ఫిరాయింపులు.. పార్టీలన్నీ దొందు దొందే! | Analytical Article By Kommineni Srinivasa Rao On Party Defections | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులు.. పార్టీలన్నీ దొందు దొందే!

Published Fri, Sep 13 2024 1:35 PM | Last Updated on Fri, Sep 13 2024 3:23 PM

Analytical Article By Kommineni Srinivasa Rao On Party Defections

ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్న రాజకీయ నేతలు తమ ఇష్టానుసారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూనే ఉన్నారు. రాజ్యాంగంలో మార్పులు తెచ్చినా.. చట్టాలను కఠినతరం చేసినా... దాదాపుగా అన్ని పార్టీల్లోనూ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. అనైతిక చర్యలకు ప్రోత్సాహమిస్తున్నాయి. ప్రజలందరికీ చట్టాలు చేసే నేతలే ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన పనులకు దిగడం సమాజం సిగ్గుపడేలా చేయడమే అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి ఫిరాయించిన నేపథ్యంలో దాఖలైన కేసుపై ఇటీవలే జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి ఇచ్చిన తీర్పు ఎంతైనా స్వాగతించదగింది. ఈ అడ్డగోలు ఫిరాయింపులకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయకపోతే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది.

తెలంగాణలో గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దానం నాగేందర్‌ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం మనకు తెలిసిన విషయమే. ఫిరాయింపు స్పష్టంగా తెలుస్తున్నా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌... దానం నాగేందర్‌పై వేటు వేయకపోవడం వివాదాస్పదమైంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు కూడా ఫిరాయింపులకు పాల్పడ్డారని వారిపై వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి చేసినా స్పీకర్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు.

దీంతో బీఆర్‌ఎస్‌ శాసన సభ్యులు ఇద్దరు, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన జస్టిస్‌ విజయ్‌ సేన్‌ రెడ్డి సుప్రీంకోర్టు గత తీర్పులను ఉదహరిస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ నాలుగు వారాల్లోగా అనర్హత పిటిషన్లపై తన వైఖరిని తెలియజేయాలని ఆదేశించారు. అంతే కాదు... సాంకేతిక కారణాలతో ఇలాంటి పిటిషన్లను కొట్టేయడం సహేతుకం కాదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడటం విశేషం. అసెంబ్లీ కాలావధి ముగిసేంత వరకూ స్పీకర్‌ నిర్ణయం తీసుకోకుండా ఉంటే కోర్టులు ఊరుకోజాలవని, అలా చేయడం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కూడా ఆయన విస్పష్టంగా పేర్కొన్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులతోపాటు ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీలో ఫిరాయించిన మరో ఏడుగురిపై కూడా వేటు వేయాల్సి ఉంది.

ఫిరాయింపులపై ఫిర్యాదు అందిన మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కానీ అధికార పక్షానికి చెందిన స్పీకర్లు తమ పార్టీ వారిపై చర్యలు తీసుకోకుండా ఉంటున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నుంచి ఎవరైనా వేరే పార్టీలోకి మారితే మాత్రం వెంటనే చర్యలు ఉంటున్నాయి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ అంశాలపై కోర్టులు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూండటం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయాన్నే ఉదాహరణగా తీసుకుందాం. అప్పట్లో పార్టీ మారిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్లు చర్యలు తీసుకోలేదు.

 ఇదీ చదవండి: మళ్లీ ఉద్రిక్తత..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హౌస్‌ అరెస్టు

సీనియన్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ ఫిరాయింపుపై ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసినా సాంకేతిక కారణాలతో కేసు వీగిపోయింది. తాజా కేసులో కూడా ప్రభుత్వ న్యాయవాది సుదర్శన్‌ రెడ్డి సాంకేతిక అంశాలను ప్రస్తావించినా కొట్టివేసేందుకు న్యాయమూర్తి అంగీకరించకపోవడం గమనార్హం. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్‌దే అంతిమ నిర్ణయమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు.  అయినా ఫలితం లేకపోయింది.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు ఈ ఫిరాయింపు సమస్యను భరించింది. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఫిరాయింపుల అంశంపై తీవ్ర విమర్శలు చేసింది. కేసిఆర్ వ్యూహత్మకంగా ఆయా శాసనసభ పక్షాలను మొదట టీఆర్‌ఎస్‌, ఆ తరువాత బీఆర్‌ఎస్‌ విలీనం చేసుకుంటున్నట్టు ప్రకటించారు. నిజానికి అది కూడా అనైతికమే. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సరిగ్గా ఇదే వ్యూహంతో వెళ్లాలని అనుకుంది కానీ.. అవసరమైనంత మందిని తనవైపు తిప్పుకోలేక పోయింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మొత్తం 38 మందిలో పది మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజ్యసభ సభ్యుడు శరద్‌ యాదవ్‌ ఒకానొక సందర్భంలో ఇంకో పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకే అనర్హుడిని చేశారు. బీజేపీ వ్యతిరేకి కావడం వల్లనే అప్పటి రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు శరద్‌ యాదవ్‌పై చర్య తీసుకున్నారన్న విమర్శ కూడా ఉంది.

జాతీయ పార్టీలైన బీజేపీ కావచ్చు.. కాంగ్రెస్‌ కావచ్చు.. రెండూ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ రాజీనామాల వ్యూహాన్ని అమలు చేసింది. సభ్యులు ఎవరైనా పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరితే చట్ట విరుద్ధం కాదు. కానీ తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ కానీ ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ హయాంలో అప్పటి స్పీకర్‌ పోచారం శ్రీనివాస రెడ్డి ఎలాంటి జంకూ లేకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడాన్ని చూసి చూడకుండా వదిలేశారు. తరువాతి కాలంలో ఆయనే ఫిరాయింపుల చట్టాని ఉల్లంఘించి మరీ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రభుత్వ సలహదారు పదవి కూడా ఇచ్చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలని ఇరు పక్షాలూ పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను బలహీన పరిచే లక్ష్యంతోనే ప్రస్తుత సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం ఇందులో భాగమనే అనుకోవాలి. అయితే తనకు ఎవరూ కాంగ్రెస్‌ కండువా కప్పలేదని గాంధీ చెప్పడం సిగ్గు చేటైన విషయం. గాంధీ అని పేరు పెట్టుకున్నందుకైనా ఆయన కొంచెం నిజాయితీతో మాట్లాడి ఉంటే బాగుండేది.

బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం నేత కేసిఆర్ లేఖకు అనుగుణంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌ను నియమించాల్సి ఉండగా కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన గాంధీకి పదవి కట్టబెట్టారు. హరీష్ రావును పీఏసీ చైర్మన్ చేయాలని ప్రతిపాదిస్తే... కనీసం ఆయనను సభ్యుడిగా కూడా చేయలేదు. ఇది ఖచ్చితంగా స్పీకర్ వైపు నుంచి జరుగుతున్న తప్పులే. గతంలో కేసిఆర్ టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చి విమర్శల పాలయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన గాంధీల మధ్య వివాదం మరో ట్విస్ట్. పోలీసులు కౌశిక్ ను హౌస్ అరెస్టు చేసి, గాంధీని చేయకపోవడం,ఆ తర్వాత ఆయన కౌశిక్ ఇంటిపైకి అనుచరులతో కలిసి దాడి చేయడం వంటివి జరిగాయి. ఇందులో పోలీసుల వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.  

ఏపిలో చంద్రబాబు నాయుడు సైతం 2014 -19 లో నలుగురు  వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయినా ఆనాటి స్పీకర్ కోడెల వారిపై కాని ...పార్టీ మారిన మొత్తం  23 మంది ఎమ్మెల్యేలపై కాని  చర్యలు తీసుకోలేదు. అలాగే తెలంగాణలో స్పీకర్ లుగా పనిచేసిన పోచారం ,మధుసుధనాచారిలు ఆనాటి సీఎం  కేసిఆర్ ఏం చెబితే అదే చేశారు. స్వత్రంతంగా వ్యవహరించలేదు. ఒకప్పుడు అయ్యదేవర కాళేశ్వర రావు, బి.వి.సుబ్బారెడ్డి, జి.నారాయణ రావు మొదలైన వారు స్పీకర్లుగా ముఖ్యమంత్రిని సైతం వ్యతిరేకించిన ఘట్టాలు చరిత్రలో ఉన్నాయి. ప్రస్తుత తెలంగాణ శాసనసభ వ్యవహరాల మంత్రి డి. శ్రీధర్‌ బాబు తండ్రి శ్రీపాదరావు స్పీకర్  ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి కొంత ప్రాధాన్యత ఇవ్వడం అప్పటి అధికార కాంగ్రెస్ కు రుచించేది కాదు. స్పీకర్ గా పనిచేసిన మరోనేత కేఆర్ సురేష్ రెడ్డి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన 10 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది.

ఒక్కోసారి సభ్యులు రాజీనామాలు చేసినా స్పీకర్లు వాటిని రాజకీయ కారణాలతో పెండింగులో ఉంచిన ఘట్టాలు ఉమ్మడి ఏపీలో జరిగాయి. తెలంగాణ ఉద్యమం కోసం కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి వాటిని ఆమోదించడం ఆలస్యం చేస్తే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామాల డ్రామాకు కిరణ్ కుమార్ ఆధ్వర్యం వహించారు. ఇంకో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లుగా జగన్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడాన్ని బాగా ఆలస్యం చేశారు.

అసెంబ్లీ టరమ్ ఏడాది లోపు ఉంటే ఉప ఎన్నికలు రావు. ఆ రకంగా మనోహర్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వచ్చాయి.  ఏపీలో తమ్మినేని సీతరాం గత టరమ్ లో ఆనాటి అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కొంత ఆలస్యంగానైనా అనర్హత వేటు వేశారు. లోక్ సభ, రాజ్యసభలో కూడా ఎక్కువ సందర్భాలలో ఇదే జరుగుతోంది. ఏపీకి చెందిన అప్పటి ఎమ్.పి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరినా స్పీకర్ ఓం బిర్లా ఏదో సాకు చూపుతూ కాలం గడిపేశారు.  ఏది ఏమైనా  ఫిరాయింపుల విషయంలో బీజేపీ కాంగ్రెస్‌తోసహ వివిధ రాజకీయ పక్షాలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నది నిజం. స్పీకర్లు ముఖ్యమంత్రులు చెప్పినట్లు నడుచుకోక తప్పని స్థితి ఉంటోంది. అందువల్ల కనీసం న్యాయవ్యవస్థలోని వారైనా  ఇలాంటి తీర్పులు ఇవ్వడమే కాకుండా స్పీకర్ చర్య తీసుకోలేని పక్షంలో వారే అనర్హత వేటు వేసేలా చోరవ చూపడం అవశ్యం అని చెప్పాలి.


- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement