మట్టిలో అదుకోనివ్వని బాల్యాలు మావి
మట్టంటే రోగాలపుట్ట అని
గట్టిగా నమ్మించే పుస్తకాలు మావి
మట్టంటే అన్నం పుట్టిల్లు
పచ్చటి హరివిల్లని,
చేతులారా స్పృశించనివ్వని
అనుభవాలు మావి
మట్టిలోని కొన్ని కోట్ల క్రిముల గురించి చెప్తారేగాని,
మృణ్మయంలోని ఉమ్మనీటి అనుభవాన్ని చెప్పరేమి?
పొలంలోని తడిమట్టి కాళ్ళని కళ్ళకద్దుకోమని చెప్పకుండా
ఊరి పొలిమెరల్లో పూరిగుడిసెల్లో ఎందుకుంచారో
వివరించరేమిటి?
మట్టి గురించి మాట్లాడినప్పుడల్లా
జుగుప్సాముద్ర కనిపిస్తుందెందుకు?
మనిషి మట్టిలో కలిశాక ముఖం మీద పాకే పురుగులు
మట్టి గురించి మాట్లాడినప్పుడు
కళ్ళల్లో ప్రతిబింబిస్తాయెందుకు
మనిషి అస్తిత్వాన్ని చూపని ఈ చదువులు మనకెందుకు?
- బుర్రా సాయిబాబు
అభావం..
1.
అనుకుంటాం కానీ
గుప్పెడు గుండెలో
ఎంత దుఃఖాన్ని దాచగలం
నరాల్లో జ్ఞాపకం నదిలా పరిగెత్తుతుంటే
ఎంతకని ఆనకట్టగలం
2.
నువ్వోనేనో
జీవితపు రహదార్లలో
దారి తప్పినవాళ్ళమే
తరచి చూడు నీ కళ్ళముందే
పారాడతాయి
3.
సహచరితో సహవాసం
సంసార సాగరంలో అలలై
కుదేలవుతాం
అయితేనేమి కష్టం సుఖం
నీకు నాకు సమం కదూ
4.
ఇప్పటికిప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే
ఏమి మిగిలింది చెప్పు
కొంచెం దుఃఖం, మరికొంత సంతోషం తప్ప
నీకంటూ వొక వొడ్డు
ఎదురు చూడటం లేదు
5.
సరే, ఇది నిరంతరంగా సాగే
వొక వొరవడి
అప్పుడే ముగించుకుని వెళ్ళిపోకు
కొన్ని గుర్తులని తరువాతి వారికై
దారి వదలి పయనం సాగించు
6.
ఉంటాను, నేను నువ్వు
వొక తాత్విక చింతన
ఇంకేమీ లేదు!
- పుష్యమీ సాగర్
Comments
Please login to add a commentAdd a comment