రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదని అంటారు. అలాగే ఏ నాయకుడు ఎలా పార్టీ మారవలసి వస్తుందో కూడా చెప్పలేం. రకరకాల పరిణామాలు ఇందుకు దోహదపడుతుంటాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికలను పరిశీలిస్తే, ఈసారి జరిగినన్ని ఫిరాయింపులు గత రెండు ఎన్నికలలో జరగలేదని చెప్పాలి. అందులోను కొందరు పెద్ద నాయకులు, దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేతలు పార్టీలు మారవలసిన పరిస్థితులు ఏర్పడడం ఆసక్తికరమైన అంశమే. ఇందుకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అతీతం కాదు. ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు కూడా వేరే పార్టీలోకి వెళ్లారు.
✍️బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగానే 115 స్థానాలకు అభ్యర్దులను ప్రకటించి దాదాపు అందరికి బిఫారంలు ఇచ్చేశారు. దాంతో కొంత గడబిడ జరిగినా, సర్దుకోవడానికి టైమ్ దొరికింది. కాని కాంగ్రెస్, బీజేపీలు అలా చేయలేకపోయాయి. దాంతో ఆ పార్టీలు అసమ్మతులతో కొంత ఎక్కువ సతమతం అయ్యాయి. బుజ్జగింపులలో కాంగ్రెస్ కొంతవరకు సఫలం అయినా, బీజేపీ మాత్రం అంత సత్ఫలితం సాధించలేకపోయిందనే చెప్పాలి. తాజాగా మాజీ ఎంపీ, ప్రముఖ నటి విజయశాంతి కూడా బీజేపీకి గుడ్ బై చెప్పడం విశేషం. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ప్రముఖుల గురించి చూద్దాం.
✍️సాధారణంగా పార్టీ టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఫిరాయించడం అరుదుగా జరుగుతుంటుంది. మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడికి మెదక్ టిక్కెట్ కోరుతూ పార్టీలో రగడ సృష్టించారు. అందుకోసం తన మల్కాజిగిరి టిక్కెట్ కూడా వదలుకుని, రెండు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్‌లో చేరడం సంచలనమే. టిక్కెట్లు రాని కొందరు నేతలు కూడా ఇలాగే పార్టీ మారారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లవలసి వస్తుందని ఆయన అనుచరులు ఎవరూ అనుకుని ఉండరు.
✍️ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ కన్నా ముందే మంత్రి పదవి పొందిన తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా వెనుకబడ్డారు. ఆ తరుణంలో కేసీఆర్ ఆయనను ఆహ్వానించి పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తే ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నికలో గెలిచారు కాని, సాధారణ ఎ న్నికలో ఓటమి చెందారు. దాంతో తుమ్మల రాజకీయం తిరగబడినట్లయింది. ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో టిక్కెట్ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్‌లో కొనసాగేవారు. కాని అందుకు కేసీఆర్ సిద్దపడలేదు
✍️దానికి కారణం కాంగ్రెస్ పక్షాన గెలిచి, బీఆర్ఎస్‌లోకి వచ్చిన ఉపేందర్ రెడ్డికి సీటు ఇవ్వవలసి రావడమే. దాంతో అసంతృప్తి చెందిన తుమ్మల పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీతో అయితే పోరాడారో ఆ పార్టీలోకే వెళ్లవలసి వచ్చింది. ఈ పిరాయింపుపై కేసీఆర్, తుమ్మల మధ్య మాటల విమర్శలు కూడా జరిగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చక్రం తిప్పిన తుమ్మలకు ఈసారి పెద్ద పరీక్షే కావచ్చు.
✍️ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆయన తలపడుతున్నారు. మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచినా, మారిన రాజకీయాలలో ఆయన అధికార బీఆర్ఎస్‌లో చేరిపోయారు. కాని 2018 ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ రాలేదు. అయినా ఓపికగా ఈ ఐదేళ్లు వేచి చూశారు. కాని ఆశ్చర్యంగా ఈసారి అసెంబ్లీ టిక్కెట్ కూడా రాలేదు. ఇక లాభం లేదని కాంగ్రెస్‌తో బేరం ఆడుకుని జంప్ చేసేశారు. ఒకదశలో బీజేపీకి వెళతారని అనుకున్నా, ఖమ్మం ప్రాంతంలో ఆ పార్టీ పుంజుకోలేదని అంచనాకు వచ్చి కాంగ్రెస్ వైపు వెళ్లి పాలేరు నియోజకవర్గంలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
✍️కొల్లాపూర్‌లో ఐదుసార్లు గెలిచిన జూపల్లి కృష్ణారావు గత ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. అప్పుడు గెలిచిన హర్షవర్దన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరడంతో కృష్ణారావుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఆయన ఆగ్రహంతో కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగాను, తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగాను, అంతకుముందు కాంగ్రెస్‌లో కూడా ప్రముఖుడుగా రాణించిన జూపల్లె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకుని బీఆర్ఎస్ సవాల్‌కు సవాల్ విసురుతున్నారు.
✍️గతసారి కాంగ్రెస్ తరపున గెలిచి ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరికి కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. వారిలో సబితా ఇంద్రారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, పైలల్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ప్రభృతులు ఉన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి రాక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన వారిలో పాయం వెంకటేశ్వర్లు, వేముల వీరేశం, వంటివారు ఉన్నారు. టిక్కెట్ రానందున అసంతృప్తి చెంది కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖులలో డాక్టర్ నాగం జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి తెలంగాణ నగారా పేరుతో సొంత బానర్‌పై ఉప ఎన్నికలలో పోటీచేసి గెలిచిన నాగం రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలు పోరాటాలు సాగించారు.
✍️ఆయన కొంతకాలం బీజేపీలోను, తదుపరి కాంగ్రెస్ లోను చేరారు. కాని కాంగ్రెస్‌లో తన రాజకీయ ప్రత్యర్ధి కె.దామోదరరెడ్డి కుమారుడికి నాగర్ కర్నూల్ టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దాంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరిపోవడం విశేషం. ఈయన కూడా కేసీఆర్ సమకాలికుడే. కేసీఆర్ కన్నా ముందుగానే మంత్రి అయ్యారు. కేసీఆర్‌ను చాలాకాలం వ్యతిరేకించిన నాగం, పాత స్నేహితుడే బెటర్ అనుకుని గులాబి కండువా కప్పుకున్నారు.
✍️పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్యయ్య కూడా జనగామ టిక్కెట్ పై కాంగ్రెస్‌తో విభేధించి పార్టీకి దూరం అయి బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి నాయకత్వం వహించిన పొన్నాల 2023 ఎన్నికల సమయానికి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. అయితే నాగం, పొన్నాల లకు ఇక్కడ కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా, అధికారం వచ్చాక వారికి గుర్తింపు ఇస్తామన్న హామీని మాత్రం పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక భూమిక పోషించిన చెరుకు సుధాకర్ కూడా సొంత పార్టీ పెట్టుకుని తర్వాత దానిని కాంగ్రెస్ లో కలిపినా ,టిక్కెట్ రాకపోవడంతో కోపం వచ్చి చాలాకాలంగా తాను వ్యతిరేకిస్తూ వచ్చిన బీఆర్ఎస్ లో చేరిపోయారు.
✍️గతంలో నకిరేకల్ ఎమ్మెల్యేగా పనిచేసిన వేముల వీరేశం ఈసారి బీఆర్ఎస్‌ను వదలి కాంగ్రెస్ టిక్కెట్ పై తలపడుతున్నారు. దానికి కారణం గతసారి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్‌లో చేరడం, తిరిగి టిక్కెట్ పొందడం.. ఫిరాయింపుల వల్ల ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అవడంతో తుమ్మల తో సహా పలువురు నేతలు తలో దిక్కు అయ్యారు. వారిలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పలువురు టీడీపీ నేతలకు కాంగ్రెస్‌లో ఆశ్రయం కల్పించారు. ములుగు నుంచి గెలిచిన సీతక్క తదితరులు ఇలాంటి వారిలో ఉన్నారు.
✍️తాజాగా మరో నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపీని వీడి పరకాల నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీచేస్తున్నారు. సుదీర్ఘకాలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీ పక్షాన మరోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టిక్కెట్లు రాని కొందరు బీజేపీలో టిక్కెట్ తీసుకుని పోటీచేస్తున్నారు. గెలవడం, ఓడడం సంగతి ఎలా ఉన్నా, గేమ్‌లో ఉండాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. తొలుత బీజేపీకి ఊపు వస్తుందని ఆశించి ఆ పార్టీలో చేరిన మాజీ ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వంటి నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోవడం గమనించదగ్గ అంశం.
✍️రాజగోపాలరెడ్డి గత ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన గెలిచి, కొంతకాలం తర్వాత బీజేపీలోకి వెళ్లారు. ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో తిరిగి నిలిచి ఓటమి చెందారు. బీఆర్ఎస్‌ను అప్పట్లో బీజేపీనే ఓడించగలదని ఆయన అనేవారు. కాని పరిస్థితి మారడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎక్కువ మంది కేసీఆర్ అవినీతిపై చర్య తీసుకోవడంలో బీజేపీ విఫలం అయిందని ఆరోపించడం విశేషం. కాంగ్రెస్‌లో టిక్కెట్లు రాని వారు కొందరు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఫిరాయింపులలో బీజేపీకి ఎక్కువ నష్టం జరిగినట్లనిపిస్తుంది.
✍️అధికార బీఆర్‌ఎస్‌ను కాదనుకుని ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు, ముగ్గురు జడ్పిచైర్ పర్సన్లు కాంగ్రెస్ లోకి వెళ్లారు. అలాగే కాంగ్రెస్ మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమార్తె విజయారెడ్డి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరి ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తుంటే, ఆమె సోదరుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ విధంగా తెలంగాణలో ఫిరాయింపుల పర్వం ఈసారి జోరుగా సాగిందని చెప్పాలి. ఎన్నికలకు ముందే ఇన్ని ఫిరాయింపులు జరిగితే ఎన్నికలు అయ్యాక ఇంకెన్ని పార్టీ మార్పిడులు జరుగుతాయో చూడాలి!
::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment