India independence
-
మూలవాసుల అభివృద్ధా? మూలాల విధ్వంసమా?
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా దేశ అభివృద్ధి నమూనా మారడం లేదు. అభివృద్ధి ఫలాలు కొందరి దగ్గరే పోగుబడడం అంతకంతకూ పెరిగిపోతోంది. సాంస్కృతిక హననంతోపాటు మూలవాసుల పేదరికమూ హెచ్చవుతోంది.భారతదేశం ప్రపంచ దేశాల ముందు తలయెత్తుకొని నిలబడగలిగిన ప్రాకృతిక సంపదను కలిగి ఉంది. దాన్ని పరిరక్షించుకుంటూ, దేశ అభివృద్ధిని నిరంతరం పెంచి పోషించుకునే సూత్రాలు, అధికరణాలు రాజ్యాంగంలో ఎల్లెడలా పరచుకొని ఉన్నాయి. ముఖ్యంగా భారత రాజ్యాంగం మానవ హక్కుల పరిరక్షణలో బలమైన సూత్రాలను మనకు అందించింది. అధికరణం 46లో ‘బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బలహీన వర్గాలకు చెందిన ప్రజల (ప్రత్యేకించి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన ప్రజలు) ఆర్థికాభివృద్ధికి, వారిలో విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి. ఏ విధంగానూ దోపిడీకి గురి కాకుండా వారిని కాపాడాలి. వారికి సామాజికంగా అన్యాయం జరగకుండా చూడాల’ని ఉంది.కానీ, ఇవాళ అర్థికాభివృద్ధి పేరుతో సహజవనరులు, సాంస్కృతిక సంపద హననానికి గురవు తోందనేది వాస్తవం. దక్షిణ భారత దేశం పారిశ్రామికంగా మిగతా ప్రాంతాల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ అభివృద్ధి క్రమంలో... వేల ఏళ్ల పాటు తరతరాలు వారసత్వంగా మనకు అందించిన సాంస్కృతిక సంపద ధ్వంసమవుతోంది. దక్షిణ భారతదేశ నవీన రాతియుగ సంస్కృతి మూలాలు అంతరించే పరిస్థితులు వచ్చాయని చరిత్రకారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సమాజ పరిణామక్రమంలో కొంత కాలానికి ప్రభుత్వాలేర్పడ్డాయి. చాలాకాలం వరకు అప్పటి ప్రభుత్వాలు భూమి పైన శిస్తు వసూలుకే పరిమితమయ్యాయి. కాని, భూమిపై హక్కును ఏర్పరచుకొనలేదు. కాలక్రమంలో భారతదేశాన్ని అనేక స్వదేశీ, విదేశీ తెగలు పరిపాలించాయి. మొగలాయీ చక్రవర్తుల కాలంలో భూమిశిస్తు వసూలు బాధ్యత ప్రభుత్వ అధికారుల నుండి ప్రైవేటు వ్యక్తులకు బదిలీ అయింది. వారే జమీందారు లయ్యారు. బ్రిటీష్ వారి పాలనలో జమీందారులకు వారి అజమాయిషీలోని ఎస్టేటు లపై 1793లో లార్డ్ కారన్వాలిస్ ఆస్తి హక్కు నిచ్చారు. భూమి కాస్తా అమ్మకపు సరుకైంది. కరవు కాటకాల సమయాల్లో నిర్బంధపు శిస్తులు కట్టలేక భూమిని అమ్ముకున్న రైతులు భూమిలేని పేదలయ్యారు. హెచ్చుగా భూములను కొన్నవారేమో... వడ్డీ వ్యాపా రులు, భూస్వాములయ్యారు. భూమిని పోగొట్టుకున్న వారిలో చాలామంది కౌలు దారులయ్యారు. క్రమంగా భూస్వాముల నిర్బంధపు కౌలు వసూలును కౌలుదార్లు భరించలేని స్థితికి చేరారు. ఆ క్రమంలో వారు భూమిలేని గ్రామీణ పేదలయ్యారు. తిరిగి భూమిని పేదలకు పంచాలనే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి, 1947 తర్వాత స్వతంత్ర భారతంలో ఈ ఉద్యమాలు ఊపందుకున్నాయి.1948లో జమీందారీ వ్యవస్థ రద్దు కాక పూర్వం మామూలు భూస్వాములకు సగటున 100 ఎకరాలుండేది. 1938లో వచ్చిన ప్రకాశం కమిటీ రిపోర్టు ఆధారంగా తయారుచేసిన ‘మద్రాసు ఎస్టేట్ రద్దు – రైత్వారీకి మార్పు బిల్లు’ 1949 ఏప్రిల్ 19న శాసనసభ ఆమోదం పొంది, 1950లో రాష్ట్రపతి ఆమోదముద్ర పడి చట్టమైంది. ఈ చట్టం ప్రకారం పర్మనెంట్ సెటిల్మెంట్ ఎస్టేటు భూములు, అడవులు, గనులు, ఖనిజాలు గల భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి వచ్చాయి. జమీందారులకు పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లిస్తూ, వారి సొంత సేద్యానికి సారవంతమైన వేలాది ఎకరాలు వదిలి వేయబడ్డాయి. దీనితో జమీందారులు బడా భూస్వాములయ్యారు.ప్రధానమైన వనరులన్నీ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళాక... దేశంలో కరవు, అవిద్య, అనారోగ్యం, దురాక్రమణలతో కూడిన పాలనా విధానాలు పెరుగుతున్నాయి. డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆనాడే దక్షిణ భారత అస్తిత్వాన్ని గురించీ, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల అస్తిత్వాల గురించి అనేక సూత్రాలు మనకు అందించారు. ముఖ్యంగా దక్షిణ భారత భూభాగంలో... స్థానిక భాషలు,సంస్కృతి, చరిత్ర, పురాతత్వ భావనలను పెంపొందించాలన్నారు. అంతేకాని వాటిని ఇతరులకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబించరాదనీ, అందువల్ల భారతదేశం అంతర్గతంగా తాకట్టులోకి వెళ్ళే ప్రమాదం ఉందనీ చెప్పారు. నిజానికి ప్రస్తుత పాలకవర్గ నిష్క్రియాపర్వాన్ని అలా ఉంచితే... కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ‘ఇండియా’ కూటమి కూడా దేశాన్ని తాకట్టు నుంచి విముక్తి చేసే విధంగా పార్లమెంటులో వాదించలేకపోతోంది. ఆ మాట ఒప్పుకోవాల్సిందే! కొన్ని కార్పొరేట్ శక్తులు వీరి వెనక కూడా ఉండడమే ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇదే సమయంలో రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకునే విషయంలో పార్లమెంటులోని దళిత బహుజన ఎం.పీలు నోరు మెదపకపోవడం వారి బానిసత్వాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి ఈ దేశం ఇలా కార్పొరేట్ శక్తుల, అగ్రవర్ణ భూస్వామ్య శక్తుల చేతుల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం పూనా ప్యాక్ట్ ద్వారా ఉమ్మడి నియోజక వర్గాల్లో గెలిచిన దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలని చెప్పక తప్పదు. ఇప్పటికీ ఈ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు దళిత హక్కుల కోసం ఎలుగెత్తి మాట్లాడలేకపోతున్నారు అనేది స్పష్టమైన అంశం. అలాగే వామపక్షాలు కూడా అనేక సందర్భాల్లో దళిత బహుజనుల భూమి హక్కు మీద, కౌలుదార్ల హక్కుల మీద మాట్లాడటం తగ్గించారు.మరోపక్క సెంటు భూమి కూడా లేని వారు భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు. బ్యాంకులో అప్పుల్లో ఉన్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ప్రజలకు ఉత్పత్తి క్రమాన్ని నేర్పటం లేదు. ప్రజల్లో జీవశక్తినీ, ఆత్మ విశ్వాసాన్నీ, ఆత్మ గౌరవ స్ఫూర్తినీ, స్వీయ జీవన ప్రమాణాన్నీ పెంచినప్పుడే దేశం ఇతర దేశాలకు అప్పులు ఇవ్వగలిగిన స్థాయికి ఎదుగుతుంది. ఈనాడు దేశీయ భావన, జాతీయ భావన, రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంచాల్సిన బాధ్యత లౌకికవాద ప్రజాస్వామ్య శక్తుల చేతుల్లో ఉంది. రాజకీయ పార్టీల కన్నా ... ఎప్పుడూ ప్రజా ఉద్య మాలే దేశాన్ని మేల్కొలుపుతాయి. నిద్రావస్థలో మునిగిన సమాజాన్ని చైతన్యవంతం చేసి, అంబేడ్కర్ మార్గంలో ఈ దేశ సాంస్కృతిక వికాసానికి అందరం పాటుపడుదాం.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
ఎదలో పూసిన ఎర్ర గులాబీ!
చందమామ లేని వెన్నెల కాయించే మాంత్రికులు రాబో తున్నారు. ఆకాశం లేని ఇంద్రధనుసును పూయించే చమత్కా రులు కూడా రాబోతు న్నారు. పండిత నెహ్రూ ప్రస్తావన లేకుండానే స్వతంత్ర భారత ప్రస్థా నాన్ని వినిపించగల హరి కథకులు ఇప్పటికే వేంచేసి ఉన్నారు. ఇక ముందు ఇలాంటి అనేక వింతల్ని చూడ వలసి ఉన్నది. అనేక విషాదాలను కూడా తట్టుకోవలసి ఉన్నది. ‘క్లైమేట్ ఛేంజ్’ పర్యవసానంగా శిరమెత్తిన నడిమంత్రపు తుపాను గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. ఇది రాజకీయ వాతావరణ శాస్త్రవేత్తల తుది హెచ్చరిక. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి డెబ్భై అయిదేళ్లు నిండిన సందర్భాన్ని అమృతోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు పిలుపునిచ్చింది. ప్రజలు అద్భుతంగా స్పందించారు. పొలం పనులకు వెళ్లిన కూలి జనం కూడా ముందుగా గట్ల మీద మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. ‘జనగణమన’ పాడారు. జైహిందంటూ జెండాలకు వందనం చేసిన తర్వాతే పనుల్లోకి దిగారు. దండకారణ్య మారుమూల ప్రాంతాల్లో ఒంటి మీద సరిగా గుడ్డల్లేని గిరిజన బిడ్డలు కూడా జెండా పండుగలు చేసుకున్నారు. దేశభక్తి ఏ ఒక్కడి అబ్బ సొత్తు కాదని ఢంకా భజాయించి చెప్పారు. ఈ నేల మీద మొలకెత్తిన గడ్డిపోచకు కూడా దేశభక్తిపై పేటెంట్ ఉన్నదని ఘంటాపథంగా చాటి చెప్పారు. భావజాల వాతావరణ మార్పుల ప్రభావం ఈ ఉత్సవాల్లో అక్కడక్కడా కనిపించింది. నవభారత నిర్మాతగా పేరున్న పండిత జవహర్లాల్ నెహ్రూ ప్రతిష్ఠ మీద దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ప్రభుత్వాలు, పాలక పార్టీలు కూడా పాల్గొన్నాయి. ‘దేశవిభజనకు నెహ్రూయే కారకు’డంటూ భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన వీడియో ఆరోపించింది. కర్ణాటకలోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొన్ని పత్రికా ప్రకటనల్ని విడుదల చేసింది. అందులో నెహ్రూను మినహాయించి మిగిలిన జాతీయ నాయకుల ఫొటోలు వేశారు. కావాలనే నెహ్రూ ఫొటోను వెయ్యలేదని ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి ఒకరు ప్రక టించారు. అంబేడ్కర్ బొమ్మను కూడా అట్టడుగున మొక్కు బడిగా వేశారనీ, బ్రిటిష్ వారిని క్షమాభిక్ష వేడిన సావర్కర్ ఫొటో మాత్రం ప్రముఖంగా వేశారనీ విమర్శలు కూడా వచ్చాయి. నెహ్రూ చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు పథకం ప్రకారమే ప్రారంభమైనట్లు కనిపిస్తున్నది. ‘‘ఈ దేశంలో ఏ హృదయ ద్వారం తెరిచినా నువ్వు – ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా అక్కడ నీ పదాంకం’’ – అట్లాంటి నిన్ను ఈ దేశం ఎలా మరవగలుగుతుందని నెహ్రూ చనిపోయినప్పుడు రాసిన కవితలో తిలక్ ప్రశ్నిస్తాడు. అది అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని కొంతమంది వీరతిలకాలు దిద్దుకొని మరీ ప్రయత్నాలు ప్రారంభించినట్టు కనిపిస్తున్నది. ఎందుకు ఈ ప్రయత్నాలు? నెహ్రూను తెరమరుగు చేసి ఏం సాధించగలరు? నెహ్రూపై కత్తి దూయడం వెనుక ఉన్నది భావజాల సంఘర్షణ కావచ్చు. దూసిన కత్తికి రెండో వైపున కూడా పదునుందని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పేదవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం అమలు చేసే పథకాలను ‘ఉచిత పథకాల’ పేరుతో ఈసడించుకునే క్యాంపెయిన్ ఈ మధ్యనే ప్రారంభమైంది. దాదాపు ఇదే సమయంలో నెహ్రూ భావ జాలాన్ని తెరమరుగు చేసే ప్రయత్నాలు యుద్ధప్రాతిపదికపై మొదలయ్యాయి. ఈ రెంటికీ మధ్యన ఉన్న సంబంధమేమిటి? అసలు నెహ్రూ భావజాలమేమిటి? ఆయన చేసిందేమిటి? 1929 డిసెంబర్లో జరిగిన ‘లాహోర్ కాంగ్రెస్ సభ’లో మొదటిసారిగా దేశానికి ‘పూర్ణ స్వరాజ్’ కావాలనే డిమాండ్ ముందుకొచ్చింది. అప్పటి వరకూ డొమినియన్ హోదా ఇస్తే చాలన్న పార్టీ పంథాలో ఈ విప్లవాత్మక మార్పునకు కారకుడు ఆ సభలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం ప్రకటించే ముందు లార్డ్ మౌంట్ బాటెన్ ఒక ప్లాన్‌ను ముందుకు తెచ్చాడు. ఆ ప్లాన్ ప్రకారం ప్రావిన్స్‌ల (రాష్ట్రాల) వారీగా స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తారు. భారత రాజ్యాంగ సభలో చేరడం, చేరకపోవడమనేది వారి ఇష్టం. ఈ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించి దేశం డజన్ ముక్కలు కాకుండా కాపాడిన వారిలో ప్రథముడు జవహర్లాల్ నెహ్రూ. స్వతంత్రం