
ఓ మహాత్మా!
చెడు అనకు, వినకు, చూడకు
అన్న పలుకులు నీవైతే
నేటి సమాజానికవే ప్రీతిపాత్రం.
అహింసాయోధుడవు నీవు,
హింసా వీరులు నేటి నాయకగణం.
సర్వమత ఐక్యత నీ పథం
అనైక్యతే నేటి జనుల మార్గం.
మద్యం వద్దని నీవు,
అదే ముద్దని నేటి ప్రభుత.
మహిళా సాధికారత నీ కల, మరి నేడో
కలకంఠి కంట కన్నీరు చూడందే
నిద్రపోని పాషండులెందరో!
గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి,
దాని అభావానికై
నేటి పాలకుల శక్తివంచన లేని కృషి.
నీవు చూపిన నాటి విరి బాట
నేటి రాజకీయులకు ముళ్లబాట.
సమానతే నీ ధ్యేయం,
అసమానతే నేటి తరం లక్ష్యం.
నిరాడంబరతే నీ భావనైతే
ఆడంబరయుత పోకడలు
నేటి యువత చిరునామా!
నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే
నేటి పాదయాత్రలు
హింసాయుత మార్గాలు,
శాంతి భద్రతల భగ్నానికి
దగ్గర దారులు.
బాపూ! నీ మార్గంలో
నేటితరం పయనించేలా దీవించవా!
– వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం
(నేడు మహాత్మా గాంధీ వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment