గౌరవనీయులకు ఎవడు చెప్పాలి? తోటలో అన్ని మొక్కల పూలు ఒకే రకంగా ఉండవని – ఉండటానికి వీలే లేదని – ఒక రంగులో అనేక రంగులుంటాయని కూడా వారికి ఎవడు చెప్పాలి? గాలులు, కెరటాలు ఎవరి చట్టాలకూ లొంగవనీ గాలి ఎవరి పిడికిలిలోనో ఖైదీగా ఉండదని కెరటం ఎవరి జీవోలతోనో వెనక్కి మళ్ళదని ఎంతటి వారైనా సరే, వాటిని గమనిస్తూ వాటికి అనుగుణంగా బతకాల్సిందే తప్ప మరో మార్గం లేదని! లేకపోతే, అవి సృష్టించే సునామీలో అడ్రసు లేకుండా గల్లంతు కావల్సిందేనని నామరూపాలు లేకుండా నశించాల్సిందేనని వారికి ఎవరైనా చెప్పండి! కనీస గౌరవమైనా... కాపాడుకొమ్మని!! – డాక్టర్ దేవరాజు మహారాజు (దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమ నేపథ్యంలో) -
Varala Anand: ఆనంద్ అంతర్లోకాల చెలిమె
కవి తనని తాను చూసుకునే చూపు. అలాగే సమాజాన్ని చూసే చూపు. తనూ సమాజం కలగలసిన చూపు. విశాల విశ్వంలో తన చూపు ఆనే చోటు. ఇలాగ చూపులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఒక కవి తనలోకి అలాగే సమాజంలోకి చూసే దృక్కోణాలే కాకుండా– అతడు సమా జాన్ని తనలోకి ఒంపుకోవడం– అలాగే తను సమాజంలో కలగలిసిపోవడం. ఇలాగా ఎన్నెన్నో కోణాల నుంచి తనని తాను బేరీజు వేసుకునే కవి శ్రమించి తన కవితను తీర్చిదిద్దుతాడు. తనలో ఒక క్రమం. అలాగే సమాజంలోనూ ఓ క్రమం ఉంటుంది. క్రమం లేని తనమూ ఉండవచ్చు. ఇలా ఆలోచిస్తూ పోతుంటే కవి తనకు తాను సాధారణంగానూ, అసాధారణంగానూ తోచవచ్చు! ‘అక్షరాల చెలిమె’ అన్న వారాల ఆనంద్ కవితా సంపుటిని ఒకటికి రెండుసార్లు చదివినాక నాలో కలిగిన భావాలివి. ఆనంద్ భావకుడు. ఒక శిల్పి ఎలాగైతే తన శిల్పాన్ని తయారు చేస్తాడో అలాగే ఆనంద్ కవిత్వం చేయడంలో నేర్పరి. పుట్టుకతో మనిషి తెచ్చుకున్న బాధ ఉంది. రకరకాల అనుభూతులతో పాటు నేను న్నానని ఎప్పుడూ హెచ్చరించే బాధ ఉంది. బాధలు రకరకాలు. ఉండీ బాధ, లేకా బాధ. ఉండీ లేకా బాధ. ఒక్కోసారి బాధ కోసమే బాధ. సందర్భాన్ని బట్టి బాధ అలంకారమూ కావచ్చు. ఏది ఏమైనా సంతోషాన్ని నిరాకరించలేనట్టే బాధనూ నిరాకరించలేము. వేదన అన్నది మరొకటి. వేదనకీ, బాధకీ కొంత వ్యత్యాస ముంది. చాలా సందర్భాలలో వేదనకి బాధ మూలమై ఉంటుంది. ఉండకనూ పోవచ్చు. మనిషి జీవితంలో సందర్భాలు అనేకం. అందుకే వేదన సందర్భాన్ని అనుసరించి కూడా ఉండొచ్చు. ప్రారంభం లాగానే కొన్నింటికి ముగింపు కనిపిస్తుంది. కొన్నింటికి కనిపించదు. మరికొన్నింటికి కనిపించీ కనిపించని తనంలా తోస్తోంది. కదలిక– స్తబ్ధత, ఉదయం– సాయంకాలం, రాత్రి–పగలు, బాగుండడం– దిగులుగా ఉండడం, నవ్వు– ఏడుపు, ఆశ– నిరాశ, తీరం కనిపించడం– దరి దొరకకపోవడం, బతుకు– చావు... మానవ జీవితంలోని ద్వంద్వాలు ఇవి. ఉన్నవాటిని అంగీకరిస్తూనే, లేని వాటిని ఊహించడం. ఒక్కో సారి ఉన్నది వాస్తవం కాకపోవచ్చు. ఊహ సరైనది కావచ్చు. అలాగే ఉన్నది వాస్తవం అయినప్పుడు ఊహ సరైనది అయ్యే అవకాశం లేకపోవచ్చు. వాస్తవం– ఊహ అన్నవి నిజాలు. అలాగే అబద్ధాలూనూ! జీవితం నిజం. వాస్తవం. అంటే మన కంటితో చూస్తున్నది నిజమైతే – భౌతికంగా కనిపించే జీవితానికి పైన అద్దిన పన్నీ కూడా ఉంది. ఇవి రెంటినీ కలిపి చూస్తే – నీరెండ నీళ్ళపై తేలియాడే వెలుతురు. పసిపాప ముఖంపై సయ్యాటలాడే చిరునవ్వు. జీవితంలోని నిజాల్ని ఒప్పుకుంటేనే, జీవితం ముందూ వెనకా జరిగే సంఘటనలను నేర్పుగా పట్టుకోలేని అసాయత కూడా ఒకటి ఉంది. ‘విజయసూత్రం’ అనేది జీవితంలో అచ్చమైన నిజం కాదు. దానికి ముందూ వెనకా చాలా విషయాలు ఉంటాయి. జీవితం అన్నది అనేక అంశాల కూడలి. వాటి క్రమం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వైవిధ్యభరితమైంది అది. వెలుగు నీడలూ, తెలుపు నలుపు అన్నవి ఎంత నిజమో; మానవ జీవితంలోని ప్రతి కదలికకి కలవరించి పలవరించడమూ అన్నది అంతే నిజం. సృజన కారుల్లో ఇది కాస్త మోతాదుని మించుతుంది. ఆనంద్ తను కవిగా చెందిన పరిణతి మనల్ని అబ్బురపరుస్తుంది. అలాగే అతడి జీవిత క్రమం కూడా! సామాన్యుల జీవితా లలో ఎన్నో పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కాని అవి అంతగా పరిగణలోకి రావు. కాని సృజన కారుడి జీవితంలో జరిగే పరిణామాలు ఎన్నో వింతలూ విడ్డూరాల్ని సృష్టించవచ్చు. కారణం సృజనకారుడు సమస్య లోతుల్లోకి వెళ్ళి శోధిస్తాడు. అతడు ఇంకా సున్నిత మనస్కుడైనప్పుడు మనకు ‘అక్షరాల చెలిమె’ లాంటి విలువైన కవిత అందుతుంది. కవి ఇక్కడ జీవితంలోని అరలను, వాటిలోని వెలుగునీడల్ని మనకు పరిచయం చేస్తాడు. జీవితంలో తట్టుకొని... సంగీతాన్ని వినిపిస్తాడు. అందుకే ఆనంద్ కవిత్వమన్నా, జీవితమన్నా నాకు చాలా ప్రత్యేకమైనవి. మీరు కూడా ఈ కవితల ద్వారా ఎన్నో వింత వినూత్న అనుభవాలకు లోనౌతారని ఆశిస్తాను. (క్లిక్ చేయండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - బి. నరసింగరావు సినీ దర్శకులు, రచయిత -
ఈ చదువు మాకొద్దు
మట్టిలో అదుకోనివ్వని బాల్యాలు మావి మట్టంటే రోగాలపుట్ట అని గట్టిగా నమ్మించే పుస్తకాలు మావి మట్టంటే అన్నం పుట్టిల్లు పచ్చటి హరివిల్లని, చేతులారా స్పృశించనివ్వని అనుభవాలు మావి మట్టిలోని కొన్ని కోట్ల క్రిముల గురించి చెప్తారేగాని, మృణ్మయంలోని ఉమ్మనీటి అనుభవాన్ని చెప్పరేమి? పొలంలోని తడిమట్టి కాళ్ళని కళ్ళకద్దుకోమని చెప్పకుండా ఊరి పొలిమెరల్లో పూరిగుడిసెల్లో ఎందుకుంచారో వివరించరేమిటి? మట్టి గురించి మాట్లాడినప్పుడల్లా జుగుప్సాముద్ర కనిపిస్తుందెందుకు? మనిషి మట్టిలో కలిశాక ముఖం మీద పాకే పురుగులు మట్టి గురించి మాట్లాడినప్పుడు కళ్ళల్లో ప్రతిబింబిస్తాయెందుకు మనిషి అస్తిత్వాన్ని చూపని ఈ చదువులు మనకెందుకు? - బుర్రా సాయిబాబు అభావం.. 1. అనుకుంటాం కానీ గుప్పెడు గుండెలో ఎంత దుఃఖాన్ని దాచగలం నరాల్లో జ్ఞాపకం నదిలా పరిగెత్తుతుంటే ఎంతకని ఆనకట్టగలం 2. నువ్వోనేనో జీవితపు రహదార్లలో దారి తప్పినవాళ్ళమే తరచి చూడు నీ కళ్ళముందే పారాడతాయి 3. సహచరితో సహవాసం సంసార సాగరంలో అలలై కుదేలవుతాం అయితేనేమి కష్టం సుఖం నీకు నాకు సమం కదూ 4. ఇప్పటికిప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి మిగిలింది చెప్పు కొంచెం దుఃఖం, మరికొంత సంతోషం తప్ప నీకంటూ వొక వొడ్డు ఎదురు చూడటం లేదు 5. సరే, ఇది నిరంతరంగా సాగే వొక వొరవడి అప్పుడే ముగించుకుని వెళ్ళిపోకు కొన్ని గుర్తులని తరువాతి వారికై దారి వదలి పయనం సాగించు 6. ఉంటాను, నేను నువ్వు వొక తాత్విక చింతన ఇంకేమీ లేదు! - పుష్యమీ సాగర్ -
Book Review: మత్తెక్కించే ‘మధుశాల’
‘మధుశాల’ మత్తెక్కిస్తుంది. అలసిన ఆత్మలను ఆదమరపించి, అంతర్లోకాల సందర్శనం చేయిస్తుంది. శుష్కవచనం కవిత్వంగా చలామణీ అవుతున్న తెలుగునేల మీద– ఆరుతడి కవిత్వమే అపురూపంగా మారిన రోజుల్లో తన గుండెతడినే కవిత్వంగా మలచి మధువొలకబోశారు అనిల్ బత్తుల. ‘మధుశాల’లలోని కవితలు పురాతన మధువులాంటి పరిమళంతో చదువరులను మత్తెక్కిస్తాయి. మైకం, మోహం జమిలిగా జుగల్బందీ చేసిన కవితలివి. జీవన బీభత్సాన్ని సుందరమైన మధుపాత్రలో దర్శింపజేసే కవితలివి. మత్తెక్కించినట్లే ఎక్కించి, చెర్నాకోలతో చరిచినట్లుగా ఒక్కసారిగా మత్తొదిలించే కవితలూ ఇందులో ఉన్నాయి. (క్లిక్: నూరు నాటకాలు.. ఆరు సంకలనాలు) ‘అప్పుడు నా వయసు పన్నెండు గొర్రెలు కాచే పేద నల్లపిల్లను/ మా గ్రామదేవతలా చక్కటి కళ నా మొహంలో ఉండేది/ సమర్తాడిన వారానికి మా ఇంటి పక్కావిడ నా కన్నెరికాన్ని లక్షరూపాయలకు/ మా ఊరి వర్తకుడికి అమ్మేసింది/ ఆ రాత్రి నాకు చేరిన నా రక్తపు ముద్ద విలువ రెండువేలు మాత్రమే’... ఎంతటి బీభత్సం! లోకంలో ఇలాంటి బీభత్సం సర్వసాధారణం. యాంత్రికలోకంలోని సర్వసాధారణ బీభత్సాన్ని తట్టుకోవడం సున్నితహృదయులకు దుస్సాధ్యం. తట్టుకోవాలంటే ‘మధుశాల’లోనికి అడుగుపెట్టాల్సిందే! -
జీవితంలో సాహిత్యాన్ని దర్శించిన విమర్శకుడు
‘‘కవిత్వానికి కవి ఇవ్వాల్సిందేమిటి? బహుశః తన రక్తమాంసాలివ్వాలి. సొంత భాషనివ్వాలి. అంతిమంగా తన ప్రాణమివ్వాలి. కవితకి భావాలు, భావ చిత్రాలు, అలంకారాలు ఇవ్వటం వేరు. ఇవి బాహ్య విషయాలు మాత్రమే. కవి రక్తమాంసాల్ని హరించినప్పుడే కవిత జవజీవాలు పొందుతుంది. ఒక మహా శిల్పం రూపొందించిన తర్వాత అంతిమంగా దానికి ప్రాణరేఖ చెక్కే శిల్పిలాంటి వాడే కవి. ప్రతి గొప్ప కవిత ప్రాణమున్న వ్యక్తే’’ – పాపినేని శివశంకర్ పది కాలాలపాటు నిలబడే కవిత్వం గురించి శివశంకర్ వ్యాఖ్యానం ఇది. ఈ వాక్యాలు చెప్పడానికి శివశంకర్ గమనింపు ఏమిటి? ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎన్ని అధ్యయనం చేసి ఉండాలి? నాలుగు పుస్తకాలకు సమీక్షలు రాసి ప్రముఖ విమర్శకులుగా చెలామణీ అవుతున్న ఈ కాలంలో తెలుగు సాహిత్య విమర్శకు ‘శివశంకర్’ ఏమి ఇచ్చాడు? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ‘సాహిత్యం– మౌలిక భావనలు’ సిద్ధాంత గ్రంథం, ద్రవాధునికతను తెలుగు సాహిత్యానికి అన్వయించడం, నిశాంత పేరు మీద అందించిన సాహిత్య తాత్విక వ్యాసాలను మనం పరిశీలించినప్పుడు... కొన్ని అన్వయాలను, కొన్ని భావనలను, ధిక్కారం నిసర్గత లాంటి సాహిత్య సారాంశాన్ని తవ్వితీసే సాధనాలను రూపొందించటానికి కృషి చేసినట్టు తెలుస్తుంది. ‘మనిషి–ప్రకృతి–సమాజం’ అనే త్రికానికి సంబంధించిన సారాంశాన్ని రచయిత అర్థం చేసుకొని, ఆవిష్కరించగలగాలి. విలువలేని సాహిత్యాన్ని తూర్పారబట్టగలగాలని అంటారు. ‘విమర్శకుడు’ అనగానే పనిగట్టుకొని లోపాలు వెతకడం కాదు. మంచిచెడుల వివేచన ఉండాలి. సంయమనం ఉండాలి. వస్తువు, శిల్పం, అభివ్యక్తి, రూపం లాంటి నాలుగు పడికట్టు మాటలతో రచనని చూడటం శివశంకర్‌కి తెలియదు. కవిత్వీకరణకు సంబంధించి ప్రాచీనులు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే మూడు హేతువులు అవసరం అన్నారు. ఇవాళ కవిత్వం రాస్తున్నవారికి ప్రాథమికంగా మూడు మౌలిక విషయాలను శివశంకర్ సూచిస్తున్నారు. ( మాలపల్లి నవల: నూరేళ్ల... విప్లవాత్మక సృజన) 1. భావబలం, 2. భావనాబలం, 3. భాషాబలం. కవిత్వ విమర్శకుడిగా ఆయన చేసిన మరికొన్ని పరిశీలనలు చూస్తే. 1. కవిత్వం వైయుక్తికాన్ని సామాజిక దృక్పథం నుంచి విలువ కట్టే ఆలోచనా ధోరణి ప్రవేశించింది. 2. ఇవాళ కవిత్వంలో కనబడే ఒక ప్రధాన లక్షణం బహుముఖీనత. ఇక్కడ మహాకవి పదవులు, ఏక నాయకత్వాలు లేవు. ఏక సమయంలో ఎన్నో గొంతులు కలివిడిగా, విడివిడిగా వినిపిస్తున్నాయి. వస్తువు విస్తృతమైనది. కవిత్వాకాశ వైశాల్యం పెరిగింది. 3. దేశీయత లేదా స్థానీయత ఇప్పటి కవిత్వంలో ఒక ముఖ్యాంశం అయింది. ‘విశ్వం నుంచి నాదాకా’ అనే సూత్రం ముందుకొచ్చింది. 4. సొంత భాషని ఎంతగా లీనం చేసుకుంటే ఆ కవి కవిత్వం అంత నిసర్గంగా ఉంటుంది. 5. కవిత్వంమంటే భాష యొక్క ఉన్నత వ్యక్తీకరణ కాదు. అందమైన అభివ్యక్తీ కాదు. పదచిత్రాలు, భావ చిత్రాల పొహళింపు కాదు. జీవితాన్ని తార్కికంగా కాదు, తాత్వికంగా వివేచించాల్సి ఉంది. ఇకపోతే జిగ్మంట్ భౌమన్ చెప్పిన లిక్విడ్ మోడల్ని ‘ద్రవాధునికత’గా శివశంకర్ మనదైన జీవన విధానాలకు అనుగుణంగా అన్వయం చేశారు. శరవేగంగా మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ‘ద్రవాధునికత’ను ఒక పరికరంగా మన ముందుంచారు. వ్యక్తి, ప్రకృతి, సమాజం.. వీటిని వ్యాపారమయం చేసిన తీరు తెలిపారు. మనం ఒక ప్రవాహంలో పడిపోయాం. అది క్షణక్షణం మారిపోయే ప్రవాహం. రూపం మార్చుకున్న ప్రవాహం. ఎక్కడా విలువలు కనిపించవు. కొత్తదనంపై తీవ్రమైన మోజు, అర్ధరాహిత్య జీవనం, అమానవీయత, మానవ దూరం.. ఇవన్నీ ద్రవాధునికతలో భాగం. (Mannu Bhandari: రాలిన రజనీగంధ) ఆయన మాటల్లో ద్రవాధునికత లక్ష్యం ఇది – ‘‘ఇవాళ ముఖ్యంగా నాగరిక, విద్యాధిక, ధనాధిక, కార్పొరేట్ వర్గ జీవన విధానంలో ద్రవాధునికత తెచ్చిన సరికొత్త మార్పు తేలిగ్గా గుర్తించగలం. అది మోగించే ప్రమాదఘంటికలు వినగలం. రకరకాల (అడ్డ)దారుల ద్వారా ఉరువైన నూతన సంపన్నవర్గం ఏర్పడింది. దానికి కరెన్సీ స్విమ్మింగ్ పూల్‌లో ఈదడం మహానందం. స్వసుఖ జీవనంతో తప్ప దానికి ఏ సామాజిక, వైయక్తిక విలువలతో పని లేదు.’’ ‘ద్రవాధునికత’ స్థితిని దాటేందుకు కూడా ఆయన కొన్ని పరికరాల్ని చూపారు. ప్రకృతిలో మైత్రి, సామూహికం, పురానవం, నిరహంకారం, నిబ్బరం, సృజనాత్మకత లాంటి విలువైన మార్గాలు చూపారు. ఆయన ద్రవాధునికతను ఒక పనిముట్టుగా చేసుకున్నారు. దాని సాయంతో సమాజంలోని స్థితిగతులను వ్యాఖ్యానించి, మనం ఇంకా ఎంత మంచి మనుషులుగా మారాల్సి వుంటుందో గుర్తు చేశారు. మానవ జీవితం ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలి అనే వైరుధ్యాన్ని పరిష్కరించే దిశగా రచనలు సాగాలని ఈ విమర్శకుడి ఉద్దేశం. ప్రపంచీకరణ సారాంశాన్ని, పతనీకరణ సారాంశాన్ని గుర్తించి ఎరుకతో ఎలా జీవించాలో హెచ్చరిస్తున్నారు. సాహిత్యంలో జీవితం గురించే కాదు, జీవితంలో సాహిత్యం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన విమర్శకుడు పాపినేని. - డాక్టర్ సుంకర గోపాల్ వ్యాసకర్త తెలుగు సహాయాచార్యులు (కాకినాడలో పాపినేని శివశంకర్ ‘అద్దేపల్లి కవిత్వ విమర్శ పురస్కారం’ అందుకుంటున్న సందర్భంగా) -
మీకు తెలుసా?.. ఇదెవరి కవిత?
ఈ మధ్య సాహితీ సహృదయులైన నా అమెరికన్ మిత్రులు కొందరికి, ఈ క్రింది పద్యం చదివి వినిపించాను. 'Who were we in our past life' She became shy and giggled. 'What will be our future life' She turned pale, amazed. 'How long our happiness last' Tears in her eyes, she grew sad. నా స్నేహితులు అన్నారు, It's great. You must publish it అని. ఈ పద్యమే, ఇక్కడ(అమెరికాలో) పుట్టి పెరుగుతూ, కాలేజీకి వెళుతున్న మా మేనకోడలికి వినిపించా. ఆ అమ్మాయి వెంటనే, ఐ I bet this must be from Elizabeth Barret Browning అన్నది. వీళ్లకి ఇది సుమారు వందేళ్ల కిందట తెలుగులో ఏలూరి వాడు, నండూరి సుబ్బారావు రాసిన యెంకి పాటకి, వెల్చేరు నారాయణరావు ప్రచురించిన అనువాదం (Twentieth Century Telugu Poetry, An Anthology, Oxford University Press, 2002) అని చెప్పి, నేను తెలుగు కవిత్వాన్ని ప్రపంచ కవిత్వంలో ఒక ముఖ్యభాగంగా చూసి, మురిసిపోయి గర్వపడ్డాను. సౌజన్యం: పర్స్పెక్టివ్స్ ప్రచురించిన ‘బహుళ’ -వేలూరి వేంకటేశ్వరరావు -
మీకు తెలుసా?
తెలుగు కవిత్వం వరకు విస్మరించలేని చరిత్రను నమోదుచేసిన దిగంబర కవుల గురించి ఈ తరానికి తెలియజెప్పే ఉద్దేశంతో ఈ వివరాలు అందిస్తున్నారు చెరుకూరి సత్యనారాయణ. వారి అసలు పేర్లు: మానేపల్లి హృషికేశవరావు (నగ్నముని), కుంభం యాదవరెడ్డి (నిఖిలేశ్వర్), బద్దం భాస్కరరెడ్డి (చెరబండ రాజు), ఆకారం వీరవెల్లి రాఘవాచారి (జ్వాలాముఖి), కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు (మహాస్వప్న), మురుకుట్ల మన్మోహన్ సహాయ్ (భైరవయ్య). యాభై ఏళ్ల క్రితం, 1965 మే 6వ తేదీన అర్ధరాత్రి రిక్షా కార్మికుడు పాండుతో హైదరాబాద్ ఆబిడ్స్ సెంటర్‌తో తమ మొదటి సంపుటాన్ని ఆవిష్కరింపజేశారు. చెరబండరాజు 2-7-1982న, జ్వాలాముఖి 14-12-2008న అనారోగ్యంతో మరణించారు. నగ్నముని, నిఖిలేశ్వర్ హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. మహాస్వప్న ప్రకాశం జిల్లా లింగసముద్రం గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు. భైరవయ్య సన్యాసం స్వీకరించి, విశాఖ-విజయనగరం మధ్య ఆశ్రమం స్థాపించుకుని భైరవానందస్వామిగా మారారు.