లభించిన తర్వాత దేశంలో ప్రజాస్వామిక విలువలు వేళ్లూనుకోవడానికీ, లౌకిక వ్యవస్థ పటిష్ఠమవడానికీ, సామాజిక న్యాయం – సామ్యవాద భావాలు వికసించడానికీ అహరహం కృషి చేసిన వ్యక్తిగా జవహర్లాల్ నెహ్రూ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుంది. భారత్‌తో పాటు ఆ కాలంలో వలస సంకెళ్లు తెంచుకున్న అనేక దేశాలు ప్రజాస్వామిక వ్యవస్థలతో ప్రారంభమై, అచిర కాలంలోనే నియంతృత్వంలోకి జారుకున్నాయి. ఆ దేశాల జాతీయ నాయకులు అభ్యుదయ భావాలు కలిగినవారే. అయినా పతనాన్ని నిరోధించలేక పోయారు. ఇండోనేషియా, పాకిస్థాన్, పలు ఆఫ్రికా దేశాలు ఇందుకు ఉదాహరణలు. ఆ రోజుల్లో ఒక్క జూలియస్ నైరేరే (టాంజానియా) మాత్రమే పండిత నెహ్రూ మాదిరిగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిలబెట్టగలిగారు. డచ్ వలస పాలన నుంచి ఇండోనేషియాకు విముక్తి సాధించడంలో సుకర్ణో కీలకపాత్ర పోషించారు. ఆయన నెహ్రూతో సమానంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు. అలీనోద్యమంలో నెహ్రూకు కుడి భుజంగా వ్యవహరించాడు. నియంతృత్వ పోకడలు పొడసూపి, పది లక్షల మంది ఊచకోతకు కారకుడై చివరకు పదవీచ్యుతుడయ్యాడు. ‘నూరు పువ్వులు వికసించాలి, వెయ్యి భావాలు పోటీపడాల’ని ప్రజాస్వామిక నినాదాలిచ్చిన మావో జెడాంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం జనం మెదళ్లపై కూడా నిఘా వేసి లక్షలాది మందిని హతమార్చింది. పండిత నెహ్రూ ఇందుకు భిన్నంగా ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాదు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా లోపభూయిష్ఠంగా వ్యవహరించి ఉండవచ్చు. కానీ ఆ కాలపు తరుణ స్వతంత్ర దేశాధినేతల్లో ఒకరికి ‘అత్యుత్తమ ప్రజాస్వామ్యవాది’ టైటిల్ ఇవ్వాల్సి వస్తే నెహ్రూతో పోటీపడగలిగే వారెవరూ లేరు. ఇన్నాళ్లుగా ప్రజాస్వామ్యం, లౌకిక విధానాలు ఈ దేశంలో నిలబడి ఉండటానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని అందరూ అంగీకరిస్తారు. ప్రతిపక్ష నేతలలో కూడా నెహ్రూ సౌహార్దంగానే వ్యవహరించారని చెప్పేందుకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నెహ్రూ విధానాలకు సోషలిస్టు నాయకుడు రామ్మనోహర్ లోహియా బద్ధవ్యతిరేకి. తీవ్రంగా విమర్శించేవాడు. ఒకసారి ఏదో ధర్నా చేసి ఆయన జైలుకు వెళ్లాడు. జైల్లో ఉన్న లోహియాకు ప్రధానిగా ఉన్న నెహ్రూ ఒక బుట్ట నిండా మామిడిపళ్లను పంపించారట. ఈ చర్య పట్ల అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘జనసంఘ్’ టిక్కెట్‌పై లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన అటల్ బిహారి వాజ్‌పేయ్ తన విధానాలను విమర్శిస్తూ చేసే ప్రసంగాలకు నెహ్రూ ముగ్ధుడయ్యేవారట. ఒకసారి ఓ విదేశీ దౌత్యవేత్తకు వాజ్‌పేయ్‌ని పరిచయం చేస్తూ ‘ఈ యువకుడు భవిష్యత్తులో దేశానికి ప్రధాని అవుతాడ’ని నెహ్రూ చెప్పారట. నెహ్రూ విధానాలను తీవ్రంగా విమర్శించే వాజ్‌పేయి వ్యక్తి గతంగా మాత్రం ఆయనను అభిమానించేవారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలై, జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. వాజ్‌పేయి విదేశాంగ మంత్రయ్యారు. తన ఛాంబర్లోకి వచ్చి చూసిన తర్వాత అక్కడ గతంలో ఉన్న నెహ్రూ ఫొటోను ఇప్పుడు తీసేశారని గుర్తించారు. ‘పండిత్‌జీ ఫొటోను తెచ్చి ఎక్కడుందో అక్కడ మళ్లీ పెట్టండ’ని ఆదేశించారట! స్వాతంత్య్ర ప్రకటనకు కొన్ని గంటల ముందు ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పేరుతో నెహ్రూ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. ఈ ప్రసంగంలో రేఖామాత్రంగా చెప్పిన అంశాలే ఆయన భావజాలానికి తార్కిక పునాది. ‘కొన్నేళ్ల కిందట (ఉద్యమ కాలంలో) మనం విధికి ఒక ఒక మాట ఇచ్చాం. ఆ మాటను ఇప్పుడు నెరవేర్చాలి. దారిద్య్రాన్ని, అసమానతలను, అజ్ఞా నాన్ని పారద్రోలాలి. ప్రతి ఒక్క కంటిలోని ప్రతి కన్నీటి చుక్కనూ తుడిచేయాలి. భారతదేశం కోసం, ప్రపంచ మానవాళి కోసం మనం కన్న కలల్ని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయా’లంటూ ఉత్తేజపూరితమైన ఉపన్యాసం చేశారు. అంబే డ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగంలో ఈ అభిప్రాయాలు ప్రతిఫలించాయి. తొలి రోజుల్లో తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న దేశం హరిత విప్లవాన్ని సాధించడం వెనుక అవసరమైన భూమికను నెహ్రూ సిద్ధం చేశారు. భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ప్రారంభించి వాటిని ‘ఆధునిక దేవాలయాలు’గా పిలిచారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప సంస్థలకు సీఈఓలుగా భారతీయులు పనిచేస్తున్నారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వారందరికీ విద్యాబుద్ధులు నేర్పిన ఐఐటీలు, ఐఐఎమ్‌లూ, వాటితోపాటు ప్రతిష్ఠాత్మకమైన ‘ఎయిమ్స్’లాంటి విద్యా సంస్థల్ని నెహ్రూ స్థాపించారు. హోమీ జె.