ideology
-
సెక్యులరిజం ఒక పాడియావు?
ఏదైనా రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ప్రకటించినపుడు అందుకు త్రికరణశుద్ధిగా కట్టుబడాలి. ఎటువంటి సమస్యలు ఎదురైనా, అధికారం ఉన్నా పోయినా, ఆ సిద్ధాంతంపై రాజీ పడకూడదు. అందుకు బహిరంగంగా గానీ, పరోక్ష రీతిలో గానీ వెసులుబాట్లు చూపరాదు. అప్పుడే ప్రజలకు ఆ పార్టీ పట్ల, ఆ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ తర్వాత కాలం నుంచి నేటి వరకు కూడా సెక్యులరిజం విషయమై అటువంటి రాజీలేనితనాన్ని చూపలేదు. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ఎత్తుగడల నుంచి, ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై విధానం వరకు సెక్యులరిజంతో కాంగ్రెస్ దోబూచులలో కనిపించేది అంతా అధికారం కోసం సాగించే ద్వంద్వ నీతే. రాహుల్ గాంధీ ఈనెల 17న కర్ణాటకలోని మాండ్యా సభలో మాట్లాడుతూ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని అన్నారు. ఇండియా కూటమి సిద్ధాంతం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కాగా, బీజేపీ సిద్ధాంతం ఆ రెండింటినీ కూలదోయట మన్నారు. సరిగా అదే 17వ తేదీన అదే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సీపీఎం పార్టీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ప్రసంగిస్తూ, పౌరసత్వ చట్టం (సీఏఏ) వివాదంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న కాంగ్రెస్‌కు సహజంగానే ఇబ్బందికరంగా మారింది. దానితో విజయన్‌పై ఎదురు దాడి జరిపింది. మరునాడు 18న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్‌లో ఒకరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ ఎన్నికల సభలో పాల్గొంటూ, విజయన్ పైకి కమ్యూనిస్టు అయినా అంతర్గతంగా మతతత్వవాది అనీ, ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో రహస్య ఒప్పందం ఉందనీ ఆరోపించారు. అక్కడ అది విన్న వారికీ, కేరళ ప్రజలకూ అదెంత రసవత్తరంగా తోచి ఉంటుందో మనకు తెలియదు. దానినట్లుంచి రాహుల్, విజయన్‌ల మాటలకు వద్దాము. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం అవసరమని, బీజేపీ వల్ల అందుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే భావన దేశంలో విస్తృతంగా ఏర్పడటం నిజం. వాటి పరిరక్షణకు కాంగ్రెస్ గానీ,ఇండియా కూటమి గానీ నిజంగానే కట్టుబడి ఉంటే దానిని స్వాగతించవలసిందే. కానీ, ఇండియా కూటమికి నాయకత్వ స్థానంలోగలకాంగ్రెస్ పార్టీయే అట్లా కట్టుబడి లేదనే సందేహం, కూటమిలో ఒక ముఖ్య భాగస్వామ్య పార్టీకి కలుగుతున్నదంటే మామూలు విషయం కాదు. సీఏఏ గానీ, దాని అమలుకు తదుపరి చర్యగా భావిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) గానీ సెక్యులరిజంతో ముడిబడిన అంశాలనే భావన విస్తృతంగా ఉంది. వీటిపై తీవ్రమైన చర్యలు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వం సీఏఏను ఇటీవల అమలుకు కూడా తెచ్చిన దరిమిలా, ప్రస్తుత ఎన్నికలలో అది వివాదంగా మారింది. దానిని తాము అమలుపరచబోమని బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించాయి. కనుక దాని ప్రాముఖ్యత ఎంతో వేరుగా చెప్పనక్కర లేదు. అటువంటి స్థితిలో సీఏఏపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, వారి ఎన్నికల మేనిఫెస్టో విధానమేమిటో ప్రకటించాలని ఎవరైనా కోరుతారు. కానీ అటునుంచి ఇంతవరకుఅంతా మౌనమే. మరొక విశేషం గమనించండి. రాహుల్ గాంధీ ఇటీ వల భారత్ జోడో యాత్రలు నిర్వహించారు. దేశంలో బీజేపీ, మోదీ విద్వేషాన్ని వ్యాపింప జేస్తుండగా తాము ప్రేమను సృష్టిస్తున్నామని అడుగడుగునా ప్రకటించారు. మోదీ విద్వేషం ప్రధానంగా అల్పసంఖ్యాక వర్గాలపై అన్నది విమర్శ. ఆ వర్గాల భయం. వారి భయ కారణాలలో ఒకటి సీఏఏ. కానీ రాహుల్ గాంధీ తన యాత్రలో ఒక్కచోటనైనా ఆ ప్రస్తావన చేయలేదు. ఎందుకన్న ప్రశ్నలు చాలా వచ్చాయి. అయినా తను ఎటువంటి వివరణా ఇవ్వలేదు. ఇవన్నీ గమనించినపుడు కలిగే అభిప్రాయం ఏమిటి? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలిపి చూపుతూ వాటి పరిరక్షణ తమ సిద్ధాంతమన్నారు. భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని ప్రవచిస్తున్నది. సమాజంలోని అన్ని వర్గాల పరిరక్షణ ప్రజాస్వామ్యపు మౌలిక లక్షణాలలో ఒకటి. అటువంటప్పుడు, రాహుల్ గాంధీ ఈ విధమైన వైఖరిని తీసుకుంటూ తమ సిద్ధాంతం ఫలానాది అని ప్రకటించటంలో రెండింటికి పొసగేది ఏమైనా ఉందా, లేక అందులో పరస్పర వైరుధ్యం కనిపిస్తుందా? ఇది మర్యాదగా అంటున్న మాట. నిర్మొహమాటంగా అడగాలంటే ఇది కపట నీతి కాదా? ఇది నిస్సందేహంగా కపట నీతే అవుతుంది. ఎందుకీ కపట నీతి అన్నది తర్వాత ఎదురయే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా రెండు పరిస్థితుల మధ్య చిక్కుకుని తనతో తానే యుద్ధం చేసుకుంటున్నది. ఆ పార్టీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, వివిధ వర్గాల ప్రజలను తానే చెప్తున్న రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, మేనిఫెస్టోల ప్రకారం అభివృద్ధి చేయటంలో అనేక దశాబ్దాల నుంచి విఫలమవుతున్నది. ఆ కారణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ఓట్లు, సీట్లు, అధికారాలను పోగొట్టుకుంటూ అసలు తన ఉనికి ఏమవుతుందోననే భయానికి గురవుతున్నది. ఆ స్థితి నుంచి బయట పడేందుకు పేదలు, మధ్యతరగతి, రైతులు, కూలీలు, వృత్తిపరులు, బడుగు వర్గాలు, మైనారిటీల ఓట్లు ఆధారమన్నది సంప్రదాయికంగా మొదటినుంచి ఉండిన ఆలోచన. కానీ తన అసమర్థ పాలనవల్ల ఒక్కొక్క వర్గమే దూరమవుతూ రాగా, ఒక దశ వచ్చే సరికి, జనరంజక పాలన ద్వారా ఓట్ల సాధన అనే దృష్టి సహజ మరణం చెందుతూ రాగా, కుల–మత ఆధారిత వ్యూహాలు మొదలయ్యాయి. అందు లోనూ పలు కులాలు ఆయా కుల పార్టీలపట్ల ఆకర్షితం కావటం ఒక సమస్యగా మారింది. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ప్రధానంగా జమ్మూ–కశ్మీర్‌కు పరిమితం కాగా, రాజీవ్ గాంధీ కాలం నుంచి అది జాతీయమై పోయింది. ఆ ప్రకారం ఆయన ఏమేమి చేశారన్న వివరాలలోకి ఇక్కడ వెళ్లలేము. ఆయన తర్వాత పీవీ నరసింహారావు కూడా అదే పని చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తనతో తాను చేసుకుంటున్న యుద్ధం ఏమంటే, పరిపాలనా వైఫల్యాలవల్ల ప్రజాసమూహాలు దూరమై ఎన్నికలలో పరాజయాలు ఎదురవుతుండిన స్థితిలో, కొత్త వ్యూహం ప్రకారం తనకు ఇటు ముస్లిముల ఓట్లు, అటు హిందువుల ఓట్లు కావాలి. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆరంభించి బీజేపీ వేగంగా బలపడుతుండటంతో కాంగ్రెస్ కూడా ఈ చట్రంలో చిక్కుకుపోయింది. ఆ ప్రకారం అటు హిందువుల కోసం, ఇటు ముస్లి ముల కోసం రెండు చేతులా కత్తిసాములు చేసినా, రెండు సాము లలోనూ ఓడిపోవటం మొదలైంది. అయితే అందులో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. ఎందుకన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. హిందువుల విషయంలో ఓడటం పొలిటికల్ సోషియాల జీకి సంబంధించినది. సూటిగా చెప్పాలంటే, హిందూవాదాన్ని 1925 నుంచే చేపట్టిన సంస్థలు, వాటికి వారసులైన బీజేపీ, ఇవన్నీ అందుకు అనుగుణంగా చేపడుతున్న కార్యకలాపాలు నిరంతరం తమ ఎదుట ఉన్న స్థితిలో, హిందూ సమాజం అందుకు కాపీరైట్‌ను బీజేపీకి మాత్రమే ఇస్తుంది. కాంగ్రెస్ సాఫ్ట్ హిందూత్వకు గానీ, అంత కు మించిన మరే వైఖరులకుగానీ విలువ ఉండదు. పోతే, ముస్లిములు కూడా కాలం గడిచేకొద్దీ, కాంగ్రెస్ పార్టీ తమను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకోవటం తప్ప, తమ అభివృద్ధికి, భద్రతకు నిజంగా చేసింది చాలా తక్కువనే అభిప్రాయానికి వచ్చారు. దానితో కాంగ్రెస్‌ను తిరస్కరించి ఇతర పార్టీల వైపు చూడటం మొదలైంది. ఆ విధంగా కాంగ్రెస్, తనతో తాను యుద్ధం చేసుకుంటూ ఈ రెండు కత్తిసాములలోనూ ఓడి పోతున్నది. ఈ రోజున కాంగ్రెస్‌ది ఒక దిక్కుతోచని స్థితి. అందుకే, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ముహబ్బత్ కీ దుకాన్ ఖోల్ నా అని యాంత్రికంగా వల్లెవేయటమైతే చేయగలరు గానీ, సీఏఏపై మాట్లాడలేరు, ఆ మాట మేనిఫెస్టోలో పెట్టలేరు. ఎందుకని అడిగేవారిపైనే ఎదురుదాడి చేస్తారు. ఎంతటి దయనీయమైన స్థితి. ఒకప్పటి పాడియావు అయిన సెక్యులరిజం క్రమంగా వట్టిపోయిన ఆవుగా మారుతున్నది. - వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -టంకశాల అశోక్ -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
మీ దగ్గర ఐడియా ఉందా..! ఐతే చలో అంటున్న స్టార్ట్ అప్
‘వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నాను. డబ్బు లేదు’ అనే వాళ్లలో చాలామందికి ఐడియా ఉండదు. అంటే... ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలి, ఎక్కడ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి... మొదలైన విషయాలపై అవగాహన ఉండదు. ‘అద్భుతమైన ఐడియా’ మన దగ్గర ఉంటే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి అనేది పెద్ద సమస్య కాదని యువతరంలో ఎంతోమంది నిరూపించారు. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ నుంచి ‘ఇండియన్ స్టార్టప్ స్టోరీస్’ లాంటి ఎన్నో టీవీ షోల ద్వారా స్ఫూర్తి పాంది ఎంటర్ప్రెన్యూర్ కావాలని కలలు కంటున్న యువతరం ఆ కల దగ్గరే ఆగిపోవడం లేదు. దానిని సాకారం చేసుకోవడానికి ఎంతో ఇష్టంగా కష్టపడుతున్నారు... ‘షార్క్ ట్యాంక్ అమెరికా కార్యక్రమాన్ని ఇష్టంగా చూసేదాన్ని. డల్లాస్ మావరిక్స్ ఓనర్ మార్క్ క్యూబన్, బ్రాక్ సిస్టమ్స్ ఫౌండర్ రాబర్ట్ హర్జెవెక్, ఫర్ యువర్ ఈజీ వోన్లీ ఫౌండర్, ప్రెసిడెంట్ లారీ గ్రైనర్లు ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లు కావడానికి సహాయం అందించారు. షార్క్‌ట్యాంక్ ఇండియన్ వెర్షన్ విషయంలో మొదట్లో ఆసక్తి ఉండేది కాదు. ఆ తరువాత మాత్రం ఆసక్తి పెరిగింది’ అంటుంది ముంబైకి చెందిన సైకాలజీ స్టూడెంట్ అహానా గుప్తా. ‘ఒక స్టార్టప్ విజయవంతం కావడానికి ఏ అంశాలు తోడ్పడతాయి, మార్కెట్‌కు సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏమిటి, వెంచర్ క్యాపిటలిస్ట్ను ఒప్పించడానికి ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి... మొదలైనవి షార్క్ ట్యాంక్లాంటి టీవీ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్నాను’ అంటుంది కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ సుతీర్థ సుహా. ‘డిస్కవరీ ప్లస్‌లో ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ చూశాను. చూస్తున్న క్రమంలో నాకు తెలియకుండానే బిజినెస్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ విషయాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది చెన్నైకి చెందిన ఎంబీఏ స్టూడెంట్’ శ్రేయా ఘోష్. ‘స్టార్టప్‌లకు సంబంధించిన పరిజ్ఞానానికి పెద్ద నగరాలలో చదవాల్సిన పనిలేదని, ఐఐటీలు, ఐఐఎంలు మాత్రమే స్టార్టప్‌లను విజయవంతంగా సృష్టించగలవనే మూస ధోరణిని స్టారప్లను దృష్టిలో పెట్టుకొని రూపాందించిన టీవీ కార్యక్రమాలు బ్రేక్ చేస్తున్నాయి’ అంటుంది దిల్లీకి చెందిన స్టాటిస్టిక్స్ స్టూడెంట్ సప్తర్షి. ‘ఒక కంపెనీ ఈక్విటీ, వాల్యుయేషన్‌ను అర్థం చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడతాయి, మార్కెట్ నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటీ... వంటివి షార్క్ ట్యాంక్ ద్వారా తెలుసుకున్నాను’ అంటుంది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ స్టూడెంట్ సహేలి సాహు. అహానా, సుతీర్థ, శ్రేయ, సప్తర్షి, సహేలి మాత్రమే కాదు... ఇంజినీరింగ్, కామర్స్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్... తాము చదువుతున్నది ఏదైనా సరే దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టూడెంట్స్ స్టార్టప్‌లకు సంబంధించి టీవీలో వచ్చే రకరకాల కార్యక్రమాల ద్వారా ్రపాక్టికల్–లైఫ్ బిజినెస్ నాలెడ్జ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్స్, బిజినెస్ స్ట్రాటజీల గురించి వివరంగా తెలుసుకోవడమే కాదు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. షార్క్ ట్యాంక్ మాత్రమే కాదు బిలియన్ డాలర్ బయర్(వూట్ టీవీ నెట్వర్క్), సిలికాన్ వ్యాలీ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), ఇండియన్ స్టార్టప్ స్టోరీస్ (డిస్కవరీ ప్లస్), స్టార్టప్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అప్‌స్టార్స్ (నెట్‌ఫ్లిక్స్), ప్లానెట్ ఆఫ్ ది యాప్స్(యాపిల్ టీవీ). గర్ల్‌బాస్–టీవీ సిరీస్ (నెట్‌ఫ్లిక్స్)... మొదలైన షోలు యువతరాన్ని ఆకట్టుకున్నాయి. ది క్వర్కీ నారీ మదురైకి చెందిన మాళవిక సక్సేనాకు మనసుకు నచ్చిన ఫుట్‌వేర్ కనిపించేది కాదు. ఏది చూసినా ‘ఇది నాకు కరెక్ట్ కాదు’ అనిపించేది. కొత్తదనం లోపించిన ఫుట్వేర్లను చూసీ చూసీ చివరికి హ్యాండ్–పెయింటెడ్ షూ బ్రాండ్ ‘ది క్వర్కీ నారీ’ని లాంచ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని క్రియేట్ చేసింది. ఇన్ఫ్లూయెన్సర్ల సహాయం తీసుకుంది. ‘షార్క్ ఇండియా’లో ‘ది క్వర్కీ నారీ’ 35 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ‘ఎపిసోడ్ ప్రసారం కాగానే ఇన్స్టాగ్రామ్ ఖాతాకు పదివేల మంది కొత్త ఫాలోవర్లు యాడ్ అయ్యారు. కేవలం నలభై ఎనిమిది గంటల్లో అమ్మకాలు బాగా పెరిగాయి’ అంటుంది మాళవిక సక్సేనా. హార్ట్ అప్ మై స్లీవ్స్ సైకాలజీలో గ్రాడ్యుయేట్ అయిన రియాకు ‘ఫ్యాషన్’ అంటే ఇష్టం. ఫ్యాషన్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన కల. 18–33 ఏళ్ల వయసు ఉన్న మహిళలను దృష్టిలో పెట్టుకొని పదివేల రూపాయల పెట్టుబడితో ‘హార్ట్ అప్ మై స్లీవ్స్’ కంపెనీ మొదలుపెట్టింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో తన ఐడియాను వినిపించిన తరువాత ఇన్వెస్టర్లు వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్ నుంచి రూ. 25 లక్షల ఫండ్ అందుకుంది. ‘ఎన్నో డ్రెస్‌లు ఉన్నా ఏది వేసుకోవాలో అనే దాని గురించి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను... అనే మాట చాలా మంది మహిళల నోటి నుంచి విన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్లీవ్స్ ద్వారా ప్రతి డ్రెస్‌కు గ్లామరస్ లుక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. వ్యాపారంలో వినీతా సింగ్, అనుపమ్ మిట్టల్‌లకు ఉన్న అనుభవం, సలహాలు మా వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడతాయి అని నమ్ముతున్నాను’ అంటుంది రియా. కవచ్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లో ఫండ్స్ అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది 13 సంవత్సరాల అనౌష్కా జాలీ. ఆరవ తరగతిలో యాంటీ–బుల్లీయింగ్ స్క్వాడ్(ఎబీఎస్) అనే వెబ్‌సైట్‌కు రూపకల్పన చేసింది. మూడు సంవత్సరాల పాటు యాంటీ–బుల్లీయింగ్ సెషన్స్ నిర్వహించిన అనౌష్క ఆ తరువాత బుల్లీయింగ్‌పై ఫైట్ చేయడానికి ‘కవచ్’ అనే యాప్‌ను రూపొందించింది. ‘షార్క్ ట్యాంక్’లో ‘కవచ్’ 50 లక్షల ఫండింగ్‌ను గెలుచుకుంది. ఇది చదవండి: దివ్యమైన ఫుడ్చైన్: వారసత్వంగా అందుకున్నదా?...! లేదా పూర్తిగా ఆమె ఆలోచనేనా..? -
మహాత్మా! చూస్తున్నావా!!
