స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనకుండా, స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో తొలి నాయకుడిగా అవతరించినవారు అన్నాదురై. ఆయన పేరు చివర ఎం.ఎ. అనే రెండు అక్షరాలు ఎప్పుడూ కనిపించేవి. దానితోనే ఆయన గౌరవాన్ని అందుకునేవారు. బ్రాహ్మణేతర జస్టిస్ పార్టీలో ఉన్నతస్థాయి నేతల ఉపన్యాసాలను తమిళంలోకి అనువదించడం ద్వారా అన్నాదురై రాజకీయ జీవితం మొదలైంది. 1937–39 మధ్యలో జరిగిన తొలి హిందీ వ్యతిరేక ఉద్యమం ఆయన భాషా నైపుణ్యాన్ని తొలిసారిగా ఘనంగా చాటి చెప్పింది.
ఆ భాషా కౌశలాన్ని ఆయన ఆ తర్వాత సినిమా స్క్రిప్టుల రచనకు కూడా ఉపయోగించారు. పెరియార్ ఇ.వి. రామస్వామి ఆయనను తన కుడి భుజంగా మార్చుకున్నారు! అయితే అనతికాలంలోనే అన్నాదురై ఆయనను స్థానభ్రంశం చెందించి, తానే అధినాయకుడిగా అవతరించారు. బహుశా అన్నాదురై విజయ రహస్యం పెరియార్ ఆలోచనలను, శక్తిమంతమైన భావజాలాన్ని సమర్థంగా ముందుకు నడిపించడంలోనే దాగుంది. పెరియార్ చెప్పిన నాస్తికతను ఆయన మధ్య యుగాల నాటి తమిళ సాధువు తిరుమలర్ మాటగా, ‘ఒన్రే కులం, ఒరువనే దేవన్’ (ఒకే కులం, ఒకే దేవుడు)’గా ప్రచారం చేశారు. వినాయకుడి విగ్రహాల ధ్వంసానికి పెరియార్ పిలుపునిస్తే, అన్నా దానికి భిన్నంగా తను విగ్రహాన్ని పగలగొట్టను, కొబ్బరికాయనూ కొట్టనని చెప్పి ప్రాచుర్యం సంపాదించారు.
1950 లో ద్రావిడ మున్నేట్ర కళగం (డి.ఎం.కె)ను స్థాపించి రాష్ట్ర పరిధిలో తమిళ జాతీయతను భద్రంగా ఎదిగేలా చేసిన అన్నాదురై, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బాగా ప్రోత్సహించారు. 60 ఏళ్ల కన్నా ముందే చనిపోవడంతో ఆయన ఉజ్వల భవితకు అకస్మాత్తుగా తెరపడింది. ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు. నిజానికి అది గిన్నిస్ రికార్డులోకి ఎక్కవలసిన ఘటన అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఆకట్టుకునే జీరస్వరం గల ఈ అయిదుంపావు అడుగుల నాయకుడు రాజకీయంగా ఎదిగిన క్రమంలో ఆధునిక తమిళనాడు చరిత్రే దాగుంది! .
(చదవండి: పోరు బాట.. అగ్గిబరాటా)
Comments
Please login to add a commentAdd a comment