ఏదైనా రాజకీయ పార్టీ ఒక సిద్ధాంతాన్ని ప్రకటించినపుడు అందుకు త్రికరణశుద్ధిగా కట్టుబడాలి. ఎటువంటి సమస్యలు ఎదురైనా, అధికారం ఉన్నా పోయినా, ఆ సిద్ధాంతంపై రాజీ పడకూడదు. అందుకు బహిరంగంగా గానీ, పరోక్ష రీతిలో గానీ వెసులుబాట్లు చూపరాదు. అప్పుడే ప్రజలకు ఆ పార్టీ పట్ల, ఆ సిద్ధాంతం పట్ల అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ తర్వాత కాలం నుంచి నేటి వరకు కూడా సెక్యులరిజం విషయమై అటువంటి రాజీలేనితనాన్ని చూపలేదు. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ఎత్తుగడల నుంచి, ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై విధానం వరకు సెక్యులరిజంతో కాంగ్రెస్ దోబూచులలో కనిపించేది అంతా అధికారం కోసం సాగించే ద్వంద్వ నీతే.
రాహుల్ గాంధీ ఈనెల 17న కర్ణాటకలోని మాండ్యా సభలో మాట్లాడుతూ, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటమని అన్నారు. ఇండియా కూటమి సిద్ధాంతం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కాగా, బీజేపీ సిద్ధాంతం ఆ రెండింటినీ కూలదోయట మన్నారు. సరిగా అదే 17వ తేదీన అదే ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సీపీఎం పార్టీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో ప్రసంగిస్తూ, పౌరసత్వ చట్టం (సీఏఏ) వివాదంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉన్నాయని సూటిగా ప్రశ్నించారు.
ఈ ప్రశ్న కాంగ్రెస్‌కు సహజంగానే ఇబ్బందికరంగా మారింది. దానితో విజయన్‌పై ఎదురు దాడి జరిపింది. మరునాడు 18న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్స్‌లో ఒకరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేరళ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ ఎన్నికల సభలో పాల్గొంటూ, విజయన్ పైకి కమ్యూనిస్టు అయినా అంతర్గతంగా మతతత్వవాది అనీ, ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీతో రహస్య ఒప్పందం ఉందనీ ఆరోపించారు. అక్కడ అది విన్న వారికీ, కేరళ ప్రజలకూ అదెంత రసవత్తరంగా తోచి ఉంటుందో మనకు తెలియదు.
దానినట్లుంచి రాహుల్, విజయన్‌ల మాటలకు వద్దాము. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం అవసరమని, బీజేపీ వల్ల అందుకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే భావన దేశంలో విస్తృతంగా ఏర్పడటం నిజం. వాటి పరిరక్షణకు కాంగ్రెస్ గానీ,ఇండియా కూటమి గానీ నిజంగానే కట్టుబడి ఉంటే దానిని స్వాగతించవలసిందే. కానీ, ఇండియా కూటమికి నాయకత్వ స్థానంలోగలకాంగ్రెస్ పార్టీయే అట్లా కట్టుబడి లేదనే సందేహం, కూటమిలో ఒక ముఖ్య భాగస్వామ్య పార్టీకి కలుగుతున్నదంటే మామూలు విషయం కాదు.
సీఏఏ గానీ, దాని అమలుకు తదుపరి చర్యగా భావిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) గానీ సెక్యులరిజంతో ముడిబడిన అంశాలనే భావన విస్తృతంగా ఉంది. వీటిపై తీవ్రమైన చర్యలు కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నాయి. మోదీ ప్రభుత్వం సీఏఏను ఇటీవల అమలుకు కూడా తెచ్చిన దరిమిలా, ప్రస్తుత ఎన్నికలలో అది వివాదంగా మారింది. దానిని తాము అమలుపరచబోమని బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటించాయి. కనుక దాని ప్రాముఖ్యత ఎంతో వేరుగా చెప్పనక్కర లేదు. అటువంటి స్థితిలో సీఏఏపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, వారి ఎన్నికల మేనిఫెస్టో విధానమేమిటో ప్రకటించాలని ఎవరైనా కోరుతారు. కానీ అటునుంచి ఇంతవరకుఅంతా మౌనమే.
మరొక విశేషం గమనించండి. రాహుల్ గాంధీ ఇటీ వల భారత్ జోడో యాత్రలు నిర్వహించారు. దేశంలో బీజేపీ, మోదీ విద్వేషాన్ని వ్యాపింప జేస్తుండగా తాము ప్రేమను సృష్టిస్తున్నామని అడుగడుగునా ప్రకటించారు. మోదీ విద్వేషం ప్రధానంగా అల్పసంఖ్యాక వర్గాలపై అన్నది విమర్శ. ఆ వర్గాల భయం. వారి భయ కారణాలలో ఒకటి సీఏఏ. కానీ రాహుల్ గాంధీ తన యాత్రలో ఒక్కచోటనైనా ఆ ప్రస్తావన చేయలేదు. ఎందుకన్న ప్రశ్నలు చాలా వచ్చాయి. అయినా తను ఎటువంటి వివరణా ఇవ్వలేదు.
ఇవన్నీ గమనించినపుడు కలిగే అభిప్రాయం ఏమిటి? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలిపి చూపుతూ వాటి పరిరక్షణ తమ సిద్ధాంతమన్నారు. భారత రాజ్యాంగం సెక్యులరిజాన్ని ప్రవచిస్తున్నది. సమాజంలోని అన్ని వర్గాల పరిరక్షణ ప్రజాస్వామ్యపు మౌలిక లక్షణాలలో ఒకటి. అటువంటప్పుడు, రాహుల్ గాంధీ ఈ విధమైన వైఖరిని తీసుకుంటూ తమ సిద్ధాంతం ఫలానాది అని ప్రకటించటంలో రెండింటికి పొసగేది ఏమైనా ఉందా, లేక అందులో పరస్పర వైరుధ్యం కనిపిస్తుందా? ఇది మర్యాదగా అంటున్న మాట. నిర్మొహమాటంగా అడగాలంటే ఇది కపట నీతి కాదా? ఇది నిస్సందేహంగా కపట నీతే అవుతుంది.
ఎందుకీ కపట నీతి అన్నది తర్వాత ఎదురయే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ కొంత కాలంగా రెండు పరిస్థితుల మధ్య చిక్కుకుని తనతో తానే యుద్ధం చేసుకుంటున్నది. ఆ పార్టీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, వివిధ వర్గాల ప్రజలను తానే చెప్తున్న రాజ్యాంగం ప్రకారం, చట్టాల ప్రకారం, మేనిఫెస్టోల ప్రకారం అభివృద్ధి చేయటంలో అనేక దశాబ్దాల నుంచి విఫలమవుతున్నది. ఆ కారణంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, ఓట్లు, సీట్లు, అధికారాలను పోగొట్టుకుంటూ అసలు తన ఉనికి ఏమవుతుందోననే భయానికి గురవుతున్నది. ఆ స్థితి నుంచి బయట పడేందుకు పేదలు, మధ్యతరగతి, రైతులు, కూలీలు, వృత్తిపరులు, బడుగు వర్గాలు, మైనారిటీల ఓట్లు ఆధారమన్నది సంప్రదాయికంగా మొదటినుంచి ఉండిన ఆలోచన.
కానీ తన అసమర్థ పాలనవల్ల ఒక్కొక్క వర్గమే దూరమవుతూ రాగా, ఒక దశ వచ్చే సరికి, జనరంజక పాలన ద్వారా ఓట్ల సాధన అనే దృష్టి సహజ మరణం చెందుతూ రాగా, కుల–మత ఆధారిత వ్యూహాలు మొదలయ్యాయి. అందు లోనూ పలు కులాలు ఆయా కుల పార్టీలపట్ల ఆకర్షితం కావటం ఒక సమస్యగా మారింది. ఇందిరాగాంధీ సాఫ్ట్ హిందూత్వ ప్రధానంగా జమ్మూ–కశ్మీర్‌కు పరిమితం కాగా, రాజీవ్ గాంధీ కాలం నుంచి అది జాతీయమై పోయింది. ఆ ప్రకారం ఆయన ఏమేమి చేశారన్న వివరాలలోకి ఇక్కడ వెళ్లలేము. ఆయన తర్వాత పీవీ నరసింహారావు కూడా అదే పని చేశారు.
ఇందులో కాంగ్రెస్ పార్టీ తనతో తాను చేసుకుంటున్న యుద్ధం ఏమంటే, పరిపాలనా వైఫల్యాలవల్ల ప్రజాసమూహాలు దూరమై ఎన్నికలలో పరాజయాలు ఎదురవుతుండిన స్థితిలో, కొత్త వ్యూహం ప్రకారం తనకు ఇటు ముస్లిముల ఓట్లు, అటు హిందువుల ఓట్లు కావాలి. అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు కూల్చివేతతో ఆరంభించి బీజేపీ వేగంగా బలపడుతుండటంతో కాంగ్రెస్ కూడా ఈ చట్రంలో చిక్కుకుపోయింది. ఆ ప్రకారం అటు హిందువుల కోసం, ఇటు ముస్లి ముల కోసం రెండు చేతులా కత్తిసాములు చేసినా, రెండు సాము లలోనూ ఓడిపోవటం మొదలైంది. అయితే అందులో ఆశ్చర్యం ఎంతమాత్రం లేదు. ఎందుకన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం. హిందువుల విషయంలో ఓడటం పొలిటికల్ సోషియాల జీకి సంబంధించినది.
సూటిగా చెప్పాలంటే, హిందూవాదాన్ని 1925 నుంచే చేపట్టిన సంస్థలు, వాటికి వారసులైన బీజేపీ, ఇవన్నీ అందుకు అనుగుణంగా చేపడుతున్న కార్యకలాపాలు నిరంతరం తమ ఎదుట ఉన్న స్థితిలో, హిందూ సమాజం అందుకు కాపీరైట్‌ను బీజేపీకి మాత్రమే ఇస్తుంది. కాంగ్రెస్ సాఫ్ట్ హిందూత్వకు గానీ, అంత కు మించిన మరే వైఖరులకుగానీ విలువ ఉండదు. పోతే, ముస్లిములు కూడా కాలం గడిచేకొద్దీ, కాంగ్రెస్ పార్టీ తమను ఓటుబ్యాంకుగా ఉపయోగించుకోవటం తప్ప, తమ అభివృద్ధికి, భద్రతకు నిజంగా చేసింది చాలా తక్కువనే అభిప్రాయానికి వచ్చారు. దానితో కాంగ్రెస్‌ను తిరస్కరించి ఇతర పార్టీల వైపు చూడటం మొదలైంది. ఆ విధంగా కాంగ్రెస్, తనతో తాను యుద్ధం చేసుకుంటూ ఈ రెండు కత్తిసాములలోనూ ఓడి పోతున్నది.
ఈ రోజున కాంగ్రెస్‌ది ఒక దిక్కుతోచని స్థితి. అందుకే, రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ముహబ్బత్ కీ దుకాన్ ఖోల్ నా అని యాంత్రికంగా వల్లెవేయటమైతే చేయగలరు గానీ, సీఏఏపై మాట్లాడలేరు, ఆ మాట మేనిఫెస్టోలో పెట్టలేరు. ఎందుకని అడిగేవారిపైనే ఎదురుదాడి చేస్తారు. ఎంతటి దయనీయమైన స్థితి. ఒకప్పటి పాడియావు అయిన సెక్యులరిజం క్రమంగా వట్టిపోయిన ఆవుగా మారుతున్నది.
- వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
-టంకశాల అశోక్
Comments
Please login to add a commentAdd a comment