ఓ మహాత్మా! చెడు అనకు, వినకు, చూడకు అన్న పలుకులు నీవైతే నేటి సమాజానికవే ప్రీతిపాత్రం. అహింసాయోధుడవు నీవు, హింసా వీరులు నేటి నాయకగణం. సర్వమత ఐక్యత నీ పథం అనైక్యతే నేటి జనుల మార్గం. మద్యం వద్దని నీవు, అదే ముద్దని నేటి ప్రభుత. మహిళా సాధికారత నీ కల, మరి నేడో కలకంఠి కంట కన్నీరు చూడందే నిద్రపోని పాషండులెందరో! గ్రామ స్వరాజ్యం నీ ఊహాసుందరి, దాని అభావానికై నేటి పాలకుల శక్తివంచన లేని కృషి. నీవు చూపిన నాటి విరి బాట నేటి రాజకీయులకు ముళ్లబాట. సమానతే నీ ధ్యేయం, అసమానతే నేటి తరం లక్ష్యం. నిరాడంబరతే నీ భావనైతే ఆడంబరయుత పోకడలు నేటి యువత చిరునామా! నాటి నీ పాదయాత్ర ఏకతా రాగమైతే నేటి పాదయాత్రలు హింసాయుత మార్గాలు, శాంతి భద్రతల భగ్నానికి దగ్గర దారులు. బాపూ! నీ మార్గంలో నేటితరం పయనించేలా దీవించవా! – వేమూరి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం (నేడు మహాత్మా గాంధీ వర్ధంతి) -
నేను అలా చేయలేను.. వరుణ్ గాంధీపై రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పంజాబ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుండగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరి ఐడియాలజీలు వేరని స్పష్టం చేశారు. తాను ఆర్ఎస్ఎస్ ఆఫీసుకు వెళ్లేలోపే తల నరికేసుకుంటానని సంచలన కామెంట్స్ చేశారు. వివరాల ప్రకారం.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ.. మంగళవారం పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ గాంధీ భావజాలంతో తాను ఏకీభవించలేనన్నారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీ తరుఫున లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. అందుకే అతని భావాజాలంతో నేను ఏకీభవించలేను. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆఫీసుకు వెళ్లడానికి ముందే తన తల నరుక్కోవాల్సి ఉంటుందని రాహుల్ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ.. ‘మా కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉంది. కానీ వరుణ్ గాంధీ మరో భావజాలాన్ని స్వీకరించారు. నేను వరుణ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకోగలను.. ప్రేమతో మాట్లాడగలను. కానీ.. అతను పుచ్చుకున్న ఐడియాలజీని తాను స్వీకరించలేన’ని తెలిపారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ పాల్గొంటారనే వార్తలు ఇటీవల చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కామెంట్స్ ఆసకిక్తరంగా మారాయి. ఇక, వరుణ్ గాంధీ.. ఆయన తల్లి మేనకా గాంధీ కూడా బీజేపీలో ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. #WATCH | Varun Gandhi is in BJP if he walks here then it might be a problem for him. My ideology doesn't match his ideology.I cannot go to RSS office,I'll have to be beheaded before that. My family has an ideology. Varun adopted another & I can't accept that ideology:Rahul Gandhi pic.twitter.com/hEgjpoqlhK — ANI (@ANI) January 17, 2023 మరోవైపు.. గతకొద్దిరోజులుగా వరుణ్ గాంధీ బీజేపీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, నిరుద్యోగంపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. దీంతో, వరుణ్ గాంధీ వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని వీడే అవకాశం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
‘బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే’.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు
లఖ్‌నవూ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. భారత్ జోడో యాత్రలో పాల్గొనాలన్న కాంగ్రెస్ పిలుపును తోసిపుచ్చారు. జోడో యాత్రకు దూరంగా ఉండిపోయారు. ఈ అంశంపై మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెస్, బీజేపీల సిద్ధాంతాలు ఒకటేనని పేర్కొన్నారు. ‘మా పార్టీ సిద్ధాంతం భిన్నమైనది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. మీ ఫోన్‌కు ఆహ్వానం వచ్చి ఉంటే నాకు పంపించండి. వారి యాత్రతో మా మనోభావాలు ఉన్నాయి. నాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ’అని పేర్కొన్నారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు.. యూపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఆహ్వానాలు పంపించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్న తరుణంగా ఎస్పీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: మమతా బెనర్జీకి తీరని లోటు.. బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి -
నిజంగా భక్తులేనా? పైకి మాత్రమేనా?
అంబేడ్కర్‌ను బీజేపీ కానీ, నరేంద్ర మోదీ కానీ విశేషంగా గౌరవిస్తున్నట్లు పైకి కనబడుతోంది. మోదీ అయితే తాను అంబేడ్కర్ భక్తుడిని అని చెప్పుకున్నారు. కానీ బీజేపీ నమ్ముతున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ విశ్వసించారు. హిందూరాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుందని రాశారు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. స్వేచ్ఛాయుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భారతీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని కూడా అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజాస్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృత్వానికి చోటిచ్చే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి ప్రమాదం ఈరోజు కనబడటం లేదా? నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ బి.ఆర్. అంబేడ్కర్‌ను ఒక ఆదర్శ మూర్తిగానే కాకుండా, తమ విశిష్ట కథా నాయకుల్లో ఒకరిగా కూడా గౌరవిస్తోంది. 2015లో ప్రధాని మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక సామాజిక వర్గానికి మాత్రమే కాకుండా, యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. 2016లో మరో సందర్భంలో తాను అంబేడ్కర్ భక్తుడిని అని ప్రకటించుకున్నారు. అయితే బీజేపీ విశ్వసిస్తున్న లేక పాటిస్తున్న అనేక కీలక అంశాలు అంబేడ్కర్ చెప్పిన దానికీ, పాటించిన దానికీ పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ అధ్యయనం చేసి ప్రచురించిన ‘అంబేడ్కర్: ఎ లైఫ్’ వెల్లడించింది. హిందూయిజం, హిందూ–రాజ్‌పై అంబేడ్కర్, బీజేపీల మధ్య తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని శశి థరూర్ రచన పేర్కొంది. భారత్‌లో మెజారిటీ వర్గపు భావన పట్ల బీజేపీ నిబద్ధత క్రమంగా పెరుగుతోంది. కానీ అలాంటి వైఖరి విధ్వంసకరమైనదని అంబేడ్కర్ ఆనాడు విశ్వసించారు. ‘‘హిందూ రాజ్ ఒక వాస్తవంగా మారితే, నిస్సందేహంగా అది ఈ దేశానికి అతిపెద్ద విపత్తు అవుతుంది’’ అని అంబేడ్కర్ రాశారు. ‘‘హిందువులు ఏమైనా చెప్పవచ్చు. కానీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు హిందూయిజం పెనుముప్పు. ఈ విషయంలో అది ప్రజాస్వామ్యంతో ఏమాత్రం సరిపోలదు. హిందూ –రాజ్‌ని ఏ విధంగానైనా సరే నిరోధించి తీరాలి’’ అని అంబేడ్కర్ పేర్కొన్నారు. వాస్తవానికి అంబేడ్కర్ హిందూయిజాన్ని ఏమాత్రం ఇష్టపడ లేదు. హిందూ నాగరికతను మానవజాతిని బానిసత్వంలోకి దింపడా నికి పన్నిన క్రూరమైన కుట్రగా ఆయన పేర్కొన్నారు. హిందూయిజా నికి సరైన పేరు అపకీర్తి అని మాత్రమే అన్నారాయన. దీన్ని బట్టి హిందువులను కూడా ఆయన ఇష్టపడనట్లే కనిపిస్తుంది. ‘‘హిందు వులు... పిదపతనంతో కుంగిపోయి ఉన్నప్పటికీ శక్తిని కోరుకుంటున్న పిగ్మీలు, మరుగుజ్జులకు చెందిన జాతి... హిందువులు మంచిగానో, చెడ్డగానో ఉండవచ్చు కానీ ఉత్తమ హిందువు అంటూ ఎవరూ ఉండరు’’ అన్నారు అంబేడ్కర్. అంబేడ్కర్ భావాల గురించి బీజేపీకి తెలియకుండా ఉంటుందా... లేదా మనం అజ్ఞానులం అనీ, అంబేడ్కర్‌ను మనం కనుగొనలేమనీ అది భావిస్తోందా? లేక తనకు ప్రయోజనకరమైన కారణాలతో అంబేడ్కర్‌ను అది ఉద్దేశపూర్వకంగా కౌగలించుకుం టోందా? అందుకోసమే నిక్కచ్చిగానూ, ఇబ్బందికరంగానూ ఉండే అంబేడ్కర్ భావాల్లో పొడసూపే వ్యత్యాసాలను కూడా బీజేపీ పట్టించుకోకుండా ఉంటోందా? భారతీయ మైనారిటీలపై అంబేడ్కర్ అభిప్రాయాలను మీరు చూసినట్లయితే, ఈ ప్రశ్నలు మరింతగా ఇబ్బందిపెడతాయి. 1948లో రాజ్యాంగ సభలో అంబేడ్కర్ ప్రసంగిస్తూ, మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి మెజారిటీ పైనే ఉందని స్పష్టంగా చెప్పారు. ‘‘భారతదేశంలోని మైనారిటీలు తమ అస్తిత్వాన్ని మెజారిటీ చేతుల్లో ఉంచడానికి అంగీకరించారు... వారు మెజారిటీ పాలన పట్ల విశ్వాసంతో ఉండటానికి అంగీకరించారు. ఆ మెజారిటీ ప్రాథమి కంగా మతపరమైన మెజారిటీనే తప్ప రాజకీయ మెజారిటీ కాదు. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శించకుండా ఉండాల్సిన విధి తమదేనని మెజారిటీ గుర్తుంచుకోవాలి.’’ అలాంటి విధిని, బాధ్యతను ఆమోదించడం అటుంచి దాన్ని బీజేపీ గుర్తిస్తుందా? అంబేడ్కర్ ఎన్నడైనా ‘బాబర్ కి ఔలద్’, ‘అబ్బా జాన్’ అనే మాటల్ని ఆమోదించేవారా? ‘కబరస్తాన్, శ్మశాన్ ఘాట్’ అనే భావనలను ఆయన ఆమోదించేవారా? లేదా ముస్లిం మతస్థు లను మొత్తంగా పాకిస్తాన్‌కి పంపించేస్తామనే బెదిరింపులను ఆమో దించేవారా? ఇలా ప్రశ్నించడం ద్వారానే బహుశా ప్రశ్నలకు సమా ధానం రాబట్టగలం. అయితే అంబేడ్కర్ ఆనాడే ఒక హెచ్చరిక చేశారు. 1948 నవంబర్‌లో తాను చేసిన సుప్రసిద్ధ ప్రసంగంలో అత్యంత స్పష్టంగా ఒక విషయాన్ని వెల్లడించారు. ‘‘మైనారిటీలు విస్ఫోటక శక్తి. అది కానీ వెలుపలకు వచ్చిందంటే మొత్తం రాజ్యవ్యవస్థనే పేల్చివేస్తుంది’’ అన్నారు. నిజానికి 70 సంవత్సరాల క్రితం మైనారిటీలు చిన్న సంఖ్యలో ఉండేవారు. భయపడుతుండేవారు. తమను నిర్లక్ష్యం చేసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈరోజు వారి జనాభా 20 కోట్లు. తమను ఎంతగా ఆగౌరవ పరుస్తున్నారో, సమాజం నుంచి ఎంతగా తమను వేరుపరుస్తున్నారో అనే విషయంలో వీరు చైత న్యంతో ఉన్నారు. అంబేడ్కర్ బతికి ఉంటే ఈరోజు చాలా ఆందోళన చెంది ఉండే వారు. కానీ బీజేపీ ఆయన భయాలను పంచుకునేదా లేక అర్థం చేసుకునేదా? బీజేపీ నిప్పుతో చెలగాటమాడుతోందని అంబేడ్కర్ భావించేవారని మీరు ఊహించగలరా? కానీ బీజేపీ మాత్రం ప్రస్తుతం చాలా ఉల్లాసంగా పని చేసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.భారత్ ఎలాంటి తరహా ప్రజాస్వామిక దేశంగా మారిపోతోందో మీరు గుర్తించినప్పుడు అంబేడ్కర్ భావాలకూ, బీజేపీ ఆచరణకూ మధ్య ఉన్న మరో అంతరం స్పష్టమవుతుంది. స్వేచ్ఛా యుతమైన, న్యాయబద్ధమైన ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ భార తీయ ప్రజాస్వామ్యం నియంతృత్వంలోకి అడుగుపెడుతుందని అంబేడ్కర్ ఆనాడే కలవరపడ్డారు. కొత్తగా ఉదయించిన ఈ ప్రజా స్వామ్యం తన రూపాన్ని కొనసాగిస్తూనే వాస్తవానికి నియంతృ త్వానికి చోటిచ్చే అవకాశం ఉందని ఆయన ఆనాడే చెప్పారు. ప్రజామద్దతు ఎంత అధికంగా ఉంటే అంత అధికంగా నియంతృత్వం ఆవిర్భవించే అవకాశం ఉంటుందని అంబేడ్కర్ 1948లోనే హెచ్చ రించారు. అలాంటి ప్రమాదం ఈరోజు జరగడం లేదా? మన రాజ కీయాల్లో ప్రస్తుతం ఒక ప్రచండాకృతి ఆధిపత్యం చలాయిస్తోంది. ఆ ప్రచండాకృతి చుట్టూ వ్యక్తి ఆరాధన అల్లుకుపోతోంది. ఎలాంటి అసమ్మతినీ అది సహించడం లేదు. పార్లమెంటును తరచుగా సంప్ర దించడం లేదు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ బలహీన పడి పోయాయి. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల కోరలు పెంచారు. మీడియాను నిర్వీర్యం చేసి పడేశారు. చివరగా, భారతదేశం విషయంలో బీజేపీని, దాని దార్శనికతను అంబేడ్కర్ ఎలా భావించి ఉండేవారో అని నేను ఆశ్చర్యపడు తున్నాను. నరేంద్ర మోదీ తనకు ఒక భక్తుడిగా ఉండటాన్ని చూసి అంబేడ్కర్ నిజంగా గర్వపడేవారా? బీజేపీవారు తన పాదముద్రల పైనే నడుస్తున్నారని అంబేడ్కర్ నమ్మి ఉండేవారా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోంది
బెంగళూరు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలం దేశాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ భళ్లారిలో శనివారం నిర్వహించిన భారీ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ల సిద్దాంతం దేశాన్ని విడదీస్తోందని వేల మంది భావిస్తున్నారని, అందుకే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన పాదయత్రకు భారత్ జోడో(దేశాన్ని ఏకం చేయడం) పేరు పెట్టినట్లు రాహుల్ చెప్పారు. భారత్ జోడో యాత్రను సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించారు రాహుల్ గాంధీ. 3500కిలోమీటర్లకు పైగా 150 రోజులపాటు సాగనున్న ఈ యాత్ర కశ్మీర్లో ముగియనుంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ ఈ యాత్రకు నడుం బిగించారు. ప్రస్తుతం 1,000 కిలోమీటర్లు పూర్తయింది. కర్ణాటక బళ్లారిలో కొనసాగుతోంది. చదవండి: ‘కులం’ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీజేపీ -
సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...
నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్‌గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!) కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి -
ఎదలో పూసిన ఎర్ర గులాబీ!
చందమామ లేని వెన్నెల కాయించే మాంత్రికులు రాబో తున్నారు. ఆకాశం లేని ఇంద్రధనుసును పూయించే చమత్కా రులు కూడా రాబోతు న్నారు. పండిత నెహ్రూ ప్రస్తావన లేకుండానే స్వతంత్ర భారత ప్రస్థా నాన్ని వినిపించగల హరి కథకులు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఇక ముందు ఇలాంటి అనేక వింతల్ని చూడ వలసి ఉన్నది. అనేక విషాదాలను కూడా తట్టుకోవలసి ఉన్నది. ‘క్లైమేట్ ఛేంజ్’ పర్యవసానంగా శిరమెత్తిన నడిమంత్రపు తుపాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. ఇది రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై అయిదేళ్లు నిండిన సందర్భాన్ని అమృతోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. ప్రజలు అద్భుతంగా స్పందించారు. పొలం పనులకు వెళ్లిన కూలి జనం కూడా ముందుగా గట్ల మీద మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. ‘జనగణమన’ పాడారు. జైహిందంటూ జెండాలకు వందనం చేసిన తర్వాతే పనుల్లోకి దిగారు. దండకారణ్య మారుమూల ప్రాంతాల్లో ఒంటి మీద సరిగా గుడ్డల్లేని గిరిజన బిడ్డలు కూడా జెండా పండుగలు చేసుకున్నారు. దేశభక్తి ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదని ఢంకా భజాయించి చెప్పారు. ఈ నేల మీద మొలకెత్తిన గడ్డిపోచకు కూడా దేశభక్తిపై పేటెంట్ ఉన్నదని ఘంటాపథంగా చాటి చెప్పారు. భావజాల వాతావరణ మార్పుల ప్రభావం ఈ ఉత్సవాల్లో అక్కడక్కడా కనిపించింది. నవభారత నిర్మాతగా పేరున్న పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ఠ మీద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా పాల్గొన్నాయి. ‘దేశవిభజనకు నెహ్రూయే కారకు’డంటూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన వీడియో ఆరోపించింది. కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పత్రికా ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో నెహ్రూను మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల ఫొటోలు వేశారు. కావాలనే నెహ్రూ ఫొటోను వెయ్యలేదని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఒకరు ప్రక టించారు. అంబేడ్కర్ బొమ్మను కూడా అట్టడుగున మొక్కు బడిగా వేశారనీ, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష వేడిన సావర్కర్ ఫొటో మాత్రం ప్రముఖంగా వేశారనీ విమర్శలు కూడా వచ్చాయి. నెహ్రూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు పథకం ప్రకారమే ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. ‘‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వు – ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం’’ – అట్లాంటి నిన్ను ఈ దేశం ఎలా మరవగలుగుతుందని నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన కవితలో తిలక్ ప్రశ్నిస్తాడు. అది అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని కొంతమంది వీరతిలకాలు దిద్దుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు ఈ ప్రయత్నాలు? నెహ్రూను తెరమరుగు చేసి ఏం సాధించగలరు? నెహ్రూపై కత్తి దూయడం వెనుక ఉన్నది భావజాల సంఘర్షణ కావచ్చు. దూసిన కత్తికి రెండో వైపున కూడా పదునుందని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను ‘ఉచిత పథకాల’ పేరుతో ఈసడించుకునే క్యాంపెయిన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. దాదాపు ఇదే సమయంలో నెహ్రూ భావ జాలాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికపై మొదలయ్యాయి. ఈ రెంటికీ మధ్యన ఉన్న సంబంధమేమిటి? అసలు నెహ్రూ భావజాలమేమిటి? ఆయన చేసిందేమిటి? 1929 డిసెంబర్లో జరిగిన ‘లాహోర్ కాంగ్రెస్ సభ’లో మొదటిసారిగా దేశానికి ‘పూర్ణ స్వరాజ్’ కావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అప్పటి వరకూ డొమినియన్ హోదా ఇస్తే చాలన్న పార్టీ పంథాలో ఈ విప్లవాత్మక మార్పునకు కారకుడు ఆ సభలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం ప్రకటించే ముందు లార్డ్ మౌంట్ బాటెన్ ఒక ప్లాన్‌ను ముందుకు తెచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ప్రావిన్స్‌ల (రాష్ట్రాల) వారీగా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తారు. భారత రాజ్యాంగ సభలో చేరడం, చేరకపోవడమనేది వారి ఇష్టం. ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించి దేశం డజన్ ముక్కలు కాకుండా కాపాడిన వారిలో ప్రథముడు జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్రం లభించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలు వేళ్లూనుకోవడానికీ, లౌకిక వ్యవస్థ పటిష్ఠమవడానికీ, సామాజిక న్యాయం – సామ్యవాద భావాలు వికసించడానికీ అహరహం కృషి చేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. భారత్‌తో పాటు ఆ కాలంలో వలస సంకెళ్లు తెంచుకున్న అనేక దేశాలు ప్రజాస్వామిక వ్యవస్థలతో ప్రారంభమై, అచిర కాలంలోనే నియంతృత్వంలోకి జారుకున్నాయి. ఆ దేశాల జాతీయ నాయకులు అభ్యుదయ భావాలు కలిగినవారే. అయినా పతనాన్ని నిరోధించలేక పోయారు. ఇండోనేషియా, పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాలు ఇందుకు ఉదాహరణలు. ఆ రోజుల్లో ఒక్క జూలియస్ నైరేరే (టాంజానియా) మాత్రమే పండిత నెహ్రూ మాదిరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలబెట్టగలిగారు. డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియాకు విముక్తి సాధించడంలో సుకర్ణో కీలకపాత్ర పోషించారు. ఆయన నెహ్రూతో సమానంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అలీనోద్యమంలో నెహ్రూకు కుడి భుజంగా వ్యవహరించాడు. నియంతృత్వ పోకడలు పొడసూపి, పది లక్షల మంది ఊచకోతకు కారకుడై చివరకు పదవీచ్యుతుడయ్యాడు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం జనం మెదళ్లపై కూడా నిఘా వేసి లక్షలాది మందిని హతమార్చింది. పండిత నెహ్రూ ఇందుకు భిన్నంగా ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా లోపభూయిష్ఠంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆ కాలపు తరుణ స్వతంత్ర దేశాధినేతల్లో ఒకరికి ‘అత్యుత్తమ ప్రజాస్వామ్యవాది’ టైటిల్ ఇవ్వాల్సి వస్తే నెహ్రూతో పోటీపడగలిగే వారెవరూ లేరు. ఇన్నాళ్లుగా ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ఈ దేశంలో నిలబడి ఉండటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రతిపక్ష నేతలలో కూడా నెహ్రూ సౌహార్దంగానే వ్యవహరించారని చెప్పేందుకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నెహ్రూ విధానాలకు సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా బద్ధవ్యతిరేకి. తీవ్రంగా విమర్శించేవాడు. ఒకసారి ఏదో ధర్నా చేసి ఆయన జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న లోహియాకు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక బుట్ట నిండా మామిడిపళ్లను పంపించారట. ఈ చర్య పట్ల అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘జనసంఘ్’ టిక్కెట్‌పై లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన అటల్ బిహారి వాజ్‌పేయ్ తన విధానాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడయ్యేవారట. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్‌పేయ్‌ని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారట. నెహ్రూ విధానాలను తీవ్రంగా విమర్శించే వాజ్‌పేయి వ్యక్తి గతంగా మాత్రం ఆయనను అభిమానించేవారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రయ్యారు. తన ఛాంబర్లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటోను ఇప్పుడు తీసేశారని గుర్తించారు. ‘పండిత్‌జీ ఫొటోను తెచ్చి ఎక్కడుందో అక్కడ మళ్లీ పెట్టండ’ని ఆదేశించారట! స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఈ ప్రసంగంలో రేఖామాత్రంగా చెప్పిన అంశాలే ఆయన భావజాలానికి తార్కిక పునాది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను ఇప్పుడు నెరవేర్చాలి. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞా నాన్ని పారద్రోలాలి. ప్రతి ఒక్క కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయా’లంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసం చేశారు. అంబే డ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలో ఈ అభిప్రాయాలు ప్రతిఫలించాయి. తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని ‘ఆధునిక దేవాలయాలు’గా పిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా భారతీయులు పనిచేస్తున్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఐఐటీలు, ఐఐఎమ్‌లూ, వాటితోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎయిమ్స్’లాంటి విద్యా సంస్థల్ని నెహ్రూ స్థాపించారు. హోమీ జె.బాబా, విక్రమ్ సారాబాయ్, సీడీ దేశ్‌ముఖ్, భట్నాగర్, వర్గీస్ కురియన్ వంటి మేధావులను ప్రోత్సహించి, వారి కృషితో దేశానికి అభివృద్ధి బాటలు పరిచిన దార్శనికుడు నెహ్రూ. అంతరిక్ష రంగంలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్’ను కూడా నెహ్రూ కాలంలోనే స్థాపించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థల్లో సింహభాగం ఆయన కాలంలోనే ఏర్ప డ్డాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక సుదీర్ఘమైన జాబితా తయారవుతుంది. నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధిని క్రమబద్ధం చేసి దేశాన్ని నిలబెట్టాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపుదిద్ది అసమానతలు, అంతరాలు అడ్డగోలుగా పెరగకుండా నియంత్రించగలిగాయి. స్వాతంత్య్రా నికి ముందు బ్రిటీష్ దోపిడీ యథేచ్ఛగా సాగిన రోజుల్లో దేశ జనాభాలోని ఒక్క శాతం అగ్రగామి శ్రీమంతుల చేతుల్లో 21 శాతం జాతి సంపద ఉండేది. నెహ్రూ విధానాల ఫలితంగా 1980 నాటికి ఒక్క శాతం జనాభా చేతిలో ఉండే జాతి సంపద 6 శాతానికి తగ్గింది. మళ్లీ ఇప్పుడు 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్‌రాజ్’ నుంచి ‘స్వరాజ్’ వైపు దేశాన్ని మళ్లించడానికి నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు ప్రయత్నించారు. ఇప్పటి ఆధునిక నేతలు దాన్ని ‘బిలియనీర్ల రాజ్’ వైపు పరుగె త్తిస్తున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తున్నది. ‘బ్రిటీష్ రాజ్ టు బిలియనీర్ రాజ్’ పేరుతో వెలువడిన ఒక పరిశోధనా పత్రం లోని ఈ వివరాలను ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో ప్రకటించారు. నెహ్రూ సర్వజ్ఞుడనీ, లోపరహితుడనీ చెప్పలేము. ఆయన పాలనా కాలంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా చైనాను అంచనా వేయడంలో ఆయన తప్పటడుగు వేశారు. తరుణ స్వతంత్ర దేశాలన్నీ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. చైనాతో ‘పంచశీల’ ఒడంబడిక కుదుర్చు కున్నారు. మావో జెడాంగ్ ఎంత కమ్యూనిస్టో అంతే కరుడు గట్టిన నేషనలిస్టు అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. టిబెట్‌పై దురాక్రమణ చేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ పరిణామానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ దేశాలను నెహ్రూ కూడగట్టి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ బెంగే ఆయన మరణానికి కూడా కారణమైంది. పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశీయంగా కూడా నెహ్రూ కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఆయన ఆధునిక భారత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ నెంబర్ వన్. దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవకుండా కాపాడినవాడు. లౌకిక భావాలను సమాజం గుండెల నిండా నింపినవాడు. సమతాభావాలకు జైకొట్టినవాడు. మనిషిని ప్రేమించినవాడు. ఈ దేశపు మట్టిని ప్రేమించినవాడు. ఆయన పటేల్ విగ్రహ మంత పెద్ద విగ్రహాన్ని పెట్టకపోవచ్చు కానీ ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న మేధావులను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాలను స్థాపించారు. ఆయన రామ మందిరాన్ని నిర్మించకపోవచ్చు కానీ ఆధునిక దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు. ఛాందస భావాలకు బద్ధవిరోధి. శాస్త్రీయ ఆలోచనా రీతులకూ, సైంటిఫిక్ టెంపర్కూ కేరాఫ్ అడ్రస్ – పండిత నెహ్రూ. ఇప్పుడా చిరునామాను చెరిపేస్తారట! కోటు మీద అలంకరించుకున్న గులాబీ పువ్వును పీకి పారేయొచ్చు. కానీ ఎద ఎదలో పూసిన ఎర్రగులాబీలను పీకేయడం ఎలా సాధ్యం? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
Vishva Hindu Parishad: ధార్మిక సేవా అక్షౌహిణి!
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) .... ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం! అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ (ఆగస్టు 5, 2020) నాటికి అన్ని వర్గాల్లో చర్చకు మూలమైంది విశ్వహిందూ పరిషత్. 1964లో శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభ పర్వదినాన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) రెండవ చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) నేతృత్వంలో విశ్వహిందూ పరిషత్ పురుడు పోసుకుంది. ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమం వేదికగా సంస్థకు అంకురార్పణ జరిగింది. మొట్టమొదట స్వామి చిన్మయానంద సరస్వతి అధ్యక్షులుగా వీహెచ్‌పీ కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టింది. అనేకమైన సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో వీహెచ్‌పీ దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉంటూ ధార్మిక, సామాజిక, సేవా రంగాల్లో కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు 17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ నిస్వార్థ కృషి సల్పు తున్నది. 1983లో వీహెచ్‌పీ ప్రతిష్ఠాత్మకంగా ‘ఏకాత్మకం యజ్ఞం’ నిర్వ హించింది. 1983 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ సామాజిక సమరసతా భావం నింపేందుకు... అంటరానివారు, దళితులు అనే భావన విడనాడి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహిస్తోంది. ఏకాత్మక యజ్ఞం, అయోధ్య రామమందిర ఉద్యమ నిర్వహణలో విజయం సాధించి హిందువులకు ఆత్మవిశ్వాసం భరోసాను కల్పించింది. మతం మార్చుకున్న హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించే ‘ఘర్ వాపసీ’ ఉద్యమాన్నీ నిర్వహిస్తోంది. (క్లిక్: ప్రణాళికాబద్ధంగా దూరం చేస్తున్నారు!) – పగుడాకుల బాలస్వామి, వీహెచ్‌పీ తెలంగాణ ప్రచార సహ ప్రముఖ్ (వీహెచ్‌పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా) -
నిజాలకు పాతరేసి.. అబద్ధాన్ని అందలం ఎక్కిస్తే...
సోషల్ మీడియా వేదికగా కొందరు ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి గౌరవానికి, ప్రైవసీకి తీవ్ర విఘాతం కలిగించారు. సామాజిక మాధ్యమాల ఖాతాల్లోంచి ముస్లిం మహిళల ఫొటోలను సేకరించి, ఓ యాప్‌లో వేలానికి పెట్టడం కలకలం రేపింది. ‘బుల్లీబాయ్’ పేరుతో రూపొందించిన బ్లాగ్‌లో ముస్లిం మహిళల ఫొటోలను విక్రయానికి పెట్టారు. వందల సంఖ్యలో ఫొటోలు ఆ యాప్‌లో ఉన్నాయి. ‘బుల్లీబాయ్ ఆఫ్ ది డే’ పేరుతో రోజుకు ఒక ముస్లిం మహిళ ఫొటోను వేలం వేయటం ఈ యాప్ ప్రత్యేకత. (ఇందుకు కారకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడంతో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్‌కి తెర పడింది). సలీ డీల్స్‌కు క్లోనింగే బుల్లీబాయ్ అనుకుంటున్నారు. బుల్లీబాయ్ తరహాలోనే ‘సలీ డీల్స్’ పేరుతో ఆర్నెల్ల క్రితం గిట్‌హబ్‌లో ఓ బ్లాగ్/యాప్ ఇలాంటి చర్యలకే ఒడి గట్టింది. మతరాజకీయాలు చేస్తూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సాంకేతికతతో ముస్లిం వ్యతిరేక భావవాతావరణం కల్పిస్తూ కొందరు రెచ్చగొడుతున్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ మతవాద ప్రతినిధులు తమ ‘భావజాలాన్ని’ నమ్మేలా సృష్టిస్తున్న వాతావరణంలో.. మైనారిటీలు వాస్తవాల్ని, సత్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతోంది. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు తమ అభిప్రాయాలే నిజం అంటూ భ్రమ కల్పిస్తున్నారు. తాము ప్రచారం చేయదలచుకున్న ఫేక్ న్యూస్‌ను నమ్మేలా ‘భావవాతావరణా’న్ని మీడియా ద్వారా సృష్టిస్తున్నారు. ఈ ట్రెండ్ గత ఐదేళ్ళుగా దేశంలో బాగా పెరిగిపోతోంది. ముస్లింల జనాభా బాగా పెరిగిపోతోందని.. ముస్లిం పురుషులు నలుగురిని పెళ్ళి చేసుకుంటున్నారనీ.. ఇలా అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఈ మతవాదులు చేస్తున్నది గోబెల్స్ ప్రచారం. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్ సిద్ధాంతం. వాస్తవానికి దేశంలో ఇప్పుడున్న స్థితి ఏమిటంటే... 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీగా ఉన్నారు. లక్షద్వీప్ (లక్ష మంది), జమ్ము–కశ్మీర్ (కోటీ 30 లక్షల మంది)ల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీ. పంజాబ్‌లో సిక్కులు; నాగాలాండ్ (20 లక్షలు), మిజోరం (10 లక్షలు), మేఘాలయ (30 లక్షలు)ల్లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. 2021 నాటికి దేశంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా, ముస్లింల జనాభా 20 కోట్లు మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అంటే.. 80 శాతం హిందువులుంటే, 20 శాతం ముస్లింలు ఉన్నారు! వాస్తవం ఇలా ఉండగా.. ముస్లింల సంఖ్య పెరిగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తూ ఇదే నిజం అని నమ్మించేలా భావ వాతావరణం కల్పిస్తున్నారు. మనుషుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన మత విషయాన్ని పబ్లిక్ చర్చకు పెట్టి, రెచ్చగొడుతూ ఓట్లు రాల్చుకుంటున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ’ధర్మ సంసద్’ సమావేశం నడిచిన తీరు ముస్లింలపై జరుగుతున్న అసత్య ప్రచారానికి అద్దం పడుతోంది. ఈ ధర్మసంసద్‌లో హిందూ సాధువులు.. హిందూ మతాన్ని కాపాడుకోడానికి ఆయుధాలు చేపట్టాలని, ముస్లిం... ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలని, ముస్లిం జనాభాను పెరగనివ్వకూడదని ఇచ్చిన పిలుపును ఏవిధంగా అర్థం చేసుకోవాలి? మత విద్వేషం నిజాన్ని కప్పేస్తుంది. ఈ దేశంలో పుట్టి పెరిగిన ముస్లింలను శత్రువులుగా ముద్రవేయడాన్ని దేశభక్తికి కొలమానంగా చూడటం, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు ముస్లింలను దూరం చేయాలనుకోవడం కరెక్టేనా? ప్రజలకు వాస్తవాల ఎరుకను కలుగ జేయవలసిన బాధ్యత లౌకికవాదులందరికీ ఉంది. - డా. ఎంకే ఫజల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ -
ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని
ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది. ‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం. అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు. స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి. ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు. ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు. తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం. ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి. ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది. సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!! ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!! ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు. – ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్ గరికపాటి -
అంబేడ్కర్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలి!
‘‘మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’’ అన్న అంబేడ్కర్ మాటలు రాజ్యాంగ సభను నివ్వెరపరిచాయి. 18వ శతాబ్దపు ఐరిష్ రాజనీతి తాత్వికుడు ఎడ్మండ్ బర్క్ మాటలను అంబేడ్కర్ తీవ్ర స్వరంతో పలికారు. ఆగస్టు 26, 1949న రాజ్యాంగంలో పొందుపరి చిన ఆర్టికల్ 334పై జరిగిన చర్చను ముగిస్తూ అంబేడ్కర్ చేసిన నిరసన గర్జన అది. షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం పోరాడిన అంబేడ్కర్‌కు రాజ్యాంగసభ నిరాశను మిగిల్చింది. దాని పర్యవ సానమే 1955 ఆగస్టు 21న బొంబాయిలో జరిగిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య, వర్కింగ్ కమిటీ సమావేశంలో... పార్లమెంటు, శాసనసభలు, జిల్లా, పట్టణ స్థాయి స్థానిక సంస్థల్లో ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు సీట్లను ఎత్తివేయాలన్న తీర్మానం. ఈ సమావేశంలో అంబేడ్కర్ కూడా పాల్గొన్నారు. దీనిని కొంతమంది ఎస్సీ రిజర్వేషన్లకే అంబేడ్కర్ వ్యతిరేకమని అర్థం చేసుకుంటున్నారు. అదే సంవత్సరం అంటే 1955 డిసెం బర్ 23న, భాషా ప్రయుక్త రాష్ట్రాలపై రూపొందించిన డాక్యు మెంటులో ‘‘ప్రత్యేక ఓటింగ్ విధానం గానీ, సీట్ల రిజర్వేషన్ గానీ సాధ్యం కానప్పుడు బహుళ సభ్యుల నియోజక వర్గాలు అంటే రెండు లేక మూడు నియోజక వర్గాలు కలిపి ఒకే నియోజక వర్గంగా రూపొందిస్తే అది అల్ప సంఖ్యాకులుగా ఉన్న వారికి భరోసాను ఇస్తుంది. దీనినే క్యుములేటివ్ ఓటింగ్ అంటారు’’ అని ప్రత్యామ్నాయాన్ని సైతం అంబేడ్కర్ సూచించిన విష యాన్ని మర్చిపోవద్దు. బాబాసాహెబ్ రాజ్యాంగ సభలో సభ్యుడిగా వెళ్లిన కారణమే రాజకీయ, సామాజిక హక్కులను పొందుపరచడానికని మరచి పోవద్దు. పార్లమెంటు, అంసెబ్లీలలో రిజర్వేషన్లు పదేళ్ళు మాత్రమే ఉంటాయనే విషయాన్ని అంబేడ్కర్ అంగీకరించలేదు. ‘ఎస్సీ, ఎస్టీల కోసం నిర్దేశించిన రిజర్వేషన్లు పదేళ్ళు ఉండాలని చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. మహా సామ్రాజ్యాలు, సంకుచిత మనస్తత్వాలు కలిసి మనుగడ సాగించలేవు’ అన్నారు. దీనర్థం పదేళ్ళ పరిమితిని అంగీకరించినట్టా, వ్యతిరేకించినట్టా? 1955లో షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ చేసిన తీర్మానానికీ, రాజ్యాంగం ఆమోదించిన దానికీ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశించిన రాజకీయ హక్కుల రక్షణకే వల్లభ్ భాయి పటేల్ లాంటి వాళ్ళు ఎసరు పెట్టారు. తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యేక ఓటింగ్ విధానం కూడా సాధ్యం కాదేమో అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. 1947 ఆగస్టులో రూపొందించిన రాజ్యాంగ ముసాయిదాలో షెడ్యూల్డ్ కులాలకు, ఇతర మైనారిటీలకు రాజకీయ రక్షణలను చేర్చారు. అంబేడ్కర్ డిమాండ్ చేసిన ప్రత్యేక ఓటింగ్ విధానం ఆమోదం పొందలేదు. అయినప్పటికీ అంబేడ్కర్ రిజర్వుడు సీట్ల విధానానికి ఒప్పు కున్నారు. అప్పుడు పదేళ్ళ పరిమితి లేదు. అయితే పాకిస్తాన్ విభజన జరగడం, గాంధీజీ హత్యకు గురవడంతో సర్దార్ పటేల్ 1947 నాటి ముసాయిదాను తిరగదోడారు. రిజర్వేషన్లనే తీసి వేస్తామని ప్రకటించారు. 1948 ఆగస్టు నాటికి రాజ్యాంగ రచన పూర్తయింది. చర్చలు ముగిశాయి. అంబేడ్కర్ తీవ్ర ఆగ్రహంతో రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేశారు. అంటరాని వారి సంక్షేమాన్ని హిందువులు ఎట్లా అడ్డుకున్నారో తరతరాల చరిత్ర మరువని విధంగా తాను రాజ్యాంగ సభ నుంచి వాకౌట్ చేస్తున్నా నని ప్రకటించారు. దాంతో దిగివచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు అంగీకరించారు. అయితే రాజ్యాంగం ఆమోదం సమయంలో పటేల్, నెహ్రూ పదేళ్ళ పాటు మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయని చేసిన ప్రసం గాలు అంబేడ్కర్‌ను బాధించాయి. 1951, 1952లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఎటువంటి విజయాలు సాధించలేదు. అంబేడ్కర్ కూడా ఓడి పోయారు. రిజర్వుడు సీట్ల విధానం వల్ల నిజమైన ఎస్సీ ప్రతి నిధుల ఎన్నిక అసాధ్యమనే విషయాన్ని మరోసారి ఆ ఎన్నికలు రుజువు చేశాయి. 1936లో, 1942లో జరిగిన ఎన్నికల్లో ఇదే అను భవం అంబేడ్కర్‌కు ఎదురైంది. అందుకే 1947లో తయారు చేసిన నమూనా రాజ్యాంగంలో ప్రత్యేక ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించారు. నమూనా రాజ్యాంగానికి ‘స్టేట్స్ అండ్ మైనారి టీస్’ అనే పేరు పెట్టారు. ‘‘ఈ రిజర్వేషన్లు పదేళ్ళే ఉంటాయి. ఆ తర్వాత ఉండవు. అందువల్ల మనం ఐక్యంగా ఉద్యమించాలి. అంతే కాకుండా, హిందువుల దయాదాక్షిణ్యాల మీద ఎన్నికయ్యే ఈ రిజర్వుడు సీట్ల విధానం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు’’ అంటూ పంజాబ్ ఎన్నికల సభల్లో అంబేడ్కర్ చేసిన ప్రసంగాలు అంబేడ్కర్ సమగ్ర రచనల 17వ సంపుటంలోనే ఉన్నాయి. పనికిరాని రిజర్వేషన్లు, పదేళ్ళే ఉండే రిజర్వేషన్లు ఉంటే ఎంత, పోతే ఎంత అనే అభిప్రాయానికి అంబేడ్కర్ వచ్చారు. దాని ఫలితమే షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ తీర్మానం. ఆ తర్వాత క్యుములేటివ్ ఓటింగ్ విధానాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఈ విధానంలో ఎన్ని నియోజక వర్గాలను కలిపి ఒక్కటిగా చేస్తారో, ప్రతి ఓటరుకు అన్ని ఓట్లు ఉంటాయి. మూడు నియోజకవర్గాలను కలిపితే మూడు ఓట్లు ఉంటాయి. రిజర్వేషన్లు ఉండవు. ఎవరైనా పోటీ చేయొచ్చు. తమ నియోజక వర్గాలకు ప్రతి పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. ఒక ఓటరు తన మూడు ఓట్లను ముగ్గురికి ఒక్కొక్క ఓటుగా వేయొచ్చు; ఇద్దరికే వేయొచ్చు; మూడు ఓట్లను ఒక అభ్యర్థికి కూడా వేయొచ్చు. ఎస్సీ అభ్యర్థి ఒక్కడే ఉండే ఆ నియోజక వర్గంలో ఎస్సీలందరూ ఒక్క అభ్యర్థికే తమ మూడు ఓట్లను వేస్తే, తప్పనిసరిగా ఎస్సీ అభ్యర్థి గెలుస్తాడు. అయితే అంబేడ్కర్‌కి ఈ విధానం మీద ఉద్యమం చేసేంతటి సమయం లేదు. ఆ సమ యంలో ఆయన బౌద్ధంపై కేంద్రీకరించి ఉన్నారు. ఈ ఆలోచన ‘స్టేట్స్, అండ్ మైనారిటీస్’లో కూడా ప్రతిపాదించారు. కానీ అది ప్రచారం పొందలేదు. రిజర్వేషన్ సీట్లు రాజకీయ అధికార భాగస్వామ్యం కోసం నిర్దేశించుకున్న ఒక రూపం. రిజర్వుడు సీట్లు అంబేడ్కర్ రాజకీయ మార్గం కాదు. ఎన్నో మార్గాలను అంబేడ్కర్ వెతికారు. ఆయన నిజమైన లక్ష్యం ఎస్సీలు రాజకీయాధికారంలో భాగం కావడం. ఆ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళేవారు ఆయన ఆలోచనా సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 81063 22077 -
మోదీ, గాడ్సేలది ఒకే భావజాలం: రాహుల్
వయనాడ్: ప్రధాని మోదీ, జాతిపిత మహాత్మ గాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేది ఒకే రకమైన భావజాలమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమంలో భాగంగా బుధవారం కేరళలోని కాల్పెట్టాలో రాహుల్ గాంధీ వేలాది మంది పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ.. తరహా భావజాలం కలిగిన వాడేనని, కాకపోతే ఆ విషయాన్ని ఒప్పుకునే ధైర్యం మోదీకి లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో యువతకు భవిష్యత్తు లేదని, పాకిస్థాన్ గురించి ప్రధాని ఎంత మాట్లాడినా మన యువకులకు ఉద్యోగాలైతే రావని అన్నారు. -
భావజాల అన్వేషణలో ‘ఆప్’
జాతిహితం అధికారాన్ని కోరుకుంటున్నా ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. అన్నా హజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది. ఎనిమిదేళ్ల క్రితం అన్నా హజారే ఉద్యమం రాజకీయవేత్తల/ రాజకీయాల వ్యతిరేక సమర నాదంతో మొదలైంది. భారత సమాజంలోని, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలలోని చెడులన్నిటికీ రాజకీయాలను, రాజకీయవేత్తలను అది తప్పుపట్టింది. ‘‘నేత’’ అనే మాటే తిట్టయిపోయింది. అయితే ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేయాలని ఆయన కోరుకోరనుకోండి. త్వరలోనే ఆ అవినీతి వ్యతిరేక ఉద్యమం, మధ్యస్థ స్థాయికి చెందినవారు, పట్టణ వృత్తిజీవులు ‘‘కుళ్లు’’ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే ఒక విధమైన తిరుగుబా టుగా పరిణమించింది. ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రముఖులు, దాని సాను భూతిపరులు, నిలకడగల వామపక్షవాదులను ఆ ఉద్యమం ఆకట్టుకుంది. బాబా రామ్‌దేవ్ నుంచి జనరల్ వీకే సింగ్ వరకు, కిరణ్ బేడీ నుంచి ప్రశాంత్ భూషణ్, షబనా ఆజ్మీ, ఓంపురి, అమీర్ ఖాన్ల వరకు మద్దతుగా ముందుకు వచ్చారు. భావజాలాలకు అతీతంగా ఆ ఉద్యమం అందరినీ ఆకట్టుకుందనే దానికి ఇది మంచి ఉదాహరణ. కేజ్రీవాల్ నేతృత్వంలో అన్నా హజారే, ఆయన వీరయోధులు ఆ ఆగ్రహావేశపు తరంగంపైనే ఎగిసివచ్చారు. ఎన్నికల తతంగం అంతా అవినీతిపరుల కోసమేనని, ప్రజలు ఓ సీసా మందు కోసమో లేదా రూ. 500 నోటు కోసమో ఓటు వేసేవారని, పార్లమెంటు అత్యా చారాలు చేసేవారు, బందిపోట్లు, దొంగలకు నిలయం మాత్రమేనని తీసిపారే శారు. అలాంటి పార్లమెంటులోని ఈ 800 మంది (ఉభయ సభల మొత్తం సభ్యులు) 125 కోట్ల మంది తలరాతలను ఎలా రాస్తారు? అని నిలదీశారు. అధికారం ఆవిర్భవించాల్సి ఉంది, పరిపాలన, చట్టాల రూపకల్పన అట్టడుగు నుంచి పైకి సాగాలి, వ్యవస్థను తలకిందులు చేయాలి. ఒక్క ముక్కలో చెప్పా లంటే ఇప్పుడు కావాల్సింది విప్లవమే తప్ప, అంతకు తక్కువ కాదు. ఎన్నికల బాటలో ‘విప్లవం’ అన్నా హజారే, గాంధీలా నటిస్తుండగా, యువ కార్యకర్తలు, నానా రకాల సోషలిస్టులు, అందరికంటే ముఖ్యంగా టీవీ యాంకర్లు ఆయనకు నీరా జనాలు పట్టారు. ఆయన తన ప్రధాన ఆయుధమైన ఆమరణ నిరహార దీక్ష కూడా గాంధీ నుంచి అరువు తెచ్చుకున్నదే. కాకపోతే ఆయన ప్రయోగించిన సంకేతాలు, అభిభాషణలు మాత్రం గాంధేయమైనవి కావు. భగత్‌సింగ్, సుభాష్ చంద్ర బోస్‌లకు, చివరకు మహారాణా ప్రతాప్‌కు అవి దగ్గరగా ఉండేవి. రామ్‌లీలా మైదాన్‌లో అన్నా చేతులు జాపి ‘‘దిల్ దియా హై జాన్ భీ దేంగే, ఏ వతన్ తేరే లియే’’ అనే దిలీప్ కుమార్ పాట చరణాన్ని వినిపించ డాన్ని గానీ, లేదా అరెస్టయి, పోలీసు బస్సులో పోతూ కిరణ్ »ే డీ టీవీ కెమె రాల వైపు తిరిగి ‘‘అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో’’ అని ఆలాపించ డాన్నిగానీ గుర్తుతెచ్చుకోండి. అయితే ఆమె ఉపయోగించినది ఎన్నటికీ మర పురాని హఖీకత్ చిత్రంలో కైఫీ అజ్మీ రాసినదో లేక బాగా ఇటీవలి కాలపు అమితాబ్–అక్షయ్–బాబీ డియోల్ల చెత్త చిత్రం లోనిదో తెలియదు. కానీ ఆ సందేశం మాత్రం ఏదో ఒక కొత్త చట్టం, కనీసం మొత్తం రాజకీయాధికారం కావాలి అనేది మాత్రం కాదు.. ‘‘వ్యవస్థను’’ మార్చే విప్లవం సాగించాలనేదే. అన్నా ఉద్యమం ఉచ్ఛస్థితిలో ఉన్న ఆనాటి నుంచి నేడు అది ఎక్కడికి చేరిందో చూద్దాం. అన్నా హజారే ఎక్కడుండాలో అక్కడికే చేరారు. రాలెగావ్ సిద్ధిలో ఏకాంతంగా తన ఊహాలోకంలోని దయ్యాలతో పోరాటం సాగిస్తు న్నారు. అప్పుడప్పుడూ ప్రధాని చేపట్టిన ఏ చిన్నపాటి చర్యనో ప్రశంసిçస్తూ లేదా కేజ్రీవాల్ చేసే చాలా పనులను విమర్శిస్తూ విజయవంతంగా పతాక శీర్షికలను వేటాడుతున్నారు. ఆయన ఉద్యమంలో ప్రధాన భూమికను పోషిం చిన కీలక వ్యక్తుల్లో ఏ ఒక్కరూ నేడు ఆయనతో లేరు. కిరణ్ బేడీ, మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, మేధా పాట్కర్ తదితరు లంతా ఎన్నికల రాజకీయాల్లో చేరారు. వైఖరి, పద్ధతి, ఉద్దేశాలకు సంబం ధించి అన్నా ఉద్యమాన్ని ప్రశ్నిస్తూ దానితో తలపడ్డ మాలాంటివారి విషయా నికి వస్తే్త... మౌలిక మేధోపరమైన చర్చలో గెలుపొందామని మేం ప్రకటించగలం. వ్యవస్థను మార్చాలంటే, మీరు దాన్ని వాటేసుకోవాల్సిందే, దాన్ని మార్చాలంటే మీరు అధికారంలోకి రావాల్సిందే. ఎన్నికల రాజకీయాలను రొచ్చుగుంట అన్నాగానీ, మీరు దాన్ని ఈదుకుంటూ పోవాల్సిందే. అంటే, అధికారాన్ని చేపట్టడానికి ఉన్న ఏకైక మార్గం బ్యాలెట్ ద్వారా ప్రజా బాహు ళ్యపు ఆమోదాన్ని పొందటమే అని. ఎన్నికల ప్రక్రియ ఆవశ్యకంగా న్యాయ మైనది, ఓటర్లు తెలివిగలవారు, చాలావరకు అవినీతి సోకని బాపతే. కేజ్రీ వాల్ ఢిల్లీని తుడిచిపెట్టేశాక, పంజాబ్, గోవాలతో జాతీయస్థాయి రంగ ప్రవేశం చేయనున్నాడు, గుజరాత్‌లోనూ సరికొత్త సవాలుదారు కావచ్చని భయపెడుతున్నాడు. రాజకీయాలు, ఎన్నికలు అన్నీ బూటకమేనని కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇక ఎంత మాత్రమూ అనలేరు. అన్నా హజారే ఉద్యమం రాజకీయాలకు వ్యతిరేకమైనదిగా నటించడాన్ని విమర్శస్తూ మనలో కొందరు చెప్పింది సరిగ్గా ఇదే కాదా? ‘‘నిజాయితీగా మీకు రాజకీ యాధికారం కావా లని చెప్పండి’’ అని మేం నిలదీశాం. కేజ్రీవాల్ బ్రాండ్ రాజకీయం ఆమ్ ఆద్మీ పంజాబ్‌లో మొదటి స్థానంలో ఉన్నా లేక రెండో స్థానంలో ఉన్నా లేదా గోవాలో ఏ స్థానంలో నిలిచినా... దాని జనాకర్షణ మాత్రం విస్తరి స్తోంది. గుజరాత్లో ఆ పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాలు సైతం అదే సూచి స్తున్నాయి. అధికారాన్ని కోరుకుంటున్నా ఆప్ తన ప్రధాన భావజాల సారం ‘వ్యవస్థకు వ్యతిరేకమైనది’ అన్న ముద్రను ఇంకా ఎలాగో కాపాడుకోవడం విశేషం. భావజాలేతరమైన పార్టీగా ఉన్న దాని ఆకర్షణకు తోడు, బీజేపీకి దీటైన అతి జాతీయవాదపు నగిషీలు, అలంకారాలూ సైతం ఉన్నాయి (ఇంకా అది భగత్‌సింగ్ పేరును వాడుతూనే ఉంది). కేజ్రీవాల్ తన ప్రచార కార్య క్రమాల్లో అరుదుగా తప్ప ప్రత్యేకించి ఏ ఒక్క పార్టీపైనా దాడి చేయరు. అన్నిS పార్టీలపైనా, అంటే ఆచరణలో ‘‘వ్యవస్థ’’కు సంబంధించిన రాజకీయ వేత్త లందరిపైనా దాడి చేస్తారు. ఆయన బ్రాండుకు ఉన్న కీలకమైన ఆకర్షణ ‘గొప్ప విచ్ఛిన్నకుడు’ అనే ఆ గుర్తింపే. కేజ్రీవాల్, ఆయన కీలక అనుచరులు అందరిదీ యువతరం, సాధార ణంగా వారు అవినీతిపరులు కారన్నట్టుగానే కనిపిస్తారు (ఢిల్లీ పోలీసు, సీబీ ఐల ఎఫ్ఐఆర్లను నమ్మేవారు లేరు). అతి పెద్ద యువ ఓటర్ల పునాదిలో ఆయనకు సానుకూలాంశం. ఆయన ప్రత్యర్థులలో కొందరు, సుఖబీర్ బాదల్, రాహుల్ గాంధీ అంత పెద్దవారేమీకారు, చిన్నవారు కూడా. అయినా గానీ వారు సంపన్నుల రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించేవారు. కాగా, కేజ్రీవాల్ స్వీయకృషితో రాణించినవారు. గత చరిత్ర లేకపోవడం, అనుభవ రాహిత్యాలను ఆయన తనకు అనుకూలతగా, అమాయకత్వానికి మారుపే రుగా ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల, మాకు కనీసం ఒక్క అవకాశం ఇవ్వండి అనే ఆయన మాట యువ ఓటర్లను మరింత ఎక్కువగా ఒప్పించ గలిగేదిగా ఉంటోంది. భావజాలం కోసం అన్వేషిస్తున్న భావజాలరహిత పార్టీ కాంగ్రెస్ ఓట్లను తుడిచిపెట్టేయడం ద్వారానే కేజ్రీవాల్ ఢిల్లీలో ఘన విజయం సాధించారని మనకు తెలుసు. పంజాబ్‌లో ఆయన అకాలీ–బీజేపీ కూటమి ఓట్లను ఎక్కువగా రాబట్టుకుంటారనడం సమంజసమే అవుతుంది. నిజమైన భావజాలమంటూ లేకపోవడం లేదా ఒక రాష్ట్ర రాజకీయ అవసరాలకు పూర్తిగా అనుగుణమైనది కాగలిగినదిగా ఆవిర్భవిస్తున్న భావజాలం ఉండ టం దానికి సానుకూలతగా లెక్కించాలి. అయితే ఇంతకు మించి ఆప్‌ను సువ్యవస్థితమైన పార్టీల నుంచి వేరుచేసేది ఏమైనా ఉందా? ఆ పార్టీలలో మనం ఉన్నాయనుకుంటున్న లోపాలన్నింటి జాబితాను తయారు చేయండి. అవినీతి, వయసు, అధికారంలో ఉండటం అనే అంశాలను మినహాయిస్తే... అందులో ఉన్న వ్యక్తిపూజ, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం, అధిష్టాన వర్గపు సంస్కృతి, మీడియా విమర్శల పట్ల అసహనం, లోతైన ఉదారవాద వ్యతిరేకత, ఎలాంటి అసమ్మతిని, ప్రశ్నించడాన్ని సహించని అత్యంత శక్తి వంతుడైన సుప్రీమ్ తరహా నేత తదితరాలను చూడండి. వాటిలో ఏమన్నా ఆప్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో కనిపించనివి ఏమైనా ఉన్నాయేమో సరి చూడండి. ఆ పార్టీ నేత ఎంతటి అత్యంత శక్తివంతుడంటే తాను పరిపాలి స్తానని ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్రాన్ని(ఢిల్లీ) వదలి దాదాపు రెండు వారా లుగా సుదూరంలోని నగరంలో గడుపుతున్నారు. ఏ రాజ్యాంగపరమైన లేదా పార్టీపరమైన జవాబుదారీతనం లేని రాహుల్ ఏడాది చివర్లో ఒక వారం విశ్రాంతి తీసుకున్నందుకు విమర్శల వెల్లువను ఎదుర్కొన్నారు. అన్నాహజారే ఉద్యమం మొదలైన ఎనిమిదేళ్ల తర్వాత, అది ఒక జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. బలమైన నాయకుని నేతృత్వంలో అది ఒక భావజాలం కోసం అన్వేషిస్తోంది. ఆ భావజాలం, ఆ నాయకుడు నిజంగా విశ్వసించేదే కానవసరం లేదు. కనీసం మనకు సుపరిచితం కాని భావజాలమది. నిలకడగా నిలిచిపోయిన, విసుగెత్తించే మన రాజకీయాలకు అది ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చింది. అది రాజకీయ రిపోర్టర్లుగా, అభి ప్రాయ రచయితలుగా మన ఉద్యోగాల్లోకి మరింత సరదాను తెచ్చింది. మనం మరి కొంత ధూషణను ఎదుర్కొంటే పోయిందేముంది? తాజా కలం: గతవారం ‘జాతిహితం’లో నేను పంజాబ్‌లో ఆప్ పెద్ద శక్తిగా ఆవిర్భవించడం గురించి రాసినందుకు నన్ను ప్రశ్నలు ముంచెత్తాయి. ఆప్ ఆధినేత సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోసినాగానీ నేనిలాంటి సాను కూల నివేదికను ఎలా ఇస్తానని ప్రశ్నించారు. ఎవరైనా నన్ను తిట్టిపోసినంత మాత్రాన నేను నా వార్తా నివేదికల్లో అబద్ధాలాడాలా? తద్వారా నా పాఠకుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవాలా? ట్రంప్ లేదా నరేంద్ర మోదీ లేదా అరవింద్ కేజ్రీవాల్ ఎవరి విషయంలోనైనా వార్తలను అందించేటప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న అదే అని భావిస్తాం. - శేఖర్ గుప్తా twitter@shekargupta -
ఐసిస్ అంతమొందించాల్సిన సంస్థ: అసదుద్దీన్
హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ విషయంలో ఎంఐఎం పార్టీ అధినేత లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తాము ఐసిస్‌కు తీవ్ర వ్యతిరేకం అని స్పష్టం చేశారు. తాము ముందునుంచి ఇదే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ఐసిస్ అనేది ఒక అంతమొందించాల్సిన సంస్థ అని ఆయన అన్నారు. ఐసిస్ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న మహ్మద్ అబుల్ హుదా అనే ఓ ప్రముఖ సిరియన్ స్కాలర్‌ను పిలిపించే ఆలోచనలు చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఇటీవల ఐసిస్ సానుభూతి పరులను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన తొలిసారి శుక్రవారం స్పందించారు. మిలటరీ సహాయంతో ఐసిస్ ను సర్వనాశనం చేయొచ్చని అంతకంటే దాని భావజాలం మొత్తాన్ని కూడా రూపుమాపాలని అన్నారు. గతంలో ఐఎస్ నుంచి అసదుద్దీన్ బెదిరింపులు ఎదుర్కున్న విషయం తెలిసిందే.