బాబా, విక్రమ్ సారాబాయ్, సీడీ దేశ్‌ముఖ్, భట్నాగర్, వర్గీస్ కురియన్ వంటి మేధావులను ప్రోత్సహించి, వారి కృషితో దేశానికి అభివృద్ధి బాటలు పరిచిన దార్శనికుడు నెహ్రూ. అంతరిక్ష రంగంలో దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చిన ‘ఇస్రో’ను, అణ్వస్త్ర దేశంగా నిలబెట్టిన ‘బార్క్’ను కూడా నెహ్రూ కాలంలోనే స్థాపించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పరిశోధనా సంస్థల్లో సింహభాగం ఆయన కాలంలోనే ఏర్ప డ్డాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక సుదీర్ఘమైన జాబితా తయారవుతుంది. నెహ్రూ రూపొందించిన పంచవర్ష ప్రణాళికలు అభివృద్ధిని క్రమబద్ధం చేసి దేశాన్ని నిలబెట్టాయి. పబ్లిక్ రంగ పరిశ్రమలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు రూపుదిద్ది అసమానతలు, అంతరాలు అడ్డగోలుగా పెరగకుండా నియంత్రించగలిగాయి. స్వాతంత్య్రా నికి ముందు బ్రిటీష్ దోపిడీ యథేచ్ఛగా సాగిన రోజుల్లో దేశ జనాభాలోని ఒక్క శాతం అగ్రగామి శ్రీమంతుల చేతుల్లో 21 శాతం జాతి సంపద ఉండేది. నెహ్రూ విధానాల ఫలితంగా 1980 నాటికి ఒక్క శాతం జనాభా చేతిలో ఉండే జాతి సంపద 6 శాతానికి తగ్గింది. మళ్లీ ఇప్పుడు 22 శాతానికి ఎగబాకింది. ‘బ్రిటీష్‌రాజ్’ నుంచి ‘స్వరాజ్’ వైపు దేశాన్ని మళ్లించడానికి నెహ్రూ తదితర జాతీయోద్యమ నేతలు ప్రయత్నించారు. ఇప్పటి ఆధునిక నేతలు దాన్ని ‘బిలియనీర్ల రాజ్’ వైపు పరుగె త్తిస్తున్న వైనం మన కళ్ల ముందు కనిపిస్తున్నది. ‘బ్రిటీష్ రాజ్ టు బిలియనీర్ రాజ్’ పేరుతో వెలువడిన ఒక పరిశోధనా పత్రం లోని ఈ వివరాలను ఇటీవల ‘ది హిందూ’ పత్రికలో ప్రకటించారు. నెహ్రూ సర్వజ్ఞుడనీ, లోపరహితుడనీ చెప్పలేము. ఆయన పాలనా కాలంలో చాలా పొరపాట్లు జరిగి ఉండవచ్చు. ముఖ్యంగా చైనాను అంచనా వేయడంలో ఆయన తప్పటడుగు వేశారు. తరుణ స్వతంత్ర దేశాలన్నీ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. చైనాతో ‘పంచశీల’ ఒడంబడిక కుదుర్చు కున్నారు. మావో జెడాంగ్ ఎంత కమ్యూనిస్టో అంతే కరుడు గట్టిన నేషనలిస్టు అనే విషయాన్ని పసిగట్టలేకపోయారు. టిబెట్‌పై దురాక్రమణ చేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ పరిణామానికి వ్యతిరేకంగా ఆనాడు ప్రపంచ దేశాలను నెహ్రూ కూడగట్టి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం మరో రకంగా ఉండేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధం చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ బెంగే ఆయన మరణానికి కూడా కారణమైంది. పదిహేడేళ్ల సుదీర్ఘ పాలనలో దేశీయంగా కూడా నెహ్రూ కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ఆయన ఆధునిక భారత నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ నెంబర్ వన్. దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించినవాడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవకుండా కాపాడినవాడు. లౌకిక భావాలను సమాజం గుండెల నిండా నింపినవాడు. సమతాభావాలకు జైకొట్టినవాడు. మనిషిని ప్రేమించినవాడు. ఈ దేశపు మట్టిని ప్రేమించినవాడు. ఆయన పటేల్ విగ్రహ మంత పెద్ద విగ్రహాన్ని పెట్టకపోవచ్చు కానీ ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని ఏలుతున్న మేధావులను తయారు చేసిన ప్రతిష్ఠాత్మక విద్యాలయాలను స్థాపించారు. ఆయన రామ మందిరాన్ని నిర్మించకపోవచ్చు కానీ ఆధునిక దేవాలయాల నిర్మాణానికి ఆద్యుడు. ఛాందస భావాలకు బద్ధవిరోధి. శాస్త్రీయ ఆలోచనా రీతులకూ, సైంటిఫిక్ టెంపర్కూ కేరాఫ్ అడ్రస్ – పండిత నెహ్రూ. ఇప్పుడా చిరునామాను చెరిపేస్తారట! కోటు మీద అలంకరించుకున్న గులాబీ పువ్వును పీకి పారేయొచ్చు. కానీ ఎద ఎదలో పూసిన ఎర్రగులాబీలను పీకేయడం ఎలా సాధ్యం? వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
భిన్నత్వంలో ఏకత్వమే రక్ష!
నేటితో భారత్ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభమయ్యాయి. సమధికోత్సాహంతో అంతటా ఉత్సవాలు సాగుతున్నాయి. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే, కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ చాలాకాలం సాగించాల్సి వచ్చింది. ఆ ప్రయత్నాలన్నీ ఫలించి, చివరికి 1947 ఆగస్ట్ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్ధతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకొనే స్థితిని సాధించాం. బ్రిటిష్ పాలకులను పంపివేసి, మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాం. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను గుర్తుచేసుకోవాలి. విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్ర జీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. రవీంద్రనాథ్ టాగూర్ ‘చిత్త్ జేథా భయశూన్య ఉన్నత్ జతో శిర్’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు భారత్ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని వీర సావర్కర్ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్ స్వరాజ్’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. భారత్ తన సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ఒకటిగా నిలవడానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది. కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయతా విభేదాలు; కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను... మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగించాలి. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం. సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయట నుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్థ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తనా సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన చేసుకోవాలి. విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్థ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా... స్వాతంత్య్ర సాధన వెనక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. రండి... సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం. డా. మోహన్ భాగవత్ వ్యాసకర్త సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -
స్వతంత్ర భారత సందేశం
స్వతంత్ర భారతావనికి నేటితో డెబ్భై అయిదు వసంతాలు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశ సాఫల్య వైఫల్యాలు అనేకం. కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నా, ఈ 75 ఏళ్లలో గణనీయమైన విజయాల విషయంలో మనం రొమ్ము విరుచుకోవచ్చు. కానీ, చేసిన పొరపాట్లతో పాటు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం. గత ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం మనలో చచ్చిపోయింది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. ఇవన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! ఇవన్నీ సమీక్షించుకొని, సరిదిద్దుకొని, సమైక్యంగా ముందుకు సాగాల్సిన సందర్భం ఇది. మన భారతదేశం స్వతంత్రమై నేటితో 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఒక దేశంగా మనం సాధించిన విజయాలేమిటి? చవిచూసిన వైఫల్యాలేమిటి? అని సమీక్షించుకునేందుకు తగిన సందర్భం ఇది. అలాగే, ఇదే సందర్భంలో మనం ఏ రకమైన దేశాన్ని నిర్మించుకున్నామన్నదీ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రశ్నలకు ఏవో స్పష్టమైన, కచ్చితమైన సమాధానాలు లభిస్తాయని కాదు. ఒక్కొక్కరి మదిలో ఒక్కో సమాధానం కచ్చితంగా ఉంటుంది. వారికి అదే సరైనదని కూడా అనిపిస్తుంది. అదే స్ఫూర్తితో నా దృష్టిలో మన దేశ సాఫల్య వైఫల్యాలను వివరించాలని అనుకుంటున్నా. ఒకవేళ దానివల్ల ప్రత్యేకించి ప్రయోజనమేదీ లేకున్నా... అది మీలో మరిన్ని ఆలోచనలు రేకెత్తించవచ్చు. ► కులం, మతం, జాతి, భాష లాంటి లోటుపాట్లు బోలెడున్నప్పటికీ, ఈ 75 ఏళ్లలో మన సాధనల విషయంలో మనం కొంచెం గర్వంగా రొమ్ము విరుచుకోవచ్చు. ఈ తేడాలు దేశాన్ని నాశనం చేస్తాయని 1960లలో పాశ్చాత్యులు కూడా విమర్శించారు. అయినా సరే... మనం ఒక్కతాటిపై నిలిచాం. అన్నింటినీ తట్టుకుని మనగలిగాం. అత్యవసర పరిస్థితులను అధిగమించి, దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. ఎన్నికలు సక్రమంగా జరుపుకోగలిగాం. ప్రభుత్వాలు మారాయి. ప్రజాగ్రహం శక్తిమంతమైన పరిపాలనా వ్యవస్థలను కూడా నియంత్రణలో ఉంచగలిగింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల మాదిరిగా దేశం సైనిక పాలనను అనుభవించాల్సిన అవసరం రాలేదు. ► అక్షరాస్యత, ఆయుః ప్రమాణాల విషయానికి వస్తే 1947కూ, ప్రస్తుతానికీ అస్సలు సారూప్యతే లేదు. అక్షరాస్యత అప్పటి కన్నా నాలుగు రెట్లు పెరిగింది. అలాగే, ఆయుః ప్రమాణం రెట్టింపు అయ్యింది. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నా... సాధించింది తక్కువేమీ కాదని స్పష్టంగా చెప్పవచ్చు. తిండిగింజల కోసం అంగలార్చిన దేశం ఈ రోజు వాటిని ఎగుమతి చేసే దశకు చేరిందంటే అంతకంటే గొప్ప విజయం ఇంకోటి ఉండదు. నౌకల్లో దిగుమతి అయితేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది అప్పట్లో! ఇప్పుడు ఆహార ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి మన దేశం. పాల ఉత్పత్తిలో మనది అగ్రస్థానం. బియ్యం, గోదుమల ఉత్పత్తిలో రెండో స్థానం. బియ్యం ఎగుమతి చేసే దేశాల్లోనూ తొలిస్థానం మనదే! మన అంతరిక్ష పరిశోధనా కార్యక్రమం, పదమూడు మంది ప్రపంచస్థాయి సీఈవోలను అందించిన మన ఐఐటీలు, ప్రపంచ ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్ టోర్నమెంట్లు, సినిమా పరిశ్రమ... ఇలాంటివన్నీ తృతీయ ప్రపంచదేశాల్లో మనల్ని ప్రత్యేకంగా నిలిపే అంశాలు. ఇంతటి వైవిధ్యభరితమైన దేశం మరొకటి ఉండదు. ► దురదృష్టవశాత్తూ మనం చేసిన పొరపాట్లు, మన లోటుపాట్లు, చివరకు ఉద్దేశపూర్వకమైన తప్పులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, వరుసగా అనేక ప్రభుత్వాలు దేశ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడంలో విఫలమయ్యాయని స్పష్టంగా చెప్పవచ్చు. భారీ నీటి ప్రాజెక్టులు కట్టుకున్నా... ఉక్కు కర్మాగారాలను నిర్మించినా... సోషలిజానికి ఇచ్చిన ప్రాధానంతో ఒక రేటు అభివృద్ధిలోనే చిక్కుబడి, దేశ ప్రజల్లో పారిశ్రామిక స్ఫూర్తిని ఉద్దీపింపజేయలేకపోయింది. ► 1984, 2002లలో జరిగిన సంఘటనలు అహింసా వాదులమని చెప్పుకొనే మన వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి. చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌లపై ఆర్థిక ఆంక్షలు ఉన్నా 1947 నాటికి వాటి జాతీయ ఆదాయం, మన దేశ జాతీయ ఆదాయం దాదాపుగా ఒకే స్థాయిలో ఉండేవి. డెబ్భై అయిదేళ్ళ తరువాత ఒక్కసారి ఈ దేశాల ఆదాయాలను భారత్‌తో పోల్చి చూసినప్పుడు మనం ఎంతో వెనుకబడ్డ విషయం స్పష్టమవుతుంది. 1990లో ఆర్థిక సంస్కరణలు ఓ మూడు దశాబ్దాల ముందే ప్రారంభమై ఉంటే భారత్ పరిస్థితి ఇంకోలా ఉండేది. ► అయితే ఏమంటారు అని అడిగితే ఒక సలహా ఇస్తా. భారతదేశం ఎంతో సాధించేసిందని మాత్రమే గట్టిగా నమ్ముతూ... ఎన్నిసార్లు దారితప్పామో మరచిపోతే అది అవివేకమే అవుతుంది. పచ్చిగా చెప్పాలంటే మనం ఎంత సాధించామో, అంతేస్థాయిలో తప్పటడుగులూ వేశాము. అలాగైతే మనమిప్పుడు ఏ రకమైన దేశంగా అవతరించామన్న ప్రశ్న వస్తుంది. పాత సమస్యలు ఇప్పటికీ చాలానే వెంటాడుతున్నాయి. దళితులు, ఆదివాసీలు ఇప్పటికీ అత్యంత అణగారిన వర్గాలుగానే కొనసాగుతున్నారు. వారి కన్నీళ్ళు తుడవడంలో విఫలమయ్యాం. ‘అస్పశ్యత’ను చట్టం ద్వారా నిషేధించినా... సమాజంలో అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. ఆకలి, కరవు వంటివి గత చరిత్రే కావచ్చు కానీ... దేశ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికీ దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. వాస్తవం ఏమిటంటే... పదేళ్లుగా పేదరికం స్థాయి ఏమిటన్నది కూడా తెలుసుకోవడం మానివేశాం మనం. ► ఉన్న సమస్యలకు మరికొన్ని చేర్చుకున్నాం కూడా! ఎనిమిదేళ్లుగా వ్యతిరేక స్వరాలను ఆలకించే సహనం చచ్చిపోయింది మనలో! మన పోకడల్లో ఆధిపత్యవాదన ఎక్కువైంది. తోటి పౌరులైన ముస్లిమ్‌లను పక్షపాత దృష్టితో చూడడం మొదలుపెట్టాం. జనహనన బెదిరింపులు ఇప్పుడు బహిరంగంగానే జరిగిపోతున్నా ప్రభుత్వం చెవులు మూసుకుని ఉండేందుకే మొగ్గు చూపుతోంది. ఇవన్నీ 1940, ’50లలో ఊహించను కూడా ఊహించలేము. ఇవన్నీ మనల్ని సిగ్గుతో తలదించుకునేలా చేసేవే! కానీ కొంతమంది ఇలాంటివి కొన్ని ఉన్నాయని కూడా ఒప్పుకోరు. ► సరే... మరి స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ రోజున మనం దేన్ని నొక్కి చెబుదాం? మన ఘనతల్ని మరోసారి నెమరేసుకుంటాం. తప్పులేదు. అయితే గట్టిగా చెప్పుకోలేకపోయినా, చేసిన తప్పులను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈ తప్పులన్నీ మనం నిర్దేశించుకున్న విలువలు, ఆర్థిక సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకపోవడం వల్ల జరిగినవే! ఇంకోలా చెప్పాలంటే మనం రాసుకున్న రాజ్యాంగానికి కట్టుబడి ఉండకపోవడం వల్ల జరిగినవే! అందుకే ప్రమాణపూర్తిగా ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి! ఈ స్వతంత్ర భారత ఉత్సవాల సందర్భంగా మనం చేయాల్సింది అదే! కరణ్ థాపర్ వ్యాసకర్త ప్రసిద్ధ పాత్రికేయులు -
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు..ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప నేతలకు గాంధీ స్ఫూర్తి: సీఎం కేసీఆర్
-
జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అనేక మంది త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని.. అలాంటి గడ్డపై జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందామని దేశానికి, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను సోమవారం నగరంలోని హెచ్ఐసీసీలో ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. అనేక త్యాగాలు, పోరాటాలతో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భారత స్వాతంత్ర సముపార్జన సారథి, ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. ప్రపంచంలోని ఎంతో మందికి స్పూర్తి ఆయన. అలాంటి మహోన్నతుడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం. గాంధీని కించపరిచే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవుడిపై కొందరు విద్వేషం రగలిస్తున్నారు. కానీ, మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే. ఆ చిల్లర శక్తుల ప్రయత్నాలు ఫలించవు. పేదరికం ఉన్నంతవరకు ఆక్రందనలు, అలజడులు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి. పేదరికం నిర్మూలిస్తేనే దేశానికి శాంతి, సౌబ్రాతృత్వం లభిస్తుంది. దేశంలో అలజడులను సృష్టించిన బ్లాక్ షిప్‌లను తరిమి కొట్టే ఘనత భారత దేశానికి ఉంది. ఈ గడ్డపై జాతిని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వెకిలి, మకిలి చర్యలను ఖండించాలి. ఆ చిల్లర మల్లర ప్రయత్నాలు, కుట్రలను ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్. కూర్పు వెనుక ఎంత కష్టం ఉంటుందో.. దాని విలువ తెలియనివాళ్లే చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి సంఘటితంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రజాప్రతినిధులంతా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్. మహనీయుల కష్టం, త్యాగాలతో దేశం ఈ తీరుకు వచ్చింది. కాబట్టే, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఎంతో మంది కష్టపడ్డారని, అలాగే అవసరమైతే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు -
మాస్తి వెంకటేశ అయ్యంగార్: జననం, మరణం ఒకేరోజు!
మాస్తి వెంకటేశ అయ్యంగార్ ప్రముఖ కన్నడ రచయిత. ఆయన తన రచనలకు గాను భారతీయ సాహిత్య రంగంలో అత్యుత్తమ పురస్కారమైన ‘జ్ఞానపీఠ్’ను అందుకున్నారు. కన్నడ భాషలో చిన్నకథల రచనలో మాస్తి ప్రసిద్ధులు. ఆయన చిన్నకథల పుస్తకానికి ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం‘ లభించింది. శ్రీనివాస కలం పేరుతో ఆయన రచనలు చేశారు. కన్నడ సాహిత్యరంగంలో మాస్తి కన్నడద ఆస్తి (మాస్తి కన్నడకు ఆస్తి) అన్న సూక్తి బహుళ ప్రచారం పొందింది. మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891 జూన్ 6న నేటి కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలోని కోసహళ్లిలో జన్మించారు. చదవండి: ఆకుపచ్చని అమృతం కళాశాల విద్యను అభ్యసించిన మాస్తి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో ఎం.ఎ. చేశారు. మైసూరు మహారాజా ప్రభుత్వంలో మైసూరు సివిల్ సర్వీసెస్ లో చేరి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా జిల్లా కమీషనర్ బాధ్యతల్లో పనిచేశారు. దివాన్ పదవికి తను అన్ని విధాలా అర్హుడైనా తనకన్నా తక్కువ సంవత్సరాల సర్వీసు ఉన్న సహోద్యోగికి ఆ పదవిని ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశారు. కన్నడ సాహిత్యంలో చిన్నకథల ప్రక్రియ వికాసంలో మాస్తి వెంకటేశ అయ్యం గార్ ది ప్రధాన పాత్ర. మొదట ఇంగ్లిష్ భాషలో రచనలు చేసిన మాస్తి, అనంతరం కన్నడ భాషలో రాయడం ప్రారంభించారు. 17 ఆంగ్ల పుస్తకాలు, 123 కన్నడ గ్రంథాలు రచించారు. ఆయన తొలినాళ్ల రచనల్లో బ్రిటిష్ పాలకుల దౌర్జన్యాలపై నిరసన ‘కలం’ కనిపిస్తుంది. మాస్తి 1986 జూన్ 6న బెంగళూరులో మరణించారు. -
చైతన్య భారతి: లోకమాన్యుడు బాల గంగాధర తిలక్ 1856–1920
సాంప్రదాయిక జాతీయవాదాన్ని స్వాతంత్య్రోద్యమంగా మలిచే ప్రయత్నం చేశారు బాల గంగాధర తిలక్. 1893లో ఆయన వినాయక చతుర్థి ఉత్సవాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం ఇందుకొక ఉదాహరణ. ఈ మహారాష్ట్ర యోధుడికి గాంధీ మార్గం పట్ల కొన్ని అభ్యంతరాలు ఉండేవి. 1920లో తిలక్ చనిపోయినప్పుడు బొంబాయిలో ఆయన అంత్యక్రియలకు హాజరైన 2 లక్షల మందిలో గాంధీ కూడా ఉన్నారు. ‘తిలక్ ఆధునిక భారత నిర్మాత’ అని గాంధీ వర్ణించారు. బాల గంగాధర తిలక్ అసమాన జనాకర్షణ కలిగిన శక్తిమంతమైన రాజకీయవేత్త. బ్రిటిష్ పాలనపై తిలక్ తీవ్రమైన విమర్శలు గుప్పించేవారు. వారి విధానాలను వ్యతిరేకించడంలో సమర్థమైన పాత్ర పోషించేవారు. అందుకు ఆయనను ‘లోకమాన్య’ అని గౌరవంగా పిలిచేవారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడైన తిలక్ కొంకణ్‌లోని రత్నగిరి జిల్లాలో జన్మించారు. బాల్యంలోనే ఆయన స్వతంత్ర వైఖరి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. పుణెలోని దక్కన్ కాలేజీలో చేరి గణితశాస్త్రంలో అమోఘమైన ప్రావీణ్యం సంపాదించారు. కాలేజీలో చదువుకుంటూనే ఆయన దేహదార్ఢ్యం పెంచుకోవడం కోసం జిమ్నాస్టిక్స్, కుస్తీ, ఈతలతో పాటు పడవ నడపడం వంటి కసరత్తులు చేసేవారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పుణెలో కొంతకాలం గణిత శాస్త్ర బోధకుడిగా పని చేశారు. ఆ తర్వాత ఆయన జాతీయవాదాన్ని బోధించే విద్యా సంస్థల్లో చేరారు. 1880ల తొలినాళ్లలో ఆయన జాతీయవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ‘మరాఠా’ అనే ఇంగ్లిషు పత్రికను, ‘కేసరి’ అనే మరాఠీ భాషా పత్రికను ప్రారంభించారు. ఆయన అందులో రాసే వ్యాసాలు ఎంతో హేతుబద్ధంగా, ముక్కుసూటిగా ఉండేవి. కాంగ్రెస్ పార్టీలో మితవాదులు, అతివాదుల మధ్య చీలిక మొదలైంది ఆ దశాబ్దంలోనే. పాశ్చాత్య విద్యను అభ్యసించిన భారతీయులతో అధికారాన్ని పంచుకోవాలని మితవాదులు బ్రిటిష్ వారిని కోరే ప్రయత్నం చేశారు. మితవాదుల యాచక వైఖరిని వ్యతిరేకించిన కూటమి పట్ల ఆకర్షితులైన తిలక్ ఆ కూటమికి నాయకుడిగా మారారు. స్వరాజ్యమే నా ధ్యేయమని ఆయన నిక్కచ్చిగా నినదించారు. – రిచర్డ్ క్యాష్‌మన్, ‘ది మిత్ ఆఫ్ ది లోకమాన్య : తిలక్, మాస్ పాలిటిక్స్ ఇన్ మహారాష్ట్ర’ గ్రంథ రచయిత -
ఒన్రే కులం, ఒరువనే దేవన్
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా, స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో తొలి నాయకుడిగా అవతరించినవారు అన్నాదురై. ఆయన పేరు చివర ఎం.ఎ. అనే రెండు అక్షరాలు ఎప్పుడూ కనిపించేవి. దానితోనే ఆయన గౌరవాన్ని అందుకునేవారు. బ్రాహ్మణేతర జస్టిస్ పార్టీలో ఉన్నతస్థాయి నేతల ఉపన్యాసాలను తమిళంలోకి అనువదించడం ద్వారా అన్నాదురై రాజకీయ జీవితం మొదలైంది. 1937–39 మధ్యలో జరిగిన తొలి హిందీ వ్యతిరేక ఉద్యమం ఆయన భాషా నైపుణ్యాన్ని తొలిసారిగా ఘనంగా చాటి చెప్పింది. ఆ భాషా కౌశలాన్ని ఆయన ఆ తర్వాత సినిమా స్క్రిప్టుల రచనకు కూడా ఉపయోగించారు. పెరియార్ ఇ.వి. రామస్వామి ఆయనను తన కుడి భుజంగా మార్చుకున్నారు! అయితే అనతికాలంలోనే అన్నాదురై ఆయనను స్థానభ్రంశం చెందించి, తానే అధినాయకుడిగా అవతరించారు. బహుశా అన్నాదురై విజయ రహస్యం పెరియార్ ఆలోచనలను, శక్తిమంతమైన భావజాలాన్ని సమర్థంగా ముందుకు నడిపించడంలోనే దాగుంది. పెరియార్ చెప్పిన నాస్తికతను ఆయన మధ్య యుగాల నాటి తమిళ సాధువు తిరుమలర్ మాటగా, ‘ఒన్రే కులం, ఒరువనే దేవన్’ (ఒకే కులం, ఒకే దేవుడు)’గా ప్రచారం చేశారు. వినాయకుడి విగ్రహాల ధ్వంసానికి పెరియార్ పిలుపునిస్తే, అన్నా దానికి భిన్నంగా తను విగ్రహాన్ని పగలగొట్టను, కొబ్బరికాయనూ కొట్టనని చెప్పి ప్రాచుర్యం సంపాదించారు. 1950 లో ద్రావిడ మున్నేట్ర కళగం (డి.ఎం.కె)ను స్థాపించి రాష్ట్ర పరిధిలో తమిళ జాతీయతను భద్రంగా ఎదిగేలా చేసిన అన్నాదురై, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బాగా ప్రోత్సహించారు. 60 ఏళ్ల కన్నా ముందే చనిపోవడంతో ఆయన ఉజ్వల భవితకు అకస్మాత్తుగా తెరపడింది. ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. నిజానికి అది గిన్నిస్ రికార్డులోకి ఎక్కవలసిన ఘటన అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఆకట్టుకునే జీరస్వరం గల ఈ అయిదుంపావు అడుగుల నాయకుడు రాజకీయంగా ఎదిగిన క్రమంలో ఆధునిక తమిళనాడు చరిత్రే దాగుంది! . (చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా) -
పోరు బాట.. అగ్గిబరాటా
స్వరాజ్య సాధన కోసం నిర్మించుకున్న ఆధునిక రాజకీయ పోరాటంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన తొలి అడుగు. డిసెంబర్ 28,1885న ఇది ఆవిర్భవించింది. ఇందుకు దోహదం చేసిన ప్రజా సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రాజకీయ చైతన్యం తేవడానికి పనిచేసినవే. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ (1836, కలకత్తా, ద్వారకానాథ్ టాగూర్ స్థాపించారు), బ్రిటిష్ ఇండియా సొసైటీ (1839, లండన్ , విలియం ఆడమ్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ (1843, కలకత్తా), బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ (1852, కలకత్తా ద్వారకానాథ్ టాగూర్), మద్రాస్ నేటివ్ అసోసియేషన్ (1852, మద్రాస్, గాజుల లక్ష్మీనరసుచెట్టి), బాంబే అసోసియేషన్ (1852,బొంబాయి, జగన్నాథ్ శంకర్ సేథ్), ఈస్టిండియా అసోసియేషన్ (1866, లండన్ , దాదాభాయ్ నౌరోజీ), నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1867, లండన్ , మేరీ కార్పెంటర్), పూనా సార్వజనిక్ సభ (1876, పూనా, ఎంజి రేనడే, జీవీ జోషి, ఎస్‌హెచ్ చిప్లుంకర్), ఇండియన్ సొసైటీ (1872, లండన్, ఆనందమోహన్ బోస్) ఇండియన్ అసోసియేషన్ (1876, కలకత్తా, సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్‌మోహన్ బోస్), మద్రాస్ మహాజన సభ (1884, మద్రాస్, ఎం. వీరరాఘవచారి, జి. సుబ్రహ్మణ్య అయ్యర్, పి.ఆనందాచార్యులు), బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ (1885, బొంబాయి, ఫిరోజ్‌షా మెహతా, కేటీ తెలాంగ్, బద్రుద్దీన్ తాయబ్జీ).. వంటి వన్నీ స్వరూజ్య చింతనకు భూమికను ఇచ్చినవే. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1905, పూనే, గోఖలే) కూడా అలాంటి సేవ చేసింది. చరిత్రలో సక్రమంగా నమోదు కాకున్నా తీవ్ర జాతీయవాద ఉద్యమం తనదైన ఉనికిని చాటుకున్న మాట నిజం. మిత్ర మేళా (1899, నాసిక్), అనుశీలన్ సమితి (1902, బెంగాల్), అభినవ్ భారత్ (1904, పూనా), స్వదేశీ బాంధబ్ సమితి (1905, బెంగాల్), ఇండియన్ హోంరూల్ సొసైటీ, (1905, లండన్ ), ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ (1907, అమెరికా) గదర్ పార్టీ (1913, అమెరికా), జుగాంతర్ పార్టీ (1914, బెంగాల్), బెర్లిన్ కమిటీ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్ (1915, జర్మనీ) సంస్థలు నాటి భారతీయ యువతరం మీద గట్టి ప్రభావాన్ని చూపిన సమయమది. జర్మన్ కుట్ర.. బెంగాల్ పుట్ర మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ విప్లవకారుల సాయంతో భారత్‌లోని బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక జాతీయ స్థాయి సాయుధ పోరు నిర్వహించాలని గదర్ పార్టీ పథకం వేసింది. దీనికే హిందూ జర్మన్ కుట్ర అని పేరు. ఇది కూడా భారతీయ యువతరం మీద నాడు విశేషమైన ప్రభావం చూపింది. జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదుల ఉద్యమ పంథాయే ఇలాంటి ఒక అగ్నివర్షాన్ని కురిపించింది. నిజానికి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వం అతివాదుల చేతులలోకి రావడానికి కారణం మితవాదుల ధోరణి. ఈ మార్పుకు అవకాశం ఇచ్చిన చారిత్రక పరిణామమే బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం లేదా స్వదేశీ ఉద్యమం (1905–1911). కర్జన్ విభజన.. ఉద్యమ గర్జన పాలనా సౌలభ్యం పేరుతో జూలై 19,1905 న వైస్రాయ్ కర్జన్ బెంగాల్ విభజనను ప్రకటించాడు. అక్టోబర్ 16న విభజన అధికారికంగా అమలులోకి వచ్చింది. ఇది బ్రిటిష్ జాతి ముద్ర స్పష్టంగా ఉన్న విభజించు పాలించు చర్య. జాతీయోద్యమంలో కీలకంగా ఉన్న బెంగాలీలను విభజించడంతో పాటు, హిందువులను ముస్లింలను విడదీయడం ఈ చర్య ఉద్దేశంగా కనిపిస్తుంది. 7 కోట్ల 80 లక్షల 50 వేల జనాభాతో కూడిన పెద్ద ప్రెసిడెన్సీ బెంగాల్. మొత్తం బెంగాల్, బిహార్, ఒరిస్సా, అస్సాం ఇందులో ఉండేవి. అస్సాం ప్రత్యేక అధికారి పాలనలో మాత్రం ఉండేది. తూర్పు బెంగాల్‌లోని 15 జిల్లాలు, బిహార్, ఒరిస్సాలను కలిపి ఒక భాగం, మిగిలిన బెంగాల్, అస్సాం ఒక ప్రాంతంగాను విభజించారు. తూర్పు బెంగాల్ రాజధానిగా ఢాకాను ప్రకటించారు. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ. మొత్తంగా రెండింటిలోనూ బెంగాలీలు అల్ప సంఖ్యాకులుగా మారారు. ఈ విధంగా కాకుండా, బెంగాల్ భాష మాట్లాడేవారితో ఒక రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చునని సురేంద్రనాథ్ బెనర్జీ వంటివారు వాదించారు. ఇంతకీ ఈ రాజకీయ సంక్షోభం సృష్టించిన వైస్రాయ్ కర్జన్ పదవి.. విభజన ప్రకటన తరువాత మూడువారాలకే (ఆగస్ట్ 16) పోయింది. అయినా ఉద్యమ సెగను చవి చూశాడు. – డా.గోపరాజు నారాయణరావు -
షార్ట్ ఫిలింలో రవీనా టాండన్
బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్ ఓ షార్ట్ ఫిలింలో నటించారు. దేశ స్వాతంత్ర్య గొప్పదనాన్ని వివరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ షార్ట్ ఫిలిం తీశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపోయి ఉంటే ప్రస్తుతం మన జీవితాలు ఎలా ఉండేవి? 1940 నాటి పరిస్థితుల కంటే మెరుగ్గా ఉండేవా? స్వాతంత్ర్యం రాకుంటే ఇప్పటికీ మన బతుకులు దుర్భరంగా ఉండేవి.. ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాల్సి వచ్చేది.. మన దేశంలో మనకే గౌరవం ఉండేది కాదు.. బ్రిటిషర్ల కింద బానిసలుగా బతికేవాళ్లం.. ఈ ఊహాజనిత పరిస్థితులకు అద్దం పట్టేలా షార్ట్ ఫిలింను రూపొందించారు. స్వాతంత్ర్యం వచ్చాక మన భద్రత, సమాజంలో లభిస్తున్న గౌరవం వంటి విషయాలను తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పిస్తూ.. వారి త్యాగఫలం వల్లే మనం 'రెస్టారెంట్లలోకి భారతీయులకు, కుక్కులకు ప్రవేశం లేదు' అన్న బోర్డులు చూసే దుస్థితి రాలేదని 6 నిమిషాల నిడివిగల ఈ షార్ట్ ఫిలింలో చక్కగా చూపించారు.