ఎదలో పూసిన ఎర్ర గులాబీ! | jawaharlal nehru role in india progress | Sakshi
Sakshi News home page

ఎదలో పూసిన ఎర్ర గులాబీ!

Published Sun, Aug 21 2022 12:58 AM | Last Updated on Sun, Aug 21 2022 6:57 AM

jawaharlal nehru role in india progress - Sakshi

చందమామ లేని వెన్నెల కాయించే మాంత్రికులు రాబో తున్నారు. ఆకాశం లేని ఇంద్రధనుసును పూయించే చమత్కా రులు కూడా రాబోతు న్నారు. పండిత నెహ్రూ ప్రస్తావన లేకుండానే స్వతంత్ర భారత ప్రస్థా నాన్ని వినిపించగల హరి కథకులు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఇక ముందు ఇలాంటి అనేక వింతల్ని చూడ వలసి ఉన్నది. అనేక విషాదాలను కూడా తట్టుకోవలసి ఉన్నది. ‘క్లైమేట్‌ ఛేంజ్‌’ పర్యవసానంగా శిరమెత్తిన నడిమంత్రపు తుపాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. ఇది రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై అయిదేళ్లు నిండిన సందర్భాన్ని అమృతోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. ప్రజలు అద్భుతంగా స్పందించారు. పొలం పనులకు వెళ్లిన కూలి జనం కూడా ముందుగా గట్ల మీద మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. ‘జనగణమన’ పాడారు. జైహిందంటూ జెండాలకు వందనం చేసిన తర్వాతే పనుల్లోకి దిగారు. దండకారణ్య మారుమూల ప్రాంతాల్లో ఒంటి మీద సరిగా గుడ్డల్లేని గిరిజన బిడ్డలు కూడా జెండా పండుగలు చేసుకున్నారు. దేశభక్తి ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదని ఢంకా భజాయించి చెప్పారు. ఈ నేల మీద మొలకెత్తిన గడ్డిపోచకు కూడా దేశభక్తిపై పేటెంట్‌ ఉన్నదని ఘంటాపథంగా చాటి చెప్పారు. 

భావజాల వాతావరణ మార్పుల ప్రభావం ఈ ఉత్సవాల్లో అక్కడక్కడా కనిపించింది. నవభారత నిర్మాతగా పేరున్న పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిష్ఠ మీద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా పాల్గొన్నాయి. ‘దేశవిభజనకు నెహ్రూయే కారకు’డంటూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన వీడియో ఆరోపించింది. కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పత్రికా ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో నెహ్రూను మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల ఫొటోలు వేశారు. కావాలనే నెహ్రూ ఫొటోను వెయ్యలేదని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఒకరు ప్రక టించారు. అంబేడ్కర్‌ బొమ్మను కూడా అట్టడుగున మొక్కు బడిగా వేశారనీ, బ్రిటిష్‌ వారిని క్షమాభిక్ష వేడిన సావర్కర్‌ ఫొటో మాత్రం ప్రముఖంగా వేశారనీ విమర్శలు కూడా వచ్చాయి. నెహ్రూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు పథకం ప్రకారమే ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది.

‘‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వు – ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం’’ – అట్లాంటి నిన్ను ఈ దేశం ఎలా మరవగలుగుతుందని నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన కవితలో తిలక్‌ ప్రశ్నిస్తాడు. అది అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని కొంతమంది వీరతిలకాలు దిద్దుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు ఈ ప్రయత్నాలు? నెహ్రూను తెరమరుగు చేసి ఏం సాధించగలరు? నెహ్రూపై కత్తి దూయడం వెనుక ఉన్నది భావజాల సంఘర్షణ కావచ్చు. దూసిన కత్తికి రెండో వైపున కూడా పదునుందని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను ‘ఉచిత పథకాల’ పేరుతో ఈసడించుకునే క్యాంపెయిన్‌ ఈ మధ్యనే ప్రారంభమైంది. దాదాపు ఇదే సమయంలో నెహ్రూ భావ జాలాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికపై మొదలయ్యాయి. ఈ రెంటికీ మధ్యన ఉన్న సంబంధమేమిటి? అసలు నెహ్రూ భావజాలమేమిటి? ఆయన చేసిందేమిటి?

1929 డిసెంబర్‌లో జరిగిన ‘లాహోర్‌ కాంగ్రెస్‌ సభ’లో మొదటిసారిగా దేశానికి ‘పూర్ణ స్వరాజ్‌’ కావాలనే డిమాండ్‌ ముందుకొచ్చింది. అప్పటి వరకూ డొమినియన్‌ హోదా ఇస్తే చాలన్న పార్టీ పంథాలో ఈ విప్లవాత్మక మార్పునకు కారకుడు ఆ సభలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన జవహర్‌లాల్‌ నెహ్రూ. స్వాతంత్య్రం ప్రకటించే ముందు లార్డ్‌ మౌంట్‌ బాటెన్‌ ఒక ప్లాన్‌ను ముందుకు తెచ్చాడు. ఆ ప్లాన్‌ ప్రకారం ప్రావిన్స్‌ల (రాష్ట్రాల) వారీగా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తారు. భారత రాజ్యాంగ సభలో చేరడం, చేరకపోవడమనేది వారి ఇష్టం. ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించి దేశం డజన్‌ ముక్కలు కాకుండా కాపాడిన వారిలో ప్రథముడు జవహర్‌లాల్‌ నెహ్రూ.

స్వతంత్రం లభించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలు వేళ్లూనుకోవడానికీ, లౌకిక వ్యవస్థ పటిష్ఠమవడానికీ, సామాజిక న్యాయం – సామ్యవాద భావాలు వికసించడానికీ అహరహం కృషి చేసిన వ్యక్తిగా జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. భారత్‌తో పాటు ఆ కాలంలో వలస సంకెళ్లు తెంచుకున్న అనేక దేశాలు ప్రజాస్వామిక వ్యవస్థలతో ప్రారంభమై, అచిర కాలంలోనే నియంతృత్వంలోకి జారుకున్నాయి. ఆ దేశాల జాతీయ నాయకులు అభ్యుదయ భావాలు కలిగినవారే. అయినా పతనాన్ని నిరోధించలేక  పోయారు. ఇండోనేషియా, పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాలు ఇందుకు ఉదాహరణలు. ఆ రోజుల్లో ఒక్క జూలియస్‌ నైరేరే (టాంజానియా) మాత్రమే పండిత నెహ్రూ మాదిరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలబెట్టగలిగారు.

డచ్‌ వలస పాలన నుంచి ఇండోనేషియాకు విముక్తి సాధించడంలో సుకర్ణో కీలకపాత్ర పోషించారు. ఆయన నెహ్రూతో సమానంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అలీనోద్యమంలో నెహ్రూకు కుడి భుజంగా వ్యవహరించాడు. నియంతృత్వ పోకడలు పొడసూపి, పది లక్షల మంది ఊచకోతకు కారకుడై చివరకు పదవీచ్యుతుడయ్యాడు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మావో జెడాంగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం జనం మెదళ్లపై కూడా నిఘా వేసి లక్షలాది మందిని హతమార్చింది.

పండిత నెహ్రూ ఇందుకు భిన్నంగా ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా లోపభూయిష్ఠంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆ కాలపు తరుణ స్వతంత్ర దేశాధినేతల్లో ఒకరికి ‘అత్యుత్తమ ప్రజాస్వామ్యవాది’ టైటిల్‌ ఇవ్వాల్సి వస్తే నెహ్రూతో పోటీపడగలిగే వారెవరూ లేరు. ఇన్నాళ్లుగా ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ఈ దేశంలో నిలబడి ఉండటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రతిపక్ష నేతలలో కూడా నెహ్రూ సౌహార్దంగానే వ్యవహరించారని చెప్పేందుకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

నెహ్రూ విధానాలకు సోషలిస్టు నాయకుడు రామ్‌మనోహర్‌ లోహియా బద్ధవ్యతిరేకి. తీవ్రంగా విమర్శించేవాడు. ఒకసారి ఏదో ధర్నా చేసి ఆయన జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న లోహియాకు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక బుట్ట నిండా మామిడిపళ్లను పంపించారట. ఈ చర్య పట్ల అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘జనసంఘ్‌’ టిక్కెట్‌పై లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ తన విధానాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడయ్యేవారట. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్‌పేయ్‌ని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారట. నెహ్రూ విధానాలను తీవ్రంగా విమర్శించే వాజ్‌పేయి వ్యక్తి గతంగా మాత్రం ఆయనను అభిమానించేవారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలై, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రయ్యారు. తన ఛాంబర్‌లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటోను ఇప్పుడు తీసేశారని గుర్తించారు. ‘పండిత్‌జీ ఫొటోను తెచ్చి ఎక్కడుందో అక్కడ మళ్లీ పెట్టండ’ని ఆదేశించారట! 

స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఈ ప్రసంగంలో రేఖామాత్రంగా చెప్పిన అంశాలే ఆయన భావజాలానికి తార్కిక పునాది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను ఇప్పుడు నెరవేర్చాలి. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞా నాన్ని పారద్రోలాలి. ప్రతి ఒక్క కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయా’లంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసం చేశారు. అంబే డ్కర్‌ రూపొందించిన భారత రాజ్యాంగంలో ఈ అభిప్రాయాలు ప్రతిఫలించాయి. 

తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్‌ వంటి భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని ‘ఆధునిక దేవాలయాలు’గా పిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా భారతీయులు పనిచేస్తున్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఐఐటీలు, ఐఐఎమ్‌లూ, వాటితోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎయిమ్స్‌’లాంటి విద్యా సంస్థల్ని నెహ్రూ స్థాపించారు.

హోమీ జె.బాబా, విక్రమ్‌ సారాబాయ్, సీడీ దేశ్‌ముఖ్, భట్నాగర్, వర్గీస్‌ కురియన్‌ వంటి మేధావులను ప్రోత్సహించి, వారి కృషితో దేశానికి అభివృద్ధి బాటలు పరిచిన దార్శనికుడు నెహ్రూ. అంతరిక్ష రంగంలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్‌’ను కూడా నెహ్రూ కాలంలోనే స్థాపించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థల్లో సింహభాగం ఆయన కాలంలోనే ఏర్ప డ్డాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక సుదీర్ఘమైన జాబితా తయారవుతుంది.

నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధిని క్రమబద్ధం చేసి దేశాన్ని నిలబెట్టాయి. పబ్లిక్‌ రంగ పరిశ్రమలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపుదిద్ది అసమానతలు, అంతరాలు అడ్డగోలుగా పెరగకుండా నియంత్రించగలిగాయి. స్వాతంత్య్రా నికి ముందు బ్రిటీష్‌ దోపిడీ యథేచ్ఛగా సాగిన రోజుల్లో దేశ జనాభాలోని ఒక్క శాతం అగ్రగామి శ్రీమంతుల చేతుల్లో 21 శాతం జాతి సంపద ఉండేది. నెహ్రూ విధానాల ఫలితంగా 1980 నాటికి ఒక్క శాతం జనాభా చేతిలో ఉండే జాతి సంపద 6 శాతానికి తగ్గింది. మళ్లీ ఇప్పుడు 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్‌రాజ్‌’ నుంచి ‘స్వరాజ్‌’ వైపు దేశాన్ని మళ్లించడానికి నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు ప్రయత్నించారు. ఇప్పటి ఆధునిక నేతలు దాన్ని ‘బిలియనీర్ల రాజ్‌’ వైపు పరుగె త్తిస్తున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తున్నది. ‘బ్రిటీష్‌ రాజ్‌ టు బిలియనీర్‌ రాజ్‌’ పేరుతో వెలువడిన ఒక పరిశోధనా పత్రం లోని ఈ వివరాలను ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో ప్రకటించారు.

నెహ్రూ సర్వజ్ఞుడనీ, లోపరహితుడనీ చెప్పలేము. ఆయన పాలనా కాలంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా చైనాను అంచనా వేయడంలో ఆయన తప్పటడుగు వేశారు. తరుణ స్వతంత్ర దేశాలన్నీ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. చైనాతో ‘పంచశీల’ ఒడంబడిక కుదుర్చు కున్నారు. మావో జెడాంగ్‌ ఎంత కమ్యూనిస్టో అంతే కరుడు గట్టిన నేషనలిస్టు అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. టిబెట్‌పై దురాక్రమణ చేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ పరిణామానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ దేశాలను నెహ్రూ కూడగట్టి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ బెంగే ఆయన మరణానికి కూడా కారణమైంది.

పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశీయంగా కూడా నెహ్రూ కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఆయన ఆధునిక భారత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ నెంబర్‌ వన్‌. దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవకుండా కాపాడినవాడు. లౌకిక భావాలను సమాజం గుండెల నిండా నింపినవాడు. సమతాభావాలకు జైకొట్టినవాడు. మనిషిని ప్రేమించినవాడు. ఈ దేశపు మట్టిని ప్రేమించినవాడు. ఆయన పటేల్‌ విగ్రహ మంత పెద్ద విగ్రహాన్ని పెట్టకపోవచ్చు కానీ ప్రపంచ కార్పొరేట్‌ రంగాన్ని ఏలుతున్న మేధావులను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాలను స్థాపించారు. ఆయన రామ మందిరాన్ని నిర్మించకపోవచ్చు కానీ ఆధునిక దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు. ఛాందస భావాలకు బద్ధవిరోధి. శాస్త్రీయ ఆలోచనా రీతులకూ, సైంటిఫిక్‌ టెంపర్‌కూ కేరాఫ్‌ అడ్రస్‌ – పండిత నెహ్రూ. ఇప్పుడా చిరునామాను చెరిపేస్తారట! కోటు మీద అలంకరించుకున్న గులాబీ పువ్వును పీకి పారేయొచ్చు. కానీ ఎద ఎదలో పూసిన ఎర్రగులాబీలను పీకేయడం ఎలా సాధ్యం?


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement