సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఎమ్మెల్యే ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్యగా చెబుతున్నారని, దీనిపై రేవంత్ లెంపలేసుకుంటారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని సూటిగా వేలెత్తి చూపుతున్నారని తెలిపారు. తమ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారని అన్నారు.
ఈ మేరకు ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్.. ‘ఇప్పటికైనా మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా? క్షమాపణ చెబుతారా? మీరు గడప గడపకు వెళ్లి.. చేర్చుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చట్టప్రకారం వేటు వేయల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇప్పటికైనా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా? ఇప్పుడు రాయితో కొట్టాల్సింది ఎవరిని..? ఫిరాయించిన ఎమ్మెల్యేలనా ?ప్రోత్సహించిన మిమ్ములనా ?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
రేవంత్ గారు..
మీ సొంత పార్టీ నేతనే..
మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు
అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు..
ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా ?
జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడే..
ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం అని….మీ దిగజారుడు… pic.twitter.com/D9CTnAl6Ci— KTR (@KTRBRS) October 23, 2024
కాగా కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర అసంతృప్తి కలిగిస్తున్నాయని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విధానాలకు ఫిరాయింపులు వ్యతిరేకమని తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి చేరిన వారిపై అనర్హత వేటు వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిరాయింపులు మంచిది కాదని హైకమాండ్‌కు చెప్పానని పేర్కొన్నారు. ఇక దానిపై నిర్ణయం పార్టీ ఇష్టమేనని తెలిపారు. ఫిరాయింపులపై తన నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.
ఫిరాయింపుల కారణంగా బీఆర్‌ఎస్ ఎవరో.. కాంగ్రెస్ ఎవరో అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి అన్నారు. అసలైన కాంగ్రెస్ నేతలు కూడా తాము కాంగ్రెస్సే అని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉందని తెలిపారు. ఎంఐఎంను మినహాయించినా కాంగ్రెస్ సుస్థిరంగానే ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరారు. పార్టీ ఫిరాయిస్తే సస్పెండ్ చేయాలని చట్టంలోనూ ఉందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment